Rajiv Swagruha Corporation
-
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ దివాలా ప్రక్రియ ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ నిర్మాణ కంపెనీ బీజీ షిర్కే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. 2018 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఈ డబ్బు చెల్లించే పరిస్థితుల్లో స్వగృహ కార్పొరేషన్ లేనందున ఆ సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎన్సీఎల్టీ సభ్యులు కె.అనంత పద్మనాభస్వామి విచారణ జరిపారు. షిర్కే కంపెనీ తరఫున న్యాయవాది డి.వి.సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జవహర్‌నగర్‌లో రూ.786 కోట్లతో 6,216 ప్లాట్లతో 37 బ్లాకులు నిర్మించేందుకు తమ కంపెనీతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 2009లో ఒప్పందం చేసుకుందని తెలిపారు. కొంతకాలం బిల్లులు చెల్లించిన కార్పొరేషన్ ఆ తర్వాత బిల్లులు చెల్లించడం మానేసిందన్నారు. అనంతరం 37 బ్లాకులను 17 బ్లాకులకు పరిమితం చేసిందని వివరించారు. 2016లో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని, 2018 మార్చి 31 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని వివరించారు. స్వగృహ కార్పొరేషన్ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. షిర్కే కంపెనీ ఫిబ్రవరి 22న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చైర్మన్‌కు లేఖ రాసిందన్నారు. చెల్లింపులకు సంబంధించి వివిధ శాఖలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారుల సమావేశం జరగలేదని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, ఇందుకు కొంతసమయం పడుతుందని తెలిపారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, అధికారులు సమావేశం నిర్వహించుకోవాలని, ఆ సమావేశం వివరాలను, అందులో తీసుకున్న నిర్ణయాలను తమ ముందుంచాలని స్పష్టంచేసింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. -
వడ్డీ కాసుల భారం
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారుల కక్కుర్తితో నిలువునా మునిగిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారింది. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్ల భారం పడుతోంది. ప్రతినెలా దీని అప్పులకే రూ.1.4 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అయినా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం నష్టాలను మరింత పెంచేస్తోంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. బండ్లగూడలో 2,600 అపార్ట్మెంట్లు, పోచారంలో 2,200 అపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అమ్ముడుపోగా మిగతావి అలాగే ఉండిపోయాయి. ఉమ్మడి ఏపీలో దీన్ని పర్యవేక్షించిన కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇళ్ల నిర్మాణ వస్తువుల ధరలు పెరిగాయని, కూలీ రేట్లు పెరిగాయంటూ భారీగా నిధులు నొక్కేశారు. దాదాపు రూ.150 కోట్లు కొల్లగొట్టారు. నాటి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో అధికారుల ఆటలు సాగాయి. ఆ నష్టాన్ని పూడ్చే క్రమంలో ఒక్కసారిగా ఆ ఇళ్ల ధరలు విపరీతంగా పెంచారు. దీంతో జనం ఇళ్లను కొనేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఆ ఇళ్లు అలాగే మిగిలిపోయాయి. రూ.200 కోట్ల అప్పులు..: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులపై రూ.200 కోట్ల బ్యాంకు అప్పు ఉన్నట్లు తేలింది. దీనిపై 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అయితే ఆ ఇళ్ల ధర తగ్గించి మార్కెట్ ధర ప్రకారం అమ్మితే కొనుగోళ్లు పెరుగుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. వాటిని చవకగా ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంకా తక్కువ ధరకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అంత తక్కువకు అమ్మితే భారీ నష్టం వస్తుందని అధికారులు చెప్పినా ప్రభుత్వం చవక ధరలనే ఖరారు చేసింది. అయినా కానీ ఆ ధర మరింత తగ్గించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఎటూ తేలక పెండింగులో పడిపోయింది. ఇదంతా బాగానే ఉన్నా అప్పులపై వడ్డీ రోజు రోజుకు కొండలా పెరిగిపోతోంది. తాజాగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు గాను రూ.4.24 కోట్ల వడ్డీ విడుదల చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘స్వగృహ’ కొంప కూల్చుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి ఉన్నారనే కారణంతో వివిధ విభాగాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం తొలగిస్తోంది.. కానీ అప్పుల్లో మునిగి దివాలా తీసిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మాత్రం ఇందుకు భిన్నం. రెండేళ్లుగా ఒక్క ఫ్లాట్‌ను కూడా అమ్మని ‘స్వగృహ’లో యథేచ్ఛగా సిబ్బంది నియామకం జరుగుతూనే ఉంది. జీతాలు చెల్లించే పరిస్థితి లేక ఖాళీ స్థలాలు అమ్ముకుంటున్న సంస్థను ఈ కొత్త కొలువులు పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఈ వ్యవహారానికి కారణం ప్రజాప్రతినిధులే. తమ అనుచరులకు వారు ‘స్వగృహ’లో ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు. ఈ కార్పొరేషన్లో ఇప్పటికే ఉన్న ఉద్యోగులకే పనీ లేదు. దానికితోడు కొత్తగా వస్తున్న వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక.. ఏదో ఓ పేరుతో పోస్టు ఇస్తున్నారు. వీరి జీతాల కోసం పెద్ద మొత్తంలో సొమ్ము వృథా అవుతోంది. కనీసం ఒక్కరోజు కూడా ఫీల్డ్‌కు వెళ్లే పనిలేకున్నా కొందరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా చెలామణి అవుతున్నారు. సిఫారసు చేసిన ప్రజాప్రతినిధి స్థాయిని బట్టి ఈ ‘కొత్త’ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ విభాగంలో పనిచేసి పదవీవిరమణ పొందిన కొందరికి నెలకు రూ.18 వేల నుంచి రూ.25 వేలు చెల్లిస్తున్నారు. ఫోన్ బిల్లు, పెట్రోలు భత్యం కూడా ఇవ్వడం గమనార్హం. అమ్మకాలు నిలిపేశాక మార్కెటింగ్‌లో కొలువులు: గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కొత్త ధరలు ఖరారు చేసే ఉద్దేశంతో ఇళ్ల అమ్మకాలు నిలిపివేయాలని నాటి ఎండీ ఆదేశించారు. ఇది జరిగి రెండున్నరేళ్లు గడిచింది. అయితే ఇళ్ల అమ్మకం వద్దనుకున్నప్పుడు మార్కెటింగ్ విభాగంలో సిబ్బంది నియామకం ఎందుకో అధికారులకే తెలియాలి. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఏపీకి చెందిన ఓ ఎంపీ, నల్లగొండకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీల సిఫారసుతో ముగ్గురికి ‘స్వగృహ’లో ఉద్యోగాలిచ్చారు. -
అమ్మకానికి ‘స్వగృహ’ భూములు
ప్రాజెక్టుకు తెరదించే దిశగా వడివడిగా అడుగులు స్థలాలమ్మి ఖజానాకు నిధులు సీఎం సమీక్ష తర్వాత నిర్ణయం ఈలోగా అధికారుల ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా 528 ఎకరాలు సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే విలాసవంతమైన ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కథ కంచికి చేరబోతోంది. ఈ కార్పొరేషన్‌కు మంగళం పాడే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనిపై తుది నిర్ణయం వెల్లడించనప్పటికీ కార్పొరేషన్లో జరుగుతున్న వ్యవహారాలు మాత్రం దీనిని స్పష్టం చేస్తున్నాయి. స్వగృహ పనులు ఎక్కడా జరపవద్దని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న అధికారులు నిర్మాణాలు పోగా మిగిలిన ఖాళీ భూముల వివరాలను సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాజీవ్ స్వగృహపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అందులో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలే రూ. లక్ష కోట్లకుపైగా మొత్తంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయ సమీకరణలో భాగంగా ప్రభుత్వం భూములను అమ్మాలని నిర్ణయిం చింది. ఇదే కోవలో స్వగృహ కార్పొరేషన్‌కు ఖాళీగా ఉన్న భూములను విక్రయించాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కొన్ని ఖాళీ భూములను అమ్మిన అధికారులు... అలా వచ్చిన మొత్తాన్ని స్వగృహ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెచ్చించారు. కానీ, ఈసారి అమ్మగా వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాకే జమ చేయనున్నారు. హైదరాబాద్ శివారులో 90 ఎకరాలు... స్వగృహ ప్రాజెక్టుల నిర్మాణం కోసమని రాజధానికి నలువైపులా గతంలో భారీగా భూములను ఆ కార్పొరేషన్ సేకరించింది. ఇందులో నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్కేసర్ వైపు పోచారం, జవహర్‌నగర్, గాజులరామారంలలో నిర్మాణాలు జరిపింది. బహదూర్‌పల్లి, బాచుపల్లిల్లో పనులు ప్రారంభించలేదు. జవహర్‌నగర్‌లో నిర్మాణ స్థలం పోను ఇంకా దాదాపు 12 ఎకరాల స్థలం ఉంది. గాజుల రామారంలో 10 ఎకరాల స్థలంలో జీప్లస్ 14 పద్ధతిలో మూడు బ్లాకులు, పాక్షికంగా మరో రెండు బ్లాకులు నిర్మించారు. ఇది పోను మరో 10 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. బహదూర్‌పల్లిలో 40 ఎకరాలు, బాచుపల్లిలో 28 ఎకరాల మేర పూర్తి ఖాళీగా ఉంది. బాచుపల్లి భూములపై కోర్టు వివాదాలున్నాయి. వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో 438 ఎకరాలు... నిజామాబాద్‌లో 100 ఎకరాలు భూమి సిద్ధంగా ఉంది. ఇక్కడ నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఇందులో 50 ఎకరాలను స్వయంగా స్వగృహ కార్పొరేషన్ పరిహారం చెల్లించి సేకరించడం విశేషం. నగర వెలుపల శాటిలైట్ టౌన్‌షిప్స్ అభివృద్ధి చేసే ఆలోచనలో భాగంగా పటాన్చెరు సమీపంలోని లక్డారం గ్రామంలో స్వగృహ ఏకం గా 250 ఎకరాలను సమీకరించుకుంది. కానీ, ఇక్కడ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టకపోవడంతో అదంతా ఖాళీగా ఉంది. కరీంనగర్లో 60 ఎకరాల భూమి ఉండగా అందులో 30 ఎకరాల్లో 40 వ్యక్తిగత ఇళ్ల నమూనాలో పనులు మొదలుపెట్టారు. పునాది దశలోనే వాటిని నిలిపివేశారు. మిగతా 30 ఎకరాలు ఖాళీగా ఉంది. వరంగల్ హంటర్‌రోడ్డులో కూడా పనులు ప్రారంభించలేదు. ఖమ్మంలో 250 ఇళ్లను నిర్మించారు. కానీ, దరఖాస్తులు లేకపోవడంతో అవి దుమ్మకొట్టుకుపోతున్నాయి. వీటిని గంపగుత్తగా అమ్మాలని ఇప్పటికే నిర్ణయించారు. వీటిని అమ్మితే దాదాపు రూ.80 కోట్లు సమకూరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎంతొచ్చినా అమ్మేద్దాం..!
‘స్వగృహ’ ఇళ్లు, భూముల ధరలు తగ్గించి అమ్మాలని సర్కారు నిర్ణయం బేరసారాలకూ వెసులుబాటు.. ‘వచ్చిందే చాలు’ తరహాలో అమ్మకం సాక్షి, హైదరాబాద్: పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఇళ్లు, భూములను వదిలించుకునేందుకు సిద్ధమైంది. ‘వచ్చిందే చాలు’ తరహాలో అపార్ట్మెంట్లు, సొంత భూములను ఎంతొచ్చినా అమ్మేయాలని నిర్ణయించింది. ఇంతకాలం నిర్ధారిత ధరలకే వాటిని అమ్మాలనే పద్ధతిలో ముందుకుసాగినా.. కొనేవారు లేకపోవడంతో కార్పొరేషన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు కొనేవారుంటే చాలు ఎంతొచ్చినా అమ్మేద్దాం.. అనే నిర్ణయానికి వచ్చి ఇదే విషయాన్ని ప్రభుత్వం ముందుంచింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే అంది. కార్పొరేషన్ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ ధరలను ఆధారం చేసుకుని స్వగృహ ఇళ్లు, భూముల ధరలను నిర్ణయించే అధికారాన్ని కార్పొరేషన్ ఎండీకి కట్టబెట్టింది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అప్పటికప్పుడు వాటి ధరలను నిర్ధారించే అవకాశం ఇక కార్పొరేషన్ పరిధిలోకే రావటంతో, ప్రజలు బేరసారాలాడే వీలు చిక్కింది. దీంతో అమ్మకాలు కూడా వేగంగా సాగి ఆదాయం సమకూరుతుందనేది ప్రభుత్వ ఆలోచన. వాటితో కేటగిరీ ఒకటి పరిధిలోని పదకొండు ప్రాజెక్టుల్లో పనులు పూర్తి చేయటానికి వీలు చిక్కటమే కాకుండా, బ్యాంకు అప్పులు తీర్చేందుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు రూ. 246 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
‘స్వగృహ’ క్లియరెన్స్ సేల్!
సాక్షి, హైదరాబాద్: క్లియరెన్స్ సేల్... అమ్ముడు కాకుండా మిగిలిపోయిన లేదా లోపాలున్న వస్తువులను వదిలించుకునే క్రమంలో దుకాణదారులు ధర భారీగా తగ్గించి అమ్మెయ్యడాన్నే క్లియరెన్స్ సేల్‌గా చెబుతూ ఉంటారు. ఇదేమాదిరిగా ప్రభుత్వం ఇప్పుడు ‘స్వగృహ’ ఇళ్లను క్లియరెన్స్ సేల్కు అమ్మేందుకు సిద్ధమవుతోంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నగరంలో బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్‌ల్లో దాదాపు 7 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే, నిధుల కొరతతో వీటి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఇవి ఖాళీగా ఉండిపోయాయి. మరికొంత కాలం ఈ ఇళ్లు ఇలాగే ఉంటే ‘పాడుబడ్డ నిర్మాణాల’నే పేరుపడితే జనం కొనరని, అప్పుడు ఏకంగా రూ. వేయి కోట్లు నష్టం రావచ్చని అంతర్జాతీయ వ్యాల్యూయేటర్స్ హెచ్చరించారు. దీంతో ఈ ఇళ్ల ధరను 25 % తగ్గించి అమ్మేయాలని స్వగృహ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 2,800 ఫ్లాట్లతో రూపుదిద్దుకుంటున్న జవహర్‌నగర్ ప్రాజెక్టుపై కార్పొరేషన్ ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.400 కోట్లు. ఇది డిమాండ్ లేని ప్రాజెక్టుగా గుర్తించిన అధికారులు కొంతకాలం క్రితం పనులు ఆపేశారు. దీన్ని ఉన్నదున్నట్టు వేలం ద్వారా అమ్మే ఆలోచనతో ఆస్తుల విలువను నిర్ధారించే మూడు అంతర్జాతీయ వ్యాల్యూయేటర్స్‌కు అప్పగించారు. నెలపాటు కసరత్తు చేసిన ఆ సంస్థలు ఈ ప్రాజెక్టు విలువను రూ.190 కోట్లుగా నిర్ధారించాయి. అదేమాదిరిగా పోచారం, బండ్లగూడ ప్రాజెక్టుల విలువ కూడా చాలా తక్కువేనని ఈ సంస్థలు తేల్చాయి. ‘ఖాళీ స్థలాన్ని కొని నచ్చిన రీతిలో ఇళ్లు కట్టుకోవటానికి ఎవరైనా ముందుకొస్తారు. కానీ.. మీకు న చ్చిన రీతిలో కట్టి అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. అందువల్లే ఈ నిర్మాణాలకు అంతగా విలువ లేదు..’ అంటూ ఆ సంస్థలు ఇచ్చిన నివేదిక చూసి ‘స్వగృహ’ ఉన్నతాధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. ఆ లెక్కన ప్రాజెక్టులను గంపగుత్తగా అమ్మితే రూ.వేయి కోట్లకుపైగా నష్టం వచ్చే అవకాశం ఉన్నందున, ఇళ్ల ధరలను భారీగా తగ్గించి విడివిడిగా అమ్మితే సాధారణ ప్రజలు హాట్ కేకుల్లా కొంటారని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ ధరకంటే 25 % మేరకు తగ్గించి అమ్మితే నష్టాలను తగ్గించవచ్చని స్వగృహ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. -
స్వ‘గృహ’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ సంస్థలు నిర్మించే ఇళ్లకు తీసిపోకుండా అన్ని వసతులతో తక్కువ ధరకే స్వగృహ ఇళ్లను అందిస్తామని ఊదరగొట్టిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ క్రమంగా ఒక్కో ‘ప్రత్యేకత’కు నీళ్లొదులుతోంది. పైపు ద్వారా వంటగ్యాస్ సరఫరా, సోలార్ వాటర్ హీటింగ్, మెరుగైన చలవరాళ్లతో ఫ్లోరింగ్, బ్రాండెడ్ కంపెనీల ఫిటింగ్ల బిగింపు... తదితర ప్రత్యేకతలకు ఇప్పటికే తిలోదకాలిచ్చారు. ఇక భూగర్భ కేబుల్ వ్యవస్థకూ మంగళం పాడాలని తాజాగా నిర్ణయించారు. నిధులు లేక పనులెలా కొనసాగించాలో తెలియుక అధికారులు అయోమయంలో ఉండగా, ప్రభుత్వ పరంగా సాయం చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపకపోవటంతో ఈ పరిస్థితి ఎదురైంది. రూ.500 కోట్లు కావాలంటూ దాదాపు ఏడాదిన్నరగా అధికారులు కోరుతుండగా, ప్రభుత్వం ఇటీవల రూ.105 కోట్లు వూత్రమే అందజేసింది. ఈ నిధులతో కొన్ని ప్రాజెక్టులను ఎలాగో ముగించి, దరఖాస్తుదారులకు అందించి, ఇచ్చిన నిధులను వడ్డీ సహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ చాలీచాలని నిధులతో పనులు చేయటం సాధ్యం కాకపోవటంతో... ప్రజలను ఆకట్టుకునేందుకు మొదట్లో చేసిన హంగులను తొలగించి ఆర్థికభారం నుంచి బయటపడాలన్నది అధికారుల ఆలోచన. ప్రతి ఇంటికి సోలార్ వాటర్ హీటర్, పైప్‌లైన్‌లో వంటగ్యాస్ వంటి వసతులు ఉండబోవని ఇప్పటికే తేల్చిచెప్పారు. ఫ్లోరింగ్‌కు, స్నానాల గదులలో, ఇతర చోట్ల వాడే ఫిటింగ్స్‌ను బ్రాండెడ్ కంపెనీలవి కాకుండా, మామూలు కేటగిరీవి వాడాలని నిర్ణయించారు. విద్యుత్తు స్తంభాలు, వాటికి అడ్డదిడ్డంగా కరెంటు వైర్లు వేళ్లాడే పరిస్థితికి భిన్నంగా భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించినా ఇపుడు అదీ వద్దనుకున్నారు. ఇప్పటికి, ఒకటి రెండు ప్రాజెక్టుల్లో భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయుగా, అందులో ఒక్కో ప్రాజెక్టుకు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు భారం పడటంతో, దీని బదులు మామూలుగా బయటకే కేబుళ్లు ఏర్పాటు చేస్తే కనీసం 40 శాతం వరకు ఖర్చు తగ్గుతుందని లెక్కలు తేల్చారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, నిర్వహణకు తగ్గ నిపుణులు అందుబాటులో లేరన్న సాకుతో ఇప్పుడు భూగర్భ కేబుళ్ల వ్యవస్థకు కూడా మంగళం పాడబోతున్నారు. -
ఈ-వేలం ద్వారా స్థలాల అమ్మకం
సీమాంధ్ర ఉద్యమంతో తీరు మార్చుకున్న స్వగృహ ఇప్పటికే విఫలమైన బహిరంగ వేలం ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: నిధులు లేక అల్లాడుతున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తన ఖాళీ స్థలాలను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు సిద్ధమైంది. గతంలోనే బహిరంగ వేలం ద్వారా స్థలాలు అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తుదిదశలో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉండడం. అందుకు తగ్గట్టుగా నిధులు సమకూరకపోవడంతో ఇప్పటికిప్పుడు స్థలాలను అమ్మేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తాజాగా ఈ-వేలం బాట పట్టింది. తొలిదఫాగా కాకినాడ, కర్నూలు, రాజంపేటలలోని ప్లాట్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితోపాటు తెలంగాణలోని కామారెడ్డిలో ఉన్న ఖాళీస్థలాన్ని అమ్మేందుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం రూ.105 కోట్ల రుణాన్ని స్వగృహకు కేటాయించింది. వీటితో ఐదు ప్రాజెక్టుల్లోని ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగతా వాటిల్లో పనులు పూర్తి చేసేందుకు కార్పొరేషనే సొంతంగా నిధులు సేకరించుకోవాల్సి ఉంది. ఇందుకోసం డిమాండ్‌లేని ప్రాజెక్టులు, డిమాండ్ ఉన్నవాటిల్లో ఖాళీగా ఉన్న భూములను అమ్మేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో కాకినాడ, తణుకుల్లోని భూములను అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు ఉద్యమం వల్ల విఫలం కావటంతో ఇప్పుడు ఈ-వేలం ద్వారా అమ్మాలనుకుంటున్నారు. కాకినాడలో తొలుత దాదాపు 5 ఎకరాల భూమిని 55 ప్లాట్లుగా, కర్నూలులో 10 ఎకరాల భూమిని 99 ప్లాట్లుగా, రాజంపేటలో 5 ఎకరాల భూమిని 60 ప్లాట్లుగా అభివృద్ధి చేశారు. వీటికి వచ్చే స్పందన ఆధారంగా మిగతా భూమిని, ఇతర ప్రాంతాల్లోని మరికొన్ని ప్లాట్లను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాకినాడ వేలం ఈ నెల 17వ తేదీన, రాజంపేటలో 18న, కర్నూలులో 19న నిర్వహించనున్నారు. అలాగే డిమాండ్ లేని ప్రాంతంగా ఇప్పటికే తేల్చిన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో అందుబాటులో ఉన్న 8.30 ఎకరాలను ఈ నెల 18న ఏకమొత్తంగా అమ్మేందుకు నిర్ణయించారు. -
కొనుగోలుదారులను ఆకర్షించేందుకు.. స్వగృహ దసరా ఆఫర్
సాక్షి, హైదరాబాద్: పండుగ వేళల్లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రైవేట్ సంస్థలు ‘ఆఫర్ల వల’ వేయడం పరిపాటే. అయితే పైసా ఆదాయం లేక అల్లాడుతున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఇదే పంథాను అనుసరిస్తోంది. అక్టోబర్ 15లోపు ఇళ్లను బుక్ చేసుకుంటే వాటి ధరపై 3 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు దసరా ఆఫర్ ప్రకటించింది. ప్రజల్లో స్వగృహాలకు డిమాండ్ ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండా మునిగిన ఆ సంస్థ, కనీసం నిర్వహణ ఖర్చుల కోసమైనా వీలైనన్ని ఇళ్లను అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేసింది. ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో స్టాల్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా స్వగృహ కార్పొరేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. స్వగృహ కార్పొరేషన్‌ను అనవసరంగా ప్రారంభించారని, అది కట్టిన ఇళ్లకు డిమాండ్ లేదని అంతర్గత సమావేశాల్లో పేర్కొంటూ ప్రభుత్వ పెద్దలే దాన్ని నష్టాల బాట పట్టించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ప్రాపర్టీ షోలో పాల్గొన్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థల స్టాల్స్ కంటే ఎక్కువగా ప్రజలు స్వగృహ స్టాల్‌పైనే ఆసక్తి చూపించడం విశేషం. దాదాపు వేయి మంది సందర్శకులు స్వగృహ వివరాలను తెలుసుకోగా, నాలుగొందల మంది ఇళ్ల కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆదరణకు ఆశ్చర్యపోయిన అధికారులు, వారు చేజారిపోకుండా ఈ తగ్గింపు ఆఫర్‌ను అక్కడ ప్రకటించారు. షోలో వచ్చిన సందర్శకులకే కాకుండా, ఇతర కొనుగోలుదారులకు కూడా దీన్ని వర్తింప చేయనున్నారు. అయితే దీనిపై అధికారికంగా కార్పొరేషన్ ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో అతి తక్కువ ఖర్చయ్యే ప్రాపర్టీ షోలు జరిగినా డబ్బులు లేవంటూ వాటిలో పాల్గొనేందుకు స్వగృహ కార్పొరేషన్ వెనుకడుగు వేసింది. అయితే తాజాగా ఒక ప్రైవేట్ సంస్థ ఒత్తిడితో ఈ ప్రాపర్టీ షోలో పాల్గొనేందుకు సుమారు రూ.14 లక్షల వరకు చెల్లించినట్టు సమాచారం. స్వగృహ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులపై ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన ప్పటికీ ఇక్కడ మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నా అధికారులు కొంత తాత్సారం చేస్తున్నారు.