Joint Home Loan
-
సొంతింటికి ‘జంట’ దారి..!
సొంతింట్లో ఉన్నంత సంతృప్తి అద్దె ఇంట్లో లభించదు. కిరాయి ఇచ్చినంత మాత్రాన అన్ని హక్కులూ రావు. గోప్యత, ఇంటి వినియోగంలో స్వేచ్ఛ, బంధువుల రాకపోకలు ఇలా చెప్పుకుంటూ పోతే.. అద్దె ఇళ్ల విషయంలో ఎన్నో ప్రతికూల అంశాలున్నాయి. అందుకే నేటితరం పెళ్లికి ముందే లేదంటే పెళ్లయిన కొన్నాళ్లకే సొంతింటి వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు సొంతిల్లు అన్నది ఓ పెద్ద కల. కానీ, నేడు విశాలమైన (కనీస అవసరాల మేరకు) ఇల్లు అన్నది కలగా మారిందని చెప్పుకోవాల్సిందే. చదువుకునే పిల్లలు ఏకాంతం కోరుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే దంపతులు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంట్లోనే తమకంటూ ప్రైవేటు స్థలం ఉండాలని భావిస్తున్నారు. కనుక మారుతున్న అవసరాల నేపథ్యంలో సొంతింటికి ప్లాన్ చేసుకునే వారు కనీసం టూ లేదా త్రీ బెడ్ రూమ్ ఉండాలంటున్నారు..! ఇల్లు విశాలంగా ఉండాలంటే భారీ మొత్తమే సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో దంపతులు ఇద్దరూ కలసి ఉమ్మడిగా గృహ రుణం (జాయింట్ హోమ్ లోన్) తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. అయితే, దీనికి ఎలా సిద్ధం కావాలి.. నిబంధనలు ఎలా ఉంటాయి.. వంటివన్నీ వివరించే కథనం ఇది.. చిన్న కుటుంబం అనుకున్నా భార్యా భర్త, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. వీరికి తోడుగా తల్లిదండ్రులు కూడా ఉంటే ఇల్లు కాస్త విశాలంగా ఉండాల్సిందే కదా. శివ, అపూర్వ దంపతులకు సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివ తల్లిదండ్రులు అతడితోనే ఉంటున్నారు. శివ పెళ్లయిన కొత్తలో తనకున్న బడ్జెట్‌తో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇటీవల కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసుకోవాల్సి వచ్చింది. కానీ, అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల్లో అతడికి ఏకాంతంతో కూడిన కాస్తంత స్థలం కరువైంది. అందుకనే అతడు త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడున్న ఒక్క పడకగది ఫ్లాట్ విక్రయించగా వచ్చే మొత్తాన్ని డౌన్ పేమెంట్ కింద జమ చేసి, మిగతా మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాలన్నది అతడి ప్రణాళిక. ఇలా కోరుకునే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ అంటే భారీ పెట్టుబడి అవసరపడుతుంది. కనుక జాయింట్ హోమ్‌లోన్ ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. దీనికి ముందు జాయింట్ హోమ్‌లోని సాధక, బాధకాల గురించి అవగాహన కల్పించుకుంటే, సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. నిబంధనలు – అర్హతలు చెల్లించే సామర్థ్యం ఉంటే ఒక్కరి పేరుమీదనే గృహ రుణాన్ని తీసుకోవచ్చు. కానీ, దంపతులు కలసి తీసుకోవడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీలైతే జాయింట్‌గానే చాలా మంది గృహ రుణానికి మొగ్గు చూపుతుంటారు. చాలా బ్యాంకులు సహ రుణ గ్రహీత కింద కుటుంబ సభ్యులనే అనుమతిస్తున్నాయి. ఒక వ్యక్తి తన తండ్రితో లేదంటే భార్యతో కలసి ఉమ్మడిగా రుణం తీసుకోవచ్చు. అలాగే, తండ్రి కూడా తన కుమారుడు, పెళ్లి కాని కుమార్తెతో కలసి రుణం పొందొచ్చు. ఇక ఇద్దరు సోదరీ మణులు, ఒక సోదరి ఒక సోదరుడు, వివాహిత అయిన కుమార్తెతో కలసి తండ్రి, స్నేహతులు ఉమ్మడిగా గృహ రుణం పొందడానికి అర్హత లేదు. జాయింట్ హోమ్ లోన్‌లో ప్రధాన రుణ గ్రహీత, సహ రుణ గ్రహీత ఉంటారు. సహ రుణ గ్రహీతలు రెండు రకాలు. ఎంత రుణం మంజూరు చేయాలన్న అర్హత కోసం సహ రుణ గ్రహీత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఇందులో ఒకటి. సహ రుణ గ్రహీత ఆదాయాన్ని సైతం రుణ అర్హతకు పరిగణనలోకి తీసుకోవడం రెండో రకం. ఉదాహరణకు రిటైర్ అయిన వారికి పెన్షన్ మినహా వేరే ఆదాయం ఉండదు. కనుక తల్లిదండ్రుల్లో ఒకరు ఆదాయం లేని సహ రుణ దరఖాస్తుదారుగా చేరొచ్చు. రుణానికి ఇద్దరు దరఖాస్తు చేసుకుంటుంటే, ఆ ప్రాపర్టీకి ఇద్దరూ సహ యజమానులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక ప్రాపర్టీకి భార్య, భర్త సహ యజమానులుగా ఉండేట్టు అయితే అప్పుడు బ్యాంకులు ఇద్దరి పేరిట జాయింట్ హోమ్ లోన్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కనుక ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇక జాయింట్ హోమ్ లోన్ అంటే ఇద్దరే తీసుకోవాలని లేదు. ముగ్గురు కూడా కలసి తీసుకోవచ్చు. ప్రయోజనాలు ఎన్నో.. ఉమ్మడిగా రుణం తీసుకుంటే ఎక్కువ మొత్తమే లభిస్తుంది. మంచి ఖరీదైన ఇంటికి ప్లాన్ చేసుకునే దంపతులు ఇద్దరూ వేతన జీవులు లేదా సంపాదనాపరులు అయితే ఇక బ్యాంకులు పిలిచి మరీ రుణం ఇస్తాయి. ఇద్దరి ఆదాయాన్ని అర్హత కింద లెక్కలోకి తీసుకుంటాయి. కనుక అధిక మొత్తాన్ని రుణం రూపంలో అందుకోవచ్చు. దీంతో తమ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఒక్కరి పేరు మీద రుణంతో పోలిస్తే ఇద్దరి పేరిట రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ఒకరి నుంచి కాకపోయినా, మరొకరి నుంచి అయినా రికవరీ చేసుకోవచ్చన్న ధీమాయే కారణం. పైగా ఇలా జాయింట్ హోమ్‌లోన్‌లో ఎగవేతలు చాలా తక్కువ. ఒకరికి ఇబ్బందులు వచ్చినా మరొకరు చెల్లింపుల బాధ్యతను తీసుకోగలరు. అందుకే బ్యాంకులకు, రుణ గ్రహీతలకు ఇది అనుకూల ఆప్షన్ అవుతుంది. పెద్ద మొత్తం వస్తుండడంతో చెల్లించే విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడదు. పైగా ఇంటి సౌకర్యాల విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్నా ఆదాయపన్ను ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఎక్కువ మందికి జాయింట్ హోమ్ లోన్ విషయంలో ఎదురయ్యే సందేహం ఇదే. కనుక ఈ సందేహం అక్కర్లేదు. విడిగా ఎవరికి వారు ఆదాయపన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటే.. ముందుగానే ఈఎంఐలో ఎవరి వాటా ఎంతో తేల్చుకోవాలి. నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి నెలా ఈఎంఐను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా జాయింట్ హోమ్ లోన్ విషయంలో పన్ను పరంగా ఓ ప్రత్యేక వెసులుబాటు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, విడిగా ఒక్కరే గృహ రుణం తీసుకుంటే, అసలు, వడ్డీ భాగాలకు ఆదాయపన్ను ప్రయోజనం పూర్తిగా పొందలేని పరిస్థితి ఉండొచ్చు. అటువంటప్పుడు ఇరువురు కలసి తీసుకోవడం వల్ల మిగులు ప్రయోజనాన్ని వేరొకరు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఈఎంఐ వాటా మార్చుకుంటే సరిపోతుంది. ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ఇక అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద మినహాయించి చూపించుకోవచ్చు. ఈ పరిమితి ఎవరికి వారికే విడిగా అమలవుతుంది. చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మహిళా రుణ గ్రహీతలకు రుణ రేటులో కొంత తగ్గింపును ఇస్తున్నాయి. ఇందుకోసం ఇద్దరు దరఖాస్తుదారుల్లో ఒకరు మహిళ అయి ఉండాలి. ప్రధాన రుణ దరఖాస్తుదారుగా లేదా సహ రుణ దరఖాస్తుదారుగా ఉండొచ్చు. ప్రతికూలతలూ ఉన్నాయ్.. ► ఇద్దరు సహ రుణ గ్రహీతల్లో ఒకరికి ఆదాయం ఉన్నట్టుండి ఆగిపోతే, మరొకరు ఆ బాధ్యత తీసుకోవచ్చు. ఇది ఒక విధంగా అనుకూలం, మరో విధంగా ప్రతికూలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కరే తీసుకుని, ఆదాయం ఆగిపోతే డిఫాల్ట్ అవుతారు. ఈఎంఐ చెల్లించలేకపోతే రుణ చరిత్రపై నల్లటి మచ్చ పడుతుంది. ఉమ్మడిగా తీసుకుంటే ఈ ఇబ్బంది రాకుండా రెండో వారు చెల్లింపులతో ఆదుకుంటారు. దీనివల్ల ఒక్కరిపైనే మొత్తం ఈఎంఐ చెల్లింపుల భారం పడుతుందని మర్చిపోవద్దు. కాకపోతే ఇది మరీ పెద్ద ప్రతికూలత కాదనుకోండి. దురదృష్టవశాత్తూ ఇద్దరిలో ఒకరు శాశ్వతంగా సంపాదించలేని పరిస్థితులు ఎదురైతే తప్ప.. జాయింట్ హోమ్ లోన్‌లో తాత్కాలిక ఆదాయ నష్టాలను ఒక్కరే భారం మోయడం ద్వారా అధిగమించొచ్చు. కాకపోతే ఇందుకు ముందుగానే సిద్ధపడాలి. ► రుణ గ్రహీతల మధ్య విభేదాలు, స్పర్థలు తలెత్తితే సమస్య ఎదురుకావచ్చు. అప్పుడు ఇద్దరిలో ఒకరు ఈఎంఐ చెల్లించేందుకు నిరాకరించొచ్చు. దీనివల్ల క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. సిబిల్ స్కోర్ పడిపోతుంది. దీంతో భవిష్యత్తులో రుణం ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ముందుకు రాకపోవచ్చు. రుణ చరిత్ర దెబ్బతినకూడదని అనుకుంటే, కష్టమైనా కానీ రెండో వ్యక్తి ఈఎంఐ భారాన్ని మోయాల్సి రావచ్చు. ఇలాంటి కేసులు తక్కువే ఉంటాయి. కీడెంచి మేలెంచమన్నట్టు.. ముందే ఈ విధమైన సమస్యలకు సన్నద్ధులు కావాలి. వీలైతే జాయింట్ హోమ్ లోన్ తీసుకునే సమయంలోనే ఒక అగ్రిమెంట్ రాసుకోవడం మంచిది. ► దంపతులు కలసి గృహ రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైనా కారణంతో విడిపోవాల్సి వస్తే..? అప్పుడు మిగిలిన గృహ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాపర్టీపై ఎవరి హక్కులు ఏ మేరకు? ఇలాంటి అంశాల్లో పక్కా స్పష్టత అవసరం. ఇందుకోసం ముందే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం ఎందుౖMðనా మంచిది. మరొకరు ఈఎంఐ భారం మోసి, చివర్లో ఇద్దరూ పంచుకోవడమా? లేక అంతటితో ముగించడమా..? ఇలా చాలా అంశాల్లో స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది. ముందే ఆయా అంశాలకు వచ్చి, న్యాయపరమైన సలహా ప్రకారం నడుచుకోవడం మంచింది. ► ఇక సహ రుణ గ్రహీతల్లో ఒకరు ఏదైనా కారణంతో మరణించినట్టయితే అప్పుడు ఏం చేయాలో ముందే ఆలోచించుకోవాలి. మిగిలిన దరఖాస్తుదారులపై రుణ ఈఎంఐ భారం పడుతుంది. ఇలా జాయింట్ హోమ్ లోన్‌లో ఏ కారణం వల్ల ఈఎంఐ చెల్లించకపోతే తీవ్ర సమస్యే. రుణం ఇచ్చిన సంస్థ ఇంటిని జప్తు చేసి వేలానికి పెడుతుంది. ఇక దంపతులు కలసి గృహ రుణం తీసుకున్న తర్వాత, వారిలో ఒకరు మరణించినట్టయితే.. మిగిలిన జీవిత భాగస్వామి మొత్తం ప్రాపర్టీలో ఒకటో వంతు వాటాకే హక్కుదారులు అవుతారు. మరో రెండు భాగాల్లో మరణించిన జీవిత భాగస్వామి తల్లిదండ్రులకు ఒక భాగం, పిల్లలకు ఒక భాగం లభిస్తుంది. ఉమ్మడిగా రుణం తీసుకునే ముందు, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అధిగమించడంపై కార్యాచరణను ముందే సిద్ధం చేసుకోవాలి. -
గృహ రుణంలోనూ కలసికట్టుగా...
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనేకానీ నగరాల్లో జీవనశైలికి అనుగుణంగా బతుకుబండి నడిచే పరిస్థితులు లేవు. అలాంటిది... ఇల్లు సమకూర్చుకోవడం ఎంత పెద్ద ప్రహసనమో చెప్పనక్కర్లేదు!! అయితే, గృహ రుణం ఒక్కరి పేరుతో తీసుకునేకంటే దంపతులు కలసి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణుల మాట. అధిక మొత్తంలో రుణం సమకూరడమేకాదు, పన్ను ప్రయోజనాలు... తక్కువ నెలవారీ వాయిదా(ఈఎంఐ) వంటి లాభాలెన్నో జాయింట్ హోమ్‌లోన్‌తో పొందొచ్చు. కొత్తింటి ప్రణాళికల్లో ఉన్నవారికి ఉమ్మడి గృహ రుణంపై అవగాహన కల్పించే కథనమిది... శ్రీనివాస కుమార్ (40) సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన శ్రీమతి సుమలత (37) కూడా ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు 2013లో జాయింట్ హోమ్ లోన్ (ఉమ్మడిగా గృహ రుణం)ను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి తీసుకున్నారు. ఇలా కలసి తీసుకోవడానికి కారణం జాయింట్ లోన్‌పై వడ్డీ రేటు తక్కువగా ఆఫర్ చేయడమే. రూ.44 లక్షల రుణం తీసుకున్నారు. వడ్డీ రేటు నాడు 9.5 శాతంగా ఉంటే, శ్రీనివాస కుమార్ దంపతులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసింది. పైగా ఉమ్మడిగా దరఖాస్తు చేసుకోవడం వల్ల రుణ అర్హత అధికంగా ఉంటుంది. రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, అర్హత మెరుగ్గా ఉండడమే తాము జాయింట్లోన్ తీసుకోవడానికి కారణాలుగా శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. జాయింట్ లోన్ ద్వారా మంచి ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు వీలు పడుతుంది. బడ్జెట్ ఎక్కువైనా కానీ, ఇద్దరు పేరిట రుణం తీసుకుంటున్నారు కనుక అధిక అర్హతలతో బ్యాంకు కూడా ఎక్కువే ఆఫర్ చేస్తుంది. దంపతులు ఇద్దరూ ఉద్యోగులైనా లేదా ఆర్జనా పరులైతే, కలసి ఉమ్మడి రుణం తీసుకోవడం వల్ల ఎంతో లాభం ఉంటుందని ఆర్థిక నిపుణుల విశ్లేషణ. మీరు నవ దంపతులు అయి ఉండి, ఇద్దరూ ఆర్జనా పరులైతే కలసి గృహ రుణం తీసుకునే ఆలోచన తప్పకుండా చేయవచ్చు. ‘‘రియల్ ఎస్టేట్ కొనుగోలు అధిక వ్యయంతో కూడుకుని ఉంటుంది. దీంతో సొంతింటి కల అన్నది ఒక్కరే ఆర్జనా పరులున్న కుటుంబానికి అంత సులభం కాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో జీవిత భాగస్వామి సహ రుణ గ్రహీతగా చేరడం వల్ల ఇద్దరి ఆర్జనను కలపడం, ఇద్దరి క్రెడిట్ స్కోరుతో మరింత మొత్తం గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే సొంతం చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి పేర్కొన్నారు. కలసి తీసుకోవడం వల్ల ప్రయోజనాలను పరిశీలించినట్టయితే... భారీ మొత్తంలో రుణం ఇద్దరు కలసి ఉమ్మడిగా రుణానికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా అర్హత ఎక్కువగా ఉంటుంది. దీంతో భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి చూసి బ్యాంకు పెద్ద మొత్తంలో రుణాన్ని ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకు మీరు రూ.కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే.. అందుకు మీ వంతు డౌన్ పేమెంట్ 20 శాతం (రూ.20లక్షలు) పోను మరో రూ.80 లక్షలను 20 ఏళ్ల కాలానికి రుణంగా తీసుకోవాల్సి ఉంటుందని అనుకుంటే, అప్పుడు 8.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.70,000 అవుతుంది. సాధారణంగా రుణగ్రహీత ప్రతీ నెలా నికరంగా అందుకునే వేతనంలో గరిష్టంగా 50 శాతం వరకూ ఈఎంఐ కింద బ్యాంకులు అనుమతిస్తుంటాయి. దీని ప్రకారం రూ.80 లక్షల గృహ రుణం తీసుకోవాలంటే, ప్రతీ నెలా నికరంగా రూ.1.4 లక్షలను అందుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా ఆర్జిస్తున్నట్టు అయితే.. ఇద్దరూ కలసి ఈ మొత్తాన్ని చెల్లించే శక్తి కలిగి ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువే చెల్లించే సామర్థ్యం ఉంటే మరింత సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఇంటి కోసం ఇంకా అధిక రుణం తీసుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. వేగంగా చెల్లింపులు ఇద్దరు కలసి రుణం తీసుకుంటే, తిరిగి చెల్లించడం సులభం కావడమే కాకుండా, వేగంగా దాన్ని తీర్చేయవచ్చు. వార్షికంగా వచ్చే బోనస్‌లు, పనితీరు ఆధారంగా వచ్చే పారితోషికాన్ని ఇలా గృహ రుణం తీర్చేందుకు వినియోగించినా వాస్తవ కాల వ్యవధి కంటే ముందే గృహ రుణం ముగిసిపోతుంది. ఎందుకంటే చెల్లింపులపై ఎటువంటి నియంత్రణలు ఉండవు. దీనివల్ల వడ్డీ భారం కూడా తగ్గిపోతుంది. రిజిస్ట్రేషన్ వ్యయం తక్కువ కొన్ని బ్యాంకులు మహిళా రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే మహిళలకు ఇల్లు/ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తక్కువగా అమల్లో ఉంది. ‘‘ఉమ్మడి గృహ రుణంలో ప్రధాన దరఖాస్తు దారుగా భార్య ఉంటే వ్యయాలను తగ్గించుకోవచ్చు. గృహ రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, రిజిష్ట్రేషన్ చార్జీలో తగ్గింపు ప్రయోజనాలను అందుకోవచ్చు’’ అ ని మైమనీమంత్రా డాట్ కామ్ ఎండీ రాజ్ ఖోస్లా చెప్పారు. క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉమ్మడిగా రుణం తీసుకుంటే దంపతులిద్దరిపై సమానంగా చెల్లింపుల భాధ్య త ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఒకరు ఉద్యోగం కోల్పోతే ఆ మేరకు గృహ రుణ ఈఎంఐ చెల్లింపులో నెలసరి వాటా అందకపోవచ్చు. ఈ కారణంగా ఈఎంఐ చెల్లింపులో వైఫల్యం చెందితే అప్పుడు ఇద్దరి క్రెడిట్ స్కోరుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘‘తిరిగి చెల్లింపుల బాధ్యత దంపతులపై పూర్తిగా ఉంటుంది. ఒక్కరు చెల్లింపుల్లో వైఫల్యం చెందినా ఇద్దరి క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది’’ అని ఆదిల్‌శెట్టి తెలిపారు. పన్ను ప్రయోజనాలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవడం వల్ల అధిక పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. దంపతులు ఉమ్మడిగా రూ.7 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద చెరో రూ.1.5 లక్షల చొప్పున రూ.3లక్షలు, సెక్షన్ 24(బి) కింద రూ.4లక్షల వడ్డీపై (చెరో రూ.2లక్షలు) పన్ను ప్రయోజనం లభిస్తుంది. మధ్యాదాయ వర్గాల నుంచి కొంచెం అధిక ఆర్జనా పరులకు ఈ మేరకు పన్ను ఆదా రూపంలో గణనీయంగానే మిగులుతుంది. వీటిని అనుసరిస్తే మేలు.. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధిలో ఇంటి యజమాని మరణిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విల్లు రాసుకోవడం మంచిది. ఇక వైవాహిక జీవితం నూటికి నూరు పాళ్లు కలసి సాగుతుందని నేటి రోజుల్లో చెప్పడం కష్టమే. కనుక ఉమ్మడిగా గృహ రుణానికి వెళ్లే దంపతులు.. ఇంటిలో వాటా, తిరిగి రుణానికి చేయాల్సిన చెల్లింపులు, ఇతర అంశాలపై స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం ఇంకా మంచిది. దీనివల్ల భవిష్యత్తులో ఒకవేళ ఇద్దరూ విడిపోవాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక గృహ రుణం తీసుకునే సమయంలోనే రుణానికి సరిపడా కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం తప్పనిసరిగా చేయాల్సినది. రుణ గ్రహీతకు ఏదైనా జరిగితే, కుటుంబంపై రుణ చెల్లింపుల బాధ్యతలు పడకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గృహ రుణ గ్రహీతల్లో ఒకరు మరణించడం వల్ల మరొకరిపై చెల్లింపుల బాధ్యత పడకుండా ఈ టర్మ్‌ప్లాన్ ఆదుకుంటుంది. విడాకులు, మరణం... దంపతులు ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత జీవితంలో ఇకమీదట కలసి సాగకూడదని విడాకులకు వెళితే పరిస్థితి ఏమిటి..? గృహ రుణాన్ని తిరిగి చెల్లించడం తప్పనిసరి. కాకపోతే ఇందుకు మార్గాన్ని వారే అన్వేషించుకోవాలి. ‘‘బ్యాంకు తన బకాయిలను వసూలు చేసుకునేందుకు చర్యలు చేపడుతుంది. అవసరమైతే న్యాయపరమైన చర్యలనూ చేపట్టవచ్చు. అందుకని భవిష్యత్తులో విడిపోవాల్సి వస్తే గృహ రుణ చెల్లింపుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై దంపతులు ముందుగానే ఓ స్పష్టమైన అంగీకారానికి రావడం మంచిది’’ అని ఆదిల్‌శెట్టి సూచించారు. ఇక దురదృష్టవశాత్తూ ఉమ్మడి గృహ రుణం తీసుకున్న తర్వాత దంపతుల్లో ఒకరు మరణించినట్టయితే అప్పుడు చెల్లింపుల బాధ్యత పూర్తిగా రెండోవారిపై పడుతుంది. -
ఉమ్మడి రుణం.. ఉభయకుశలోపరి
సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు కలసి తీసుకునే గృహ రుణాలు కూడా ఉన్నాయి. మరొకరితో కలసి గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఉండొచ్చు. కారణం ఏదైనా జాయింట్ హోమ్‌లోన్ విషయంలో ఉండే సానుకూల ప్రతికూలతలు ఏంటన్నవి తెలుసుకుంటే గృహ రుణ గ్రహీతలకు సాయంగా ఉంటుంది. వాటిని తెలియజేసే కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం జాయింట్హోమ్ లోన్ అన్నది మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణం. సాధారణంగా జీవిత భాగస్వామి లేదా తోడబుట్టిన వ్యక్తితో కలసి జాయింట్ హోమ్‌లోన్ తీసుకోవచ్చు. విడిగా ఒక్కరే తీసుకునే రుణంతో పోలిస్తే, ఇతరులతో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణానికి ఎన్నో కారణాలు ఉంటాయి. విడిగా తీసుకునేందుకు అనుకూలమైన క్రెడిట్ స్కోరు లేకపోవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) దరఖాస్తుదారుల రుణ చరిత్ర (క్రెడిట్ స్కోరు)ను చూసిన తర్వాతే రుణంపై తేలుస్తాయి. వారి క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించి ఒకవేళ రుణం మంజూరు చేస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం వారికి ఉందా అని ఆరాతీస్తాయి. రుణ ఎగవేతల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నాయి. ఒకవేళ ఒకరి క్రెడిట్ రిపోర్ట్ మంచిగా ఉండి, గతంలో తీసుకున్న రుణాలకు చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే, సహజంగానే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఇటువంటి వారికి గృహ రుణం సులభంగానే లభిస్తుంది. అయితే, క్రెడిట్ స్కోరు తగినంత లేని వారి పరిస్థితి ఏంటి? వీరు ఆశ కోల్పోనవసరం లేదు. క్రెడిట్ స్కోరు మంచిగా ఉన్న మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడమే పరిష్కారం. మీరు ఎంచుకునే ఆ భాగస్వామి క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటే, అప్పుడు సులభంగానే రుణం లభిస్తుంది. ఇక తీసుకున్న రుణాన్ని తాము ఒక్కరమే తిరిగి చెల్లించడం కష్టమని భావించే వారు కూడా ఉమ్మడిగా రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే, భార్యాభర్తలు ఇరువురూ వేతన జీవులు అయి ఉంటే, పన్ను ప్రయోజనం ఇరువురికీ అవసరం కనుక జాయింట్ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపుతారు. సానుకూలతలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే సాధారణ హోమ్‌లోన్‌తో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లభించే అవకాశాలు ఎక్కువ. ఖరీదైన ప్రాపర్టీ అయితే పెద్ద మొత్తంలోనే గృహ రుణాన్ని పొందొచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం జాయింట్ హోమ్‌లోన్‌లో ఇద్దరూ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకు గాను ఒక్కొక్కరు విడిగా రూ.2లక్షలను మినహాయింపు చూపించుకోవచ్చు. అలాగే, రుణం అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలపై అదనంగా తమ ఆదాయం నుంచి పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. బలహీన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి కూడా జాయింట్ హోమ్‌లోన్‌లో సులభంగా రుణం లభిస్తుంది. ప్రతికూలతలు జాయింట్ లోన్ తీసుకునే వారు గుర్తించుకోవాల్సిన ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత వారిలో ఒకరు తమవాటా చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఇద్దరి క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఇక భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని, అది చెల్లించే కాలంలో విభేదాల కారణంగా వారు విడిపోతే న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రాపర్టీ అనేది ఒకరి పేరిట నమోదై ఉండి, ఇద్దరూ కలసి రుణం తీసుకుని పూర్తిగా చెల్లించారనుకోండి. అయినప్పటికీ ప్రాపర్టీ ఉన్న వారికే దానిపై చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. అపోహలకు చెక్ ► జాయింట్ హోమ్‌లోన్ విషయంలో ఎన్నో సందేహా లు ఉన్నాయి. రుణం తీసుకునే వారు ముందుగా వీటిపై స్పష్టత తెచ్చుకోవాలి. ప్రాథమిక రుణ దరఖాస్తుదారునితో సమానంగా సహ దరఖాస్తుదారునిపైనా గృహ రుణం చెల్లించాల్సిన బాధ్యత సమంగానే ఉంటుంది. అందుకే రుణ డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి ముందే నిబం ధనలపై పూర్తిగా స్పష్టత తెచ్చుకోవాలి. బ్యాంకుతో చేసుకునే ఒప్పందం గురించి సందేహాలు తీర్చుకోవాలి. ► ఉమ్మడిగా తీసుకునే రుణంలో ఒక్కరికే పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అంటే... ఇద్దరు గ్రహీతలకూ ప్రయోజనాలు సమానంగా వర్తిస్తాయి. కానీ, ఉమ్మడిగా తీసుకునే రుణాలపై పన్ను స్పష్టత కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24ను చూడాల్సి ఉంటుంది. ఆదాయపన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం... సహ రుణ గ్రహీత పన్ను ప్రయోజనాలు క్లెయి మ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత ఆస్తికి అతను లేదా ఆమె సైతం సహ యజమాని అయి ఉండాలి. ► ఒక్కరు విడిగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే మరొకరితో కలసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకుంటే రుణాన్ని సులభంగా పొందడం అన్నది నిజమే. అయితే, కచ్చితంగా రుణం వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఎందుకంటే గృహ రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అధిక రిస్క్‌తో కూడినవిగానే పరిగణిస్తాయి. కనుక సహ దరఖాస్తుదారునితో కలసి రుణం తీసుకునే ప్రయత్నం చేసే వారు... వారి క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండి, ఈఎంఐ చెల్లించేంత ఆదాయం కలిగి ఉంటేనే రుణాన్ని పొందగలరు. ఉమ్మడి గృహ రుణం విషయంలో ఈ అంశాలతోపాటు వడ్డీ రేటు సహా చూడాల్సినవి మరి కొన్ని కూడా ఉన్నాయి. ఒక్కసారి రుణం తీసుకుంటే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కనుక ముందే సమగ్రంగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలి. గృహ రుణానికి అర్హతలు ఇంటి రుణం దరఖాస్తును ఆమోదించడానికి ముందు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఏఏ అంశాలను చూస్తాయి? రుణం ఇస్తే ఎగవేతకు అవకాశం లేదని ఎలా తేలుస్తాయి? ఇవి తెలిస్తే దరఖాస్తుదారులు తమకు రుణం వస్తుందో లేదో తెలుసుకోవడం సులభం. ఇంటి రుణం విషయానికి వస్తే ప్రతీ దరఖాస్తుదారుని అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. వయసు దరఖాస్తుదారుని వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి రుణంలో గరిష్ట టర్మ్ 30 ఏళ్ల వరకే ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వారు అయితే దీర్ఘకాలానికి ఇంటి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే మధ్య వయసుకు వచ్చిన వారికి దీర్ఘకాలిక రుణానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసుతో పోలిస్తే, 40–45 ఏళ్ల వయసున్న వ్యక్తి పదవీ కాలం తక్కువగా ఉంటుంది కనుక. ఈ నేపథ్యంలో యుక్తవయసులో ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో రుణం, దీర్ఘకాలానికి లభించే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, ప్రాపర్టీ వయసు, సైజును కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలంటే గ్రహీత ఆదాయం దాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఎంత ఆదాయం వస్తోంది, స్థిరత్వం ఏ మేరకు తదితర అంశాలు రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాయి. క్రెడిట్ హిస్టరీ దరఖాస్తుదారుని రుణ చరిత్ర కూడా కీలకం అవుతుంది. గతంలో తీసుకున్న రుణాలు, వాటికి చెల్లింపులు ఏ విధంగా చేశారన్నది క్రెడిట్ రిపోర్ట్‌లో తెలుస్తుంది. మంచి స్కోరు ఉందంటే రుణ ఎగవేత అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి బ్యాంకులు సులభంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఇతర బాధ్యతలు అలాగే, దరఖాస్తుదారునిపై ఇప్పటికే ఉన్న ఆర్థిక, రుణ బాధ్యతలు కూడా పరిశీలనకు వస్తాయి. కారు రుణం, క్రెడిట్ కార్డు వంటివి తీసుకుంటే వాటిని కూడా ఇంటి రుణం దరఖాస్తు పరిశీలనలో భాగంగా బ్యాంకులు చూసి, చెల్లింపుల సామర్థ్యంపై అంచనాకు వస్తాయి. వ్యక్తిగత ప్రొఫైల్ వీటితోపాటు దరఖాస్తుదారుని వ్యక్తిగత ప్రొఫైల్ కూడా కీలకం అవుతుంది. విద్యార్హతలు, బ్యాక్‌గ్రౌండ్‌ను రుణదాతలు చెక్ చేసుకుంటారు. మంచి విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి. వీరికి రుణం ఇచ్చినా తిరిగి చెల్లించగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్యాంకులు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. హామీదారుగా ఉంటే ఇప్పటికే ఏదైనా రుణానికి హామీదారుగా ఉన్నారనుకుంటే... ఆ మేరకు దరఖాస్తుదారుని అర్హత నుంచి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహాయించి చూస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ బాధ్యత హామీగా ఉన్న వారిపైనే పడుతుంది. కనుక ఇది కూడా రుణ దరఖాస్తుదారుని అర్హతలను ప్రభావితం చేసే అంశంగా గుర్తు పెట్టుకోవాలి. అర్హత ఉంటే... అర్హత ఉందని నిర్ధారణకు వస్తే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తర్వాతి అంశాలపై దృష్టి పెడతాయి. వీటిల్లో ఆదాయంతో రుణ వాయిదా రేషియో ఒకటి. రుణ వాయిదా చెల్లింపుల కోసం వచ్చే ఆదాయంలో పక్కన పెట్టాల్సిన మొత్తం. ఆదాయంలో సగాన్ని సాధారణ ఖర్చుల కింద మినహాయించి మిగిలిన మొత్తంలో బాధ్యతలను చూస్తాయి. అంటే అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని వాటికి వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే ఆదాయంలో కచ్చితమైన బాధ్యతల కింద ఆ మొత్తాన్ని మినహాయిస్తాయి. లోన్ కాస్ట్ రేషియో కూడా ఒకటి. ప్రాపర్టీకి ఇచ్చే రుణంలో దరఖాస్తుదారుని వాటాను చూస్తాయి. అర్హతను పెంచుకునే మార్గాలు ► జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో సన్నిహిత వ్యక్తిని సహ దరఖాస్తుదారునిగా చేర్చుకుంటే రుణం లభించడం సులువు అవుతుంది. ► క్రమం తప్పకుండా ఆదాయం, పొదుపు, పెట్టుబడుల చరిత్ర ఉంటే రుణం లభించడం తేలిక. ► అదనపు ఆదాయ వనరుల గురించి కూడా దరఖాస్తుతోపాటు తెలియజేయడం అవసరం. అద్దె ఆదా యం, వ్యాపారం, వృత్తి పరంగా ఇతర ఆదాయ వనరుల గురించి తప్పక తెలియజేయడం లాభిస్తుంది. ► ఇక ఇంటి రుణం అవసరం అనుకునే వారు ముందు నుంచే తమ క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ముందుగా చెల్లించేయడం, బకాయిలు ఉంటే వెంటనే తీర్చేయడం చేయాలి. చాలా వరకు రుణమిచ్చే సంస్థలు క్రెడిట్స్కోరును తెలుసుకునే అవకాశాన్ని ఆన్లైన్లో ఉచితంగానే కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. -
పెళ్ళి చేసుకొని... ఇల్లు చూసు ‘కొని’...
ఇల్లు కట్టి చూడు... పెళ్ళి చేసి చూడు... అంటూ ఉంటారు. నవతరంలో నూతన దంపతులు తీసుకుంటున్న తొలి నిర్ణయాలు కొన్నింటిలో ఒకటి - సొంత ఇల్లు కొనుక్కోవడం. ఇలాంటి కీలకమైన సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ కలసి, ఉమ్మడిగా ఒక నిర్ణయానికి నిలబడితే, వాళ్ళ వివాహ బంధం మరింత పటిష్ఠమవుతుంది. ముఖ్యంగా, ఇల్లు కొనాలనుకున్నప్పుడు గృహ ఋణం తీసుకోవడం తప్పదు. ఆ సమయంలో భార్య కూడా తన వంతుగా సలహా సూచనవ్వడమే కాకుండా, ఇంటి ఋణానికి సంబంధించి భర్తతో పాటు తాను సహ దరఖాస్తుదారురాలిగా నిలిస్తే ఎంతో ఉపయోగం. ఇంటి కొనుగోలు అంటే, పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం కాబట్టి, మహిళలు ఈ విషయాలలో వీలైనంత ఎక్కువ ఆసక్తి చూపాలి. పైగా, తీసుకున్న ఋణం తాలూకు నెలసరి వాయిదా (ఈ.ఎం.ఐ)ని బట్టి ఇంటి బడ్జెట్‌ను తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది గనక మరీ జాగ్రత్తపడాలి. ఆర్థిక విషయాల్లో మగవారు కొంత దూకుడుగా ఉంటే, మహిళలు కొంత సాంప్రదాయికంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎక్కువగా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి, మగవాళ్ళు తక్కువ కాలవ్యవధిలోనే తీర్చేసే విధంగా గృహఋణం తీసుకుంటే, అది నెలవారీ ఇంటి బడ్జెట్ మీద ప్రభావం చూపుతుందని గుర్తించి, ఆ విషయంలో జాగ్రత్త పడాల్సింది మహిళలే. కొన్ని సందర్భాల్లో ఎక్కువ విలువైన ఇంటిని కొనాలంటే, ఆ మేరకు భర్త ఒక్కడికే ఋణం లభించకపోవచ్చు. కాబట్టి, భార్య కూడా ఆయనతో కలసి, జాయింట్ హోమ్ లోన్ తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం ఉన్న జీవిత భాగస్వామిని ఇలా కలుపుకొని, జాయింట్ హోమ్ లోన్ తీసుకోవచ్చు.ఇలా ఇద్దరూ కలసి గృహ ఋణం తీసుకున్నప్పుడు ఇద్దరూ ఇటు అసలు మీద, అటు ఋణానికి చెల్లించే వడ్డీ మీద కూడా పన్ను రాయితీ పొందవచ్చు. అయితే, ఇలా ఇద్దరూ కలసి ఋణం తీసుకున్నప్పుడు, దాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఇద్దరి మీదా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వారిలో ఏ ఒక్కరైనా లోన్ తాలూకు చెల్లింపులు జరపకపోతే, ఆ మొత్తం భారం రెండో వ్యక్తి మీదే పడుతుందని గ్రహించాలి. కాబట్టి, భార్యాభర్తలిద్దరూ కలసికట్టుగా ఋణం చెల్లింపును ప్లాన్ చేసుకోవాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మరీ ఈ విషయంలో ముందడుగు వేయాలి. ఇళ్ళ ధరలు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేవు. అందువల్ల గృహ ఋణం తీసుకుంటే, జీవితంలో దాదాపు పావువంతు వరకు ఆ ఋణం తీర్చడానికి డబ్బు వెచ్చించాల్సి వస్తుందని గుర్తించాలి. భార్యాభర్తలిద్దరూ కలసి కూర్చొని, మనసు విప్పి మాట్లాడుకొని ఏ నిర్ణయమైనా తీసుకుంటే, అప్పుడిక సొంత గృహమే కదా స్వర్గసీమ! - సుకన్యా కుమార్, ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు