అద్దె ఇల్లా.. సొంతిల్లా..? | Rent vs buy house on profits and losses | Sakshi
Sakshi News home page

అద్దె ఇల్లా.. సొంతిల్లా..?

Published Mon, Aug 31 2020 5:17 AM | Last Updated on Mon, Aug 31 2020 5:22 AM

Rent vs buy house on profits and losses - Sakshi

సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం నేటి రోజుల్లో సులభ సాధ్యంగానే మారింది. వేతన జీవులు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అవకాశం కల్పిస్తున్నాయి. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంది. అయితే, కొందరు రుణం అంటే భయంతో వెనుకంజ వేస్తుంటారు. దీనికి బదులు అద్దె ఇంట్లోనే ఉందామనుకుంటుంటారు. కొందరు అయితే అద్దె ఇంటికి చెల్లించేదేదో రుణ ఈఎంఐగా చెల్లిస్తే కొన్నాళ్లకు ఓ ఇల్లు మనదైపోతుందన్న అంచనాతో ధైర్యం చేసి ముందడుగు వేస్తుంటారు. ఇంకొందరు అయితే ఏది లాభం? అనే సంశయంతో ఉండొచ్చు. కానీ, ఈ విషయంలో నిపుణుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్యాపిటల్‌ కోషెంట్‌ సీఈవో సౌస్తవ్‌ చక్రవర్తి అభిప్రాయ కోణం ఇలా ఉంది.. 


ఓ 20 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉంటూ, సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో నిధిని సమకూర్చుకుని ఇంటిని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా రుణంపై ప్రాపర్టీని కొనుగోలు చేసి 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. మన దేశంలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. వారి ముఖ్యమైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఇల్లు సమకూర్చుకుని అందులో నివసించే విషయంలో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అద్దె ఇంట్లో ఉండడం ప్రతికూల ఆప్షన్‌ ఏమీ కాదు. అయితే, ఈ రెండు ఆప్షన్లలో ఉండే ప్రయోజనాలు, ప్రతికూలతలను చూద్దాం. 

ఇంటిని కొనుగోలు చేయడం.. 
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ధోరణులను పరిశీలిస్తే.. ప్రాపర్టీ ధరలు ఏటా 8 శాతం చొప్పున వచ్చే 20 ఏళ్ల పాటు పెరుగుతాయని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు 20 ఏళ్ల కాలానికి గృహ రుణాలపై 8.5 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఇంటి ఖరీదు రూ.90 లక్షలని అనుకుంటే.. 20 ఏళ్ల తర్వాత ఇదే ప్రాపర్టీ 8 శాతం ఏటా పెరుగుదల అంచనాల ఆధారంగా రూ.4.19 కోట్లు అవుతుంది. అదే ఇప్పుడు రుణం తీసుకుని 20 ఏళ్ల పాటు ప్రతీ నెలా రూ.78,104 చొప్పున చెల్లిస్తూ వెళితే కట్టే మొత్తం రూ.1.87 కోట్లు మాత్రమే. 

లాభ, నష్టాలు అద్దె ఇంటితో పోలిస్తే సొంత ఇంట్లో ఉండే అనుభవం వేరు. దీన్ని కాదనడం లేదు. కానీ, ఆర్థిక కోణంలో నుంచి చూసేట్టు అయితే ఎన్నో అంశాలపై దృష్టి సారించాలి. రుణం తీసుకుని అద్దె చెల్లించడం వల్ల అతిపెద్ద అనుకూలత.. రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపన్ను మినహాయింపులు ఉండడం. ప్రతికూలత.. వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే విక్రయించడంలో ఉండే ఇబ్బంది. ఒకరు ఒకే ప్రాంతంలో శాశ్వతంగా ఉండిపోతారన్న నమ్మకం తక్కువే. ఇంటి కోసం ఒకే ప్రాంతంలో ఉండి కెరీర్‌లో ఉన్నత అవకాశాలను నష్టపోలేరు కదా. 

అద్దె ఇంట్లో ఉండడం...
అద్దె ఇంట్లో ఉండే వారు, వేతనంలో మిగిలే మొత్తాన్ని ప్రతీ నెలా లేదా మూడు నెలలకోసారి క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్‌) రూపంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్‌ ఎంచుకున్న కాలానికి అనుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి మొత్తం బ్యాంకు నుంచి సంబంధిత మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వెళుతుంది. ఎన్‌ఏవీ ధర ఆధారంగా ఫండ్స్‌ యూనిట్ల కేటాయింపులు చేస్తారు. ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేస్తుండడం వల్ల మార్కెట్లు పెరుగుదల, పతనాల్లోనూ కొనుగోలుతో సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. ఇప్పుడు పై ఉదాహరణలో ఇంటి రుణంపై ఈఎంఐగా రూ.78,104 చెల్లించాలని చెప్పుకున్నాం కదా.. ఇందులో అద్దె ఇంటికి ప్రతినెలా చెల్లించాల్సిన రూ.25,000ను మినహాయించగా, సిప్‌ కోసం రూ.53,104 అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రతినెలా సిప్‌ రూపంలో 20 ఏళ్ల పాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే.. 12% రాబడి అంచనాతో రూ.5,30,58,751 సమకూరుతుంది.  


లాభ, నష్టాలు: అద్దె ఇంట్లో ఉండే వారు తమ కెరీర్‌ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైనా మరో చోటకు (అదే పట్టణంలో మరో చోటుకు లేదా వేరే ప్రాంతానికి) మారిపోయే వెసులుబాటుతో ఉంటారు. ఇంటిని విక్రయించాలన్న ఇబ్బంది ఉండనే ఉండదు. పైగా అద్దె ఇంట్లో ఉండే వారికి హెచ్‌ఆర్‌ఏ పేరుతో పన్ను మినహాయింపు ఉండనే ఉంది. వేతనం లేని వారికి కూడా కొంత మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే అద్దె ఇంట్లో ఉండడం వల్ల మీరు ఒక ఇంటి వారు కాలేకపోవచ్చు.

ఏంటి కర్తవ్యం..? 
రెండు ఆప్షన్లలోనూ లాభ, నష్టాలు ఉన్నాయి. రెండింటిలోకి.. అద్దె ఇంట్లో ఉండి, సిప్‌ ద్వారా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసుకోవడం వల్ల రూ.5.3 కోట్ల నిధిని సమకూర్చుకోగలరు. మరోవైపు రుణంపై ఇంటిని సమకూర్చుకున్నా కానీ.. 20 ఏళ్ల తర్వాత దాని విలువ రూ.4.19 కోట్లు అవుతుంది. కాకపోతే రూ.కోటి వరకు వడ్డీ రూపేణా ఈ కాలంలో చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.. ఇంటి అద్దెను 20 ఏళ్ల కాలానికి ఫ్లాట్‌గా ప్రతీ నెలా రూ.25,000గానే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవంలో ఇంటి అద్దె ఏటేటా పెరుగుతుంది.

అయితే, అదే సమయంలో వేతనం పెరుగుతుంటుంది కనుక సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా పెంచుకుంటూ వెళ్లొచ్చు. అంతిమంగా తమ అవసరాలు, అనుకూలతలు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండింటిలో అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కొందరు రుణ ఈఎంఐ అంటే తప్పనిసరి బాధ్యతగా భావించి వేతనంలో కచ్చితంగా ఆ మొత్తాన్ని పక్కన పెడతారు. అదే అద్దె ఇంట్లో ఉండి, మిగులు మొత్తాన్ని అంతే క్రమశిక్షణగా, బాధ్యతగా సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడం ఎక్కువ మందికి సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే వారి అవసరాలు ప్రాధాన్యంగా మారి.. పెట్టుబడులు పక్కకు వెళ్లిపోవచ్చు. ఇదే జరిగితే సొంతిల్లు లేక పోగా, చివరికి మంచి నిధి కూడా ఏర్పాటు చేసుకోలేరు. అందుకే క్రమశిక్షణ, దృష్టి కోణం ఆధారంగానూ నిర్ణయం ఉండాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement