ప్రతీకాత్మక చిత్రం
పెళ్లి సంబంధాలు వస్తే చాలు.. అమెరికా.. సింగపూరా.. చూసుకోకుండా.. మంచిదైతే చాలు కుదుర్చుకునే రోజులివి. ఇక పొరుగు రాష్ట్రమైతే ఎలాంటి అభ్యంతరం లేనేలేదు. ఓ గ్రామంలో మాత్రం ఊరు ఊరంతా కూడా అదే గ్రామానికి చెందిన వారిని మాత్రమే వివాహాలు చేసుకుంటున్నారు. అమ్మాయిలు.. అబ్బాయిలు గ్రామం దాటి బయటికి వెళ్లకుండా.. అదే గ్రామానికి చెందిన వారితోనే జీవితం పంచుకుంటున్నారు. పూర్వీకుల నుంచి ఇదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్న ఆ గ్రామం జామి మండలం లొట్లపల్లి.
విజయనగరం జిల్లా జామి మండలం లొట్లపల్లి గ్రామంలో సుమారు వెయ్యిమంది జనాభా ఉంది. గ్రామస్తులంతా ఆ గ్రామస్తులనే వివాహం చేసుకోవడం ఆనవాయితీ. తాతల కాలం నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇతర గ్రామాలు, ప్రాంతాల సంబంధాలు చేసుకోవడానికి ఇష్టపడరు. ఆడపిల్లకు, మగ పిల్లలకు వివాహ వయసు వచ్చేసరికి కుటుంబ పెద్దలు, గ్రామ పెద్దలు కూర్చొని ఇద్దరినీ ఒప్పించి పెళ్లిళ్లు జరిపిస్తారు. వివాహలు చేసుకున్న వారు కూడా పెద్దల మాటల జవదాటరు. మేనత్త కూతుళ్లు, అక్క కూతుళ్లను ఎక్కువ శాతం వివాహాలు చేసుకుంటారు. అక్క కూతుళ్లు, మేనత్త కూతుళ్లు లేకపోతే ఇతర కుటుంబాల్లో వరసకు అయ్యే వారిని చేసుకుంటారు. బయటి సంబంధాలు మాత్రం చూసుకోరు. అక్క కూతుళ్లు, మేనత్త కూతుళ్లు లేదా గ్రామంలో వివాహాలు చేసుకోవడానికి ఎవరూ లేకపోతే.. తప్పనిసరి పరిస్థితిలో బయటి సంబంధాలు చేసుకుంటారు.
లొట్లపల్లి గ్రామం
కష్టసుఖాల్లో తోడుగా ఉంటారని..
గ్రామస్తుల్ని, అక్క లేదా మేనత్త కూతుళ్లని వివాహం చేసుకుంటే కుటుంబాలు బలపడతాయని, వ్యవసాయం లేదా ఇతరత్రా పనులు చేసుకోవడానికి వీలుంటుందని వారి నమ్మకం. గ్రామంలో అయితే ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆస్తులు కూడా బయటి వారికి పోకుండా అవే కుటుంబాల మధ్య ఉంటాయని.. పిల్లలు బయట కాకుండా కళ్ల ముందుంటారని.. రాజకీయంగా కూడా కుటుంబాలు కలిసి వస్తాయని వారి ఉద్దేశం. గ్రామంలో దగ్గర సంబంధాలు చేసుకున్న వారికి పుట్టిన పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండటం విశేషం.
మేనమామ కూతుర్ని పెళ్లాడా
మాగ్రామంలోనే ఉన్న మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నాను. నాకు ఇద్దరు పాపలు ఉన్నారు. ఇద్దరూ చదువుకుంటున్నారు. మా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలను కూడా గ్రామంలో దగ్గర వారికి ఇమ్మని ఇప్పటి నుంచే అడుగుతున్నారు.
– శిడగ శ్రీను, మాజీ ఉప సర్పంచ్, లొట్లపల్లి గ్రామం
అత్త కూతురితో వివాహం
మా అత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. మాకు ఇద్దరు సంతానం. ఇద్దరు ఆరోగ్యంతో ఉన్నారు. వారిద్దరినీ చదివిస్తున్నాను. కష్ట సుఖాల్లో మా అత్తవారు అండగా ఉంటారు.
– పిల్లల ఎర్నాయుడు, లొట్లపల్లి గ్రామం
ఇక్కడే పెళ్లి
నా కొడుకు, కూతురికి కూడా గ్రామస్తులతోనే పెళ్లిళ్లు చేశారు. మా మేనత్త కూతురినే చేసుకున్నాను. గ్రామంలో వారిని చేసుకుంటే మా కుటుంబాలు అన్ని కలిసి మెలిసి ఉంటాయి.
– బమ్మిడి గురువులు, లొట్లపల్లి
బలమైన కుటుంబాలు
గ్రామంలోని వారినే చేసుకుంటే కుటుంబాలు బలంగా ఉంటాయి. కష్ట సుఖాల్లో ఒకరి కొకరం తోడుగా ఉంటాం. నేను కూడా మా గ్రామానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నాను.
– జన్నేల గంగునాయుడు, లొట్లపల్లి
పూర్వం నుండి అదే పద్ధతి
తప్పనిసరి పరిస్థితిలో తప్ప బయట సంబంధాలు చేసుకోం. నేను కూడా మేనమామ కూతుర్ని చేసుకున్నాను. ఆస్తుల విషయంలో లేదా వ్యవసాయ పనులకు గ్రామంలో అయితే ఒకరి కొకరు సహాయం చేసుకుంటాం.
– జన్నేల ముత్యాలు, లొట్లపల్లి గ్రామం.
Comments
Please login to add a commentAdd a comment