మంచివే అయినా, లోక విరుద్ధంగా కొన్ని పనుల్ని చేయలేం.
‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికుండదా?’’ పెద్దగా నవ్వి అన్నాడు వినోద్. వీచిక కూడా నవ్వింది. అయితే అది నవ్వొచ్చి నవ్వడం కాదు. వినోద్ నవ్వాడని నవ్వింది. ఆవలింతలకు ఉన్న గుణమే నవ్వుకీ, భయానికీ ఉంటుంది.. అంటుకోవడం! అలాంటి నవ్వు కావొచ్చది. ఆ రోజు ఉదయమే వాళ్లు ఆ ఇంట్లోకి వచ్చారు. కొత్తగా పెళ్లయినవాళ్లు, కొత్తగా కట్టిన ఇంట్లోకి, కొత్తగా వచ్చి చేరారు. కొత్తగా రావడం అంటే.. కాళ్ల పారాణి ఆరకముందే ఇటు వచ్చేయడం కాదు. అప్పటివరకు ఉన్న ఇంటిని ఖాళీ చేసి, ఈ ఇంట్లోకి వచ్చి చేరారు. పెద్దగా సామాను లేదు. ఇల్లు మాత్రం పెద్దది. ఓనర్ కూడా పెద్దాయన. ఆయన ఒక్కరే ఉంటారు. పక్క పోర్షన్‌లోనే ఉంటారు. వీళ్లున్న పోర్షన్ కొత్తగా కట్టింది. పెద్దాయన ఉన్నది పాతది. ఆ పాత ఇంటి కంటే కూడా పాత మనిషి ఆయన. ఓ డెబ్భై ఏళ్లు ఉంటాయి. తెల్లగా ఉంటారు. తెల్లటి పైజమా లాల్చీ వేసుకుని ఉంటారు. కొత్త ఇంట్లోకి ఆయనే షిఫ్ట్ అయి, పాత ఇంటినే ఈ దంపతులకు ఇవ్వొచ్చు కానీ ఇవ్వలేదు. ‘ఎందుకలా?’ అని వీళ్లు అడగలేదు. ఆయనకెవరూ లేరా అనే డౌట్ కూడా వచ్చింది. అదీ అడగలేదు.
‘‘హైదరాబాద్‌లో ఇంత తక్కువ అద్దెకు ఇలాంటి ఇల్లు దొరకడం మీ అదృష్టం’’ అని చెప్పి వెళ్లిపోయాడు, ఈ ఇంటిని చూపించిన అతను. నిజమే అనిపించింది వినోద్‌కీ, వీచికకు. ‘‘నిజానికి రెంటు కూడా నాకు అక్కర్లేదు. మంచివే అయినా, లోక విరుద్ధంగా కొన్ని పనుల్ని చేయలేం. రెంటు లేకుండా మీకు నా ఇంటిని ఇవ్వొచ్చు కానీ అది లోక విరుద్ధం. రెంటు లేకుండా నా ఇంట్లో ఉండడం మీకూ లోక విరుద్ధంగానే అనిపించవచ్చు. పద్ధతులు శుభ్రంగా ఉండటం నాకు ముఖ్యం. రెంటు కాదు’’ అన్నారు పెద్దాయన. వీళ్లిద్దరూ ఆశ్చర్యపోయారు. ‘‘ఇల్లు నచ్చింది. మంచిరోజు చూసుకుని వచ్చి చేరతాం’’ అని చెప్పి.. మెట్లు దిగారు.రోడ్డు మీదకు రాగానే.. ‘‘ఆయన మనకు ఇంటిని రెంట్‌కు ఇచ్చినట్లుగా లేదు. మన ఇంటిని చూసుకోడానికి ఆయనకే మనం జీతం ఇస్తున్నట్లుగా ఉంది’’ అన్నాడు వినోద్ నవ్వుతూ. వీచిక మాట్లాడలేదు. ‘‘పర్లేదంటావా?’’ అంది, అతడి చెయ్యి పట్టుకుని. ‘ఏంటి పర్లేదా?’ అన్నట్లు చూశాడు వినోద్. ‘‘కొత్తగా కట్టిన ఇంట్లో.. అలాంటివేమీ ఉండవు కదా?’’ అంది. ‘‘ఎందుకలా అనిపిస్తోంది!’’ అన్నాడు వినోద్.
‘‘అంత పెద్దింటికి రెంట్ ఇంత తక్కువగా ఉంటేనూ! పైగా.. రెంట్ తీసుకోకపోవడం లోక విరుద్ధం కాబట్టే ఆ మాత్రం రెంట్ అయినా తీసుకోవలసివస్తోంది అని కూడా ఆయన అన్నారు..’’ అంది వీచిక. వినోద్ మాట్లాడలేదు. రోడ్డు దాటే ధ్యాసలో ఉన్నాడు. రోడ్డు దాటాక, ఇద్దరూ వెనక్కి తిరిగి ఒకసారి ఆ కొత్తింటి వైపు చూశారు. తెల్లటి బట్టల్లో ఉన్న ఆ పెద్దాయన ఇంటి బయటికి వచ్చి నిలబడి, వీళ్లనే చూస్తూ ఉండడం కనిపించింది. ‘‘ఆయన్నలా చూస్తూంటే, ఆ ఇంట్లో ఏమీ లేవని నాకు అనిపించడం లేదు’’ అన్నాడు వినోద్ నవ్వుతూ. వీచిక మళ్లీ అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. ‘‘బాల్కనీలోంచి ఏదో చప్పుడు వినిపిస్తోంది వినోద్’’ అంది భయంగా వీచిక. అదిగో అప్పుడే అన్నాడు వినోద్ పెద్దగా నవ్వుతూ..‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికి మాత్రం ఉండదా?’’ అని.ఆ ఇంట్లో వారికది ఫస్ట్ డే. ఇంట్లోని గదులు విశాలంగా, కంఫర్ట్‌గా ఉన్నాయి. ఉన్న ఒకటీ అరా సామాను హాల్లో ఓ మూలకు ఉంది. కిచెన్‌ని మాత్రం రెడీ చేసుకున్నారు..‘గృహప్రవేశం’ రోజే బయట తినడం ఎందుకని. రాత్రికి కూడా సరిపోయేలా మధ్యాహ్నమే వండేసింది వీచిక. స్నానం అయ్యాక ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం అయ్యాక వినోద్‌కి చెప్పింది వీచిక..‘‘పగలు వేసినట్లే.. రాత్రిళ్లు జోక్‌లు వెయ్యకు వినోద్. నాకు భయం’’ అని.
తెల్లారి లేవగానే వినోద్ ముఖం అలజడిగా ఉండడం గమనించింది వీచిక. ‘‘ఏంటలా ఉన్నావు?’’ అని అడిగింది.. టీ కప్పు అందిస్తూ. ‘‘ఏం లేదు’’ అన్నాడు వీచికనే చూస్తూ. తేటగా, అందంగా ఉంది ఆమె ముఖం. అక్కణ్ణుంచి నేరుగా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్లాడు వినోద్. ‘‘మీకేమైనా కనిపించాయా కొత్తింట్లో? నిజం చెప్పండి’’ అన్నాడు స్ట్రయిట్‌గా.‘‘నీకేమైనా అనిపించిందా?’’ అన్నారు పెద్దాయన!‘‘అనిపించడం ఏంటీ! కనిపిస్తేనూ..’’ అన్నాడు వినోద్ భయంగా. పెద్దాయన నవ్వారు. ‘‘నా మనవరాలికి నచ్చని పనేదో చేసి ఉంటావ్. చూద్దాం పద’’ అని, వినోద్‌తో పాటు కొత్తింట్లోకి వచ్చారు.‘‘ఇదిగో.. రాత్రి స్నానం చేశాక, ఒళ్లు తుడుచుకుని ఈ తడి టవల్‌ని తలుపు మీద కుప్పగా వేసినట్లున్నావ్’’ అన్నారు పెద్దాయన.‘‘వేస్తే?’’ అన్నాడు వినోద్.. పెద్దాయన్ని కళ్లప్పగించి చూస్తూ. ‘‘చెప్పాను కదా.. నా మనవరాలికి ఇలాంటివి నచ్చవని’’ అన్నారు పెద్దాయన. వినోద్ బిగదీసుకుపోయాడు. ‘‘మీ మనవరాలు.. ?’’ అంటూ ఆగిపోయాడు.‘‘యు.ఎస్.లో ఉంది. తనే ప్లాన్ పంపి ఈ ఇంటిని కట్టించుకుంది. ‘పద్ధతిగా ఉండేవాళ్లెవరికైనా రెంట్‌కివ్వు తాతయ్యా’ అని చెప్పి వెళ్లింది. రాత్రి నీకు జరిగిన దానిని బట్టి చూస్తే.. తన మనసంతా ఈ ఇంటిపైనే ఉన్నట్లుంది’’ అన్నారు పెద్దాయన. వినోద్ మరింత బిగుసుకుపోయాడు. ‘‘ఏంటీ.. రాత్రి జరగడం?’’ అంటూ వచ్చింది వీచిక... పెద్దాయనకు టీ అందిస్తూ. భార్యనే చూస్తున్నాడు.. వినోద్.తేటగా, అందంగా ఉంది ఆమె ముఖం. వినోద్ నమ్మలేకపోతున్నాడు.రాత్రి తన చెంపలు పగలగొట్టింది వీచికే అంటే నమ్మలేకపోతున్నాడు! పెద్దాయన మనవరాలు వీచికలోకి ప్రవేశించిందా?బతికున్నవారికి కూడా ఆత్మలుంటాయా?!
∙మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment