Wedding relationship
-
Shivani Misri Sadhoo: ‘విడిపోవడం’ అనే గాయం నుంచి బయటపడటానికి..
ప్రేమికులైనా, దంపతులైనా కలిసున్న ఇద్దరు వ్యక్తులు విడిపోతే.. ఆ ‘విడి’బంధం తాలూకు ప్రభావం ఎవరి మీద ఉంటుంది? దుఃఖంలో నిండా కూరుకుపోతే ముందున్న జీవితం కనపడుతుందా? చీకటి నిండిన ఒంటరితనంలో తిరిగి వెలుగులు నింపుకోవడం సాధ్యమేనా? విడిపోయే బంధాలను తిరిగి కలపడానికి ప్రయత్నించవచ్చు. కానీ, విడిపోయాక ఆ శూన్యంలో కలిసిపోకూడదు. తిరిగి నిలబడటానికి ప్రయత్నించాలి. మాజీ జ్ఞాపకాలకు బై బై చెప్పి తాజా దారులకు ఆహ్వానం పలకాలి. అందుకు ఏం చేయాలో చెబుతున్నారు మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సెలర్ శివాని మిశ్రి సాధు. Marriage Counselor Shivani Misri Sadhoo: శివాని మిశ్రి సాధు ఇరవై ఏళ్ల నుంచి సైకాలజిస్ట్‌గా సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా 17,000 జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి, దేశరాజధాని ఢిల్లీలో బెస్ట్ మ్యారేజ్ కౌన్సెలర్‌గా పేరొందారు. ప్రతి నెలా వందలాది యువతకు కౌన్సెలింగ్ ఇచ్చే శివాని ఢిల్లీ ఐబిఎస్ (ఇన్స్ట్యూట్ ఆఫ్ బ్రేయిన్ అండ్ స్పైన్), ఫోర్టిస్ హాస్పిటల్స్‌లో కౌన్సెలర్‌గా ఉన్నారు. సార్ధి కౌన్సెలింగ్ పేరుతో వ్యక్తిగతంగా సేవలను అందిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ అని చెప్పే శివాని మిశ్రి సాధు పెళ్లికి ముందైనా, పెళ్లి తర్వాతైనా రిలేషన్షిప్ బ్రేక్ అయితే, ఆ డిప్రెషన్‌తో బాధపడేవారు జీవితాలను అంతం చేసుకోకుండా, గతం నుంచి ఎలా బయటపడాలో సూచనలు చేస్తున్నారు. ‘‘ప్రేమ, పెళ్లి బంధంలో వచ్చే సమస్యల గురించి ప్రతి నెలా వందలాది మంది యువతీ యువకులతో సంభాషిస్తుంటాను. వారితో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయాలేంటంటే.. బంధం నుంచి విడిపోయిన తర్వాత ప్రపంచం శూన్యమైపోయినట్టుగా ఉంటుంది. తమని తాము ఒంటరిగా చేసుకోవడం, పుచ్చుకున్న కానుకలను ముందు పెట్టుకొని గంటలు గంటలు కూర్చోవడం, కెరీర్‌పై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం.. వంటివి చేస్తున్నారు. అదే అబ్బాయిలైతే వీటితోపాటు తాగుడుకు అలవాటు పడటం, సోషల్ మీడియాలో తమ మాజీ ప్రియురాలు లేదా మాజీ భార్యతో ఉన్న పాత ఫొటోలను అప్లోడ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. కృత్రిమ జీవితానికి స్వస్తి కలిసున్న ఇద్దరు వ్యక్తులు విడిపోవాలనుకున్న బాధను అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అనుభవిస్తారు. ఆ బాధను వెలిబుచ్చడానికి మరొకరి ఓదార్పును కోరుకుంటారు. దీని కారణంగా వారు చాలాసార్లు పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం గమనించాను. మన నుంచి ఒకరు విడిపోతే అంతటితో జీవితం ముగియదు. జీవితాన్ని తరచి చూసుకుంటే మరో కొత్త కోణం తప్పక కనిపిస్తుంది. నచ్చని మనిషితో ఉంటూ భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ నాటకం ఆడాల్సిన అవసరం లేదు. కృత్రిమ జీవితాన్ని గడపాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ మంచి రేపటి కోసం ఈ రోజు మీ మాజీ జ్ఞాపకాలకు బై బై చెప్పండి. జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ఈ ఆరు అంశాలను అనుసరించండి. 1. మాజీ జ్ఞాపకాలలో ఓదార్పు వద్దు గతంలో గడిపిన అందమైన లేదా భయంకరమైన సమయాలు ఎన్నో ఉంటాయి. మీరు ఆ క్షణాలను పదేపదే తలచుకుంటూ వాటిలోనే ఓదార్పు కోరుకుంటూ జీవించాలనుకుంటే అది వృథా ప్రయాస అవుతుంది. అక్కడితోనే ఆగిపోతే జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు. 2. తిరిగి వచ్చి మాట్లాడటానికి సాకులు వెతకద్దు ప్రతి చిన్న, పెద్ద విషయాలను ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ‘మాజీ’తో పంచుకోవడం మీకు అలవాటు ఉండి ఉంటుంది. అందుకు పదేపదే కాల్/ మెసేజ్/ ఇ–మెయిల్ చేయడం, అతను/ఆమె ఇంటి చుట్టూ తిరగడం చేయవద్దు. ముందుగా మీ సంబంధం ముగిసి పోయిందనే వాస్తవంలోకి రండి. మీ జీవితం నుంచి మీ మాజీని పూర్తిగా తొలగించండి. 3. ఆ జ్ఞాపకాలను చెత్తబుట్టలో వేయండి దిగిన ఫోటోలు, వీడియోలు, ఫోటో ఫ్రేమ్‌లు, ఇచ్చి పుచ్చుకున్న బహుమతులు లేదా మీ మాజీని మళ్లీ మళ్లీ గుర్తుచేసే ఏదైనా వస్తువును ముందు పెట్టుకొని బాధపడుతూ కూర్చోకుండా వాటిని చెత్తబుట్టలో వేసేయండి. మీ ఇంటిలో ఫర్నిచర్ క్రమాన్ని మార్చండి. మీకు నచ్చిన రంగురంగుల పువ్వులు, లైట్లతో అలంకరించండి. మీ అందమైన ఫొటోలను గోడపై ఉంచండి, తద్వారా మీరు ఉదయం కళ్ళు తెరిచినప్పుడు, ప్రతిదీ మీదే కనిపిస్తుంది. మంచం మధ్యలో పడుకుని మీరే చెప్పుకోండి.. ‘ఇప్పుడు అంతా నాదే’ అని. 4. మీ ప్రత్యేక లక్షణాలను రాయండి ఒక డైరీ, పెన్ను తీసుకొని మీ 10 ప్రత్యేక లక్షణాలను రాయండి. ఈ జాబితా కొత్త విషయాలను ప్రయత్నించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు.. మీరు మంచి డ్యాన్సర్. గొప్ప పెయింటింగ్స్ చేస్తారు. నేను నా చేతులపై పచ్చబొట్లు ఇష్టపడతాను. ఇలాంటివి రాస్తున్నప్పుడు భవిష్యత్తు అందంగా కనిపిస్తూ ఉంటుంది. 5. ఆరు నెలల మేజిక్ పాట్ మీ ‘మాజీ’ని మరచిపోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ‘మీ మాజీ గురించి ఆలోచించడం మానేసి, చేయవలసిన పనుల జాబితా’ను రూపొందించండి. బరువు తగ్గడం, మారథాన్‌కు సిద్ధపడటం, కొత్త భాష నేర్చుకోవడం, ఇల్లు కొనడం లేదా కొత్త ఇంటికి వెళ్లడం, సెలవులో వెళ్లడం, రాఫ్టింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహసాలు చేయడం, మీరు ఆనందించే కొత్త వ్యక్తులను కలవడం వంటి వాటిని జాబితా చేయండి. వీటిలో ఎప్పుడూ ప్రయత్నించని వాటిని రాబోయే ఆరు నెలల్లో చేయండి. అప్పుడు మీ మాజీ మీ ఆలోచనలలో కూడా పలచ బడిపోతారు. 6. మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా భావించండి ‘విడిపోవడం’ అనే గాయం నుండి బయటపడటానికి మీకు మీరే ఒక పార్టీని ఇవ్వడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా భావించుకోవచ్చు. మీ భాగస్వామితో సంబంధంలో ఉండటం వలన మీరు దూరంగా పెట్టిన మీ స్నేహితులను ఈ పార్టీకి ఆహ్వానించండి. రెట్టింపులుగా ఆనందాన్ని వెతుక్కుంటూ కొత్త జీవితానికి ఆహ్వానం పలకండి. -
ఏనాడు విడిపోని ముడి వేసెనే..!!
పెళ్లి సంబంధాలు వస్తే చాలు.. అమెరికా.. సింగపూరా.. చూసుకోకుండా.. మంచిదైతే చాలు కుదుర్చుకునే రోజులివి. ఇక పొరుగు రాష్ట్రమైతే ఎలాంటి అభ్యంతరం లేనేలేదు. ఓ గ్రామంలో మాత్రం ఊరు ఊరంతా కూడా అదే గ్రామానికి చెందిన వారిని మాత్రమే వివాహాలు చేసుకుంటున్నారు. అమ్మాయిలు.. అబ్బాయిలు గ్రామం దాటి బయటికి వెళ్లకుండా.. అదే గ్రామానికి చెందిన వారితోనే జీవితం పంచుకుంటున్నారు. పూర్వీకుల నుంచి ఇదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్న ఆ గ్రామం జామి మండలం లొట్లపల్లి. విజయనగరం జిల్లా జామి మండలం లొట్లపల్లి గ్రామంలో సుమారు వెయ్యిమంది జనాభా ఉంది. గ్రామస్తులంతా ఆ గ్రామస్తులనే వివాహం చేసుకోవడం ఆనవాయితీ. తాతల కాలం నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇతర గ్రామాలు, ప్రాంతాల సంబంధాలు చేసుకోవడానికి ఇష్టపడరు. ఆడపిల్లకు, మగ పిల్లలకు వివాహ వయసు వచ్చేసరికి కుటుంబ పెద్దలు, గ్రామ పెద్దలు కూర్చొని ఇద్దరినీ ఒప్పించి పెళ్లిళ్లు జరిపిస్తారు. వివాహలు చేసుకున్న వారు కూడా పెద్దల మాటల జవదాటరు. మేనత్త కూతుళ్లు, అక్క కూతుళ్లను ఎక్కువ శాతం వివాహాలు చేసుకుంటారు. అక్క కూతుళ్లు, మేనత్త కూతుళ్లు లేకపోతే ఇతర కుటుంబాల్లో వరసకు అయ్యే వారిని చేసుకుంటారు. బయటి సంబంధాలు మాత్రం చూసుకోరు. అక్క కూతుళ్లు, మేనత్త కూతుళ్లు లేదా గ్రామంలో వివాహాలు చేసుకోవడానికి ఎవరూ లేకపోతే.. తప్పనిసరి పరిస్థితిలో బయటి సంబంధాలు చేసుకుంటారు. లొట్లపల్లి గ్రామం కష్టసుఖాల్లో తోడుగా ఉంటారని.. గ్రామస్తుల్ని, అక్క లేదా మేనత్త కూతుళ్లని వివాహం చేసుకుంటే కుటుంబాలు బలపడతాయని, వ్యవసాయం లేదా ఇతరత్రా పనులు చేసుకోవడానికి వీలుంటుందని వారి నమ్మకం. గ్రామంలో అయితే ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆస్తులు కూడా బయటి వారికి పోకుండా అవే కుటుంబాల మధ్య ఉంటాయని.. పిల్లలు బయట కాకుండా కళ్ల ముందుంటారని.. రాజకీయంగా కూడా కుటుంబాలు కలిసి వస్తాయని వారి ఉద్దేశం. గ్రామంలో దగ్గర సంబంధాలు చేసుకున్న వారికి పుట్టిన పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండటం విశేషం. మేనమామ కూతుర్ని పెళ్లాడా మాగ్రామంలోనే ఉన్న మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నాను. నాకు ఇద్దరు పాపలు ఉన్నారు. ఇద్దరూ చదువుకుంటున్నారు. మా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలను కూడా గ్రామంలో దగ్గర వారికి ఇమ్మని ఇప్పటి నుంచే అడుగుతున్నారు. – శిడగ శ్రీను, మాజీ ఉప సర్పంచ్, లొట్లపల్లి గ్రామం అత్త కూతురితో వివాహం మా అత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. మాకు ఇద్దరు సంతానం. ఇద్దరు ఆరోగ్యంతో ఉన్నారు. వారిద్దరినీ చదివిస్తున్నాను. కష్ట సుఖాల్లో మా అత్తవారు అండగా ఉంటారు. – పిల్లల ఎర్నాయుడు, లొట్లపల్లి గ్రామం ఇక్కడే పెళ్లి నా కొడుకు, కూతురికి కూడా గ్రామస్తులతోనే పెళ్లిళ్లు చేశారు. మా మేనత్త కూతురినే చేసుకున్నాను. గ్రామంలో వారిని చేసుకుంటే మా కుటుంబాలు అన్ని కలిసి మెలిసి ఉంటాయి. – బమ్మిడి గురువులు, లొట్లపల్లి బలమైన కుటుంబాలు గ్రామంలోని వారినే చేసుకుంటే కుటుంబాలు బలంగా ఉంటాయి. కష్ట సుఖాల్లో ఒకరి కొకరం తోడుగా ఉంటాం. నేను కూడా మా గ్రామానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నాను. – జన్నేల గంగునాయుడు, లొట్లపల్లి పూర్వం నుండి అదే పద్ధతి తప్పనిసరి పరిస్థితిలో తప్ప బయట సంబంధాలు చేసుకోం. నేను కూడా మేనమామ కూతుర్ని చేసుకున్నాను. ఆస్తుల విషయంలో లేదా వ్యవసాయ పనులకు గ్రామంలో అయితే ఒకరి కొకరు సహాయం చేసుకుంటాం. – జన్నేల ముత్యాలు, లొట్లపల్లి గ్రామం. -
పోలీసుల అదుపులో పెళ్లిళ్ల పేరయ్య !
పలాస: పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తి అనేక ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే... వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామానికి చెందిన సంగారు గణేష్(25) పెళ్లిళ్ల పేరుతో బాధితుల నుంచి వేలాది రూపాయలు దోచుకుంటున్నాడు. తాను మిలటరీ మెడికల్ విభాగంలో హవల్ధార్నని, పెళ్లి సంబంధాలు చూస్తానని నమ్మబలుకుతూ వారి నుంచి వేలాది రూపాయలు తీసుకొని ఉడాయిస్తుంటాడు. ఇదే విధంగా హైదరాబాదు, బహాడపల్లి, పెనుకొండ, పి.ఎం.పురం ప్రాంతాల్లో పెళ్లి సంబంధాలు కుదుర్చుతానని హామీ ఇచ్చి సొమ్ముకాజేశాడు. గణేష్‌ను అనుమానించిన కొంతమంది స్థానికులు పెళ్లి సంబంధం ఉందని రమ్మని కోరగా ఆయన శనివారం మధ్యాహ్నం సూదికొండ కాలనీ సమీపంలో ఉంటున్న పోతనపల్లి గిరిధర్ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆయన వంచనకు గురైన బాధిత యువకులు గణేష్‌ను అదుపులోకి తీసుకొని కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై గణేష్ మాట్లాడుతూ పెళ్లిళ్ల పేరుతో ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తాను కాశీబుగ్గ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నానని, విలాసాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. బాధితులు దేవేంద్రతో పాటు మరికొంతమంది లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ వద్ద ప్రస్తావించగా పెనుకొండ ప్రాంతంలో ఉంటున్న ఒక అమ్మాయి నుంచి రూ. 30 వేలు గణేష్ తీసుకున్నాడని చెబుతున్నాడని, ఆదివారం బాధితురాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. -
పెళ్ళి చేసుకొని... ఇల్లు చూసు ‘కొని’...
ఇల్లు కట్టి చూడు... పెళ్ళి చేసి చూడు... అంటూ ఉంటారు. నవతరంలో నూతన దంపతులు తీసుకుంటున్న తొలి నిర్ణయాలు కొన్నింటిలో ఒకటి - సొంత ఇల్లు కొనుక్కోవడం. ఇలాంటి కీలకమైన సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ కలసి, ఉమ్మడిగా ఒక నిర్ణయానికి నిలబడితే, వాళ్ళ వివాహ బంధం మరింత పటిష్ఠమవుతుంది. ముఖ్యంగా, ఇల్లు కొనాలనుకున్నప్పుడు గృహ ఋణం తీసుకోవడం తప్పదు. ఆ సమయంలో భార్య కూడా తన వంతుగా సలహా సూచనవ్వడమే కాకుండా, ఇంటి ఋణానికి సంబంధించి భర్తతో పాటు తాను సహ దరఖాస్తుదారురాలిగా నిలిస్తే ఎంతో ఉపయోగం. ఇంటి కొనుగోలు అంటే, పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం కాబట్టి, మహిళలు ఈ విషయాలలో వీలైనంత ఎక్కువ ఆసక్తి చూపాలి. పైగా, తీసుకున్న ఋణం తాలూకు నెలసరి వాయిదా (ఈ.ఎం.ఐ)ని బట్టి ఇంటి బడ్జెట్‌ను తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది గనక మరీ జాగ్రత్తపడాలి. ఆర్థిక విషయాల్లో మగవారు కొంత దూకుడుగా ఉంటే, మహిళలు కొంత సాంప్రదాయికంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎక్కువగా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి, మగవాళ్ళు తక్కువ కాలవ్యవధిలోనే తీర్చేసే విధంగా గృహఋణం తీసుకుంటే, అది నెలవారీ ఇంటి బడ్జెట్ మీద ప్రభావం చూపుతుందని గుర్తించి, ఆ విషయంలో జాగ్రత్త పడాల్సింది మహిళలే. కొన్ని సందర్భాల్లో ఎక్కువ విలువైన ఇంటిని కొనాలంటే, ఆ మేరకు భర్త ఒక్కడికే ఋణం లభించకపోవచ్చు. కాబట్టి, భార్య కూడా ఆయనతో కలసి, జాయింట్ హోమ్ లోన్ తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం ఉన్న జీవిత భాగస్వామిని ఇలా కలుపుకొని, జాయింట్ హోమ్ లోన్ తీసుకోవచ్చు.ఇలా ఇద్దరూ కలసి గృహ ఋణం తీసుకున్నప్పుడు ఇద్దరూ ఇటు అసలు మీద, అటు ఋణానికి చెల్లించే వడ్డీ మీద కూడా పన్ను రాయితీ పొందవచ్చు. అయితే, ఇలా ఇద్దరూ కలసి ఋణం తీసుకున్నప్పుడు, దాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఇద్దరి మీదా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వారిలో ఏ ఒక్కరైనా లోన్ తాలూకు చెల్లింపులు జరపకపోతే, ఆ మొత్తం భారం రెండో వ్యక్తి మీదే పడుతుందని గ్రహించాలి. కాబట్టి, భార్యాభర్తలిద్దరూ కలసికట్టుగా ఋణం చెల్లింపును ప్లాన్ చేసుకోవాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మరీ ఈ విషయంలో ముందడుగు వేయాలి. ఇళ్ళ ధరలు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేవు. అందువల్ల గృహ ఋణం తీసుకుంటే, జీవితంలో దాదాపు పావువంతు వరకు ఆ ఋణం తీర్చడానికి డబ్బు వెచ్చించాల్సి వస్తుందని గుర్తించాలి. భార్యాభర్తలిద్దరూ కలసి కూర్చొని, మనసు విప్పి మాట్లాడుకొని ఏ నిర్ణయమైనా తీసుకుంటే, అప్పుడిక సొంత గృహమే కదా స్వర్గసీమ! - సుకన్యా కుమార్, ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు