పని చేస్తే జీతమిస్తారు ఎక్కడైనా. కానీ.. పరుపులపై నిద్రపోవడం.. క్యూలైన్‌లో నిలబడటం.. శవం దగ్గర ఏడ్వటం లాంటి పనులు చేస్తే కాసుల వర్షం కురుస్తోంది. వివిధ దేశాల్లో ఇలాంటి చిత్ర విచిత్రమైన పనులెన్నో చేసేస్తూ డబ్బులు గడిస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి. అవేంటో చూసేద్దాం పదండి.
కార్యాలయం లేదా పనిచేసే చోట నిద్రపోతే ఉద్యోగం ఊడిపోతుంది. కానీ.. బాగా నిద్రపోయే వారికి మాత్రం అక్కడ జీతాలు ఇస్తారు. ‘ప్రొఫెషనల్ స్లీపర్స్’ పేరిట ఇలాంటి ఉద్యోగాలను పరుపుల తయారీ కంపెనీలు, కొన్ని ప్రముఖ హోటళ్లు సైతం ఆఫర్ చేస్తున్నాయి. ఫిన్లాండ్‌లోని ఒక హోటల్ ప్రొఫెషనల్ స్లీపర్స్‌ను నియమించుకుంది. ఆ హోటల్‌లోని బెడ్‌లలో రోజూ ఏదో ఒక బెడ్‌పై పడుకుని అవి సౌకర్యంగా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసి నివేదిక ఇవ్వడమే ప్రొఫెషనల్ స్లీపర్ పని. ఇందుకోసం వీరికి నెలకు రూ.లక్షల్లో జీతాలిస్తున్నారు.
అంతేకాదు.. బెడ్‌లు, పరుపుల తయారీ కంపెనీలు సైతం వాటి నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రొఫెషనల్ స్లీపర్స్‌ను నియమించుకుంటున్నాయి. న్యూయార్క్‌లో పరుపులు తయారు చేసే కాస్పెర్ కంపెనీ బిజినెస్ పెంచుకునేందుకు కొత్తగా ఆలోచించి ‘స్లీపర్స్’ కావాలని ఈ మధ్యే ఒక ప్రకటన చేసింది. తమ కంపెనీ పరుపు మీద పడుకుంటే కంటినిండా నిద్రపడుతుందని చెప్పడం ద్వారా మార్కెట్ పెంచుకునేందుకు ‘ప్రొఫెషనల్ స్లీపర్స్’ కోసం వెతుకుతోంది ఆ కంపెనీ.
అభ్యర్థులకు ఎక్కువసేపు నిద్రపోవాలనే కోరిక ఉండాలట. చుట్టూ ఏం జరిగినా ఏమీ పట్టనట్టు హాయిగా పడుకోగలగటం ప్రత్యేకత. జాబ్‌లో చేరిన వారు కాస్పెర్ పరుపుల పైపడుకుని బాగా నిద్రపోవడంతోపాటు వారి అనుభవాలను టిక్‌టాక్ వీడియోలు, రీల్స్, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని
ఆ కంపెనీ నిబంధనలు విధించింది.
బెంగళూరులోనూ ఉందో కంపెనీ
నిద్రపోతే చాలు జీతమిస్తామంటోంది మన దేశంలోని బెంగళూరుకు చెందిన ‘వేక్‌ఫిట్’ సంస్థ. ‘రోజూ రాత్రి 9 గంటలపాటు శుభ్రంగా పడుకోండి. నెలకు రూ.లక్ష జీతం ఇస్తాం’ అంటోంది. అంతేకాదు.. ఈ జాబ్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనే అభ్యర్థులకు బాగా నిద్రపోయేలా స్లీప్ ఎక్స్‌పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, ఫిట్‌నెస్ నిపుణులు పలు సూచనలు కూడా ఇస్తారట.
అభ్యర్థులందరినీ ఒక ప్రత్యేక వాతావరణంలో ఉంచి వారందరూ గాఢంగా, ఎక్కువ సేపు నిద్రపోయేలా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తారు. ఇందులో పాల్గొనే వారికి ఏదైనా డిగ్రీ ఉండాలి. బెడ్‌పైకి వెళ్లగానే 10–20 నిమిషాల్లో నిద్రలోకి జారుకునే లక్షణం కలిగి ఉండాలి.
క్యూలో నిలబడితే డబ్బిస్తారు
క్యూలో గంటల తరబడి నిలబడటం ఎవరికైనా ఇబ్బందే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వయసు పైబడిన వారు, చిన్న పిల్లల తల్లులు, పిల్లలు క్యూలైన్‌లో నిలబడటం కష్టం. ఇందుకు ప్రత్యామ్నాయంగా అనేక దేశాలు ‘లైన్ స్టాండర్’ పద్ధతిని అనుసరిస్తున్నాయి. లైన్‌లో మీరు నిలబడలేకపోతే మీకు బదులుగా అక్కడి ఉద్యోగులు నిల్చుంటారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఈ తరహా లైన్ స్టాండర్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్‌లో ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించినప్పుడు.. మార్కెట్లో కొత్త ప్రొడక్ట్స్ విడుదలైనప్పుడు వీరికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.
ప్రయాణికుల్ని తోసేస్తే జీతం
పండగలు, పర్వదినాల్లో కిక్కిరిసిన రైలు, బస్సుల్లో జనం గుమ్మాల దగ్గర వేలాడటం చూస్తుంటాం. మెట్రో రైలులో ఇలాంటి పరిస్థితి వస్తే తలుపులు మూసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాల్లో ప్రత్యేకంగా ‘పాసింజర్ పుషర్స్’ను నియమిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోతోపాటు వివిధ దేశాల్లోని మెట్రో రైళ్లలో ‘పాసింజర్ పుషర్స్’ డ్యూటీలో చేరుతున్నారు. మెట్రో రైలు లోపలికి ప్రయాణికులను నెట్టేసి రైలు తలుపులు మూసుకునేలా చేయడమే వీరి పని. ఇందుకోసం వారికి నెలకు మన కరెన్సీలో చూస్తే రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు జీతం ఇస్తున్నారు.
అక్కడ ఏడిస్తే డబ్బులిస్తారు
కొన్ని దేశాల్లో ఎవరైనా చనిపోతే ఏడ్చేందుకు వెళ్లి డబ్బులు సంపాదించుకోవచ్చు. చైనా, ఆఫ్రికా, యూకే వంటి దేశాల్లో మతపరమైన సంప్రదాయంలో ప్రత్యేకంగా దుఃఖితులను నియమించుకుని డబ్బులిస్తారు. వీరంతా ఏడవడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తారు. ఇందుకోసం ఒక్కో ఈవెంట్‌కు సుమారు రూ.9 వేల నుంచి రూ.16 వేల వరకు చెల్లిస్తారు.
మరిన్ని చిత్రమైన కొలువులున్నాయ్!
ఓటీటీ సంస్థలు ప్రత్యేకంగా మూవీ వాచర్‌లను నియమించుకుంటున్నాయి. సినిమా ప్రసారం కావడానికి ముందే సినిమా ఎలా ఉంది.. రీచింగ్ బాగా ఉంటుందా.. లేదా.. ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనే దానిపై కొందర్ని నియమించుకుని జీతాలిస్తున్నాయి. విడుదలకు ముందే వెబ్ సిరీస్, మూవీలను చూసి సమీక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే రిలీజ్ ఆధారపడి ఉంటుంది. కాగా, ఇంటికి వేసిన రంగు (కలర్) ఎంత సమయంలో ఆరుతుందో చెప్పడానికి ప్రత్యేకంగా రంగుల తయారీ కంపెనీలు పెయింట్ డ్రైయింగ్ వాచర్ పేరిట సిబ్బందిని నియమించుకుంటున్నాయి.
పెయింట్ ఎంతసేపట్లో ఆరుతుంది.. చేతికి అంటుకుంటుందా అనే వివరాలతో రిపోర్ట్ తయారు చేసి మేనేజర్లకు ఇవ్వడమే వీరి పని. కాగా.. గోల్ఫ్ గేమ్‌లో కొట్టిన బంతిని దూరం నుంచి తిరిగి తేవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఆదా చేసేలా బాల్ డ్రైవర్‌ను నియమించుకుని జీతాలిస్తారు. కాగా, చివరకు కండోమ్ తయారీ సంస్థలు వాటిని మార్కెట్లో విడుదల చేయడానికి ముందు సౌకర్యంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు కూడా కండోమ్ టెస్టర్స్‌ను నియమించుకుంటాయి. వారికి జీతం ఏడాదికి ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే.. ఏకంగా రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు చెల్లిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment