సినీఫక్కీలో రూ.11లక్షల దోపిడీ
గుడివాడ: అద్దెకు ఇల్లు కావాలని వచ్చి యజమాని కంట్లో కారం చల్లి రూ.11 లక్షల నగదు అపహరించిన ఘటన గురువారం పట్టణంలో జరిగింది. ఏలూరు రోడ్డులోని నారాయణ పాఠశాల పక్కన ఉన్న సీఎంఎస్ కస్టోడియన్ నివాసంలో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధితుడు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్, ఐఓబీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు ఉన్న ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసే సీఎంఎస్ సంస్థలో కస్టోడియన్‌గా లక్కరాజు రాంప్రసాద్ పనిచేస్తున్నారు. గురువారం ఆయన స్థానిక యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.17 లక్షల నగదు తీసుకున్నారు. అనంతరం ఒక బ్యాంక్ ఏటీఎంలో రూ.6 లక్షలు డిపాజిట్ చేశారు.
తరువాత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏలూరురోడ్డులోని నారాయణ హైస్కూల్ పక్కన ఉన్న ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఓ యువకుడు ఇంట్లోకి నేరుగా వచ్చాడు. ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. ఆ యువకుడు గత మూడురోజులుగా రాంప్రసాద్ ఇంటికి వచ్చి ఇదే కారణం చెబుతున్నాడు. ఇల్లు బ్యాచిలర్స్‌కు ఇవ్వబోమని ముందే చెప్పాను కదా.. అని ఆయన బదులిచ్చారు. ఇంతలో ఆ యువకుడు రాంప్రసాద్ కళ్లలో కారం జల్లి పక్కనే ఉన్న రూ.11 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యాడు.
అప్పటికే ఇంటిముందు రోడ్డుపై మరో యువకుడు బైక్‌తో సిద్ధంగా ఉన్నాడు. వారిద్దరూ వాహనంపై హనుమాన్‌జంక్షన్ వైపు పరారయ్యారు. రాంప్రసాద్ కళ్లు కడుక్కుని చూడగా నగదు బ్యాగ్ కనిపించలేదు. దీంతో దొంగ.. దొంగ.. అని ఆయన కేకలు వేస్తూ బయటకు వచ్చారు. ఆ యువకులు అప్పటికే పరారయ్యారు. బాధితుడు ఈ ఘటన గురించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాము సిబ్బందితో వచ్చి ఆయన వద్ద వివరాలు సేకరించారు.
అరగంటపాటు రోడ్డుపైనే తిరిగారు..
దొంగతనం జరగకముందు అరగంటపాటు ఇద్దరు యువకులు ఇంటి బయట రోడ్డు మీదనే తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మోటార్ సైకిల్‌పై వారు వచ్చారని పేర్కొన్నారు, ఏటీఎంలలో డబ్బును డిపాజిట్ చేసే వాహనం లక్కరాజు రాంప్రసాద్ ఇంటి బయటనే ఉంది. దీనిలో డ్రైవర్, గార్డు వాహనం సమీపంలోనే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, దొంగతనం జరిగిన వెంటనే బాధితుడు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి రూ.7 లక్షలు అపహరణకు గురైనట్లు చెప్పారు.
ఎస్సై రాము సిబ్బందితో వచ్చి విచారణ జరపగా, రూ.11 లక్షలు పోయినట్లు తెలిపారు. దీంతో ఎంత మొత్తం పోయిందనే దానిపై పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పట్టపగలు ఇంత భారీ దొంగతనం జరగడంతో పోలీసుల్లోనూ కలకలం రేగింది. దీనిపై సమాచారం అందిన ఐదు నిముషాల్లోనే వన్‌టౌన్ ఎస్సై ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు.
యువకులు హనుమాన్‌జంక్షన్ వైపు పరారయ్యారని బాధితుడు, స్థానికులు చెప్పడంతో ఆ ప్రాంత పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు యాక్సిస్ బ్యాంక్‌కు వెళ్లి వెబ్‌క్యామ్, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.