‘స్వగృహ’ కొంప కూల్చుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి ఉన్నారనే కారణంతో వివిధ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం తొలగిస్తోంది.. కానీ అప్పుల్లో మునిగి దివాలా తీసిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మాత్రం ఇందుకు భిన్నం. రెండేళ్లుగా ఒక్క ఫ్లాట్‌ను కూడా అమ్మని ‘స్వగృహ’లో యథేచ్ఛగా సిబ్బంది నియామకం జరుగుతూనే ఉంది. జీతాలు చెల్లించే పరిస్థితి లేక ఖాళీ స్థలాలు అమ్ముకుంటున్న సంస్థను ఈ కొత్త కొలువులు పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఈ వ్యవహారానికి కారణం ప్రజాప్రతినిధులే. తమ అనుచరులకు వారు ‘స్వగృహ’లో ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు.
ఈ కార్పొరేషన్‌లో ఇప్పటికే ఉన్న ఉద్యోగులకే పనీ లేదు. దానికితోడు కొత్తగా వస్తున్న వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక.. ఏదో ఓ పేరుతో పోస్టు ఇస్తున్నారు. వీరి జీతాల కోసం పెద్ద మొత్తంలో సొమ్ము వృథా అవుతోంది. కనీసం ఒక్కరోజు కూడా ఫీల్డ్‌కు వెళ్లే పనిలేకున్నా కొందరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా చెలామణి అవుతున్నారు. సిఫారసు చేసిన ప్రజాప్రతినిధి స్థాయిని బట్టి ఈ ‘కొత్త’ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ విభాగంలో పనిచేసి పదవీవిరమణ పొందిన కొందరికి నెలకు రూ.18 వేల నుంచి రూ.25 వేలు చెల్లిస్తున్నారు. ఫోన్ బిల్లు, పెట్రోలు భత్యం కూడా ఇవ్వడం గమనార్హం.
అమ్మకాలు నిలిపేశాక మార్కెటింగ్‌లో కొలువులు: గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కొత్త ధరలు ఖరారు చేసే ఉద్దేశంతో ఇళ్ల అమ్మకాలు నిలిపివేయాలని నాటి ఎండీ ఆదేశించారు. ఇది జరిగి రెండున్నరేళ్లు గడిచింది. అయితే ఇళ్ల అమ్మకం వద్దనుకున్నప్పుడు మార్కెటింగ్ విభాగంలో సిబ్బంది నియామకం ఎందుకో అధికారులకే తెలియాలి. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఏపీకి చెందిన ఓ ఎంపీ, నల్లగొండకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీల సిఫారసుతో ముగ్గురికి ‘స్వగృహ’లో ఉద్యోగాలిచ్చారు.