పలాస: పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తి అనేక ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే... వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామానికి చెందిన సంగారు గణేష్(25) పెళ్లిళ్ల పేరుతో బాధితుల నుంచి వేలాది రూపాయలు దోచుకుంటున్నాడు. తాను మిలటరీ మెడికల్ విభాగంలో హవల్ధార్‌నని, పెళ్లి సంబంధాలు చూస్తానని నమ్మబలుకుతూ వారి నుంచి వేలాది రూపాయలు తీసుకొని ఉడాయిస్తుంటాడు.
ఇదే విధంగా హైదరాబాదు, బహాడపల్లి, పెనుకొండ, పి.ఎం.పురం ప్రాంతాల్లో పెళ్లి సంబంధాలు కుదుర్చుతానని హామీ ఇచ్చి సొమ్ముకాజేశాడు. గణేష్‌ను అనుమానించిన కొంతమంది స్థానికులు పెళ్లి సంబంధం ఉందని రమ్మని కోరగా ఆయన శనివారం మధ్యాహ్నం సూదికొండ కాలనీ సమీపంలో ఉంటున్న పోతనపల్లి గిరిధర్ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆయన వంచనకు గురైన బాధిత యువకులు గణేష్‌ను అదుపులోకి తీసుకొని కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు.
ఈ విషయంపై గణేష్ మాట్లాడుతూ పెళ్లిళ్ల పేరుతో ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తాను కాశీబుగ్గ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నానని, విలాసాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. బాధితులు దేవేంద్రతో పాటు మరికొంతమంది లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ వద్ద ప్రస్తావించగా పెనుకొండ ప్రాంతంలో ఉంటున్న ఒక అమ్మాయి నుంచి రూ. 30 వేలు గణేష్ తీసుకున్నాడని చెబుతున్నాడని, ఆదివారం బాధితురాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీసుల అదుపులో పెళ్లిళ్ల పేరయ్య !
Published Sun, Jun 7 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement
Advertisement