Rental house
-
హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలకు రెక్కలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు 24 శాతం పెరిగాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా 13 పట్టణాల్లో సగటున 22.4 శాతం మేర అద్దెలు పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) మ్యాజిక్‌బ్రిక్స్ రెంటల్ ఇండెక్స్ ప్రకటించింది. అదే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ పెరుగుదల 4.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) గణాంకాలను మ్యాజిక్‌బ్రిక్స్ విడుదల చేసింది. మ్యాజిక్‌బ్రిక్స్ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్లకు పైగా కస్టమర్ల ప్రాధాన్యతల ఆధారంగా ఈ నివేదికను సంస్థ రూపొందించింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు థానేలో ఇళ్ల ధరలు 57.3 శాతం, గురుగ్రామ్‌లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం చొప్పున పెరిగాయి. ఈ పట్టణాల్లో అద్దెల డిమాండ్‌లో యువత (18.34 ఏళ్లు) పాత్ర 67 శాతంగా ఉంది. 41 శాతం మంది కిరాయిదారులు రూ.10,000–30,000 మధ్య అద్దెల ఇళ్లకు మొగ్గు చూపిస్తున్నారు. అద్దె ఇళ్లల్లో 52.7 శాతం సెమీ ఫర్నిష్డ్ ఇళ్లకే డిమాండ్ ఉంటోంది. కానీ, వీటి సరఫరా 48.7 శాతంగా ఉంది. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పట్టణీకరణ, తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులు అద్దెలు పెరగడానికి కారణాలుగా మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్‌పాయ్ పేర్కొన్నారు. ఒకవైపు అద్దె ఇళ్లకు అధిక డిమాండ్, మరోవైపు సరఫరా తగినంత లేకపోవడం ధరలను పెంచుతున్నట్టు చెప్పారు. -
అద్దె ఇల్లా.. సొంతిల్లా..?
సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం నేటి రోజుల్లో సులభ సాధ్యంగానే మారింది. వేతన జీవులు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అవకాశం కల్పిస్తున్నాయి. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంది. అయితే, కొందరు రుణం అంటే భయంతో వెనుకంజ వేస్తుంటారు. దీనికి బదులు అద్దె ఇంట్లోనే ఉందామనుకుంటుంటారు. కొందరు అయితే అద్దె ఇంటికి చెల్లించేదేదో రుణ ఈఎంఐగా చెల్లిస్తే కొన్నాళ్లకు ఓ ఇల్లు మనదైపోతుందన్న అంచనాతో ధైర్యం చేసి ముందడుగు వేస్తుంటారు. ఇంకొందరు అయితే ఏది లాభం? అనే సంశయంతో ఉండొచ్చు. కానీ, ఈ విషయంలో నిపుణుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్యాపిటల్ కోషెంట్ సీఈవో సౌస్తవ్ చక్రవర్తి అభిప్రాయ కోణం ఇలా ఉంది.. ఓ 20 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉంటూ, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నిధిని సమకూర్చుకుని ఇంటిని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా రుణంపై ప్రాపర్టీని కొనుగోలు చేసి 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. మన దేశంలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. వారి ముఖ్యమైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఇల్లు సమకూర్చుకుని అందులో నివసించే విషయంలో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అద్దె ఇంట్లో ఉండడం ప్రతికూల ఆప్షన్ ఏమీ కాదు. అయితే, ఈ రెండు ఆప్షన్లలో ఉండే ప్రయోజనాలు, ప్రతికూలతలను చూద్దాం. ఇంటిని కొనుగోలు చేయడం.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ధోరణులను పరిశీలిస్తే.. ప్రాపర్టీ ధరలు ఏటా 8 శాతం చొప్పున వచ్చే 20 ఏళ్ల పాటు పెరుగుతాయని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు 20 ఏళ్ల కాలానికి గృహ రుణాలపై 8.5 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఇంటి ఖరీదు రూ.90 లక్షలని అనుకుంటే.. 20 ఏళ్ల తర్వాత ఇదే ప్రాపర్టీ 8 శాతం ఏటా పెరుగుదల అంచనాల ఆధారంగా రూ.4.19 కోట్లు అవుతుంది. అదే ఇప్పుడు రుణం తీసుకుని 20 ఏళ్ల పాటు ప్రతీ నెలా రూ.78,104 చొప్పున చెల్లిస్తూ వెళితే కట్టే మొత్తం రూ.1.87 కోట్లు మాత్రమే. లాభ, నష్టాలు అద్దె ఇంటితో పోలిస్తే సొంత ఇంట్లో ఉండే అనుభవం వేరు. దీన్ని కాదనడం లేదు. కానీ, ఆర్థిక కోణంలో నుంచి చూసేట్టు అయితే ఎన్నో అంశాలపై దృష్టి సారించాలి. రుణం తీసుకుని అద్దె చెల్లించడం వల్ల అతిపెద్ద అనుకూలత.. రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపన్ను మినహాయింపులు ఉండడం. ప్రతికూలత.. వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే విక్రయించడంలో ఉండే ఇబ్బంది. ఒకరు ఒకే ప్రాంతంలో శాశ్వతంగా ఉండిపోతారన్న నమ్మకం తక్కువే. ఇంటి కోసం ఒకే ప్రాంతంలో ఉండి కెరీర్లో ఉన్నత అవకాశాలను నష్టపోలేరు కదా. అద్దె ఇంట్లో ఉండడం... అద్దె ఇంట్లో ఉండే వారు, వేతనంలో మిగిలే మొత్తాన్ని ప్రతీ నెలా లేదా మూడు నెలలకోసారి క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ ఎంచుకున్న కాలానికి అనుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి మొత్తం బ్యాంకు నుంచి సంబంధిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళుతుంది. ఎన్ఏవీ ధర ఆధారంగా ఫండ్స్ యూనిట్ల కేటాయింపులు చేస్తారు. ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తుండడం వల్ల మార్కెట్లు పెరుగుదల, పతనాల్లోనూ కొనుగోలుతో సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. ఇప్పుడు పై ఉదాహరణలో ఇంటి రుణంపై ఈఎంఐగా రూ.78,104 చెల్లించాలని చెప్పుకున్నాం కదా.. ఇందులో అద్దె ఇంటికి ప్రతినెలా చెల్లించాల్సిన రూ.25,000ను మినహాయించగా, సిప్ కోసం రూ.53,104 అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రతినెలా సిప్ రూపంలో 20 ఏళ్ల పాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 12% రాబడి అంచనాతో రూ.5,30,58,751 సమకూరుతుంది. లాభ, నష్టాలు: అద్దె ఇంట్లో ఉండే వారు తమ కెరీర్ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైనా మరో చోటకు (అదే పట్టణంలో మరో చోటుకు లేదా వేరే ప్రాంతానికి) మారిపోయే వెసులుబాటుతో ఉంటారు. ఇంటిని విక్రయించాలన్న ఇబ్బంది ఉండనే ఉండదు. పైగా అద్దె ఇంట్లో ఉండే వారికి హెచ్ఆర్ఏ పేరుతో పన్ను మినహాయింపు ఉండనే ఉంది. వేతనం లేని వారికి కూడా కొంత మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే అద్దె ఇంట్లో ఉండడం వల్ల మీరు ఒక ఇంటి వారు కాలేకపోవచ్చు. ఏంటి కర్తవ్యం..? రెండు ఆప్షన్లలోనూ లాభ, నష్టాలు ఉన్నాయి. రెండింటిలోకి.. అద్దె ఇంట్లో ఉండి, సిప్ ద్వారా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రూ.5.3 కోట్ల నిధిని సమకూర్చుకోగలరు. మరోవైపు రుణంపై ఇంటిని సమకూర్చుకున్నా కానీ.. 20 ఏళ్ల తర్వాత దాని విలువ రూ.4.19 కోట్లు అవుతుంది. కాకపోతే రూ.కోటి వరకు వడ్డీ రూపేణా ఈ కాలంలో చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.. ఇంటి అద్దెను 20 ఏళ్ల కాలానికి ఫ్లాట్‌గా ప్రతీ నెలా రూ.25,000గానే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవంలో ఇంటి అద్దె ఏటేటా పెరుగుతుంది. అయితే, అదే సమయంలో వేతనం పెరుగుతుంటుంది కనుక సిప్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా పెంచుకుంటూ వెళ్లొచ్చు. అంతిమంగా తమ అవసరాలు, అనుకూలతలు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండింటిలో అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కొందరు రుణ ఈఎంఐ అంటే తప్పనిసరి బాధ్యతగా భావించి వేతనంలో కచ్చితంగా ఆ మొత్తాన్ని పక్కన పెడతారు. అదే అద్దె ఇంట్లో ఉండి, మిగులు మొత్తాన్ని అంతే క్రమశిక్షణగా, బాధ్యతగా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ మందికి సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే వారి అవసరాలు ప్రాధాన్యంగా మారి.. పెట్టుబడులు పక్కకు వెళ్లిపోవచ్చు. ఇదే జరిగితే సొంతిల్లు లేక పోగా, చివరికి మంచి నిధి కూడా ఏర్పాటు చేసుకోలేరు. అందుకే క్రమశిక్షణ, దృష్టి కోణం ఆధారంగానూ నిర్ణయం ఉండాలి. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ఘట్కేసర్: గుట్టుచప్పుడు కాకుండా ఓ అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు బంగ్లాదేశ్ యువతులకు విముక్తి కలిగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చౌదరిగూడలోని సాయినగర్‌కాలనీలో సురేందర్ మూర్తి, రాజేశ్వరి దంపతులు గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఘట్కేసర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ విటుడిగా పరిచయం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించడంతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అతని సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న సురేందర్ మూర్తి(37), రాజేశ్వరి(34) దంపతులను, బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. సురేందర్ మూర్తి, రాజేశ్వరి దంపతులను విచారించగా బంగ్లాదేశ్‌కు చెందిన అభిజిత్,ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహేశ్‌లకు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో భాగంగా ఒక సెల్‌ఫోన్, రూ.5100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అభిజిత్, మహేశ్‌లను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దంపతులతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు. -
లోక విరుద్ధం
మంచివే అయినా, లోక విరుద్ధంగా కొన్ని పనుల్ని చేయలేం. ‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికుండదా?’’ పెద్దగా నవ్వి అన్నాడు వినోద్. వీచిక కూడా నవ్వింది. అయితే అది నవ్వొచ్చి నవ్వడం కాదు. వినోద్ నవ్వాడని నవ్వింది. ఆవలింతలకు ఉన్న గుణమే నవ్వుకీ, భయానికీ ఉంటుంది.. అంటుకోవడం! అలాంటి నవ్వు కావొచ్చది. ఆ రోజు ఉదయమే వాళ్లు ఆ ఇంట్లోకి వచ్చారు. కొత్తగా పెళ్లయినవాళ్లు, కొత్తగా కట్టిన ఇంట్లోకి, కొత్తగా వచ్చి చేరారు. కొత్తగా రావడం అంటే.. కాళ్ల పారాణి ఆరకముందే ఇటు వచ్చేయడం కాదు. అప్పటివరకు ఉన్న ఇంటిని ఖాళీ చేసి, ఈ ఇంట్లోకి వచ్చి చేరారు. పెద్దగా సామాను లేదు. ఇల్లు మాత్రం పెద్దది. ఓనర్ కూడా పెద్దాయన. ఆయన ఒక్కరే ఉంటారు. పక్క పోర్షన్‌లోనే ఉంటారు. వీళ్లున్న పోర్షన్ కొత్తగా కట్టింది. పెద్దాయన ఉన్నది పాతది. ఆ పాత ఇంటి కంటే కూడా పాత మనిషి ఆయన. ఓ డెబ్భై ఏళ్లు ఉంటాయి. తెల్లగా ఉంటారు. తెల్లటి పైజమా లాల్చీ వేసుకుని ఉంటారు. కొత్త ఇంట్లోకి ఆయనే షిఫ్ట్ అయి, పాత ఇంటినే ఈ దంపతులకు ఇవ్వొచ్చు కానీ ఇవ్వలేదు. ‘ఎందుకలా?’ అని వీళ్లు అడగలేదు. ఆయనకెవరూ లేరా అనే డౌట్ కూడా వచ్చింది. అదీ అడగలేదు. ‘‘హైదరాబాద్‌లో ఇంత తక్కువ అద్దెకు ఇలాంటి ఇల్లు దొరకడం మీ అదృష్టం’’ అని చెప్పి వెళ్లిపోయాడు, ఈ ఇంటిని చూపించిన అతను. నిజమే అనిపించింది వినోద్కీ, వీచికకు. ‘‘నిజానికి రెంటు కూడా నాకు అక్కర్లేదు. మంచివే అయినా, లోక విరుద్ధంగా కొన్ని పనుల్ని చేయలేం. రెంటు లేకుండా మీకు నా ఇంటిని ఇవ్వొచ్చు కానీ అది లోక విరుద్ధం. రెంటు లేకుండా నా ఇంట్లో ఉండడం మీకూ లోక విరుద్ధంగానే అనిపించవచ్చు. పద్ధతులు శుభ్రంగా ఉండటం నాకు ముఖ్యం. రెంటు కాదు’’ అన్నారు పెద్దాయన. వీళ్లిద్దరూ ఆశ్చర్యపోయారు. ‘‘ఇల్లు నచ్చింది. మంచిరోజు చూసుకుని వచ్చి చేరతాం’’ అని చెప్పి.. మెట్లు దిగారు.రోడ్డు మీదకు రాగానే.. ‘‘ఆయన మనకు ఇంటిని రెంట్‌కు ఇచ్చినట్లుగా లేదు. మన ఇంటిని చూసుకోడానికి ఆయనకే మనం జీతం ఇస్తున్నట్లుగా ఉంది’’ అన్నాడు వినోద్ నవ్వుతూ. వీచిక మాట్లాడలేదు. ‘‘పర్లేదంటావా?’’ అంది, అతడి చెయ్యి పట్టుకుని. ‘ఏంటి పర్లేదా?’ అన్నట్లు చూశాడు వినోద్. ‘‘కొత్తగా కట్టిన ఇంట్లో.. అలాంటివేమీ ఉండవు కదా?’’ అంది. ‘‘ఎందుకలా అనిపిస్తోంది!’’ అన్నాడు వినోద్. ‘‘అంత పెద్దింటికి రెంట్ ఇంత తక్కువగా ఉంటేనూ! పైగా.. రెంట్ తీసుకోకపోవడం లోక విరుద్ధం కాబట్టే ఆ మాత్రం రెంట్ అయినా తీసుకోవలసివస్తోంది అని కూడా ఆయన అన్నారు..’’ అంది వీచిక. వినోద్ మాట్లాడలేదు. రోడ్డు దాటే ధ్యాసలో ఉన్నాడు. రోడ్డు దాటాక, ఇద్దరూ వెనక్కి తిరిగి ఒకసారి ఆ కొత్తింటి వైపు చూశారు. తెల్లటి బట్టల్లో ఉన్న ఆ పెద్దాయన ఇంటి బయటికి వచ్చి నిలబడి, వీళ్లనే చూస్తూ ఉండడం కనిపించింది. ‘‘ఆయన్నలా చూస్తూంటే, ఆ ఇంట్లో ఏమీ లేవని నాకు అనిపించడం లేదు’’ అన్నాడు వినోద్ నవ్వుతూ. వీచిక మళ్లీ అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. ‘‘బాల్కనీలోంచి ఏదో చప్పుడు వినిపిస్తోంది వినోద్’’ అంది భయంగా వీచిక. అదిగో అప్పుడే అన్నాడు వినోద్ పెద్దగా నవ్వుతూ..‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికి మాత్రం ఉండదా?’’ అని.ఆ ఇంట్లో వారికది ఫస్ట్ డే. ఇంట్లోని గదులు విశాలంగా, కంఫర్ట్‌గా ఉన్నాయి. ఉన్న ఒకటీ అరా సామాను హాల్లో ఓ మూలకు ఉంది. కిచెన్‌ని మాత్రం రెడీ చేసుకున్నారు..‘గృహప్రవేశం’ రోజే బయట తినడం ఎందుకని. రాత్రికి కూడా సరిపోయేలా మధ్యాహ్నమే వండేసింది వీచిక. స్నానం అయ్యాక ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం అయ్యాక వినోద్‌కి చెప్పింది వీచిక..‘‘పగలు వేసినట్లే.. రాత్రిళ్లు జోక్‌లు వెయ్యకు వినోద్. నాకు భయం’’ అని. తెల్లారి లేవగానే వినోద్ ముఖం అలజడిగా ఉండడం గమనించింది వీచిక. ‘‘ఏంటలా ఉన్నావు?’’ అని అడిగింది.. టీ కప్పు అందిస్తూ. ‘‘ఏం లేదు’’ అన్నాడు వీచికనే చూస్తూ. తేటగా, అందంగా ఉంది ఆమె ముఖం. అక్కణ్ణుంచి నేరుగా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్లాడు వినోద్. ‘‘మీకేమైనా కనిపించాయా కొత్తింట్లో? నిజం చెప్పండి’’ అన్నాడు స్ట్రయిట్‌గా.‘‘నీకేమైనా అనిపించిందా?’’ అన్నారు పెద్దాయన!‘‘అనిపించడం ఏంటీ! కనిపిస్తేనూ..’’ అన్నాడు వినోద్ భయంగా. పెద్దాయన నవ్వారు. ‘‘నా మనవరాలికి నచ్చని పనేదో చేసి ఉంటావ్. చూద్దాం పద’’ అని, వినోద్‌తో పాటు కొత్తింట్లోకి వచ్చారు.‘‘ఇదిగో.. రాత్రి స్నానం చేశాక, ఒళ్లు తుడుచుకుని ఈ తడి టవల్ని తలుపు మీద కుప్పగా వేసినట్లున్నావ్’’ అన్నారు పెద్దాయన.‘‘వేస్తే?’’ అన్నాడు వినోద్.. పెద్దాయన్ని కళ్లప్పగించి చూస్తూ. ‘‘చెప్పాను కదా.. నా మనవరాలికి ఇలాంటివి నచ్చవని’’ అన్నారు పెద్దాయన. వినోద్ బిగదీసుకుపోయాడు. ‘‘మీ మనవరాలు.. ?’’ అంటూ ఆగిపోయాడు.‘‘యు.ఎస్.లో ఉంది. తనే ప్లాన్ పంపి ఈ ఇంటిని కట్టించుకుంది. ‘పద్ధతిగా ఉండేవాళ్లెవరికైనా రెంట్కివ్వు తాతయ్యా’ అని చెప్పి వెళ్లింది. రాత్రి నీకు జరిగిన దానిని బట్టి చూస్తే.. తన మనసంతా ఈ ఇంటిపైనే ఉన్నట్లుంది’’ అన్నారు పెద్దాయన. వినోద్ మరింత బిగుసుకుపోయాడు. ‘‘ఏంటీ.. రాత్రి జరగడం?’’ అంటూ వచ్చింది వీచిక... పెద్దాయనకు టీ అందిస్తూ. భార్యనే చూస్తున్నాడు.. వినోద్.తేటగా, అందంగా ఉంది ఆమె ముఖం. వినోద్ నమ్మలేకపోతున్నాడు.రాత్రి తన చెంపలు పగలగొట్టింది వీచికే అంటే నమ్మలేకపోతున్నాడు! పెద్దాయన మనవరాలు వీచికలోకి ప్రవేశించిందా?బతికున్నవారికి కూడా ఆత్మలుంటాయా?! ∙మాధవ్ శింగరాజు -
సొంతిల్లుకంటే అద్దె ఇల్లే మేలు
లండన్: సొంతిల్లు కంటే అద్దె ఇల్లే ఆర్థికంగా ప్రయోజనకరమని వెల్లడైంది. తాజా అధ్యయనం ప్రకారం ఇల్లు కొనే సమయాల్లో చాలామంది దాని బీమా, ఆస్తి నిర్వహణ వ్యయాలను తరచూ విస్మరిస్తుంటారు. అయితే వీటి నిర్వహణ వ్యయాలతో పోల్చుకుంటే అద్దె ఇంటికి చేసే చెల్లింపులే తక్కువని బ్రిటన్‌లోని స్టిర్లింగ్ వర్సిటీకి చెందిన పరిశోధకుడు ఇస్సాక్ తాబ్నెర్ తెలిపారు. అయితే వ్యక్తిగత పరిస్థితులు, మార్కెట్ నిబంధనలు కూడా ఈ సొంతిల్లు మేలా లేక అద్దె ఇల్లు మేలా అన్న అంశంపై ఆధారపడి ఉంటాయన్నారు. -
అద్దె ఇళ్ల కష్టాలిక చెల్లు
♦ యజమానులకు అదనపు ఆదాయం ♦ నెస్ట్అవే సీఈవో అమరేంద్ర సాహు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అద్దె ఇల్లు అవసరం అయిన వారికి, ఇంటి యజమానులకు ఇబ్బందులు లేని సేవలు అందిస్తామంటోంది బెంగళూరుకు చెందిన నెస్ట్ అవే. కిరాయిదారులకు, యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న నెస్ట్అవే.కామ్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, పుణే నగరాల్లో 2,400 మంది ఇంటి యజమానులకు 10 వేలకుపైగా కిరాయిదారులను అనుసంధానించింది. కిరాయిదారులు అద్దె చెల్లించకపోయినా, ఇంటికి నష్టం వాటిల్లినా ఆ బాధ్యత తమదేనని చెప్పారు నెస్ట్ అవే సహ వ్యవస్థాపకులు, సీఈవో అమరేంద్ర సాహు. అద్దె రూ.6 వేల నుంచి మొదలవుతుందని, రెండు నెలల అడ్వాన్సు చెల్లిస్తే చాలని బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ఎలా పనిచేస్తుందంటే.. అద్దెకు ఇల్లు, రూమ్, బెడ్ కావాల్సిన వారు వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ-మెయిల్ ఐడీ, గుర్తింపు కార్డులు, ఫోన్ నంబరు ఇవ్వాలి. కంపెనీ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఇవి సరైనవా కాదా అని పరిశీలిస్తుంది. ఇంట్లో చేరే ముందు కూడా ఈ పత్రాలను పరిశీలిస్తారు. ఇక అందుబాటులో ఉన్న ఇళ్ల వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. ప్రత్యక్షంగా చూడాలంటే అపాయింట్మెంట్ కోరవచ్చు. నేరుగా బుక్ చేసుకుంటే కొంత మొత్తాన్ని ఆన్లైన్లో అడ్వాన్సుగా చెల్లించాలి. మిగిలినది ఇంట్లో చేరే ముందు చెల్లించాలి. ఇల్లు నచ్చకపోతే మూడు రోజుల్లో డబ్బులు వెనక్కి ఇస్తారు. -
అద్దె ఇంటి నుంచి ఫాంహౌస్‌కు చంద్రబాబు
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఇల్లు మారబోతున్నారు. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన త్వరలో ఫాంహౌస్‌కు వెళ్లనున్నారు. వాస్తు సమస్యల కారణంగా చంద్రబాబు కుటుంబం ఇప్పుడు ఉంటున్న ఇల్లు మారుతున్నట్లు సమాచారం. అలాగే నిర్మాణం పూర్తి కాగానే చంద్రబాబు ఫాంహౌస్ నుంచి సొంతింటికి వెళ్లే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. కాగా బాబు సీఎం పీఠం ఎక్కిన తరువాత వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రూ.కోట్లు వెచ్చించి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్, క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లలో అనేక మార్పు చేర్పులు కూడా చేశారు. అయితే ఓటుకు కోట్లు కేసు అనంతరం చంద్రబాబు తన మకాన్ని విజయవాడకు మార్చారు. అక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. -
అద్దెల మోత..!
రాజధానిలో సామాన్యుడికి భారంగా మారిన అద్దె ఇల్లు ఇళ్లు తక్కువగా ఉండడంతో పెరిగిన డిమాండ్ అద్దెలు పెరగడంతో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు వ్యాపార సముదాయాలకు మరింత డిమాండ్ ఆ గ్రామానికి కచ్చితమైన బస్సు సౌకర్యం లేదు.. రైలు మార్గం అంతకన్నా లేదు... వినోదానికి సినిమా థియేటర్లు లేవు... ఆహ్లాదానికి విశేషమైన పార్కులు, రిసార్టులు లేవు... అది పర్యాటక ప్రాంతమూ కాదు... ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కానే కాదు... ఇక విశాలమైన రహదారులు లేవు.. సమస్యల్లేని డ్రైనేజీ వ్యవస్థ లేదు. కానీ అక్కడి అద్దెలు మాత్రం వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇదీ గుంటూరు జిల్లా తుళ్లూరులో పరిస్థితి. - సాక్షి, గుంటూరు నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరు పేరు ప్రకటించగానే అక్కడి స్థలాలకు భారీగా విలువ పెరిగిపోయింది. పంట పొలాలు ఎకరా కోట్లల్లో పలికింది. నివాస స్థలాలైతే కాస్మొపాలిటన్ సిటీలకు తీసిపోని ధరలు పలుకుతున్నాయి. మొదట్లో ఎకరం పొలం రూ. కోటి నుంచి కోటిన్నర వరకు పలికింది. అద్భుతమైన భవనాలు లేకున్నా రెండు సెంట్లు స్థలంలో నిర్మించిన ఇంటి అద్దె నెలకు రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు పలుకుతోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అయితే నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు చెబుతున్నారు. ఆరునెలలు అద్దె ముందుగానే చెల్లించాలని డిమాండ్చేస్తున్నారు. ఇదే అదనుగా ఇప్పటికే ఖాళీస్థలాలున్న కొంతమంది ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీస్థలాలను లీజుకు సైతం ఇస్తున్నారు. చివరకు పశువుల పాకలను సైతం కార్యాలయాలుగా మార్చి అద్దెలకు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల చిన్నపాటి వేతన జీవుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రానురాను అద్దెకు ఇల్లు దొరకడమే కష్టమవుతుందని భావించిన అనేక మంది ఒక్క గది ఉన్న ఇంటిని సైతం రూ. 5వేల నుంచి 8 వేల వరకూ చెల్లిస్తూ ఉంటున్నారు. కొంతమంది ఈ అద్దెలు భరించలేక అక్కడకి దగ్గరలో ఉన్న పల్లెల్లో అద్దెకు ఉంటూ రోజూ తుళ్లూరు వెళ్ళి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. తుళ్లూరు, సమీప ప్రాంతాల్లో భవన నిర్మాణాలు అధికంగా జరుగుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికులు అధిక ధరలు చెల్లించి ఇల్లు అద్దెకు తీసుకుని ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవీ కారణాలు ►రాజధాని ప్రాంతంలో ఇప్పటినుంచే వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందకు వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించడం. ► బ్యాంకులు, వివిధ నగదు లావాదేవీల కార్యాలయాలు విస్తృతంగా ఏర్పాటు చేస్తుండటం. ► రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, వివిధ వ్యాపార షోరూమ్లకోసం ఇప్పటినుంచే భవనాలను వెదుకుతుండటం. ► ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం... అందులో పనిచేసే సిబ్బంది ఇక్కడే మకాం పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడడం. వివిధ ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు ఇలా.. గుంటూరు నగరంలో సింగిల్ బెడ్రూమ్, లేదా మూడుగదులు ఉన్న ఇంటి అద్దె రూ. 5 వేల నుంచి 6 వేలవరకూ... డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ శ్యామలానగర్‌లో రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకూ... అరండల్‌పేట, బ్రాడీపేట, లక్ష్మీపురంలో రూ. 9 వేల నుంచి రూ. 14 వేల వరకూ... విద్యానగర్, ఎస్వీఎన్ కాలనీ, సిద్ధార్ధనగర్‌లో రూ. 7 వేల నుంచి రూ. 12 వేల వరకూ ఉన్నాయి. గుంటూరు వన్‌టౌన్‌లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకూ ఉంది. మంగళగిరిలో సైతం అద్దెలు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే రెట్టింపు అయింది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏరియాను బట్టి రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకూ ఉన్నాయి. మామూలు మూడు గదుల ఇల్లులే రూ. 5 వేలు అద్దె చెబుతున్నారు. విజయవాడలోని పటమటలో డబుల్బెడ్రూమ్ రూ. 12వేలు, ట్రిపుల్బెడ్రూమ్ 19వేలు, లబ్బీపేట, మొగల్రాజపురంలో రూ. పదివేలు, రూ. 16వేలు, మాచవరంలో రూ. 8,500, రూ. 14,000 ఉంది. ఇక వన్‌టౌన్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ. 9,500, ట్రిపుల్బెడ్రూమ్ రూ. 12,000 ఉన్నాయి. -
12న ఇల్లు మారనున్న సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 12న అద్దె ఇంట్లోకి మారనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 65లోని తన సొంత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 24లో అద్దె ఇంట్లోకి మారుతున్నారు. నేడు ఢిల్లీకి..: చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఇచ్చే విందులో పాల్గొంటారు. ఆదివారం న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే న్యాయమూర్తుల సమావేశానికి కూడా సీఎం హాజరవుతారు. నైపుణ్య కేంద్రం ప్రారంభం: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నైపుణ్య కేంద్రాన్ని ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిథి సమన్వయకర్త నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఐటీ కంపెనీలతో పాటు వివిధ సంస్థలకు ఇంటర్వ్యూలకు వెళ్లే గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. -
సినీఫక్కీలో రూ.11లక్షల దోపిడీ
గుడివాడ: అద్దెకు ఇల్లు కావాలని వచ్చి యజమాని కంట్లో కారం చల్లి రూ.11 లక్షల నగదు అపహరించిన ఘటన గురువారం పట్టణంలో జరిగింది. ఏలూరు రోడ్డులోని నారాయణ పాఠశాల పక్కన ఉన్న సీఎంఎస్ కస్టోడియన్ నివాసంలో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధితుడు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్, ఐఓబీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు ఉన్న ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసే సీఎంఎస్ సంస్థలో కస్టోడియన్‌గా లక్కరాజు రాంప్రసాద్ పనిచేస్తున్నారు. గురువారం ఆయన స్థానిక యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.17 లక్షల నగదు తీసుకున్నారు. అనంతరం ఒక బ్యాంక్ ఏటీఎంలో రూ.6 లక్షలు డిపాజిట్ చేశారు. తరువాత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏలూరురోడ్డులోని నారాయణ హైస్కూల్ పక్కన ఉన్న ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఓ యువకుడు ఇంట్లోకి నేరుగా వచ్చాడు. ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. ఆ యువకుడు గత మూడురోజులుగా రాంప్రసాద్ ఇంటికి వచ్చి ఇదే కారణం చెబుతున్నాడు. ఇల్లు బ్యాచిలర్స్‌కు ఇవ్వబోమని ముందే చెప్పాను కదా.. అని ఆయన బదులిచ్చారు. ఇంతలో ఆ యువకుడు రాంప్రసాద్ కళ్లలో కారం జల్లి పక్కనే ఉన్న రూ.11 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యాడు. అప్పటికే ఇంటిముందు రోడ్డుపై మరో యువకుడు బైక్‌తో సిద్ధంగా ఉన్నాడు. వారిద్దరూ వాహనంపై హనుమాన్‌జంక్షన్ వైపు పరారయ్యారు. రాంప్రసాద్ కళ్లు కడుక్కుని చూడగా నగదు బ్యాగ్ కనిపించలేదు. దీంతో దొంగ.. దొంగ.. అని ఆయన కేకలు వేస్తూ బయటకు వచ్చారు. ఆ యువకులు అప్పటికే పరారయ్యారు. బాధితుడు ఈ ఘటన గురించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాము సిబ్బందితో వచ్చి ఆయన వద్ద వివరాలు సేకరించారు. అరగంటపాటు రోడ్డుపైనే తిరిగారు.. దొంగతనం జరగకముందు అరగంటపాటు ఇద్దరు యువకులు ఇంటి బయట రోడ్డు మీదనే తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మోటార్ సైకిల్‌పై వారు వచ్చారని పేర్కొన్నారు, ఏటీఎంలలో డబ్బును డిపాజిట్ చేసే వాహనం లక్కరాజు రాంప్రసాద్ ఇంటి బయటనే ఉంది. దీనిలో డ్రైవర్, గార్డు వాహనం సమీపంలోనే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, దొంగతనం జరిగిన వెంటనే బాధితుడు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి రూ.7 లక్షలు అపహరణకు గురైనట్లు చెప్పారు. ఎస్సై రాము సిబ్బందితో వచ్చి విచారణ జరపగా, రూ.11 లక్షలు పోయినట్లు తెలిపారు. దీంతో ఎంత మొత్తం పోయిందనే దానిపై పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పట్టపగలు ఇంత భారీ దొంగతనం జరగడంతో పోలీసుల్లోనూ కలకలం రేగింది. దీనిపై సమాచారం అందిన ఐదు నిముషాల్లోనే వన్‌టౌన్ ఎస్సై ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. యువకులు హనుమాన్‌జంక్షన్ వైపు పరారయ్యారని బాధితుడు, స్థానికులు చెప్పడంతో ఆ ప్రాంత పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు యాక్సిస్ బ్యాంక్‌కు వెళ్లి వెబ్‌క్యామ్, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.