ఔట్‌సోర్సింగ్‌ కుచ్చుటోపీ ! | Irregularities In The Payment Of Salaries Outsourcing Staff | Sakshi
Sakshi News home page

ఔట్‌సోర్సింగ్‌ కుచ్చుటోపీ !

Published Fri, Aug 30 2019 10:17 AM | Last Updated on Fri, Aug 30 2019 10:17 AM

Irregularities In The Payment Of Salaries Outsourcing Staff - Sakshi

బీసీకాలనీలోని బేతస్థ అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కార్యాలయం ఇదే...

ఔట్‌ సోర్సింగ్‌ ముసుగులో గత ప్రభుత్వ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తమ ప్రాబల్యం పెంచుకునేందుకు అధికారులను పావులుగా వాడుకుని అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు కాజేశారు. మొన్నటికి మొన్న సర్వశిక్ష అభియాన్‌ ద్వారా భారీ స్క్రీన్‌ల పేరుతో నిధులు మింగినవైనం బయటపడగా... తాజాగా జిల్లాలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే అండతో ఏర్పాటైన ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ఉద్యోగుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ మొత్తాలు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన సంఘటన వెలుగు చూసింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఇప్పుడు ఆ సంస్థపై క్రిమినల్‌కేసు నమోదు చేయించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు తీసుకుంటున్నారు.

సాక్షి,విజయనగరం అర్బన్‌: విద్యాశాఖ అడ్డాగా గత ప్రభుత్వ పాలనలో సాగిన అక్రమాల పర్వం వెలుగు చూస్తూ నే ఉంది. జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూళ్లలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలు తాజాగా బయ ట పడ్డాయి. వారికోసం చెల్లించా ల్సిన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము రూ.62 లక్షలు జమచేయకుండా జిల్లాలోని ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి చెందిన బేతస్థ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ తినేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిపాటు సిబ్బంది అడిగినా ఇటు విద్యాశాఖగానీ, అటు ఏజెన్సీగానీ స్పందించలేదు. అయితే తినేసిన ఆ రూ.62 లక్షలు ఆ ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చులో చూపించారని ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ ఏజెన్సీ అడ్రస్‌కు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో విద్యాశాఖ క్రిమినల్‌ కేసు పెట్టింది.

 అధికారం అండతో... అడ్డగోలు నియామకాలు... 
జిల్లాలోని 16 మోడల్‌ స్కూళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన హాస్టళ్ల నిర్వహణ కోసం గతేడాది జనవరిలో వివిధ కేడర్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తొలుత జిల్లా విద్యాశాఖ అర్హులైన అభ్యర్థులతో నియామక జాబితాను సిద్ధం చేసి సర్వీసు అనుభవం ఉన్న ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీతో జిల్లా యంత్రాంగం ఒప్పందం పెట్టుకుంది. అయితే అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఆ నియామకాలను, ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆ ఏజెన్సీ స్థానంలో ఎలాం టి అనుభవం లేని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బంధువుకు చెందిన బేతస్థ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీని నియమించింది. రాత్రికి రాత్రి ఇచ్చిన ఆ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా కనీసం పత్రికా ప్రకటనైనా లేకుండా ఒక్క రోజు సమయం ఇచ్చి నియామక నోటిఫికేషన్‌ మరలా విడుదల చేసి ఎలాగోలా తమకు అనుకూలమైనవారిని నియమించుకుని మరో జాబితా ప్రకటించారు. ఈ విషయం అప్పట్లో వివాదా స్పదమైనాజిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు.

తొలినుంచీ ఎగ్గొట్టిన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తాలు..
తొలి మూడు నెలలకు ఒకసారి వేతన నిధులు రావడంతో ఆ మొత్తం ఒకేసారి చెల్లించారు. ఆ సమయంలో ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ఇతర సౌకర్యాల నిధులు వెళ్లలేదని విద్యాశాఖ గుర్తించి తదుపరి బిల్లులకు అనుమతులివ్వలేదు. జిల్లా యంత్రాంగంపై ఆ ఎమ్మెల్యే ఒత్తిడి పెంచడంతో ఈపీఎఫ్, ఈఎస్‌ఐ నిధులు కేటాయించకపోయినా తరువాత మరో ఐదునెలల వేతనాన్ని విడుదల చేశారు. అయినా ఆ ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్‌ఐ నిధులు ఎగ్గొట్టింది. ఇప్పుడు ఆ ఏజెన్సీ చెల్లించాల్సిన బకాయి రూ.62 లక్షలకు చేరింది. నూతన ప్రభుత్వం వచ్చాక జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చింది. గత నెల రోజులుగా బేతస్థ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ యజమానికి నోటీసులు పంపారు. అక్కడినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీపై విద్యాశాఖ తాజాగా ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌పై క్రిమినల్‌ కేసు పెట్టింది.

ఆందోళనలో సిబ్బంది.. 
జిల్లాలోని 16 మోడల్‌ స్కూళ్లలో గతేడాది హాస్టళ్లను నూతనంగా ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం ఒక్కో హాస్టల్‌కు ఒక వార్డెన్, ఒక హెడ్‌కుక్, ఇద్దరు సహాయ కుక్‌లు, ఒక నైట్‌ వాచ్‌మన్‌ వంతున పోస్టులను భర్తీ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ఖాతాల కోసం వేతన మొత్తం నుంచి తీసుకున్న సొమ్మును ఇవ్వకపోడంపై ఏడాదిగా ఆందోళనలో ఉన్నారు. 

ఆ ఏజెన్సీపై కేసుపెట్టాం..
జిల్లాలోని మోడల్‌ స్కూళ్లలో హాస్టల్‌ నిర్వహణ సిబ్బంది నియామకానికి గడచిన ఏడాది ఒప్పందం పెట్టుకున్న బేతస్థ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. వేతనాల నుంచి కేటాయించిన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ నిధులను సిబ్బంది ఖాతాలో జమ చేయకుండా సుమారు రూ.62 లక్షలు తిరిగి చెల్లించాలని కొన్ని నెలలుగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీపై చట్టబద్ధమైన చర్యలకోసం ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో  క్రిమినల్‌ కేసు పెట్టాం. సిబ్బంది వివరాలను తాజాగా పోలీసులు అడిగారు. ఇస్తున్నాం.
– జి.నాగమణి, డీఈఓ, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement