
చిలకలపూడి (మచిలీపట్నం): పేదవారికి ఇప్పటికే సొంతింటి కల నెరవేర్చి స్థల పట్టాలు ఇచ్చామని, మధ్య తరగతి కుటుంబీకులకు కూడా అతి తక్కువ ధరతో సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్ స్మార్ట్ కాలనీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నెలకు రూ.12 వేలకు పైగా ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాల వారికి మూడు కేటగిరీల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి 150, 200, 240 గజాల చొప్పున స్థలాలు విభజించి.. వాటిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. వీటన్నింటికి అయిన ఖర్చును మాత్రమే దరఖాస్తుదారుని వద్ద తీసుకుని ఇంటి పట్టా అందజేయటం జరుగుతుందన్నారు. ఆ స్థలాల కోసం సచివాలయాల్లో ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో మొదటిదశగా మచిలీపట్నం, గుడివాడ మునిసిపాలిటీలను గుర్తించినట్టు చెప్పారు. మునిసిపాలిటీ పరిధికి అతి దగ్గరగా ఈ కాలనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.