హైదరాబాద్‌లో ఆ గృహాలకు మహా గిరాకీ | Sales Of Luxury Flats Jump 2.5 Times Across 7 Cities In March Quarter | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆ గృహాలకు మహా గిరాకీ

Published Tue, May 9 2023 6:23 AM | Last Updated on Tue, May 9 2023 7:00 AM

Sales Of Luxury Flats Jump 2.5 Times Across 7 Cities In March Quarter - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మార్కెట్లో విలాస గృహాలకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) 430 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల్లో విక్రయాలు 50 యూనిట్లతో పోలిస్తే ఎనిమిది రెట్లకు పైగా పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ ఈ వివరాలను విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లోనూ విలాస నివాసాలు జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. మొత్తం 4,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 1,600 యూనిట్లతో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా నమోదయ్యాయి. అన్ని రకాల ఇళ్లు కలసి ఈ ఏడు పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో 78,700 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 70,500 యూనిట్లుగా ఉన్నాయి.

పట్టణాల వారీగా..  
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 600 యూనిట్లు ఉంటే, అవి తాజాగా ముగిసిన త్రైమాసికంలో 1,900 యూనిట్లు అమ్ముడయ్యాయి.  
► ముంబైలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు 800 యూనిట్ల నుంచి 1,150 యూనిట్లకు పెరిగాయి.  
► పుణెలో 10 రెట్లు అధికంగా 150 యూనిట్లు అమ్ముడుపోగా, బెంగళూరులో కేవలం 50 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.  
► కోల్‌కతాలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 50 యూనిట్ల నుంచి 100కు పెరిగాయి.  
► చెన్నై మార్కెట్లో విలాస నివాసాల అమ్మకాలు 250 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 50 యూనిట్లుగానే ఉన్నాయి.


బలంగా సొంతిల్లు ఆకాంక్ష  
2022లో ఖరీదైన ఇళ్ల విభాగం బలమైన పనితీరు చూపించగా, ఆ తర్వాత కూడా అదే విధమైన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కొనసాగినట్టు సీబీఆర్‌ఈ తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత విలాస గృహాలకు డిమాండ్‌ ఎగిసింది. సొంతిల్లు కావాలని, విశాలమైన ఇళ్లు కావాలని కోరుకునే వారు పెరిగారు’’అని సీబీఆర్‌ఈ నివేదిక పేర్కొంది. సొంతిల్లు కావాలనే ఆకాంక్ష ఈ ఏడాది కూడా విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుందని సీబీఆర్‌ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్‌ మ్యాగజైన్‌ తెలిపారు. వినియోగ ప్రాధాన్యతలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు, ఆరోగ్యం, భద్రత, చుట్టూ పరిశుభ్రమైన పరిసరాలతో కూడిన ప్రాజెక్టులకు డిమాండ్‌ ఉంటుందన్నారు. లగ్జరీ ప్రాపర్టీలకు కన్సల్టెన్సీ సేవలు అందించే సోథెబీ ఎండీ అమిత్‌ గోయల్‌ స్పందిస్తూ.. సాధారణంగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో 5–7 ఏళ్ల పాటు బేర్, బుల్‌ సైకిల్‌ ఉంటుందని చెబుతూ.. ప్రస్తుతం కచ్చితంగా బుల్‌ సైకిల్‌ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement