Women jobs
-
‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’
ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దాంతో చాలా కంపెనీలు మౌలిక సదుపాయాల కోసం గతంలోకంటే ఎక్కువ ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కంపెనీలు ఉత్పాదక పెంచేందుకు ఉపయోగపడే టెక్నాలజీ, మిషనరీ వంటి వాటిపై ఖర్చులు తగ్గించాయి. ఓ పక్కన క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవడంతో కంపెనీలు సతమతమవుతుండగా.. ఆ ప్రభావం కాస్త సిబ్బందిపై పడింది. వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమయంలో ‘అప్నా’ విడుదల చేసిన నివేదిక మహిళలను కొంత ఊరటనిస్తోంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ ఫారమ్ 'అప్నా' జాబ్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం గురించి కీలక రిపోర్టు విడుదల చేసింది. 5.6 కోట్ల ఉద్యోగ దరఖాస్తులను పరిశీలిస్తే మహిళలు అధిక ప్రభావం చూపుతున్నట్లు ప్రకటించింది. బ్లూ, గ్రే, వైట్ కాలర్ రంగాల్లోని 2.1 లక్షలు స్మాల్ అండ్ మిడ్‌సైజ్ బిజినెస్(ఎస్ఎంబీ)లు, 400 ఎంటర్ప్రైజెస్ కు సంబంధించిన ఉద్యోగాలకు 33 శాతం మంది మహిళలు దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది మహిళా ఉద్యోగుల వేతనాల్లో సరాసరి 25 శాతం వృద్ధి నమోదు అయినట్లు తెలిసింది. అయితే పురుషుల వేతనాల్లో మాత్రం 17 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. వేతనాల వృద్ధి విషయంలో పురుషుల కంటే మహిళలే ముందున్నారని చెప్పింది. అక్టోబర్‌లో విడుదలైన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగింది. 2022లో ఇది 32.8 శాతం కాగా 2021లో 32.5 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: రూ.10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల వృద్ధి ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితులు, చాలా సంస్థల డైవర్సిఫై విధానాల ద్వారా వర్క్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఐటీ, ఆర్థిక సేవలు, సప్లై చైన్, లాజిస్టిక్ విభాగాలు ఈ విధానం ద్వారా మంచి పురోగతి సాధిస్తున్నట్లు చెప్పారు. మరో పదేళ్లలో టాప్ లెవల్ మేనేజ్మెంట్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగవచ్చని భావిస్తున్నారు. -
Group of Seven: జి ఫర్ గ్రేట్
జి సెవన్ అంటే ‘గ్రేట్’ సెవన్ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్’ సెవన్. అయితే లండన్ జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో జరిగిన తాజా నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్ సెవన్ కాదు, గ్రేట్ సెవన్ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. బాలికలు, మహిళల మీదే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏడాదిన్నరగా సర్వేలు చెబుతూ వస్తున్నాయి. సర్వేల వరకు వెళ్లక్కర్లేదు. మన చుట్టూ చూస్తేనే తెలిసిపోతుంది. ఇళ్లలో మహిళలకు పని భారం ఎక్కువైంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కంపెనీలకు భారమయ్యారు! బాలికల పరిస్థితి కూడా ఇంతే. బడి గంటలు పోయి, ఇంట్లో పని గంటలు వచ్చేశాయి. ఇక గృహహింస, మహిళల అనారోగ్యాలపై కుటుంబ సభ్యుల అలక్ష్యం, నిరాదరణ ఎప్పుడూ ఉన్నవే. ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. మొదట ఈ పరిస్థితులను చక్కబరిస్తే గానీ కరోనా పర్యవసానాలను నివారించలేమని జి7 దేశాల గుర్తించాయి. బాలికలు, మహిళల చదువు, సంక్షేమాల కోసం నిధులను, విధులను భుజానికెత్తుకున్నాయి. ఏటా జి7 దేశాధ్యక్షుల సదస్సు జరగడానికి ముందు జి7 ఆర్థిక మంత్రుల సమావేశం జరుగుతుంది. కష్టకాలంలో కలిసికట్టుగా ఉండటానికి, అభివృద్ధి చెందే దశలో ఉన్న దేశాలను గట్టెక్కించడానికి ఒక జట్టుగా ఏర్పడిన ఏడు పారిశ్రామిక, ధనిక దేశాల బృందమే జి సెవన్. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యు.కె., జపాన్. వీటితో పాటు ఐరోపా సమాఖ్య ఉంటుంది. జి సెవన్ అంటే ‘గ్రేట్’ సెవన్ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్’ సెవన్. అయితే లండన్‌లో జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో తాజాగా జరిగిన నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్ సెవన్ కాదు, గ్రేట్ సెవన్ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. వచ్చే రెండేళ్లలో బాలికల చదువు, మహిళల ఉద్యోగాల కోసం.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలను సహాయంగా అందివ్వాలని ఏడు దేశాల ఆర్థిక మంత్రులు తీర్మానించారు. వారి సహాయం పొందే దేశాలలో భారత్ కూడా ఉంది. ∙∙ నలభై ఐదేళ్లుగా ఏటా జి7 సదస్సులు జరుగుతున్నాయి. ఏ సదస్సులోనూ ఇంత భారీ ఎత్తున బాలికలు, మహిళల కోసం నిధుల కేటాయింపు లేదు! పైగా ఇది విరాళం వంటి సహాయం. ఈ ఏడు సభ్యదేశాలే తమ కోశాగారం లోంచి తీసి ఇవ్వవలసి ఉంటుంది. అందుకు జి7లోని ఏ దేశమూ కాదనడం ఉండదు కానీ, ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం మీద, వాక్సిన్లు ఆక్సిజన్ల మీద కదా ధార్మిక దృష్టి ఉండవలసింది! ఆ మాట వాస్తవమే కానీ, ఈ ఆపత్సమయంలో మిగతా కూటములలోని భాగస్వాములుగా జి సెవన్ దేశాలు తాము అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు.. జి7 గ్రూపుగా ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల చదువును, మహిళల ఉద్యోగాలను ప్రాధాన్యతా అంశాలుగా గుర్తించాయి! జూన్‌లో జరిగే జి 7 దేశాధ్యక్షుల సదస్సులో ఇప్పుడీ జీ7 ఆర్థిక మంత్రుల నిర్ణయానికి ఆమోదముద్ర పడిన అనంతరం నిధులు పంపిణీకి ప్రణాళిక సిద్ధం అవుతుంది. విషయం ఏంటంటే.. ఇది ఒకరు అడిగితే చేస్తున్న సహాయం కాదు. సహాయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి అందిస్తున్న స్నేహ హస్తం. ఆడపిల్లలకు ఆరేళ్ల వయసు నుంచి పన్నెండేళ్ల పాటు నాణ్యమైన విద్యను అందించడం, మహిళలకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సహాయం ముఖ్యోద్దేశం. జి7 దేశాల్లోని డి.ఎఫ్.ఐ.లు (డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) ఈ నిధుల్ని సమీకరించి, ఆర్థికమంత్రిత్వ శాఖలకు సమకూరుస్తాయి. జి7 తాజా సమావేశం మరొక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. 2026 నాటికి అల్ప, దిగువ మధ్య తరగతి ఆదాయాలున్న దేశాలలో 4 కోట్ల మంది బాలికలను పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే 2 కోట్ల మంది బాలికల్ని వారి పదో ఏట కల్లా చదవడం వచ్చిన వారిలా తీర్చిదిద్దాలి. ఈ రెండు లక్ష్యాలపై కూడా జి సెవన్ మంత్రులు సంతకాలు చేశారు. ∙∙ లండన్‌లో ‘ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్’ (ఎఫ్.సి.డి.వో.) అని విదేశీ ఆర్థిక వ్యవహారాల కార్యాలయం ఒకటి ఉంది. జి7 దేశాల ఆర్థిక మంత్రుల సమన్వయంతో అది పని చేస్తుంది. డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేసే విషయాన్ని ఎఫ్.సి.డి.వో.నే అడగాలి ఏ దేశమైనా! బాలికల చదువు మీద పెట్టుబడి పెట్టడం వివేకవంతమైన పని అంటుంది ఎఫ్.సి.డి.వో.! ‘‘దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, దేశ ఆర్థికాభివృద్ధికి వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడుతుంటాం. అవి ఎంతవరకు ఫలిస్తాయో, ఎప్పటికి ఫలవంతం అవుతాయో కచ్చితంగా చెప్పలేం. కానీ బాలికల చదువు కోసం ఒక దేశం పెట్టే పెట్టుబడి మాత్రం నమ్మకంగా ఆ దేశంలోని పేదరికాన్ని రూపుమాపుతుంది. ఆ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది’’ అని ఎఫ్.సి.డి.వో. జి7 మంత్రుల తీర్మానానికి మద్దతు పలికింది. ‘నువ్వొక బాలుడిని చదివిస్తే అది అతడికే ఉపయోగం. ఒక బాలికను చదివిస్తే మొత్తం దేశానికే ప్రయోజనం’ అని జేమ్స్ ఎమ్మెన్ అన్న మాటను గుర్తుకు తెచ్చేలా ఈసారి జి7 మంత్రుల నిర్ణయాలు ఉన్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు ‘గర్ల్స్ ఎడ్యుకేషన్ పొలిటికల్ డిక్లరేషన్’పై ఏడు దేశాలూ సంతకాలు చేయడంతో బుధవారం ముగిశాయి. కరోనా చీకట్లలో కాంతి కిరణం: బాలికల చదువుకు, మహిళల ఉపాధికి జి7 దేశాల లక్షా పది వేల కోట్ల రూపాయల తీర్మానం -
మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవ్
► ఉద్యోగాలు, వ్యాపారాలంటూ తిరగడం వల్లే మహిళలకు వేధింపులు ► షెడ్లో ఉంచితేనే వాహనానికి భద్రత.. ► ఆడవాళ్ల పరిస్థితి కూడా అంతే..! ►వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి ► మీట్ ది ప్రెస్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాక్షి, అమరావతి : ‘ఒక వాహనం కొని షెడ్లో ఉంచితే ప్రమాదాలు జరగవు.. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయట తిరుగుతున్నందునే వేధింపులకు గురవుతున్నారు. అలాగని వారు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోకూడదని నా ఉద్దేశం కాదు. వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి.. ’ అని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి స్పీకర్ హాజరై మీడియాతో మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలతో పాటు బాల్య వివాహాలు, అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టాలంటే చట్టాలు ఒక్కటే ఉంటే సరిపోదన్నారు. ఆ చట్టాలు అమలు కావాలంటే ముఖ్యంగా మహిళల్లో ధైర్యం రావాలన్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మూడు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో 12 గంటల పాటు పనిచేసే తనకు స్పీకర్‌గా ప్రస్తుతం పెద్దగా పని ఉండటం లేదన్నారు. ఆ సమయంలో ఆలోచించి శాసనసభ ద్వారా ‘మహిళా సాధికారత’ అనే అంశంపై సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందనుకొని ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలకు దేశ, విదేశాల నుంచి 60 మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీయూడబ్లూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కె.జయరాజ్, బొంతా విలియం పాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమానమంటాం... శాసిస్తుంటాం!
ఇప్పటికీ.. స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఊళ్లేలుతున్న ఈ కాలంలోనూ... సమాజంలోని పురుషాధిక్య మూస ధోరణులు ఆడపిల్లను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాయి. అసలీ ధోరణి పిల్ల పుట్టుకతోనే మొదలౌతుంది. ఇది మన పెద్దవాళ్ల నుంచి మనకు సంక్రమించిన జాడ్యం. అయితే ఈ మాటను సమాజం ఒప్పుకోదు. ఆడపిల్ల ఆడపిల్లలా పెరగకపోవడం మన సంప్రదాయం కాదు అంటుంది. ఇలా సంప్రదాయం పేరుతో చిన్నారుల మనసుల్లో బాల్యం నుంచే ఆడ-మగ వేరు అనే భావనను నాటుతున్నాం. ఈ కారణంగా ఆడపిల్లలు, స్త్రీలు మానవ సమాజంలో ఉండవలసిన కనీస స్వేచ్ఛా సమానత్వాలను కూడా కోల్పోతున్నారు. దిగువ శ్రేణి పౌరుల్లా జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఈ 21వ శతాబ్దంలోనూ స్త్రీల జీవితాలను పురాతనకాలం నాటి పరిమితులు, నియమాలు, నిబంధనలు శాసించడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పరిమితులు, నియమ నిబంధనల్లో అత్యంత అర్థరహితమైన వాటిని ఓసారి చూద్దాం. ఆడది గడప దాటకూడదు: ఎప్పటి మాట ఇది! ఇప్పటికీ వినిపిస్తోంది. గృహిణులు కూడా ఈ మాటకు అనుగుణంగా తమను తాము వంటింటికి పరిమితం చేసుకుంటున్నారు. ఒకవేళ ఎవరికైనా వంటిల్లు, ఇల్లు దాటి బయటికెళ్లి ఉద్యోగం చేయాలని ఉన్నా, ఉద్యోగం చేసే అర్హతలున్నా వాళ్లని బయటికి వెళ్లనిచ్చేవారెవరు? పిల్లల పెంపకం స్త్రీ బాధ్యతే: ఎంత బాధ్యతారహితమైన మాట! పిల్లల బాధ్యత తండ్రికి ఉండదా? ఇంట్లోని మిగతా పెద్దవాళ్లు ఆ బాధ్యతను స్వీకరించకూడదా? అన్నీ తల్లే చూసుకోవాలా? ఇంటెడు చాకిరీ చేస్తూ, పిల్లల ఆలనాపాలన చూడ్డం ఒక్క మనిషికి సాధ్యమయ్యేదేనా? మగరాయుడి వేషాలు వేయకూడదు: ఆడపిల్లలు చెట్లు ఎక్కగలరు. పరుగులు తీయగలరు. సాహసాలు చేయగలరు. ఈ ఇష్టాలన్నీ వారు చంపుకోవలసిందేనా? ఎందుకింత కట్టడి!! సమాజం చెప్పినట్లు వినాలి: అంటే స్త్రీ.. పూర్తిగా సమాజం అదుపాజ్ఞల్లో ఉండాలి. వాటి ప్రకారం నడుచుకోవాలి. మరి పురుషుడికి ఉన్నట్లు స్త్రీకి వ్యక్తిగత జీవితం ఉండకూడదా? ఆశలు, ఆశయాలు ఏర్పరచుకోకూడదా? స్త్రీ గొంతు పెంచకూడదు: ఎందుకు పెంచకూడదు? ఆమెకు కోపం రాదా? బాధ కలగదా? ఆవేశం ఆమెను కుదిపెయ్యదా? అప్పుడు కూడా మౌనంగా ఉండిపోవాలా? ఎంత అన్యాయం? పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలి: పెద్దలు చూసి చేసిందే పెళ్లి అనే భావనను బాల్యంలోనే సమాజం నాటి ఉంటుంది కాబట్టి, ప్రేమ పెళ్లి ఆడపిల్లల పాలిటి ఒక శాపంలా పరిణమిస్తోంది. వంట ఆడవాళ్ల పనే: ఈ ధోరణి నుంచి భారతీయ సమాజం ఇప్పట్లో బయటపడకపోవచ్చు. ఇదేదో తమకు పుట్టుకతో వచ్చిన బాధ్యత అని ఆడపిల్ల అనుకునేలా చిన్నప్పటి నుంచే వంటింటి పాఠాలు మొదలౌతున్నాయి మరి! చీకటి పడకముందే ఇంటికి చేరుకోవాలి: చీకటి పడేవరకు బయట ఉండాలని ఏ ఆడపిల్లా అనుకోదు. ఇంటికి వస్తున్నప్పుడో, ఇంటి నుంచి వెళుతున్నప్పుడో జరగరానిది ఏదైనా జరిగితే ఆడపిల్లనే తప్పుపట్టే పరిస్థితి ఇవాళ్టికీ మన సమాజంలో నెలకొని ఉంది. పడక గదిలో ఇష్టాయిష్టాలకు తావులేదు: అసలు నోరు ఎత్తడానికే ఉండదు. ఈ ప్రభావం... పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే ఒక ముఖ్యమైన విషయంపై స్త్రీ అభిప్రాయానికి తావు లేకుండా చేస్తోంది. ఆడదానివి, నీ కెందుకు: ఆడది అయినంత మాత్రాన మనసులో మాట చెప్పకూడదా? అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదా? సలహాలు ఇవ్వకూడదా? సంప్రదింపులు జరపకూడదా? స్త్రీకి వ్యతిరేకంగా ఉన్న ఈ పది సామాజిక ధోరణులు ఎంత త్వరగా మారితే, సమాజం అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇవన్నీ పురుషాధిక్యతలోంచి పొడసూపిన సామాజిక అవలక్షణాలు కనుక పురుషుడే వీటిని రూపుమాపడానికి అవసరమైన సహాయ సహకారాలను స్త్రీకి అందించాలి. (ప్రతీకాత్మక చిత్రం) : బాలికలు, స్త్రీల మనోవికాసానికి, ఉల్లాసానికి అవరోధంగా పరిణమించేసామాజిక ధోరణులను పురుషులే రూపుమాపాలి.