బిడ్డను తల్లికి అప్పగిస్తున్న సీఐ వెంకటరమణ
ప్రొద్దుటూరు క్రైం : అతను తాగుడు కోసం స్వయానా బిడ్డ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. డబ్బు, సెల్‌ఫోన్‌తో పాటు మూడు నెలల పసికందును ఎత్తుకెళ్లాడు. మనిషి తాగుడుకు బానిసైతే ఏ స్థాయికి దిగజారుతాడన్న దానికి ఈ సంఘటన అద్దం పడుతోంది. వివరాలిలా.. గురుప్రియ, నాగునాయక్ దంపతులు ప్రొద్దుటూరులోని సూపర్‌బజార్ రోడ్డులో నాగులకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు.
గురుప్రియ తండ్రి గురుశేఖర్ అధికంగా అప్పులు చేసి సొంత ఊళ్లో ఉండలేక కొన్ని రోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. పసికందును తండ్రికి అప్పగించి శుక్రవారం గురుప్రియ పని కోసం బయటికి వెళ్లింది. ఆమె ఇంటికి వచ్చే సరికి పాపతో పాటు తండ్రి కూడా కనిపించలేదు. ఇంట్లో డబ్బు, సెల్‌ఫోన్ లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె వీధిలోనూ, బంధువుల ఇళ్లలో వెతికింది. అయినా వారి జాడ కనిపించలేదు.
దీంతో కంగారు పడిన గురుప్రియ దంపతులు త్రీ టౌన్ పోలీస్‌ష్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. త్రీ టౌన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక సాయంతో రాజంపేటలో ఉన్న గురుశేఖర్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసికందును తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు. మద్యానికి బానిసై డబ్బు, సెల్‌ఫోన్‌ను గురుశేఖర్ తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పసికందును ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే ప్రమాదమనే ఉద్దేశంతో అతను మనవరాలిని ఎత్తుకొని వెళ్లాడని పోలీసు అధికారులు తెలిపారు. తమ కుమార్తెను సురక్షితంగా అప్పగించిన త్రీ టౌన్ పోలీసులకు గురుప్రియ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. 36 గంటల్లోనే కేసును ఛేదించిన త్రీ టౌన్ సీఐ వెంకటరమణ, సిబ్బంది శ్రీనివాసులు, తిరుమల, దస్తగిరి, పక్కీరప్ప, శివానంద, హోంగార్డు సురేంద్రయాదవ్‌లను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment