Own House dream
-
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల సందడి
న్యూఢిల్లీ: ఇళ్ల డిమాండ్ ప్రధాన నగరాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వితీయ శ్రేణి (టైర్–2) పట్టణాల్లోనూ ఇళ్ల మార్కెట్లో సందడి నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2023–24) టాప్30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 11 శాతం పెరిగి 2,07,896 యూనిట్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్ ఈక్విటీ’ తెలిపింది. 2022–23 సంవత్సరంలో 1,86,951 యూనిట్లు విక్రయం కావడం గమనార్హం. ఈ మేరకు ఒక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం విక్రయాల్లో 80 శాతం టాప్–10 టైర్–2 పట్టణాలైన అహ్మదాబాద్, వదోదర, సూరత్, నాసిక్, గాంధీనగర్, జైపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, మోహాలిలో నమోదయ్యాయి. ఈ పది పట్టణాల్లో 2023–24లో 1,68,998 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 1,51,706 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మిగిలిన 20 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో భోపాల్, లక్నో, గోవా, రాయిపూర్, విజయవాడ, ఇండోర్, కోచి, త్రివేండ్రం, మంగళూరు, గుంటూరు, భివాండి, డెహ్రాడూన్, లుధియానా, చండీగఢ్, ఆగ్రా, మైసూర్, సోనేపట్, పానిపట్, అమృత్సర్ ఉన్నాయి. ఎన్నో సానుకూలతలు.. ‘‘టైర్–1 పట్టణాల కంటే టైర్–2 పట్టణాల్లోనే ఇళ్ల మార్కెట్ పరంగా మెరుగైన పనితీరు నమోదైంది. దీనికి కారణం ధరలు తక్కువగా ఉండడంతోపాటు, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండడమే. ఈ చిన్న పట్టణాల్లోని మధ్యతరగతి వాసుల సొంతింటి కలను అందుబాటు ధరలు సాకారం చేస్తున్నాయి’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్ జసూజ తెలిపారు. చిన్న మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), పరిశ్రమల ఏర్పాటుతో ఈ పట్టణాలు ఆర్థిక బూమ్‌ను చూస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు మద్దతునిస్తుండడం కూడా ఈ పట్టణాల్లో డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపారు. పశి్చమాదిన ఎక్కువ దేశవ్యాప్తంగా టాప్–30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గత ఆర్థిక సంవత్సరం నమోదైన ఇళ్ల విక్రయాల్లో 70 శాతం వాటా.. పశి్చమాదినే ఉండడం గమనించొచ్చు. ఇక్కడి పట్టణాల్లో విక్రయాలు అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం పెరిగి 1,44,269 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని పట్టణాల్లో అధిక డిమాండ్ కనిపించింది. ఉత్తరాదిన విక్రయాలు 8 శాతం పెరిగి 26,308 యూనిట్లుగా ఉంటే, దక్షిణాదిన 8 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. తూర్పు, మధ్య భారత్‌లోని పట్టణాల్లో 18 శాతం అధికంగా 15,372 ఇళ్లు అమ్ముడయ్యాయి. సొంతింటి కల ఆకాంక్షల ఫలితం..మౌలిక వసతులు, ప్రాంతాల మధ్య అనుసంధాన పెరగడంతో పెద్ద ఎత్తున మార్పును చూస్తున్నట్టు ఎల్డెకో గ్రూప్ సీవోవో మనీష్ జైస్వాల్ పేర్కొన్నారు. తమ కంపెనీ లుధియానా, రుద్రాపూర్, సోనిపట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. ‘‘లోక్‌సభ ఎన్నికల సమయం కావడంతో టైర్–1 పట్టణాల్లో 2024 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్మకాలు తాత్కాలికంగా తగ్గాయి. కానీ ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం పెరిగాయి. ధరలు అందుబాటు ధరల్లో ఉండడంతో మధ్యతరగతి వాసుల సొంతింటి ఆకాంక్ష డిమాండ్‌ను నడిపిస్తోంది’’అని బెంగళూరుకు చెందిన సముద్ర గ్రూప్ సీఎండీ మధుసూదన్ జి తెలిపారు. -
మిమిక్రీ శాయవలే... ముంబైలో ఫ్లాట్ కొనవలే!
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్‌కు ఓనర్‌ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది చాందిని. సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్‌డే ఫంక్షన్‌ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని. -
సొంత ఇల్లు కొందామనుకుంటున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కొనాలని కలలు కంటున్నారా? ఇల్లు కొనడం మంచిదా లేక అద్దె ఇంట్లోనే కాలం గడపడం మంచిదా? ఈ రోజు ఈ ప్రశ్నలకు జవాబుగా మీ జాతకపరంగా పరిష్కారం చెప్పటం లేదు. ఇది ఏదో ఒక రుణ సంస్థ తరఫున ప్రకటన కాదు. ఫలానా దగ్గరే కొనమని విసిగించడమూ కాదు. ఇప్పుడు చెప్పబోతున్నది ఇల్లు, ఫ్లాటు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే. కేవలం ఆర్థికపరంగా, ఇన్‌కం ట్యాక్స్ చట్టపరంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, మీరు తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు తెలుసుకోండి. ఈ విషయంలో సెంటిమెంటు జోలికి వెళ్లకండి. ఎక్కడ కొందామనుకుంటున్నారు? మీకు కానీ మీ కుటుంబసభ్యులకు అనువైన లొకేషన్లో కొనండి. అన్నింటికీ దగ్గరగా ఉండాలి. రవాణా సౌకర్యం ఉండాలి. వాన, వరద వస్తే ముంపునకు గురి కాకూడదు. మీరే ఉంటారా లేక కేవలం అద్దె.. అంటే ఆదాయం కొసం తీసుకుందామనుకుంటున్నారా అనేది చూసుకోవాలి. కొంత మంది పెన్షన్ లేని వాళ్లు నెలసరి ఆదాయం కోసం ఇళ్లు కొన్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. మీ వనరుల సంగతేమిటి? మీరు ఇంటికోసం ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఇటువంటి విషయాల్లో ఎంత పక్కాగా లెక్కలు వేసినప్పటికీ అదనపు భారం అనివార్యం. టైం కూడా మీ చేతిలో ఉండదు. వ్యవహారం సాఫీగా జరగకపోవచ్చు. మొత్తం ఇన్వెస్టుమెంటు రెడీగా ఉందా? అప్పు అవసరమా? అనవసరమా? అప్పు ఎక్కడ నుంచి తీసుకోవాలి? ఏ సంస్థా పూర్తి మొత్తాన్ని అప్పుగా ఇవ్వదు. మనం కొంత మార్జిన్ మనీ చెల్లించాలి. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. మీరు చేసిన ఇన్వెస్టుమెంటుకి, చెల్లించిన మార్జిన్ మనీకి ‘సోర్స్’ ఉండాలి. ‘సోర్స్’ అంటే అప్పు కావచ్చు, మీ సేవింగ్స్ కావచ్చు, పన్ను చెల్లించగా మిగిలిన మొత్తం కావచ్చు, మీ అబ్బాయి అమెరికా నుండి పంపి ఉండవచ్చు, మీకు వీలునామా ద్వారా సంక్రమించిన బ్యాంకు బ్యాలెన్సు కావచ్చు లేదా లాటరీ తలుపు తట్టి ఉండవచ్చు. ‘సోర్స్’కి రాత లు, కోతలు ఉండాలి. అలా ఉండకపోతే ఆ మొ త్తాన్ని మీ ఆదాయంగా భావిస్తారు. క్యాపిటల్ బడ్జె ట్ వేసుకున్నాకా, రెవెన్యూ బడ్జెట్ వేసుకోవాలి. రెవెన్యూ బడ్జెట్ గురించి ఆలోచించారా? అన్నీ సక్రమంగా ఉండి, సకాలంలో ఇల్లు పూర్తి అయ్యిందనుకోండి. మీరే ఆ ఇంట్లో ఉంటే ఇంటి రుణం చెల్లింపుల మీద, రుణం మీద వడ్డీ (పరిమితుల మేరకు) మినహాయింపు లభిస్తుంది. కానీ ప్రతి నెలా వాయిదా (ఈఎంఐ) చెల్లించగలగాలి. మీకు వచ్చే హెచ్ఆర్ఏ పన్నుకి గురి అవుతుంది. ఆర్థికపరంగా బండి సాఫీగా వెళ్లాలి. అద్దెకి ఇచ్చారనుకోండి. వచ్చిన అద్దెను తప్పకుండా ఆదాయంగా చూపించాలి. అవసరం అయితే, పన్ను చెల్లించాలి. స్వంత ఇల్లు/కొత్త ఇల్లు నిర్వహించడానికి బోలెడంత .. లేదా అనుకోని ఖర్చులు అవుతాయి. వీటన్నింటికీ సిద్ధంగా ఉండాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
హైదరాబాద్‌లో ఆ గృహాలకు మహా గిరాకీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో విలాస గృహాలకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) 430 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల్లో విక్రయాలు 50 యూనిట్లతో పోలిస్తే ఎనిమిది రెట్లకు పైగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఈ వివరాలను విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లోనూ విలాస నివాసాలు జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. మొత్తం 4,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 1,600 యూనిట్లతో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా నమోదయ్యాయి. అన్ని రకాల ఇళ్లు కలసి ఈ ఏడు పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో 78,700 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 70,500 యూనిట్లుగా ఉన్నాయి. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 600 యూనిట్లు ఉంటే, అవి తాజాగా ముగిసిన త్రైమాసికంలో 1,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ముంబైలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు 800 యూనిట్ల నుంచి 1,150 యూనిట్లకు పెరిగాయి. ► పుణెలో 10 రెట్లు అధికంగా 150 యూనిట్లు అమ్ముడుపోగా, బెంగళూరులో కేవలం 50 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్‌కతాలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 50 యూనిట్ల నుంచి 100కు పెరిగాయి. ► చెన్నై మార్కెట్లో విలాస నివాసాల అమ్మకాలు 250 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 50 యూనిట్లుగానే ఉన్నాయి. బలంగా సొంతిల్లు ఆకాంక్ష 2022లో ఖరీదైన ఇళ్ల విభాగం బలమైన పనితీరు చూపించగా, ఆ తర్వాత కూడా అదే విధమైన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కొనసాగినట్టు సీబీఆర్ఈ తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత విలాస గృహాలకు డిమాండ్ ఎగిసింది. సొంతిల్లు కావాలని, విశాలమైన ఇళ్లు కావాలని కోరుకునే వారు పెరిగారు’’అని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. సొంతిల్లు కావాలనే ఆకాంక్ష ఈ ఏడాది కూడా విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. వినియోగ ప్రాధాన్యతలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు, ఆరోగ్యం, భద్రత, చుట్టూ పరిశుభ్రమైన పరిసరాలతో కూడిన ప్రాజెక్టులకు డిమాండ్ ఉంటుందన్నారు. లగ్జరీ ప్రాపర్టీలకు కన్సల్టెన్సీ సేవలు అందించే సోథెబీ ఎండీ అమిత్ గోయల్ స్పందిస్తూ.. సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో 5–7 ఏళ్ల పాటు బేర్, బుల్ సైకిల్ ఉంటుందని చెబుతూ.. ప్రస్తుతం కచ్చితంగా బుల్ సైకిల్ అని పేర్కొన్నారు. -
సొంతింటికి ‘జంట’ దారి..!
సొంతింట్లో ఉన్నంత సంతృప్తి అద్దె ఇంట్లో లభించదు. కిరాయి ఇచ్చినంత మాత్రాన అన్ని హక్కులూ రావు. గోప్యత, ఇంటి వినియోగంలో స్వేచ్ఛ, బంధువుల రాకపోకలు ఇలా చెప్పుకుంటూ పోతే.. అద్దె ఇళ్ల విషయంలో ఎన్నో ప్రతికూల అంశాలున్నాయి. అందుకే నేటితరం పెళ్లికి ముందే లేదంటే పెళ్లయిన కొన్నాళ్లకే సొంతింటి వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు సొంతిల్లు అన్నది ఓ పెద్ద కల. కానీ, నేడు విశాలమైన (కనీస అవసరాల మేరకు) ఇల్లు అన్నది కలగా మారిందని చెప్పుకోవాల్సిందే. చదువుకునే పిల్లలు ఏకాంతం కోరుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే దంపతులు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంట్లోనే తమకంటూ ప్రైవేటు స్థలం ఉండాలని భావిస్తున్నారు. కనుక మారుతున్న అవసరాల నేపథ్యంలో సొంతింటికి ప్లాన్ చేసుకునే వారు కనీసం టూ లేదా త్రీ బెడ్ రూమ్ ఉండాలంటున్నారు..! ఇల్లు విశాలంగా ఉండాలంటే భారీ మొత్తమే సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో దంపతులు ఇద్దరూ కలసి ఉమ్మడిగా గృహ రుణం (జాయింట్ హోమ్ లోన్) తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. అయితే, దీనికి ఎలా సిద్ధం కావాలి.. నిబంధనలు ఎలా ఉంటాయి.. వంటివన్నీ వివరించే కథనం ఇది.. చిన్న కుటుంబం అనుకున్నా భార్యా భర్త, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. వీరికి తోడుగా తల్లిదండ్రులు కూడా ఉంటే ఇల్లు కాస్త విశాలంగా ఉండాల్సిందే కదా. శివ, అపూర్వ దంపతులకు సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివ తల్లిదండ్రులు అతడితోనే ఉంటున్నారు. శివ పెళ్లయిన కొత్తలో తనకున్న బడ్జెట్‌తో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇటీవల కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసుకోవాల్సి వచ్చింది. కానీ, అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల్లో అతడికి ఏకాంతంతో కూడిన కాస్తంత స్థలం కరువైంది. అందుకనే అతడు త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడున్న ఒక్క పడకగది ఫ్లాట్ విక్రయించగా వచ్చే మొత్తాన్ని డౌన్ పేమెంట్ కింద జమ చేసి, మిగతా మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాలన్నది అతడి ప్రణాళిక. ఇలా కోరుకునే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ అంటే భారీ పెట్టుబడి అవసరపడుతుంది. కనుక జాయింట్ హోమ్‌లోన్ ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. దీనికి ముందు జాయింట్ హోమ్‌లోని సాధక, బాధకాల గురించి అవగాహన కల్పించుకుంటే, సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. నిబంధనలు – అర్హతలు చెల్లించే సామర్థ్యం ఉంటే ఒక్కరి పేరుమీదనే గృహ రుణాన్ని తీసుకోవచ్చు. కానీ, దంపతులు కలసి తీసుకోవడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీలైతే జాయింట్‌గానే చాలా మంది గృహ రుణానికి మొగ్గు చూపుతుంటారు. చాలా బ్యాంకులు సహ రుణ గ్రహీత కింద కుటుంబ సభ్యులనే అనుమతిస్తున్నాయి. ఒక వ్యక్తి తన తండ్రితో లేదంటే భార్యతో కలసి ఉమ్మడిగా రుణం తీసుకోవచ్చు. అలాగే, తండ్రి కూడా తన కుమారుడు, పెళ్లి కాని కుమార్తెతో కలసి రుణం పొందొచ్చు. ఇక ఇద్దరు సోదరీ మణులు, ఒక సోదరి ఒక సోదరుడు, వివాహిత అయిన కుమార్తెతో కలసి తండ్రి, స్నేహతులు ఉమ్మడిగా గృహ రుణం పొందడానికి అర్హత లేదు. జాయింట్ హోమ్ లోన్‌లో ప్రధాన రుణ గ్రహీత, సహ రుణ గ్రహీత ఉంటారు. సహ రుణ గ్రహీతలు రెండు రకాలు. ఎంత రుణం మంజూరు చేయాలన్న అర్హత కోసం సహ రుణ గ్రహీత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఇందులో ఒకటి. సహ రుణ గ్రహీత ఆదాయాన్ని సైతం రుణ అర్హతకు పరిగణనలోకి తీసుకోవడం రెండో రకం. ఉదాహరణకు రిటైర్ అయిన వారికి పెన్షన్ మినహా వేరే ఆదాయం ఉండదు. కనుక తల్లిదండ్రుల్లో ఒకరు ఆదాయం లేని సహ రుణ దరఖాస్తుదారుగా చేరొచ్చు. రుణానికి ఇద్దరు దరఖాస్తు చేసుకుంటుంటే, ఆ ప్రాపర్టీకి ఇద్దరూ సహ యజమానులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక ప్రాపర్టీకి భార్య, భర్త సహ యజమానులుగా ఉండేట్టు అయితే అప్పుడు బ్యాంకులు ఇద్దరి పేరిట జాయింట్ హోమ్ లోన్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కనుక ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇక జాయింట్ హోమ్ లోన్ అంటే ఇద్దరే తీసుకోవాలని లేదు. ముగ్గురు కూడా కలసి తీసుకోవచ్చు. ప్రయోజనాలు ఎన్నో.. ఉమ్మడిగా రుణం తీసుకుంటే ఎక్కువ మొత్తమే లభిస్తుంది. మంచి ఖరీదైన ఇంటికి ప్లాన్ చేసుకునే దంపతులు ఇద్దరూ వేతన జీవులు లేదా సంపాదనాపరులు అయితే ఇక బ్యాంకులు పిలిచి మరీ రుణం ఇస్తాయి. ఇద్దరి ఆదాయాన్ని అర్హత కింద లెక్కలోకి తీసుకుంటాయి. కనుక అధిక మొత్తాన్ని రుణం రూపంలో అందుకోవచ్చు. దీంతో తమ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఒక్కరి పేరు మీద రుణంతో పోలిస్తే ఇద్దరి పేరిట రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ఒకరి నుంచి కాకపోయినా, మరొకరి నుంచి అయినా రికవరీ చేసుకోవచ్చన్న ధీమాయే కారణం. పైగా ఇలా జాయింట్ హోమ్‌లోన్‌లో ఎగవేతలు చాలా తక్కువ. ఒకరికి ఇబ్బందులు వచ్చినా మరొకరు చెల్లింపుల బాధ్యతను తీసుకోగలరు. అందుకే బ్యాంకులకు, రుణ గ్రహీతలకు ఇది అనుకూల ఆప్షన్ అవుతుంది. పెద్ద మొత్తం వస్తుండడంతో చెల్లించే విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడదు. పైగా ఇంటి సౌకర్యాల విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్నా ఆదాయపన్ను ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఎక్కువ మందికి జాయింట్ హోమ్ లోన్ విషయంలో ఎదురయ్యే సందేహం ఇదే. కనుక ఈ సందేహం అక్కర్లేదు. విడిగా ఎవరికి వారు ఆదాయపన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటే.. ముందుగానే ఈఎంఐలో ఎవరి వాటా ఎంతో తేల్చుకోవాలి. నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి నెలా ఈఎంఐను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా జాయింట్ హోమ్ లోన్ విషయంలో పన్ను పరంగా ఓ ప్రత్యేక వెసులుబాటు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, విడిగా ఒక్కరే గృహ రుణం తీసుకుంటే, అసలు, వడ్డీ భాగాలకు ఆదాయపన్ను ప్రయోజనం పూర్తిగా పొందలేని పరిస్థితి ఉండొచ్చు. అటువంటప్పుడు ఇరువురు కలసి తీసుకోవడం వల్ల మిగులు ప్రయోజనాన్ని వేరొకరు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఈఎంఐ వాటా మార్చుకుంటే సరిపోతుంది. ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ఇక అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద మినహాయించి చూపించుకోవచ్చు. ఈ పరిమితి ఎవరికి వారికే విడిగా అమలవుతుంది. చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మహిళా రుణ గ్రహీతలకు రుణ రేటులో కొంత తగ్గింపును ఇస్తున్నాయి. ఇందుకోసం ఇద్దరు దరఖాస్తుదారుల్లో ఒకరు మహిళ అయి ఉండాలి. ప్రధాన రుణ దరఖాస్తుదారుగా లేదా సహ రుణ దరఖాస్తుదారుగా ఉండొచ్చు. ప్రతికూలతలూ ఉన్నాయ్.. ► ఇద్దరు సహ రుణ గ్రహీతల్లో ఒకరికి ఆదాయం ఉన్నట్టుండి ఆగిపోతే, మరొకరు ఆ బాధ్యత తీసుకోవచ్చు. ఇది ఒక విధంగా అనుకూలం, మరో విధంగా ప్రతికూలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కరే తీసుకుని, ఆదాయం ఆగిపోతే డిఫాల్ట్ అవుతారు. ఈఎంఐ చెల్లించలేకపోతే రుణ చరిత్రపై నల్లటి మచ్చ పడుతుంది. ఉమ్మడిగా తీసుకుంటే ఈ ఇబ్బంది రాకుండా రెండో వారు చెల్లింపులతో ఆదుకుంటారు. దీనివల్ల ఒక్కరిపైనే