జాతీయ రహదారికి పక్కనే మధ్యతరగతి ప్రజల ఇళ్ల కోసం కేటాయించిన కొండ ఇదే
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. మధ్యతరగతి ప్రజల సొంతిల్లు సాకారం దిశగా అడుగులు వేస్తోంది. జగనన్న స్మార్ట్ సిటీల ఏర్పాటులో భాగంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ స్థలాలను కేటాయించాలంటూ సర్కారు ఆదేశించడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్(ఎంటీఎంసీ) పరిధిలోని మధ్యతరగతి ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానిక అధికారులతో కలసి స్థలాన్వేషణ చేపట్టారు. అనేక చర్చోపచర్చల అనంతరం కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే ఉన్న కొండను ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 33.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండను తొలచి బహుళ అంతస్తులు నిర్మించి మధ్యతరగతి ప్రజలకు ఇళ్లను కేటాయించనున్నారు. ఈ నివాసాల్లో డబుల్, త్రిబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించేందకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం.
రూ.వందల కోట్ల విలువ
ఈ కొండ ప్రాంతం జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఇక్కడ ఎకరం భూమి విలువ రూ.15 కోట్లు పలుకుతోంది. మొత్తం 33.8 ఎకరాల విలువ రూ.480 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. బైపాస్‌రోడ్‌లో ఒక సెంటు స్థలం కొనాలంటే రూ.20 లక్షలపైన ఉంది. డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ కొనాలంటే రూ.50లక్షలపై మాటే. త్రిబుల్ బెడ్‌రూమ్ కొనాలంటే రూ.60లక్షలు పైనే ఉంటుంది. అదే పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు వేసే వెంచర్లలో అయితే త్రిబుల్ బెడ్ రూమ్ రూ.1.25 కోట్లు ఉంటుంది. అదే నాణ్యతతో అతి తక్కువ ధరలకు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ఇళ్లను అందజేయనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
విజయవాడకు ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో..
ఈ కొండకు ఆనుకుని ఒక పక్క జాతీయ రహదారి మరో పక్క ఎయిమ్స్ రహదారి ఉన్నాయి. కేవలం జాతీయ రహదారికి 500 మీటర్లు, ఎయిమ్స్ రహదారికి 25 మీటర్లు దూరం మాత్రమే ఉంది. విజయవాడకు వెళ్లాలంటే కేవలం 5 నిమిషాలు. గుంటూరు వెళ్లాలంటే 25 నిమిషాల సమయం పడుతుంది. ఇలాంటి విలువైన స్థలం కార్పొరేట్ సంస్థలకు ఇస్తే కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. కానీ.. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం కేటాయించడంపై ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఎయిమ్స్ రోడ్
సీఆర్‌డీఏకు అప్పగింత....
ఇప్పటికే తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి కొండ ప్రాంతాన్ని సర్వే చేసి 33.8 ఎకరాల భూమిని సీఆర్డీడీఏకు అప్పగించారు. సీఆర్డీఏ అధికారులు అతి త్వరలోనే ఆ కొండను ఆధునిక పద్ధతుల్లో తొలచి భవనాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆరునెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని ఏపీఎంఆర్డీ అధికారులు
స్పష్టంచేశారు.
సర్వే పూర్తయింది
జగనన్న స్మార్ట్ సిటీ కోసం కేటాయించిన కొండ ప్రాంతం సర్వే పూర్తయింది. ఇప్పటికే స్థలం చుట్టూ బౌండరీ రాళ్లను ఏర్పాటు చేసి ఏపీఎంఆర్‌డీ అధికారులకు అప్పగించాం. త్వరలో వారు అక్కడ పనులను చేపట్టి ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం
చేస్తున్నారు. – శ్రీనివాసులురెడ్డి, తాడేపల్లి తహసీల్దార్
ఉద్యోగులకు ఉపయోగం
మా నాన్నగారు ఉద్యోగి కావడంతో మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి కలగలేదు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల మాకు మేలు చేస్తుంది. జగనన్న స్మార్ట్ సిటీ అమల్లోకి వస్తే మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని మధ్యతరగతి కుటుంబీకులకు అద్దెల బాధలు తొలగిపోతాయి. ఇక్కడ ఏ ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా రూ.6 వేల నుంచి రూ.15 వేలు చెల్లించాల్సి వస్తోంది. సంపాదించిన జీతం ఇంటి అద్దెకే కట్టాలి. ఆ ఇళ్లు వస్తే ఇక ఆ బాధ ఉండదు.
– మధు, ఉండవల్లి సెంటర్
మాట నిలబెట్టుకున్న జగనన్న
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి బంగారు కొండ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మధ్య తరగతి ప్రజల కోసం తాడేపల్లి కొలనుకొండలో ఇంత విలువైన స్థలం కేటాయిస్తారని కలలోనైనా ఊహించలేదు. గత ప్రభుత్వంలో జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. కానీ జగనన్న అలా చేయకుండా ఎకరం రూ.15 కోట్లు ఉన్న స్థలాన్ని మధ్యతరగతి ప్రజలకు కేటాయించడం హర్షణీయం.
– కత్తిక రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ, దుర్గగుడి బోర్డ్ మెంబర్
Comments
Please login to add a commentAdd a comment