సొంతింటికి ‘జంట’ దారి..! | Advantages of Married Couples Joint Housing Loans | Sakshi
Sakshi News home page

సొంతింటికి ‘జంట’ దారి..!

Published Mon, Oct 3 2022 5:36 AM | Last Updated on Mon, Oct 3 2022 8:45 AM

Advantages of Married Couples Joint Housing Loans - Sakshi

సొంతింట్లో ఉన్నంత సంతృప్తి అద్దె ఇంట్లో లభించదు. కిరాయి ఇచ్చినంత మాత్రాన అన్ని హక్కులూ రావు. గోప్యత, ఇంటి వినియోగంలో స్వేచ్ఛ, బంధువుల రాకపోకలు ఇలా చెప్పుకుంటూ పోతే.. అద్దె ఇళ్ల విషయంలో ఎన్నో ప్రతికూల అంశాలున్నాయి. అందుకే నేటితరం పెళ్లికి ముందే లేదంటే పెళ్లయిన కొన్నాళ్లకే సొంతింటి వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు సొంతిల్లు అన్నది ఓ పెద్ద కల. కానీ, నేడు విశాలమైన (కనీస అవసరాల మేరకు) ఇల్లు అన్నది కలగా మారిందని చెప్పుకోవాల్సిందే. చదువుకునే పిల్లలు ఏకాంతం కోరుకుంటున్నారు.

ఉద్యోగాలు చేసే దంపతులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం ఇంట్లోనే తమకంటూ ప్రైవేటు స్థలం ఉండాలని భావిస్తున్నారు. కనుక మారుతున్న అవసరాల నేపథ్యంలో సొంతింటికి ప్లాన్‌ చేసుకునే వారు కనీసం టూ లేదా త్రీ బెడ్‌ రూమ్‌ ఉండాలంటున్నారు..! ఇల్లు విశాలంగా ఉండాలంటే భారీ మొత్తమే సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో దంపతులు ఇద్దరూ కలసి ఉమ్మడిగా గృహ రుణం (జాయింట్‌ హోమ్‌ లోన్‌) తీసుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుంది. అయితే, దీనికి ఎలా సిద్ధం కావాలి.. నిబంధనలు ఎలా ఉంటాయి.. వంటివన్నీ వివరించే కథనం ఇది..

చిన్న కుటుంబం అనుకున్నా భార్యా భర్త, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. వీరికి తోడుగా తల్లిదండ్రులు కూడా ఉంటే ఇల్లు కాస్త విశాలంగా ఉండాల్సిందే కదా. శివ, అపూర్వ దంపతులకు సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివ తల్లిదండ్రులు అతడితోనే ఉంటున్నారు. శివ పెళ్లయిన కొత్తలో తనకున్న బడ్జెట్‌తో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేశాడు. ఇటీవల కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసుకోవాల్సి వచ్చింది. కానీ, అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల్లో అతడికి ఏకాంతంతో కూడిన కాస్తంత స్థలం కరువైంది.

అందుకనే అతడు త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడున్న ఒక్క పడకగది ఫ్లాట్‌ విక్రయించగా వచ్చే మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ కింద జమ చేసి, మిగతా మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాలన్నది అతడి ప్రణాళిక. ఇలా కోరుకునే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నగరంలో త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ అంటే భారీ పెట్టుబడి అవసరపడుతుంది. కనుక జాయింట్‌ హోమ్‌లోన్‌ ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. దీనికి ముందు జాయింట్‌ హోమ్‌లోని సాధక, బాధకాల గురించి అవగాహన కల్పించుకుంటే, సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.  

నిబంధనలు – అర్హతలు
చెల్లించే సామర్థ్యం ఉంటే ఒక్కరి పేరుమీదనే గృహ రుణాన్ని తీసుకోవచ్చు. కానీ, దంపతులు కలసి తీసుకోవడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీలైతే జాయింట్‌గానే చాలా మంది గృహ రుణానికి మొగ్గు చూపుతుంటారు. చాలా బ్యాంకులు సహ రుణ గ్రహీత కింద కుటుంబ సభ్యులనే అనుమతిస్తున్నాయి. ఒక వ్యక్తి తన తండ్రితో లేదంటే భార్యతో కలసి ఉమ్మడిగా రుణం తీసుకోవచ్చు. అలాగే, తండ్రి కూడా తన కుమారుడు, పెళ్లి కాని కుమార్తెతో కలసి రుణం పొందొచ్చు. ఇక ఇద్దరు సోదరీ మణులు, ఒక సోదరి ఒక సోదరుడు, వివాహిత అయిన కుమార్తెతో కలసి తండ్రి, స్నేహతులు ఉమ్మడిగా గృహ రుణం పొందడానికి అర్హత లేదు.  జాయింట్‌ హోమ్‌ లోన్‌లో ప్రధాన రుణ గ్రహీత, సహ రుణ గ్రహీత ఉంటారు.

సహ రుణ గ్రహీతలు రెండు రకాలు. ఎంత రుణం మంజూరు చేయాలన్న అర్హత కోసం సహ రుణ గ్రహీత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఇందులో ఒకటి. సహ రుణ గ్రహీత ఆదాయాన్ని సైతం రుణ అర్హతకు పరిగణనలోకి తీసుకోవడం రెండో రకం. ఉదాహరణకు రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌ మినహా వేరే ఆదాయం ఉండదు. కనుక తల్లిదండ్రుల్లో ఒకరు ఆదాయం లేని సహ రుణ దరఖాస్తుదారుగా చేరొచ్చు. రుణానికి ఇద్దరు దరఖాస్తు చేసుకుంటుంటే, ఆ ప్రాపర్టీకి ఇద్దరూ సహ యజమానులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక ప్రాపర్టీకి భార్య, భర్త సహ యజమానులుగా ఉండేట్టు అయితే అప్పుడు బ్యాంకులు ఇద్దరి పేరిట జాయింట్‌ హోమ్‌ లోన్‌ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కనుక ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇక జాయింట్‌ హోమ్‌ లోన్‌ అంటే ఇద్దరే తీసుకోవాలని లేదు. ముగ్గురు కూడా కలసి తీసుకోవచ్చు.

ప్రయోజనాలు ఎన్నో..
ఉమ్మడిగా రుణం తీసుకుంటే ఎక్కువ మొత్తమే లభిస్తుంది. మంచి ఖరీదైన ఇంటికి ప్లాన్‌ చేసుకునే దంపతులు ఇద్దరూ వేతన జీవులు లేదా సంపాదనాపరులు అయితే ఇక బ్యాంకులు పిలిచి మరీ రుణం ఇస్తాయి. ఇద్దరి ఆదాయాన్ని అర్హత కింద లెక్కలోకి తీసుకుంటాయి. కనుక అధిక మొత్తాన్ని రుణం రూపంలో అందుకోవచ్చు. దీంతో తమ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఒక్కరి పేరు మీద రుణంతో పోలిస్తే ఇద్దరి పేరిట రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ఒకరి నుంచి కాకపోయినా, మరొకరి నుంచి అయినా రికవరీ చేసుకోవచ్చన్న ధీమాయే కారణం. పైగా ఇలా జాయింట్‌ హోమ్‌లోన్‌లో ఎగవేతలు చాలా తక్కువ.

ఒకరికి ఇబ్బందులు వచ్చినా మరొకరు చెల్లింపుల బాధ్యతను తీసుకోగలరు. అందుకే బ్యాంకులకు, రుణ గ్రహీతలకు ఇది అనుకూల ఆప్షన్‌ అవుతుంది. పెద్ద మొత్తం వస్తుండడంతో చెల్లించే విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడదు. పైగా ఇంటి సౌకర్యాల విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం ఉండదు.   ఇక ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్నా ఆదాయపన్ను ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఎక్కువ మందికి జాయింట్‌ హోమ్‌ లోన్‌ విషయంలో ఎదురయ్యే సందేహం ఇదే. కనుక ఈ సందేహం అక్కర్లేదు. విడిగా ఎవరికి వారు ఆదాయపన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్‌ చేసుకోవాలని అనుకుంటే.. ముందుగానే ఈఎంఐలో ఎవరి వాటా ఎంతో తేల్చుకోవాలి. నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి నెలా ఈఎంఐను షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పైగా జాయింట్‌ హోమ్‌ లోన్‌ విషయంలో పన్ను పరంగా ఓ ప్రత్యేక వెసులుబాటు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, విడిగా ఒక్కరే గృహ రుణం తీసుకుంటే, అసలు, వడ్డీ భాగాలకు ఆదాయపన్ను ప్రయోజనం పూర్తిగా పొందలేని పరిస్థితి ఉండొచ్చు. అటువంటప్పుడు ఇరువురు కలసి తీసుకోవడం వల్ల మిగులు ప్రయోజనాన్ని వేరొకరు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఈఎంఐ వాటా మార్చుకుంటే సరిపోతుంది. ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్‌ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ఇక అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలను సెక్షన్‌ 80సీ కింద మినహాయించి చూపించుకోవచ్చు. ఈ పరిమితి ఎవరికి వారికే విడిగా అమలవుతుంది. చాలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మహిళా రుణ గ్రహీతలకు రుణ రేటులో కొంత తగ్గింపును ఇస్తున్నాయి. ఇందుకోసం ఇద్దరు దరఖాస్తుదారుల్లో ఒకరు మహిళ అయి ఉండాలి. ప్రధాన రుణ దరఖాస్తుదారుగా లేదా సహ రుణ దరఖాస్తుదారుగా ఉండొచ్చు.

ప్రతికూలతలూ ఉన్నాయ్‌..
► ఇద్దరు సహ రుణ గ్రహీతల్లో ఒకరికి ఆదాయం ఉన్నట్టుండి ఆగిపోతే, మరొకరు ఆ బాధ్యత తీసుకోవచ్చు. ఇది ఒక విధంగా అనుకూలం, మరో విధంగా ప్రతికూలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కరే తీసుకుని, ఆదాయం ఆగిపోతే డిఫాల్ట్‌ అవుతారు. ఈఎంఐ చెల్లించలేకపోతే రుణ చరిత్రపై నల్లటి మచ్చ పడుతుంది. ఉమ్మడిగా తీసుకుంటే ఈ ఇబ్బంది రాకుండా రెండో వారు చెల్లింపులతో ఆదుకుంటారు. దీనివల్ల ఒక్కరిపైనే మొత్తం ఈఎంఐ చెల్లింపుల భారం పడుతుందని మర్చిపోవద్దు. కాకపోతే ఇది మరీ పెద్ద ప్రతికూలత కాదనుకోండి. దురదృష్టవశాత్తూ ఇద్దరిలో ఒకరు శాశ్వతంగా సంపాదించలేని పరిస్థితులు ఎదురైతే తప్ప.. జాయింట్‌ హోమ్‌ లోన్‌లో తాత్కాలిక ఆదాయ నష్టాలను ఒక్కరే భారం మోయడం ద్వారా అధిగమించొచ్చు. కాకపోతే ఇందుకు ముందుగానే సిద్ధపడాలి.  

► రుణ గ్రహీతల మధ్య విభేదాలు, స్పర్థలు తలెత్తితే సమస్య ఎదురుకావచ్చు. అప్పుడు ఇద్దరిలో ఒకరు ఈఎంఐ చెల్లించేందుకు నిరాకరించొచ్చు. దీనివల్ల క్రెడిట్‌ హిస్టరీ దెబ్బతింటుంది. సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంది. దీంతో భవిష్యత్తులో రుణం ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ముందుకు రాకపోవచ్చు. రుణ చరిత్ర దెబ్బతినకూడదని అనుకుంటే, కష్టమైనా కానీ రెండో వ్యక్తి ఈఎంఐ భారాన్ని మోయాల్సి రావచ్చు. ఇలాంటి కేసులు తక్కువే ఉంటాయి. కీడెంచి మేలెంచమన్నట్టు.. ముందే ఈ విధమైన సమస్యలకు సన్నద్ధులు కావాలి. వీలైతే జాయింట్‌ హోమ్‌ లోన్‌ తీసుకునే సమయంలోనే ఒక అగ్రిమెంట్‌ రాసుకోవడం మంచిది.  

► దంపతులు కలసి గృహ రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైనా కారణంతో విడిపోవాల్సి వస్తే..? అప్పుడు మిగిలిన గృహ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాపర్టీపై ఎవరి హక్కులు ఏ మేరకు? ఇలాంటి అంశాల్లో పక్కా స్పష్టత అవసరం. ఇందుకోసం ముందే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం ఎందుౖMðనా మంచిది. మరొకరు ఈఎంఐ భారం మోసి, చివర్లో ఇద్దరూ పంచుకోవడమా? లేక అంతటితో ముగించడమా..? ఇలా చాలా అంశాల్లో స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది.  ముందే ఆయా అంశాలకు వచ్చి, న్యాయపరమైన సలహా ప్రకారం నడుచుకోవడం మంచింది.

► ఇక సహ రుణ గ్రహీతల్లో ఒకరు ఏదైనా కారణంతో మరణించినట్టయితే అప్పుడు ఏం చేయాలో ముందే ఆలోచించుకోవాలి. మిగిలిన దరఖాస్తుదారులపై రుణ ఈఎంఐ భారం పడుతుంది. ఇలా జాయింట్‌ హోమ్‌ లోన్‌లో ఏ కారణం వల్ల ఈఎంఐ చెల్లించకపోతే తీవ్ర సమస్యే. రుణం ఇచ్చిన సంస్థ ఇంటిని జప్తు చేసి వేలానికి పెడుతుంది. ఇక దంపతులు కలసి గృహ రుణం తీసుకున్న తర్వాత, వారిలో ఒకరు మరణించినట్టయితే.. మిగిలిన జీవిత భాగస్వామి మొత్తం ప్రాపర్టీలో ఒకటో వంతు వాటాకే హక్కుదారులు అవుతారు. మరో రెండు భాగాల్లో మరణించిన జీవిత భాగస్వామి తల్లిదండ్రులకు ఒక భాగం, పిల్లలకు ఒక భాగం లభిస్తుంది. ఉమ్మడిగా రుణం తీసుకునే ముందు, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అధిగమించడంపై కార్యాచరణను ముందే సిద్ధం చేసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement