సమానమంటాం... శాసిస్తుంటాం! | say equal but ordering rules | Sakshi
Sakshi News home page

సమానమంటాం... శాసిస్తుంటాం!

Published Tue, Aug 5 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

సమానమంటాం...  శాసిస్తుంటాం!

సమానమంటాం... శాసిస్తుంటాం!

ఇప్పటికీ.. స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఊళ్లేలుతున్న ఈ కాలంలోనూ... సమాజంలోని పురుషాధిక్య మూస ధోరణులు ఆడపిల్లను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాయి. అసలీ ధోరణి పిల్ల పుట్టుకతోనే మొదలౌతుంది. ఇది మన పెద్దవాళ్ల నుంచి మనకు సంక్రమించిన జాడ్యం. అయితే ఈ మాటను సమాజం ఒప్పుకోదు. ఆడపిల్ల ఆడపిల్లలా పెరగకపోవడం మన సంప్రదాయం కాదు అంటుంది. ఇలా సంప్రదాయం పేరుతో చిన్నారుల మనసుల్లో బాల్యం నుంచే ఆడ-మగ వేరు అనే భావనను నాటుతున్నాం. ఈ కారణంగా ఆడపిల్లలు, స్త్రీలు మానవ సమాజంలో ఉండవలసిన కనీస స్వేచ్ఛా సమానత్వాలను కూడా కోల్పోతున్నారు. దిగువ శ్రేణి పౌరుల్లా జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఈ 21వ శతాబ్దంలోనూ స్త్రీల జీవితాలను పురాతనకాలం నాటి పరిమితులు, నియమాలు, నిబంధనలు శాసించడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పరిమితులు, నియమ నిబంధనల్లో అత్యంత అర్థరహితమైన వాటిని ఓసారి చూద్దాం.

ఆడది గడప దాటకూడదు: ఎప్పటి మాట ఇది! ఇప్పటికీ వినిపిస్తోంది. గృహిణులు కూడా ఈ మాటకు అనుగుణంగా తమను తాము వంటింటికి పరిమితం చేసుకుంటున్నారు. ఒకవేళ ఎవరికైనా వంటిల్లు, ఇల్లు దాటి బయటికెళ్లి ఉద్యోగం చేయాలని ఉన్నా, ఉద్యోగం చేసే అర్హతలున్నా వాళ్లని బయటికి వెళ్లనిచ్చేవారెవరు?

పిల్లల పెంపకం స్త్రీ బాధ్యతే: ఎంత బాధ్యతారహితమైన మాట! పిల్లల బాధ్యత తండ్రికి ఉండదా? ఇంట్లోని మిగతా పెద్దవాళ్లు ఆ బాధ్యతను స్వీకరించకూడదా? అన్నీ తల్లే చూసుకోవాలా? ఇంటెడు చాకిరీ చేస్తూ, పిల్లల ఆలనాపాలన చూడ్డం ఒక్క మనిషికి సాధ్యమయ్యేదేనా?
 
మగరాయుడి వేషాలు వేయకూడదు: ఆడపిల్లలు చెట్లు ఎక్కగలరు. పరుగులు తీయగలరు. సాహసాలు చేయగలరు. ఈ ఇష్టాలన్నీ వారు చంపుకోవలసిందేనా? ఎందుకింత కట్టడి!!

సమాజం చెప్పినట్లు వినాలి: అంటే స్త్రీ.. పూర్తిగా సమాజం అదుపాజ్ఞల్లో ఉండాలి. వాటి ప్రకారం నడుచుకోవాలి. మరి పురుషుడికి ఉన్నట్లు స్త్రీకి వ్యక్తిగత జీవితం ఉండకూడదా? ఆశలు, ఆశయాలు ఏర్పరచుకోకూడదా?
 
స్త్రీ గొంతు పెంచకూడదు: ఎందుకు పెంచకూడదు? ఆమెకు కోపం రాదా? బాధ కలగదా? ఆవేశం ఆమెను కుదిపెయ్యదా? అప్పుడు కూడా మౌనంగా ఉండిపోవాలా? ఎంత అన్యాయం?

పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలి: పెద్దలు చూసి చేసిందే పెళ్లి అనే భావనను బాల్యంలోనే సమాజం నాటి ఉంటుంది కాబట్టి, ప్రేమ పెళ్లి ఆడపిల్లల పాలిటి ఒక శాపంలా పరిణమిస్తోంది.

వంట ఆడవాళ్ల పనే: ఈ ధోరణి నుంచి భారతీయ సమాజం ఇప్పట్లో బయటపడకపోవచ్చు. ఇదేదో తమకు పుట్టుకతో వచ్చిన బాధ్యత అని ఆడపిల్ల అనుకునేలా చిన్నప్పటి నుంచే వంటింటి పాఠాలు మొదలౌతున్నాయి మరి!

చీకటి పడకముందే ఇంటికి చేరుకోవాలి: చీకటి పడేవరకు బయట ఉండాలని ఏ ఆడపిల్లా అనుకోదు. ఇంటికి వస్తున్నప్పుడో, ఇంటి నుంచి వెళుతున్నప్పుడో జరగరానిది ఏదైనా జరిగితే ఆడపిల్లనే తప్పుపట్టే పరిస్థితి ఇవాళ్టికీ మన సమాజంలో నెలకొని ఉంది.
 పడక గదిలో ఇష్టాయిష్టాలకు తావులేదు: అసలు నోరు ఎత్తడానికే ఉండదు. ఈ ప్రభావం... పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే ఒక ముఖ్యమైన విషయంపై స్త్రీ అభిప్రాయానికి తావు లేకుండా చేస్తోంది.

ఆడదానివి, నీ కెందుకు: ఆడది అయినంత మాత్రాన మనసులో మాట చెప్పకూడదా? అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదా? సలహాలు ఇవ్వకూడదా? సంప్రదింపులు జరపకూడదా?

 స్త్రీకి వ్యతిరేకంగా ఉన్న ఈ పది సామాజిక ధోరణులు ఎంత త్వరగా మారితే, సమాజం అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇవన్నీ పురుషాధిక్యతలోంచి పొడసూపిన సామాజిక అవలక్షణాలు కనుక పురుషుడే వీటిని రూపుమాపడానికి అవసరమైన సహాయ సహకారాలను స్త్రీకి అందించాలి.
 
(ప్రతీకాత్మక చిత్రం) : బాలికలు,  స్త్రీల మనోవికాసానికి, ఉల్లాసానికి అవరోధంగా పరిణమించేసామాజిక ధోరణులను  పురుషులే రూపుమాపాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement