పెళ్ళి చేసుకొని... ఇల్లు చూసు ‘కొని’...
ఇల్లు కట్టి చూడు... పెళ్ళి చేసి చూడు... అంటూ ఉంటారు. నవతరంలో నూతన దంపతులు తీసుకుంటున్న తొలి నిర్ణయాలు కొన్నింటిలో ఒకటి - సొంత ఇల్లు కొనుక్కోవడం. ఇలాంటి కీలకమైన సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ కలసి, ఉమ్మడిగా ఒక నిర్ణయానికి నిలబడితే, వాళ్ళ వివాహ బంధం మరింత పటిష్ఠమవుతుంది. ముఖ్యంగా, ఇల్లు కొనాలనుకున్నప్పుడు గృహ ఋణం తీసుకోవడం తప్పదు. ఆ సమయంలో భార్య కూడా తన వంతుగా సలహా సూచనవ్వడమే కాకుండా, ఇంటి ఋణానికి సంబంధించి భర్తతో పాటు తాను సహ దరఖాస్తుదారురాలిగా నిలిస్తే ఎంతో ఉపయోగం.
ఇంటి కొనుగోలు అంటే, పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం కాబట్టి, మహిళలు ఈ విషయాలలో వీలైనంత ఎక్కువ ఆసక్తి చూపాలి. పైగా, తీసుకున్న ఋణం తాలూకు నెలసరి వాయిదా (ఈ.ఎం.ఐ)ని బట్టి ఇంటి బడ్జెట్‌ను తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది గనక మరీ జాగ్రత్తపడాలి. ఆర్థిక విషయాల్లో మగవారు కొంత దూకుడుగా ఉంటే, మహిళలు కొంత సాంప్రదాయికంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎక్కువగా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి, మగవాళ్ళు తక్కువ కాలవ్యవధిలోనే తీర్చేసే విధంగా గృహఋణం తీసుకుంటే, అది నెలవారీ ఇంటి బడ్జెట్ మీద ప్రభావం చూపుతుందని గుర్తించి, ఆ విషయంలో జాగ్రత్త పడాల్సింది మహిళలే.
కొన్ని సందర్భాల్లో ఎక్కువ విలువైన ఇంటిని కొనాలంటే, ఆ మేరకు భర్త ఒక్కడికే ఋణం లభించకపోవచ్చు. కాబట్టి, భార్య కూడా ఆయనతో కలసి, జాయింట్ హోమ్ లోన్ తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం ఉన్న జీవిత భాగస్వామిని ఇలా కలుపుకొని, జాయింట్ హోమ్ లోన్ తీసుకోవచ్చు.ఇలా ఇద్దరూ కలసి గృహ ఋణం తీసుకున్నప్పుడు ఇద్దరూ ఇటు అసలు మీద, అటు ఋణానికి చెల్లించే వడ్డీ మీద కూడా పన్ను రాయితీ పొందవచ్చు. అయితే, ఇలా ఇద్దరూ కలసి ఋణం తీసుకున్నప్పుడు, దాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఇద్దరి మీదా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వారిలో ఏ ఒక్కరైనా లోన్ తాలూకు చెల్లింపులు జరపకపోతే, ఆ మొత్తం భారం రెండో వ్యక్తి మీదే పడుతుందని గ్రహించాలి. కాబట్టి, భార్యాభర్తలిద్దరూ కలసికట్టుగా ఋణం చెల్లింపును ప్లాన్ చేసుకోవాలి.
స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మరీ ఈ విషయంలో ముందడుగు వేయాలి. ఇళ్ళ ధరలు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేవు. అందువల్ల గృహ ఋణం తీసుకుంటే, జీవితంలో దాదాపు పావువంతు వరకు ఆ ఋణం తీర్చడానికి డబ్బు వెచ్చించాల్సి వస్తుందని గుర్తించాలి. భార్యాభర్తలిద్దరూ కలసి కూర్చొని, మనసు విప్పి మాట్లాడుకొని ఏ నిర్ణయమైనా తీసుకుంటే, అప్పుడిక సొంత గృహమే కదా స్వర్గసీమ!
- సుకన్యా కుమార్, ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు