దేశంలో 2024లో వేతనాలు సగటున 9.5% పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్‌సీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 45 రంగాలకు చెందిన 1,414 కంపెనీల డేటాను విశ్లేషించింది.
కరోనా పరిణామాల అనంతరం 2022లో దేశీయంగా అధిక వేతన పెంపు లభించిందని, రానున్న రోజుల్లో గరిష్ఠ స్థాయిలో వేతనాలు పెంపు ఉంటోందని తెలిపింది. సంఘటిత రంగానికి అంచనా వేసిన ఈ వేతన పెంపు.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా వ్యూహాత్మక సర్దుబాటును సూచిస్తోందని పేర్కొంది. ‘మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలు గణనీయ వృద్ధిని నమోదు చేస్తాయి. కొన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమవుతాయి’ అని ఎయాన్ ఇండియాలో ట్యాలెంట్ సొల్యూషన్స్‌కు ముఖ్య కమర్షియల్ అధికారిగా ఉన్న రూపాంక్ చౌదరి తెలిపారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగల దేశాల్లో, వేతన పెంపు అధికంగా ఉంటున్న దేశాల్లో భారత్ అగ్రగామిగా కొనసాగుతుందని సర్వే తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, ఇండోనేషియా ఉన్నాయని పేర్కొంది. 2024లో ఈ రెండు దేశాల్లో సగటు వేతన పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనుందని పేర్కొంది. మనదేశంలో సిబ్బంది వలసల రేటు 2022లో 21.4% కాగా.. 2023లో 18.7 శాతానికి పరిమితమైందని సర్వే తెలిపింది.
ఇదీ చదవండి: సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ‘పాపా’
ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉందని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఆర్థిక సేవల సంస్థలు, ఇంజినీరింగ్, వాహన, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. రిటైల్, టెక్నాలజీ కన్సల్టింగ్, సేవల రంగాల్లో తక్కువ వేతన పెంపు ఉండొచ్చని సర్వే ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment