
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవుల్లో సేద తీరడానికి పలు కుటుంబాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటాయి. కానీ, అక్కడి వసతి ఎలా? హోటళ్లలో ఉండాలంటే.. కాస్త ఖర్చు ఎక్కువే. నచ్చిన వంట వండుకోలేం. సరైన ఆతిథ్యాన్ని స్వీకరించలేం. వాళ్లు పెట్టినవాటిలో నుంచి ఎంపిక చేసుకొని తినాలి. దీనికి పరిష్కారం చూపించేవే పర్యాటక విడిదులు. స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆధునిక వసతులు అందించడమే ఈ టూరిస్ట్ ఇళ్ల ప్రత్యేకత.
ఇళ్లు.. హోం స్టేలుగా!
భాగ్యనగరం అంటేనే చక్కని ఆతిథ్యానికి చిరునామా. అందుకే విదేశీ పర్యాటకులు ఇక్కడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. ఈ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు పర్యాటక శాఖ హోం స్టే పథకం ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పలు ప్రైవేట్ సంస్థలూ సేవలందిస్తున్నాయి. నగరంలోని గృహ యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే బదులుగా ఇలా హోంస్టే సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆకట్టుకునేలా గృహాలను తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు తాత్కాలికంగా కిరాయికి ఇస్తున్నారు.
అన్ని రకాల వసతులు..
ఎయిర్ బీఎన్‌బీ, వీఆర్బో, బుకింగ్.కామ్, మేక్ మై ట్రిప్, ట్రావెల్ స్టేషన్, హోమ్ టుగో వంటి సంస్థలు హోం స్టే సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, తీర్థయాత్రలు అన్నిచోట్లా టూరిస్ట్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కిచెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులు ఈ హోం స్టేలలో ఉంటాయి. సౌకర్యాలను బట్టి అద్దె ఒక రాత్రికి రూ.5 వేల నుంచి ఉంటాయి.
ఆయా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న హోం స్టేల వివరాలను సంస్థలు తమ వెబ్‌సైట్లలో పొందుపరుస్తున్నాయి. వారికి అనువైన వసతిని వెతుక్కోవచ్చు. ఇందులోనే ధరలను కూడా నిర్ణయిస్తారు. వండి వడ్డించే భోజనం వివరాలు కూడా ఉంటాయి. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment