శివాని మిశ్రి సాధు
ప్రేమికులైనా, దంపతులైనా కలిసున్న ఇద్దరు వ్యక్తులు విడిపోతే.. ఆ ‘విడి’బంధం తాలూకు ప్రభావం ఎవరి మీద ఉంటుంది? దుఃఖంలో నిండా కూరుకుపోతే ముందున్న జీవితం కనపడుతుందా? చీకటి నిండిన ఒంటరితనంలో తిరిగి వెలుగులు నింపుకోవడం సాధ్యమేనా? విడిపోయే బంధాలను తిరిగి కలపడానికి ప్రయత్నించవచ్చు. కానీ, విడిపోయాక ఆ శూన్యంలో కలిసిపోకూడదు. తిరిగి నిలబడటానికి ప్రయత్నించాలి. మాజీ జ్ఞాపకాలకు బై బై చెప్పి తాజా దారులకు ఆహ్వానం పలకాలి. అందుకు ఏం చేయాలో చెబుతున్నారు మ్యారేజ్ అండ్ రిలేషన్‌షిప్ కౌన్సెలర్ శివాని మిశ్రి సాధు.
Marriage Counselor Shivani Misri Sadhoo: శివాని మిశ్రి సాధు ఇరవై ఏళ్ల నుంచి సైకాలజిస్ట్‌గా సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా 17,000 జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి, దేశరాజధాని ఢిల్లీలో బెస్ట్ మ్యారేజ్ కౌన్సెలర్‌గా పేరొందారు. ప్రతి నెలా వందలాది యువతకు కౌన్సెలింగ్ ఇచ్చే శివాని ఢిల్లీ ఐబిఎస్ (ఇన్‌స్ట్యూట్ ఆఫ్ బ్రేయిన్ అండ్ స్పైన్), ఫోర్టిస్ హాస్పిటల్స్‌లో కౌన్సెలర్‌గా ఉన్నారు. సార్ధి కౌన్సెలింగ్ పేరుతో వ్యక్తిగతంగా సేవలను అందిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ అని చెప్పే శివాని మిశ్రి సాధు పెళ్లికి ముందైనా, పెళ్లి తర్వాతైనా రిలేషన్‌షిప్ బ్రేక్ అయితే, ఆ డిప్రెషన్‌తో బాధపడేవారు జీవితాలను అంతం చేసుకోకుండా, గతం నుంచి ఎలా బయటపడాలో సూచనలు చేస్తున్నారు.
‘‘ప్రేమ, పెళ్లి బంధంలో వచ్చే సమస్యల గురించి ప్రతి నెలా వందలాది మంది యువతీ యువకులతో సంభాషిస్తుంటాను. వారితో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయాలేంటంటే.. బంధం నుంచి విడిపోయిన తర్వాత ప్రపంచం శూన్యమైపోయినట్టుగా ఉంటుంది. తమని తాము ఒంటరిగా చేసుకోవడం, పుచ్చుకున్న కానుకలను ముందు పెట్టుకొని గంటలు గంటలు కూర్చోవడం, కెరీర్‌పై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం.. వంటివి చేస్తున్నారు. అదే అబ్బాయిలైతే వీటితోపాటు తాగుడుకు అలవాటు పడటం, సోషల్ మీడియాలో తమ మాజీ ప్రియురాలు లేదా మాజీ భార్యతో ఉన్న పాత ఫొటోలను అప్‌లోడ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు.
కృత్రిమ జీవితానికి స్వస్తి
కలిసున్న ఇద్దరు వ్యక్తులు విడిపోవాలనుకున్న బాధను అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అనుభవిస్తారు. ఆ బాధను వెలిబుచ్చడానికి మరొకరి ఓదార్పును కోరుకుంటారు. దీని కారణంగా వారు చాలాసార్లు పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం గమనించాను. మన నుంచి ఒకరు విడిపోతే అంతటితో జీవితం ముగియదు. జీవితాన్ని తరచి చూసుకుంటే మరో కొత్త కోణం తప్పక కనిపిస్తుంది. నచ్చని మనిషితో ఉంటూ భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ నాటకం ఆడాల్సిన అవసరం లేదు. కృత్రిమ జీవితాన్ని గడపాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ మంచి రేపటి కోసం ఈ రోజు మీ మాజీ జ్ఞాపకాలకు బై బై చెప్పండి. జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ఈ ఆరు అంశాలను అనుసరించండి.
1. మాజీ జ్ఞాపకాలలో ఓదార్పు వద్దు
గతంలో గడిపిన అందమైన లేదా భయంకరమైన సమయాలు ఎన్నో ఉంటాయి. మీరు ఆ క్షణాలను పదేపదే తలచుకుంటూ వాటిలోనే ఓదార్పు కోరుకుంటూ జీవించాలనుకుంటే అది వృథా ప్రయాస అవుతుంది. అక్కడితోనే ఆగిపోతే జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు.
2. తిరిగి వచ్చి మాట్లాడటానికి సాకులు వెతకద్దు
ప్రతి చిన్న, పెద్ద విషయాలను ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ‘మాజీ’తో పంచుకోవడం మీకు అలవాటు ఉండి ఉంటుంది. అందుకు పదేపదే కాల్/ మెసేజ్/ ఇ–మెయిల్ చేయడం, అతను/ఆమె ఇంటి చుట్టూ తిరగడం చేయవద్దు. ముందుగా మీ సంబంధం ముగిసి పోయిందనే వాస్తవంలోకి రండి. మీ జీవితం నుంచి మీ మాజీని పూర్తిగా తొలగించండి.
3. ఆ జ్ఞాపకాలను చెత్తబుట్టలో వేయండి
దిగిన ఫోటోలు, వీడియోలు, ఫోటో ఫ్రేమ్‌లు, ఇచ్చి పుచ్చుకున్న బహుమతులు లేదా మీ మాజీని మళ్లీ మళ్లీ గుర్తుచేసే ఏదైనా వస్తువును ముందు పెట్టుకొని బాధపడుతూ కూర్చోకుండా వాటిని చెత్తబుట్టలో వేసేయండి. మీ ఇంటిలో ఫర్నిచర్ క్రమాన్ని మార్చండి. మీకు నచ్చిన రంగురంగుల పువ్వులు, లైట్లతో అలంకరించండి. మీ అందమైన ఫొటోలను గోడపై ఉంచండి, తద్వారా మీరు ఉదయం కళ్ళు తెరిచినప్పుడు, ప్రతిదీ మీదే కనిపిస్తుంది. మంచం మధ్యలో పడుకుని మీరే చెప్పుకోండి.. ‘ఇప్పుడు అంతా నాదే’ అని.
4. మీ ప్రత్యేక లక్షణాలను రాయండి
ఒక డైరీ, పెన్ను తీసుకొని మీ 10 ప్రత్యేక లక్షణాలను రాయండి. ఈ జాబితా కొత్త విషయాలను ప్రయత్నించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు.. మీరు మంచి డ్యాన్సర్. గొప్ప పెయింటింగ్స్ చేస్తారు. నేను నా చేతులపై పచ్చబొట్లు ఇష్టపడతాను. ఇలాంటివి రాస్తున్నప్పుడు భవిష్యత్తు అందంగా కనిపిస్తూ ఉంటుంది.
5. ఆరు నెలల మేజిక్ పాట్
మీ ‘మాజీ’ని మరచిపోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ‘మీ మాజీ గురించి ఆలోచించడం మానేసి, చేయవలసిన పనుల జాబితా’ను రూపొందించండి. బరువు తగ్గడం, మారథాన్‌కు సిద్ధపడటం, కొత్త భాష నేర్చుకోవడం, ఇల్లు కొనడం లేదా కొత్త ఇంటికి వెళ్లడం, సెలవులో వెళ్లడం, రాఫ్టింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహసాలు చేయడం, మీరు ఆనందించే కొత్త వ్యక్తులను కలవడం వంటి వాటిని జాబితా చేయండి. వీటిలో ఎప్పుడూ ప్రయత్నించని వాటిని రాబోయే ఆరు నెలల్లో చేయండి. అప్పుడు మీ మాజీ మీ ఆలోచనలలో కూడా పలచ బడిపోతారు.
6. మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా భావించండి
‘విడిపోవడం’ అనే గాయం నుండి బయటపడటానికి మీకు మీరే ఒక పార్టీని ఇవ్వడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా భావించుకోవచ్చు. మీ భాగస్వామితో సంబంధంలో ఉండటం వలన మీరు దూరంగా పెట్టిన మీ స్నేహితులను ఈ పార్టీకి ఆహ్వానించండి. రెట్టింపులుగా ఆనందాన్ని వెతుక్కుంటూ కొత్త జీవితానికి ఆహ్వానం పలకండి.
Comments
Please login to add a commentAdd a comment