అమ్మకానికి ‘స్వగృహ’ భూములు
ప్రాజెక్టుకు తెరదించే దిశగా వడివడిగా అడుగులు
స్థలాలమ్మి ఖజానాకు నిధులు
సీఎం సమీక్ష తర్వాత నిర్ణయం
ఈలోగా అధికారుల ఏర్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 528 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే విలాసవంతమైన ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కథ కంచికి చేరబోతోంది. ఈ కార్పొరేషన్‌కు మంగళం పాడే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనిపై తుది నిర్ణయం వెల్లడించనప్పటికీ కార్పొరేషన్‌లో జరుగుతున్న వ్యవహారాలు మాత్రం దీనిని స్పష్టం చేస్తున్నాయి. స్వగృహ పనులు ఎక్కడా జరపవద్దని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న అధికారులు నిర్మాణాలు పోగా మిగిలిన ఖాళీ భూముల వివరాలను సిద్ధం చేసుకుంటున్నారు.
త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాజీవ్ స్వగృహపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అందులో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలే రూ. లక్ష కోట్లకుపైగా మొత్తంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయ సమీకరణలో భాగంగా ప్రభుత్వం భూములను అమ్మాలని నిర్ణయిం చింది. ఇదే కోవలో స్వగృహ కార్పొరేషన్‌కు ఖాళీగా ఉన్న భూములను విక్రయించాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కొన్ని ఖాళీ భూములను అమ్మిన అధికారులు... అలా వచ్చిన మొత్తాన్ని స్వగృహ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెచ్చించారు. కానీ, ఈసారి అమ్మగా వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాకే జమ చేయనున్నారు.
హైదరాబాద్ శివారులో 90 ఎకరాలు...
స్వగృహ ప్రాజెక్టుల నిర్మాణం కోసమని రాజధానికి నలువైపులా గతంలో భారీగా భూములను ఆ కార్పొరేషన్ సేకరించింది. ఇందులో నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్‌కేసర్ వైపు పోచారం, జవహర్‌నగర్, గాజులరామారంలలో నిర్మాణాలు జరిపింది. బహదూర్‌పల్లి, బాచుపల్లిల్లో పనులు ప్రారంభించలేదు. జవహర్‌నగర్‌లో నిర్మాణ స్థలం పోను ఇంకా దాదాపు 12 ఎకరాల స్థలం ఉంది. గాజుల రామారంలో 10 ఎకరాల స్థలంలో జీప్లస్ 14 పద్ధతిలో మూడు బ్లాకులు, పాక్షికంగా మరో రెండు బ్లాకులు నిర్మించారు. ఇది పోను మరో 10 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. బహదూర్‌పల్లిలో 40 ఎకరాలు, బాచుపల్లిలో 28 ఎకరాల మేర పూర్తి ఖాళీగా ఉంది. బాచుపల్లి భూములపై కోర్టు వివాదాలున్నాయి. వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాల్లో 438 ఎకరాలు...
నిజామాబాద్‌లో 100 ఎకరాలు భూమి సిద్ధంగా ఉంది. ఇక్కడ నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఇందులో 50 ఎకరాలను స్వయంగా స్వగృహ కార్పొరేషన్ పరిహారం చెల్లించి సేకరించడం విశేషం. నగర వెలుపల శాటిలైట్ టౌన్‌షిప్స్ అభివృద్ధి చేసే ఆలోచనలో భాగంగా పటాన్‌చెరు సమీపంలోని లక్డారం గ్రామంలో స్వగృహ ఏకం గా 250 ఎకరాలను సమీకరించుకుంది.
కానీ, ఇక్కడ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టకపోవడంతో అదంతా ఖాళీగా ఉంది. కరీంనగర్‌లో 60 ఎకరాల భూమి ఉండగా అందులో 30 ఎకరాల్లో 40 వ్యక్తిగత ఇళ్ల నమూనాలో పనులు మొదలుపెట్టారు. పునాది దశలోనే వాటిని నిలిపివేశారు. మిగతా 30 ఎకరాలు ఖాళీగా ఉంది. వరంగల్ హంటర్‌రోడ్డులో కూడా పనులు ప్రారంభించలేదు. ఖమ్మంలో 250 ఇళ్లను నిర్మించారు. కానీ, దరఖాస్తులు లేకపోవడంతో అవి దుమ్మకొట్టుకుపోతున్నాయి. వీటిని గంపగుత్తగా అమ్మాలని ఇప్పటికే నిర్ణయించారు. వీటిని అమ్మితే దాదాపు రూ.80 కోట్లు సమకూరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.