ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దాంతో చాలా కంపెనీలు మౌలిక సదుపాయాల కోసం గతంలోకంటే ఎక్కువ ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫలితంగా కంపెనీలు ఉత్పాదక పెంచేందుకు ఉపయోగపడే టెక్నాలజీ, మిషనరీ వంటి వాటిపై ఖర్చులు తగ్గించాయి. ఓ పక్కన క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవడంతో కంపెనీలు సతమతమవుతుండగా.. ఆ ప్రభావం కాస్త సిబ్బందిపై పడింది. వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమయంలో ‘అప్నా’ విడుదల చేసిన నివేదిక మహిళలను కొంత ఊరటనిస్తోంది.
ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్ ఫారమ్ 'అప్నా' జాబ్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం గురించి కీలక రిపోర్టు విడుదల చేసింది. 5.6 కోట్ల ఉద్యోగ దరఖాస్తులను పరిశీలిస్తే మహిళలు అధిక ప్రభావం చూపుతున్నట్లు ప్రకటించింది. బ్లూ, గ్రే, వైట్ కాలర్ రంగాల్లోని 2.1 లక్షలు స్మాల్ అండ్ మిడ్‌సైజ్ బిజినెస్(ఎస్‌ఎంబీ)లు, 400 ఎంటర్ప్రైజెస్ కు సంబంధించిన ఉద్యోగాలకు 33 శాతం మంది మహిళలు దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది.
ఈ ఏడాది మహిళా ఉద్యోగుల వేతనాల్లో సరాసరి 25 శాతం వృద్ధి నమోదు అయినట్లు తెలిసింది. అయితే పురుషుల వేతనాల్లో మాత్రం 17 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. వేతనాల వృద్ధి విషయంలో పురుషుల కంటే మహిళలే ముందున్నారని చెప్పింది. అక్టోబర్‌లో విడుదలైన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగింది. 2022లో ఇది 32.8 శాతం కాగా 2021లో 32.5 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రూ.10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల వృద్ధి
ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితులు, చాలా సంస్థల డైవర్సిఫై విధానాల ద్వారా వర్క్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఐటీ, ఆర్థిక సేవలు, సప్లై చైన్, లాజిస్టిక్ విభాగాలు ఈ విధానం ద్వారా మంచి పురోగతి సాధిస్తున్నట్లు చెప్పారు. మరో పదేళ్లలో టాప్ లెవల్ మేనేజ్‌మెంట్‌లో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment