అద్దెల మోత..!
రాజధానిలో సామాన్యుడికి భారంగా మారిన అద్దె ఇల్లు
ఇళ్లు తక్కువగా ఉండడంతో పెరిగిన డిమాండ్
అద్దెలు పెరగడంతో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు
వ్యాపార సముదాయాలకు మరింత డిమాండ్
ఆ గ్రామానికి కచ్చితమైన బస్సు సౌకర్యం లేదు.. రైలు మార్గం అంతకన్నా లేదు... వినోదానికి సినిమా థియేటర్లు లేవు... ఆహ్లాదానికి విశేషమైన పార్కులు, రిసార్టులు లేవు... అది పర్యాటక ప్రాంతమూ కాదు... ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కానే కాదు... ఇక విశాలమైన రహదారులు లేవు.. సమస్యల్లేని డ్రైనేజీ వ్యవస్థ లేదు. కానీ అక్కడి అద్దెలు మాత్రం వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇదీ గుంటూరు జిల్లా తుళ్లూరులో పరిస్థితి.
- సాక్షి, గుంటూరు
నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరు పేరు ప్రకటించగానే అక్కడి స్థలాలకు భారీగా విలువ పెరిగిపోయింది. పంట పొలాలు ఎకరా కోట్లల్లో పలికింది. నివాస స్థలాలైతే కాస్మొపాలిటన్ సిటీలకు తీసిపోని ధరలు పలుకుతున్నాయి. మొదట్లో ఎకరం పొలం రూ. కోటి నుంచి కోటిన్నర వరకు పలికింది. అద్భుతమైన భవనాలు లేకున్నా రెండు సెంట్లు స్థలంలో నిర్మించిన ఇంటి అద్దె నెలకు రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు పలుకుతోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అయితే నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు చెబుతున్నారు. ఆరునెలలు అద్దె ముందుగానే చెల్లించాలని డిమాండ్‌చేస్తున్నారు. ఇదే అదనుగా ఇప్పటికే ఖాళీస్థలాలున్న కొంతమంది ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీస్థలాలను లీజుకు సైతం ఇస్తున్నారు. చివరకు పశువుల పాకలను సైతం కార్యాలయాలుగా మార్చి అద్దెలకు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల చిన్నపాటి వేతన జీవుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రానురాను అద్దెకు ఇల్లు దొరకడమే కష్టమవుతుందని భావించిన అనేక మంది ఒక్క గది ఉన్న ఇంటిని సైతం రూ. 5వేల నుంచి 8 వేల వరకూ చెల్లిస్తూ ఉంటున్నారు. కొంతమంది ఈ అద్దెలు భరించలేక అక్కడకి దగ్గరలో ఉన్న పల్లెల్లో అద్దెకు ఉంటూ రోజూ తుళ్లూరు వెళ్ళి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. తుళ్లూరు, సమీప ప్రాంతాల్లో భవన నిర్మాణాలు అధికంగా జరుగుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికులు అధిక ధరలు చెల్లించి ఇల్లు అద్దెకు తీసుకుని ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇవీ కారణాలు
►రాజధాని ప్రాంతంలో ఇప్పటినుంచే వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందకు వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించడం.
► బ్యాంకులు, వివిధ నగదు లావాదేవీల కార్యాలయాలు విస్తృతంగా ఏర్పాటు చేస్తుండటం.
► రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, వివిధ వ్యాపార షోరూమ్‌లకోసం ఇప్పటినుంచే భవనాలను వెదుకుతుండటం.
► ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం... అందులో పనిచేసే సిబ్బంది ఇక్కడే మకాం పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడడం.
వివిధ ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు ఇలా..
గుంటూరు నగరంలో సింగిల్ బెడ్‌రూమ్, లేదా మూడుగదులు ఉన్న ఇంటి అద్దె రూ. 5 వేల నుంచి 6 వేలవరకూ... డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ శ్యామలానగర్‌లో రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకూ... అరండల్‌పేట, బ్రాడీపేట, లక్ష్మీపురంలో రూ. 9 వేల నుంచి రూ. 14 వేల వరకూ... విద్యానగర్, ఎస్‌వీఎన్ కాలనీ, సిద్ధార్ధనగర్‌లో రూ. 7 వేల నుంచి రూ. 12 వేల వరకూ ఉన్నాయి. గుంటూరు వన్‌టౌన్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకూ ఉంది.
మంగళగిరిలో సైతం అద్దెలు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే రెట్టింపు అయింది. ఇక్కడ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఏరియాను బట్టి రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకూ ఉన్నాయి. మామూలు మూడు గదుల ఇల్లులే రూ. 5 వేలు అద్దె చెబుతున్నారు. విజయవాడలోని పటమటలో డబుల్‌బెడ్‌రూమ్ రూ. 12వేలు, ట్రిపుల్‌బెడ్‌రూమ్ 19వేలు, లబ్బీపేట, మొగల్రాజపురంలో రూ. పదివేలు, రూ. 16వేలు, మాచవరంలో రూ. 8,500, రూ. 14,000 ఉంది. ఇక వన్‌టౌన్ ఏరియాలో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రూ. 9,500, ట్రిపుల్‌బెడ్‌రూమ్ రూ. 12,000 ఉన్నాయి.