మొత్తం ఈఎంఐ చెల్లింపుల భారం పడుతుందని మర్చిపోవద్దు. కాకపోతే ఇది మరీ పెద్ద ప్రతికూలత కాదనుకోండి. దురదృష్టవశాత్తూ ఇద్దరిలో ఒకరు శాశ్వతంగా సంపాదించలేని పరిస్థితులు ఎదురైతే తప్ప.. జాయింట్ హోమ్ లోన్‌లో తాత్కాలిక ఆదాయ నష్టాలను ఒక్కరే భారం మోయడం ద్వారా అధిగమించొచ్చు. కాకపోతే ఇందుకు ముందుగానే సిద్ధపడాలి. ► రుణ గ్రహీతల మధ్య విభేదాలు, స్పర్థలు తలెత్తితే సమస్య ఎదురుకావచ్చు. అప్పుడు ఇద్దరిలో ఒకరు ఈఎంఐ చెల్లించేందుకు నిరాకరించొచ్చు. దీనివల్ల క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. సిబిల్ స్కోర్ పడిపోతుంది. దీంతో భవిష్యత్తులో రుణం ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ముందుకు రాకపోవచ్చు. రుణ చరిత్ర దెబ్బతినకూడదని అనుకుంటే, కష్టమైనా కానీ రెండో వ్యక్తి ఈఎంఐ భారాన్ని మోయాల్సి రావచ్చు. ఇలాంటి కేసులు తక్కువే ఉంటాయి. కీడెంచి మేలెంచమన్నట్టు.. ముందే ఈ విధమైన సమస్యలకు సన్నద్ధులు కావాలి. వీలైతే జాయింట్ హోమ్ లోన్ తీసుకునే సమయంలోనే ఒక అగ్రిమెంట్ రాసుకోవడం మంచిది. ► దంపతులు కలసి గృహ రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైనా కారణంతో విడిపోవాల్సి వస్తే..? అప్పుడు మిగిలిన గృహ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాపర్టీపై ఎవరి హక్కులు ఏ మేరకు? ఇలాంటి అంశాల్లో పక్కా స్పష్టత అవసరం. ఇందుకోసం ముందే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం ఎందుౖMðనా మంచిది. మరొకరు ఈఎంఐ భారం మోసి, చివర్లో ఇద్దరూ పంచుకోవడమా? లేక అంతటితో ముగించడమా..? ఇలా చాలా అంశాల్లో స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది. ముందే ఆయా అంశాలకు వచ్చి, న్యాయపరమైన సలహా ప్రకారం నడుచుకోవడం మంచింది. ► ఇక సహ రుణ గ్రహీతల్లో ఒకరు ఏదైనా కారణంతో మరణించినట్టయితే అప్పుడు ఏం చేయాలో ముందే ఆలోచించుకోవాలి. మిగిలిన దరఖాస్తుదారులపై రుణ ఈఎంఐ భారం పడుతుంది. ఇలా జాయింట్ హోమ్ లోన్‌లో ఏ కారణం వల్ల ఈఎంఐ చెల్లించకపోతే తీవ్ర సమస్యే. రుణం ఇచ్చిన సంస్థ ఇంటిని జప్తు చేసి వేలానికి పెడుతుంది. ఇక దంపతులు కలసి గృహ రుణం తీసుకున్న తర్వాత, వారిలో ఒకరు మరణించినట్టయితే.. మిగిలిన జీవిత భాగస్వామి మొత్తం ప్రాపర్టీలో ఒకటో వంతు వాటాకే హక్కుదారులు అవుతారు. మరో రెండు భాగాల్లో మరణించిన జీవిత భాగస్వామి తల్లిదండ్రులకు ఒక భాగం, పిల్లలకు ఒక భాగం లభిస్తుంది. ఉమ్మడిగా రుణం తీసుకునే ముందు, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అధిగమించడంపై కార్యాచరణను ముందే సిద్ధం చేసుకోవాలి. -
మధ్య తరగతి సొంతింటి కల నెరవేరుస్తాం
చిలకలపూడి (మచిలీపట్నం): పేదవారికి ఇప్పటికే సొంతింటి కల నెరవేర్చి స్థల పట్టాలు ఇచ్చామని, మధ్య తరగతి కుటుంబీకులకు కూడా అతి తక్కువ ధరతో సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్ స్మార్ట్ కాలనీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నెలకు రూ.12 వేలకు పైగా ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాల వారికి మూడు కేటగిరీల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి 150, 200, 240 గజాల చొప్పున స్థలాలు విభజించి.. వాటిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. వీటన్నింటికి అయిన ఖర్చును మాత్రమే దరఖాస్తుదారుని వద్ద తీసుకుని ఇంటి పట్టా అందజేయటం జరుగుతుందన్నారు. ఆ స్థలాల కోసం సచివాలయాల్లో ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో మొదటిదశగా మచిలీపట్నం, గుడివాడ మునిసిపాలిటీలను గుర్తించినట్టు చెప్పారు. మునిసిపాలిటీ పరిధికి అతి దగ్గరగా ఈ కాలనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
అద్దె ఇల్లా.. సొంతిల్లా..?
సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం నేటి రోజుల్లో సులభ సాధ్యంగానే మారింది. వేతన జీవులు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అవకాశం కల్పిస్తున్నాయి. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంది. అయితే, కొందరు రుణం అంటే భయంతో వెనుకంజ వేస్తుంటారు. దీనికి బదులు అద్దె ఇంట్లోనే ఉందామనుకుంటుంటారు. కొందరు అయితే అద్దె ఇంటికి చెల్లించేదేదో రుణ ఈఎంఐగా చెల్లిస్తే కొన్నాళ్లకు ఓ ఇల్లు మనదైపోతుందన్న అంచనాతో ధైర్యం చేసి ముందడుగు వేస్తుంటారు. ఇంకొందరు అయితే ఏది లాభం? అనే సంశయంతో ఉండొచ్చు. కానీ, ఈ విషయంలో నిపుణుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్యాపిటల్ కోషెంట్ సీఈవో సౌస్తవ్ చక్రవర్తి అభిప్రాయ కోణం ఇలా ఉంది.. ఓ 20 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉంటూ, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నిధిని సమకూర్చుకుని ఇంటిని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా రుణంపై ప్రాపర్టీని కొనుగోలు చేసి 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. మన దేశంలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. వారి ముఖ్యమైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఇల్లు సమకూర్చుకుని అందులో నివసించే విషయంలో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అద్దె ఇంట్లో ఉండడం ప్రతికూల ఆప్షన్ ఏమీ కాదు. అయితే, ఈ రెండు ఆప్షన్లలో ఉండే ప్రయోజనాలు, ప్రతికూలతలను చూద్దాం. ఇంటిని కొనుగోలు చేయడం.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ధోరణులను పరిశీలిస్తే.. ప్రాపర్టీ ధరలు ఏటా 8 శాతం చొప్పున వచ్చే 20 ఏళ్ల పాటు పెరుగుతాయని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు 20 ఏళ్ల కాలానికి గృహ రుణాలపై 8.5 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఇంటి ఖరీదు రూ.90 లక్షలని అనుకుంటే.. 20 ఏళ్ల తర్వాత ఇదే ప్రాపర్టీ 8 శాతం ఏటా పెరుగుదల అంచనాల ఆధారంగా రూ.4.19 కోట్లు అవుతుంది. అదే ఇప్పుడు రుణం తీసుకుని 20 ఏళ్ల పాటు ప్రతీ నెలా రూ.78,104 చొప్పున చెల్లిస్తూ వెళితే కట్టే మొత్తం రూ.1.87 కోట్లు మాత్రమే. లాభ, నష్టాలు అద్దె ఇంటితో పోలిస్తే సొంత ఇంట్లో ఉండే అనుభవం వేరు. దీన్ని కాదనడం లేదు. కానీ, ఆర్థిక కోణంలో నుంచి చూసేట్టు అయితే ఎన్నో అంశాలపై దృష్టి సారించాలి. రుణం తీసుకుని అద్దె చెల్లించడం వల్ల అతిపెద్ద అనుకూలత.. రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపన్ను మినహాయింపులు ఉండడం. ప్రతికూలత.. వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే విక్రయించడంలో ఉండే ఇబ్బంది. ఒకరు ఒకే ప్రాంతంలో శాశ్వతంగా ఉండిపోతారన్న నమ్మకం తక్కువే. ఇంటి కోసం ఒకే ప్రాంతంలో ఉండి కెరీర్లో ఉన్నత అవకాశాలను నష్టపోలేరు కదా. అద్దె ఇంట్లో ఉండడం... అద్దె ఇంట్లో ఉండే వారు, వేతనంలో మిగిలే మొత్తాన్ని ప్రతీ నెలా లేదా మూడు నెలలకోసారి క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ ఎంచుకున్న కాలానికి అనుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి మొత్తం బ్యాంకు నుంచి సంబంధిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళుతుంది. ఎన్ఏవీ ధర ఆధారంగా ఫండ్స్ యూనిట్ల కేటాయింపులు చేస్తారు. ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తుండడం వల్ల మార్కెట్లు పెరుగుదల, పతనాల్లోనూ కొనుగోలుతో సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. ఇప్పుడు పై ఉదాహరణలో ఇంటి రుణంపై ఈఎంఐగా రూ.78,104 చెల్లించాలని చెప్పుకున్నాం కదా.. ఇందులో అద్దె ఇంటికి ప్రతినెలా చెల్లించాల్సిన రూ.25,000ను మినహాయించగా, సిప్ కోసం రూ.53,104 అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రతినెలా సిప్ రూపంలో 20 ఏళ్ల పాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 12% రాబడి అంచనాతో రూ.5,30,58,751 సమకూరుతుంది. లాభ, నష్టాలు: అద్దె ఇంట్లో ఉండే వారు తమ కెరీర్ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైనా మరో చోటకు (అదే పట్టణంలో మరో చోటుకు లేదా వేరే ప్రాంతానికి) మారిపోయే వెసులుబాటుతో ఉంటారు. ఇంటిని విక్రయించాలన్న ఇబ్బంది ఉండనే ఉండదు. పైగా అద్దె ఇంట్లో ఉండే వారికి హెచ్ఆర్ఏ పేరుతో పన్ను మినహాయింపు ఉండనే ఉంది. వేతనం లేని వారికి కూడా కొంత మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే అద్దె ఇంట్లో ఉండడం వల్ల మీరు ఒక ఇంటి వారు కాలేకపోవచ్చు. ఏంటి కర్తవ్యం..? రెండు ఆప్షన్లలోనూ లాభ, నష్టాలు ఉన్నాయి. రెండింటిలోకి.. అద్దె ఇంట్లో ఉండి, సిప్ ద్వారా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రూ.5.3 కోట్ల నిధిని సమకూర్చుకోగలరు. మరోవైపు రుణంపై ఇంటిని సమకూర్చుకున్నా కానీ.. 20 ఏళ్ల తర్వాత దాని విలువ రూ.4.19 కోట్లు అవుతుంది. కాకపోతే రూ.కోటి వరకు వడ్డీ రూపేణా ఈ కాలంలో చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.. ఇంటి అద్దెను 20 ఏళ్ల కాలానికి ఫ్లాట్‌గా ప్రతీ నెలా రూ.25,000గానే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవంలో ఇంటి అద్దె ఏటేటా పెరుగుతుంది. అయితే, అదే సమయంలో వేతనం పెరుగుతుంటుంది కనుక సిప్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా పెంచుకుంటూ వెళ్లొచ్చు. అంతిమంగా తమ అవసరాలు, అనుకూలతలు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండింటిలో అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కొందరు రుణ ఈఎంఐ అంటే తప్పనిసరి బాధ్యతగా భావించి వేతనంలో కచ్చితంగా ఆ మొత్తాన్ని పక్కన పెడతారు. అదే అద్దె ఇంట్లో ఉండి, మిగులు మొత్తాన్ని అంతే క్రమశిక్షణగా, బాధ్యతగా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ మందికి సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే వారి అవసరాలు ప్రాధాన్యంగా మారి.. పెట్టుబడులు పక్కకు వెళ్లిపోవచ్చు. ఇదే జరిగితే సొంతిల్లు లేక పోగా, చివరికి మంచి నిధి కూడా ఏర్పాటు చేసుకోలేరు. అందుకే క్రమశిక్షణ, దృష్టి కోణం ఆధారంగానూ నిర్ణయం ఉండాలి. -
నగరవాసుల సొంతింటి కల నెరవేరుతుందట
న్యూఢిల్లీ: నగరవాసులకు సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ఓ కల. రియల్ ఎస్టేట్ ధరలు నానాటికి రియాలిటీకి దూరంగా పెరిగిపోతుండడంతో ఆ కల ఎప్పటికీ తీరునో తెలియక సతమతమయ్యేవారే ఎక్కువ. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వారి కలను నిజం చేస్తుందని రియల్ ఎస్టేట్ రంగానికే చెందిన నిపుణులే తెలియజేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నల్ల డబ్బు, నగదు చెలామణి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెల్సిందే. మోదీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు సడన్‌గా ఈ చెలామణికి బ్రేక్ పడింది. పర్యవసానంగా కొనుగోళ్లు, అమ్మకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అలాగే నగదు చెలామణి నిలిచిపోతుందీ, నల్లడబ్బు ఆగిపోతుంది కనుక రియల్టీ ధరలు పడిపోతున్నాయి. భూమి విలువ కూడా పడిపోతుంది కనుక తాము కూడా తగ్గించి అమ్మగలమని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చెబుతున్నారు. మరోపక్క పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు పెరుగుతుండడంతో ఇళ్ల రుణాలు ఎక్కువ ఇవ్వడానికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ముందుకు వస్తాయి. ఇళ్ల రుణాల వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించిన బ్యాంకులు డిపాజిట్లు పెరిగిన నేపథ్యంలో ఆ వడ్డీలను మరింత తగ్గిస్తాయి. డిపాజిట్లు పెరిగిన నేపథ్యంలో ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు కూడా ఇప్పటికే తగ్గాయి. దేశంలో నల్లడబ్బు చెలామణి ఎక్కువగా ఉండడంతో ప్రముఖ రియల్టర్ సంస్థలు ప్రధానంగా ధనవంతుల కోసం లగ్జరీ విల్లాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ సంస్థలు మధ్యతరగతి ప్రజల ఇళ్లపైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వస్తుంది. సకాలంలో కస్టమర్లకు బ్యాంక్ రుణాలు కూడా లభిస్తాయి కనక ఇదే వారికి లాభదాయక వ్యాపారం అవుతుంది. ఇంతకుముందుకన్నా గత రెండేళ్లుగా దేశంలో ఇళ్ల నిర్మాణ యూనిట్లు తగ్గుతూ వస్తుండడంతో కొన్ని రియల్టీ సంస్థలు ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు కొనుగోలు శక్తి మేరకే ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇకముందు ఈ సెక్టార్లో కూడా రియల్టీ సంస్థల మధ్య పోటీ ఉంటుంది కనుక ఇళ్ల రేట్లుకూడా తగ్గుతాయి. ప్రజలతో మోర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టంలో మార్పులు తీసుకరావాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భావించడం కూడా ప్రజలకు కలిసొచ్చే అంశమే. ఇళ్ల రేట్లు ఎలా తగ్గుతాయంటే.... 1. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల నోట్లు మృగ్యమై భూముల రేట్లు పడిపోతాయి. పర్యవసానంగా ఇళ్ల అమ్మకం రేట్లు పడిపోతాయి. 2. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగినందున బ్యాంకుల ద్వారా ఇళ్ల రుణాలు సులభంగా లభిస్తాయి. 3. ఇప్పటికే తగ్గించిన ఇళ్ల రుణాల రేట్లను బ్యాంకులు మరింత తగ్గిస్తాయి. 4. లగ్జరీ విల్లాలకు డిమాండ్ పడిపోయి మధ్య తరగతి ఇళ్లకు రియల్టర్లు మర్లుతారు కనుక వారి మధ్య పోటీ పెరుగుతుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు రాయితీలు ప్రకటించక తప్పదు. 5. రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టాంలో సవరణల ప్రభావం. తదితర కారణాల వల్ల ఇళ్ల రేట్లు పడిపోతాయని, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల ధరలు అందుబాటులోకి వస్తాయని గెరా డెవలప్మెంట్స్, అసెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గెరా, జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీఈవో అశ్విందర్ రాజ్ సింగ్, రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కుర్షద్ గాంధీ చెబుతున్నారు. ముఖ్యంగా ‘రెడీ టూ గో’ ఇళ్లకు డిమాండ్ కూడా ఉంటుందని గాంధీ అంచనావేస్తున్నారు. దేశంలో ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టిన ఆరేడు నమ్మకమైన ప్రముఖ రియల్టీ సంస్థలపై మోదీ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చని, అవి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లావాదేవీలు నిర్వహించడమే ఇందుకు కారణమని ఆ సంస్థలకు చెందిన కొందరు నిపుణులు చెబుతున్నారు. -
సొంతింటి కల.. మరింత భారం
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకుసొంతింటి కల ఇక మరింత భారం కానుంది. రైతులు అష్టకష్టాలు పడి పొదుపు చేసిన సొమ్ముతో ఎకరానో అరెకరానో పొలం కొనాలన్నా గగన కుసుమమే. ఇంటి జాగా కొనడమూ పెనుభారంగా మారనుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్థిరాస్తుల మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. భూములు, ఇళ్లు, స్థలాల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేపట్టింది. ‘‘మార్కెట్ విలువలు పెంచడం ఖాయం. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారు. గ్రామాలు, పట్టణాలవారీగా భూములు, స్థలాల వాస్తవ విలువల ప్రాతిపదికన మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రెవెన్యూ డివిజనల్ అధికారులు/జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని మార్కెట్ రివిజన్ కమిటీల అనుమతి తీసుకోవాలి. ఈ దిశగా జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లను సన్నద్ధం చేయండి’’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ విలువల పెంపునకు మంత్రి కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేసి, సీఎం ఆమోదం నిమిత్తం పంపించారని, సీఎం దీనిని ఆమోదించడం లాంఛనప్రాయమేనని ఉన్నతాధికారులు వివరించారు. సీఎం ఆమోదిస్తే సవరించిన విలువలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. భారీ ఆర్జనకు సర్కారు యత్నాలు భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు పెరగడంవల్ల కొనుగోలుదారులపై స్టాంపు డ్యూటీ భారం పెరుగుతుంది. మార్కెట్ విలువపై నాలుగు శాతం ఉన్న స్టాంపు డ్యూటీని ప్రభుత్వం ఇటీవలే ఐదు శాతానికి పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజును అర శాతం నుంచి ఒక శాతానికి పెంచింది. వివిధ రకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టేబుల్ ఫీజులను కూడా పెంచింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఇప్పుడు మళ్లీ మార్కెట్ విలువలను సవరించడం ద్వారా భారీగా ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘ఇక మార్కెట్ రివిజన్ కమిటీలు ఆమోదించిన రిజిస్ట్రేషన్ విలువలే అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ విలువలతో పోల్చితే 20 నుంచి 30 శాతం వరకూ పెరుగుదల ఉండే అవకాశం ఉంది’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
నేడు, రేపు సాక్షి ప్రాపర్టీ షో 2015
-
సాక్షి ప్రాపర్టీ షో నేడే!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడమంటే మామూలు విషయం కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలు, మరెంతో సమయం వృథా. వీటన్నింటికి సులువైన పరిష్కారం చూపించేందుకు సిద్ధమైంది సాక్షి. శని, ఆదివారాల్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్:1లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఉదయం 10 గంటలకు మెగా ప్రాపర్టీ షో జరగనుంది. ⇒ జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్ గంట గంటకూ లక్కీ డ్రా తీయనుంది. ⇒ నగరంలోని ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉంది? స్థిరాస్తి కంపెనీలు అందజేస్తున్న ప్రత్యేక ఆఫర్లు, బ్యాంక్‌లోన్ సదుపాయాలు.. ఇలా స్థిరాస్తికి సంబంధించిన సమాచారం ఈ షోలో తెలుసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు ఒకే చోటుకి చేరడం వల్ల సరసమైన ధరలకు ఫ్లాట్ లేదా స్థలం లభించే అవకాశం ఉంటుంది. మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్యా కన్స్ట్రక్షన్స్ కో-స్పాన్సర్స్: హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్, మంజీరా కన్స్ట్రక్షన్స్. పాల్గొనే సంస్థలు: సత్వా గ్రూప్, ఎస్ఎంఆర్ బిల్డ ర్స్, శాంతా శ్రీరామ్, జనప్రియ ఇంజనీర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రణీత్ గ్రూప్, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్ ఇంజనీర్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్, గ్రీన్ హోమ్, ఎస్ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్ఫ్రా, శతాబ్ధి టౌన్‌షిప్స్, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, స్పేస్ విజన్, మ్యాక్ ప్రాజెక్ట్స్, జీకే డెవలపర్స్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, స్వేర్మైల్ ప్రాజెక్ట్స్, శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్. బ్యాంకులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ.