ఈ-వేలం ద్వారా స్థలాల అమ్మకం | Rajiv swagruha to sell sites through e-auction | Sakshi
Sakshi News home page

ఈ-వేలం ద్వారా స్థలాల అమ్మకం

Published Fri, Oct 11 2013 2:19 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

ఈ-వేలం ద్వారా స్థలాల అమ్మకం - Sakshi

ఈ-వేలం ద్వారా స్థలాల అమ్మకం

 సీమాంధ్ర ఉద్యమంతో తీరు మార్చుకున్న స్వగృహ
 ఇప్పటికే విఫలమైన బహిరంగ వేలం ప్రక్రియ


 సాక్షి, హైదరాబాద్: నిధులు లేక అల్లాడుతున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తన ఖాళీ స్థలాలను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు సిద్ధమైంది. గతంలోనే బహిరంగ వేలం ద్వారా స్థలాలు అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తుదిదశలో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉండడం. అందుకు తగ్గట్టుగా నిధులు సమకూరకపోవడంతో ఇప్పటికిప్పుడు స్థలాలను అమ్మేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తాజాగా ఈ-వేలం బాట పట్టింది. తొలిదఫాగా కాకినాడ, కర్నూలు, రాజంపేటలలోని ప్లాట్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితోపాటు తెలంగాణలోని కామారెడ్డిలో ఉన్న ఖాళీస్థలాన్ని అమ్మేందుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం రూ.105 కోట్ల రుణాన్ని స్వగృహకు కేటాయించింది. వీటితో ఐదు ప్రాజెక్టుల్లోని ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించారు.

మిగతా వాటిల్లో పనులు పూర్తి చేసేందుకు కార్పొరేషనే సొంతంగా నిధులు సేకరించుకోవాల్సి ఉంది. ఇందుకోసం డిమాండ్‌లేని ప్రాజెక్టులు, డిమాండ్ ఉన్నవాటిల్లో ఖాళీగా ఉన్న భూములను అమ్మేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో కాకినాడ, తణుకుల్లోని భూములను అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు ఉద్యమం వల్ల విఫలం కావటంతో ఇప్పుడు ఈ-వేలం ద్వారా అమ్మాలనుకుంటున్నారు. కాకినాడలో తొలుత దాదాపు 5 ఎకరాల భూమిని 55 ప్లాట్లుగా, కర్నూలులో 10 ఎకరాల భూమిని 99 ప్లాట్లుగా, రాజంపేటలో 5 ఎకరాల భూమిని 60 ప్లాట్లుగా అభివృద్ధి చేశారు. వీటికి వచ్చే స్పందన ఆధారంగా మిగతా భూమిని, ఇతర ప్రాంతాల్లోని మరికొన్ని ప్లాట్లను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాకినాడ వేలం ఈ నెల 17వ తేదీన, రాజంపేటలో 18న, కర్నూలులో 19న నిర్వహించనున్నారు. అలాగే డిమాండ్ లేని ప్రాంతంగా ఇప్పటికే తేల్చిన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో అందుబాటులో ఉన్న 8.30 ఎకరాలను ఈ నెల 18న ఏకమొత్తంగా అమ్మేందుకు నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement