సాక్షి, విజయవాడ : ప్రభుత్వోద్యోగులు విధులకు హాజరుకాకపోతే ‘జీతంలో కోతపెడతామని.. పనిచేస్తేనే జీతం’ అని ప్రభుత్వం బెదిరిస్తోంది. ఉద్యోగులు సమ్మెచేసినప్పుడల్లా ‘పనిచేస్తేనే జీతం’ అంటూ ఎస్మా (అత్యవసర విధుల నిర్వహణ చట్టం) ప్రయోగించడం ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. గతంలో తెలంగాణ ఉద్యోగులు జీతాలకోసం ఉద్యమా న్ని పక్కన పెట్టలేదు. వారికి దీటుగానే ప్రస్తుతం సీమాంధ్ర ఉద్యోగులు జీతం కోత హెచ్చరికతో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సిద్ధంగా లేరు. జీతమే కాదు, ఉద్యోగం పోయినా.. చివరికి ప్రాణాలు పోయినా ఉద్యమం ఆపబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జీతం బూచి చూపి ఉద్యోగుల్ని బెదిరించాలనే కిరణ్ సర్కార్ ఆలోచనలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎస్మాను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇటువంటి జీవోలు తమ ఐక్యతను దెబ్బతీయలేవని చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన ‘జీతం కోత’పై వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటున్నారో వారి మాటల్లోనే...
ఎన్నిరోజులైనా పోరాడతాం..
ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటోంది. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మహిళా ఉద్యోగులంతా రోడ్డు ఎక్కడానికి కూడా వెనుకాడడం లేదు. 13 జిల్లాల్లో పదిహేను రోజులుగా జరుగుతున్న ఉద్యమాలను చూసైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి. సమైక్యాంధ్ర కోసం ఎన్ని రోజులైనా పోరాటం చేయడానికి వెనుకాడబోం.
- మనోరంజని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
జీవోలు ఉపసంహరించాలి
రాష్ట్ర ఐక్యతను కాపాడాల్సిన రాజకీయ నాయకులు ఆ బాధ్యత నుంచి తప్పుకొంటే.. ఉద్యోగస్తులుగా మేము ఆ బాధ్యత తీసుకున్నాం. నాలుగు లక్షల మంది ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే జీవోలను జారీ చేసేటప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు.
- ఎం.దుర్గాప్రసాద్, ఏపీఎస్‌ఆర్టీసీ
కేంద్రం నిర్ణయం మార్చుకోవాలి
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్ని గౌరవించాలి. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఎక్కువ నష్టపోతారని భావించినప్పుడు ఆ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవడంలో తప్పులేదు.
- కాటంరాజు, రెవెన్యూ శాఖ
సమైక్యాంధ్రే ముఖ్యం
రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిర్ణయానికి వచ్చేముందే ఇటువంటి బెదిరింపులకు భయపడకూడదని నిర్ణయించుకున్నాం. నాలుగు లక్షల మంది ఎన్జీవోలు ఒక్కతాటిపైకి వ చ్చి ఉద్యమిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు ప్రకటించడం మినహా ప్రత్యామ్నాయం లేదు.
- విద్యాసాగర్, ఏపీఎన్జీవో సంఘం చైర్మన్
జీవోలకు భయపడం
ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగులు చేసే ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రభుత్వం జారీ చేసే నల్లజీవోలను ఏమాత్రం ఖాతరు చేయం. ఎస్మా వంటి చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగులను దారిలోకి తెచ్చుకోవాలనుకోవడం ప్రభుత్వ అవివేకం. ప్రభుత్వం దిగి వచ్చి రాష్ట్ర విభజనను నిలిపివేయాలి.
- ఈశ్వర్, విజయవాడ నగరపాలక సంస్థ
ఉద్యమాన్ని ముందుకుతీసుకెళతాం..
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం మొన్న జీవో 177ను, నిన్న 238ను జారీ చేసింది. అయినప్పటికీ 13 జిల్లాల ఉద్యోగులు ఏమాత్రం బెదిరిపోకుండా ఒకేమాటపై ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.
- వెంకటేశ్వరరావు, రవాణాశాఖ
ఐక్యత కోసం ఏమైనా చేస్తాం..
జీతాల్లో కోత కాదు.. ఉద్యోగాలు... ప్రాణాలు పోయినా కూడా వెనక్కి తగ్గం. రాష్ట్ర ఐక్యతను కాపాడేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టడానికి కూడా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయం చేసే ఢి ల్లీ పెద్దలు ఈ విషయాన్ని గమనించి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలి.
- కె.మధుసూదనరాజు, గ్రంథాలయ శాఖ
హైదరాబాద్ ఎవడి సొత్తూ కాదు
హైదరాబాద్‌లో సీమాంధ్రవాసులకు భద్రత కల్పిస్తామంటున్నారు. మాకు అక్కడ భద్రత లేదని ఎవరన్నారు. 30 ఏళ్లు కష్టబడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను వారికి ధారాదత్తం చేయడానికి సిద్ధంగా లేము. సీమాంధ్ర ఉద్యోగుల సత్తా ఏంటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చూపిస్తాం.
- వాసు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం
జీతాలు, ఉద్యోగాలు, ప్రాణత్యాగం దేనికైనా రెఢీ
Published Mon, Aug 19 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement