కొనుగోలుదారులను ఆకర్షించేందుకు.. స్వగృహ దసరా ఆఫర్
సాక్షి, హైదరాబాద్: పండుగ వేళల్లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రైవేట్ సంస్థలు ‘ఆఫర్ల వల’ వేయడం పరిపాటే. అయితే పైసా ఆదాయం లేక అల్లాడుతున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఇదే పంథాను అనుసరిస్తోంది. అక్టోబర్ 15లోపు ఇళ్లను బుక్ చేసుకుంటే వాటి ధరపై 3 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు దసరా ఆఫర్ ప్రకటించింది. ప్రజల్లో స్వగృహాలకు డిమాండ్ ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండా మునిగిన ఆ సంస్థ, కనీసం నిర్వహణ ఖర్చుల కోసమైనా వీలైనన్ని ఇళ్లను అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేసింది.
ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో స్టాల్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా స్వగృహ కార్పొరేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. స్వగృహ కార్పొరేషన్‌ను అనవసరంగా ప్రారంభించారని, అది కట్టిన ఇళ్లకు డిమాండ్ లేదని అంతర్గత సమావేశాల్లో పేర్కొంటూ ప్రభుత్వ పెద్దలే దాన్ని నష్టాల బాట పట్టించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ప్రాపర్టీ షోలో పాల్గొన్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థల స్టాల్స్ కంటే ఎక్కువగా ప్రజలు స్వగృహ స్టాల్‌పైనే ఆసక్తి చూపించడం విశేషం. దాదాపు వేయి మంది సందర్శకులు స్వగృహ వివరాలను తెలుసుకోగా, నాలుగొందల మంది ఇళ్ల కోసం పేర్లను నమోదు చేసుకున్నారు.
ప్రజల నుంచి వచ్చిన ఆదరణకు ఆశ్చర్యపోయిన అధికారులు, వారు చేజారిపోకుండా ఈ తగ్గింపు ఆఫర్‌ను అక్కడ ప్రకటించారు. షోలో వచ్చిన సందర్శకులకే కాకుండా, ఇతర కొనుగోలుదారులకు కూడా దీన్ని వర్తింప చేయనున్నారు. అయితే దీనిపై అధికారికంగా కార్పొరేషన్ ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో అతి తక్కువ ఖర్చయ్యే ప్రాపర్టీ షోలు జరిగినా డబ్బులు లేవంటూ వాటిలో పాల్గొనేందుకు స్వగృహ కార్పొరేషన్ వెనుకడుగు వేసింది. అయితే తాజాగా ఒక ప్రైవేట్ సంస్థ ఒత్తిడితో ఈ ప్రాపర్టీ షోలో పాల్గొనేందుకు సుమారు రూ.14 లక్షల వరకు చెల్లించినట్టు సమాచారం. స్వగృహ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులపై ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన ప్పటికీ ఇక్కడ మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నా అధికారులు కొంత తాత్సారం చేస్తున్నారు.