సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ నిర్మాణ కంపెనీ బీజీ షిర్కే కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించింది. 2018 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఈ డబ్బు చెల్లించే పరిస్థితుల్లో స్వగృహ కార్పొరేషన్ లేనందున ఆ సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ సభ్యులు కె.అనంత పద్మనాభస్వామి విచారణ జరిపారు. షిర్కే కంపెనీ తరఫున న్యాయవాది డి.వి.సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జవహర్‌నగర్‌లో రూ.786 కోట్లతో 6,216 ప్లాట్లతో 37 బ్లాకులు నిర్మించేందుకు తమ కంపెనీతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 2009లో ఒప్పందం చేసుకుందని తెలిపారు.
కొంతకాలం బిల్లులు చెల్లించిన కార్పొరేషన్ ఆ తర్వాత బిల్లులు చెల్లించడం మానేసిందన్నారు. అనంతరం 37 బ్లాకులను 17 బ్లాకులకు పరిమితం చేసిందని వివరించారు. 2016లో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని, 2018 మార్చి 31 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని వివరించారు. స్వగృహ కార్పొరేషన్ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. షిర్కే కంపెనీ ఫిబ్రవరి 22న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చైర్మన్‌కు లేఖ రాసిందన్నారు. చెల్లింపులకు సంబంధించి వివిధ శాఖలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారుల సమావేశం జరగలేదని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, ఇందుకు కొంతసమయం పడుతుందని తెలిపారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, అధికారులు సమావేశం నిర్వహించుకోవాలని, ఆ సమావేశం వివరాలను, అందులో తీసుకున్న నిర్ణయాలను తమ ముందుంచాలని స్పష్టంచేసింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ దివాలా ప్రక్రియ ప్రారంభించండి
Published Tue, Mar 5 2019 2:15 AM | Last Updated on Tue, Mar 5 2019 2:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment