structures
-
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బఫర్ జోన్లో ఎలా నిర్మిస్తారు?
సాక్షి, హైదరాబాద్: నగ రంలోని రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మా ణం చేపట్టడం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన సంస్థ అయిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహ నం వ్యక్తం చేసింది. నగరంలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేయాలని, దీన్ని తదుపరి విచారణ రోజున కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని కుంటలు, చెరువులకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేశారు.. ఇంకా ఎన్ని చేయా లి.. పూర్తి వివరాలతో రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని చెప్పింది. రామ్మమ్మ కుంట బఫర్ జోన్ పరిధిలోని 4 ఎకరాల స్థలంలో టూరిజం పేరిట నిర్మిస్తున్న భవనానికి అక్రమంగా ఆడిటోరియం, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై తీవ్రంగా మండిపడింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం రామ్మమ్మ కుంట బఫర్ జోన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం భవనం నిర్మించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జూన్‌లో స్టేటస్ కో విధించింది.మళ్లీ ఈ పిటిషన్ గురువారం సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం ముందు విచారణకొచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తయిందని, భవనాన్ని పెంచడానికి అన్ని అనుమతులున్నందున స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు. అక్కడ విద్యనభ్య సిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మ్యాప్‌ను పరిశీలించిన ధర్మాసనం.. భవనంలో ఎక్కువ భాగం బఫర్ జోన్లో లేదని, కొద్దిభాగం మాత్రమే ఉందంది. స్టేటస్ కో ఆదేశాలను సవరిస్తూ బఫర్ జోన్లోకి రాకుండా భవన నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది. -
భూమిపై అసాధారణ నిర్మాణాలు
-
మంచుకొండల్లో మహాముప్పు.. తక్షణం అడ్డుకట్ట వేయకుంటే విధ్వంసమే
అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి. దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు. సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్‌లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్‌పోస్టులు, హెలిప్యాడ్లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఎల్ఏసీ వెంట అధిక ముప్పు.. భారత్, చైనా మధ్య 3,500 కి.మీ. పొడవునున్న వాస్తవాధీన రేఖ వెంబడి ముప్పు అధికంగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్‌హెచ్–7 జాతీయ రహదారిపై ప్రతీ కిలోమీటర్‌కి ఒక కొండచరియ విరిగిపడి రహదారులు మూతపడడం సర్వసాధారణంగా మారింది. ‘‘భారత్‌లోని హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లోనూ, అటు చైనా వైపు హిమాలయాల్లోనూ అత్యధిక ముప్పు పొంచి ఉంది. మౌలిక సదుపాయాల పేరిట చేపడుతున్న కార్యక్రమాలు శాశ్వత మంచు పర్వతాలను సైతం కుదేలు చేసే రోజులొచ్చేస్తున్నాయి. అవలాంచ్‌లు (హిమ ఉత్పాతం), కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు అత్యంత సాధారణంగా మారతాయి’’అని క్రయోస్ఫియర్ జర్నల్ ఒక నివేదికలో వెల్లడించింది. చైనా నిర్మాణాలు టిబెట్ పీఠభూమిలో ► 9,400 కి.మీ. మేరకు రోడ్డు నిర్మాణం. ళీ 580 కి.మీ. పొడవున రైల్వేలు చెంగ్డూ నుంచి లాసా వరకు రైల్వే నిర్మాణం ► సముద్రానికి 13 వేల అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతి పెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్–టిబెట్ రైల్వే లైన్ నిర్మాణం ► 2,600 కి.మీ. పొడవున విద్యుత్ లైన్లు ళీ వేలాది సంఖ్యలో భవనాలు ► అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఉత్తర చైనాకు నీటిని మళ్లించడానికి డ్యామ్‌లు ► 2050 నాటికి మంచుకొండల్లో 38.14%రోడ్లు, 38.76% రైల్వేలు ► 39.41% విద్యుత్ లైన్లు, 20.94% భవనాలే కనిపిస్తాయి. ► సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం 624 భవనాల నిర్మాణం నేపాల్ వైపు ► చైనా బెల్డ్ అండ్ ఓడ్ ఇనీషియేటివ్ కింద రాసువగాఢి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ► ఉద్యాన వనాలు ► హైడ్రోపవర్ ప్రాజెక్టులు ► 240 కోట్ల డాలర్ల విలు వైన ప్రాజెక్టులు ► పాంగాంగ్ సరస్సుపై సైనిక అవసరాల కోసం వంతెన భారత్ నిర్మాణాలు ► హిమాలయాల్లో 30 అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ► అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిమ్‌లలో వాయువేగంతో సాగుతున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాలు ► 900 కి.మీ. పొడవునా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్లను కలిపేలా చార్ధామ్ ప్రాజెక్టు ► 283 కి.మీ. పొడవునా నిమ్ము–పదమ్–దర్చా (ఎన్పీడీ)హైవే ► చైనాతో వివాదంలో ఉన్న 3,500 కి.మీ. సరిహద్దుల పొడవునా రోడ్లు, టన్నెల్స్, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్స్, హెలిప్యాడ్స్ నిర్మాణం ► చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? ► అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాల్లో వర్షాకాలాలు బీభత్సంగా మారనున్నాయి. ► సింధు నదికి సమీపంలో చిలాస్‌లో డ్యామ్‌లు కట్టడంతో ఒక నెలలో దాని పరిసర ప్రాంతంలో 300 సార్లు భూకంపం సంభవించింది. ► సరిగ్గా అలాంటి ముప్పే హిమాలయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ► అవలాంచ్‌లు ముంచెత్తి సరస్సులు విస్ఫోటనం చెందుతాయి ► కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదముంది. టిబెట్‌లోని బొమి ప్రాంతంలో దశాబ్దాల క్రితం కట్టిన వంతెనలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. ► ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవకుండానే భూకంపాలు, కొండచరియలు, అలవాంచ్లతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని, మరింత ప్రమాదంలోకి హిమాలయాలు వెళ్లిపోయాయని ఓల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూస్ కాబ్ అంచనా వేస్తున్నారు. ► భారత్‌లో 23 హిమానీనదాలతో అత్యంత ప్రమాదముందని నిపుణులు గుర్తించారు. ► భారత్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాల్లో 85% హిమాలయాల్లోనే సంభవిస్తున్నాయి. కొండచరియలు ముప్పు కలిగిన టాప్–5 దేశాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి. ► హిమాలయాల్లో ఉన్న హిమానీ నదాలు 2035 నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాతి.. చిర ఖ్యాతి!
సాక్షి, హైదరాబాద్: పాత రాతి కట్టడాలు చూస్తే వాటిల్లోని శిల్పాలు అబ్బురపరుస్తాయి. వాటిని చెక్కిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ మండపాలు, ప్రాకారాలు, గోపురాలు.. ఒకటేమిటి అన్నీ కట్టిపడేస్తాయి. కారణం.. అవన్నీ రాతి నిర్మాణాలే. 17వ శతాబ్దంలో జటప్రోలు దేవాలయాల నిర్మాణాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆ స్థాయిలో రాతి నిర్మాణాలు జరగలేదు. ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగాక నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది. రాతి కట్టడాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ అలనాటి అబ్బురాన్ని కళ్లకు కట్టేలా రెండు భారీ రాతి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటు యాదాద్రి.. అటు శ్రీరామానుజుల సహస్రాబ్ధి ప్రాంగణం.. సనాతన సంప్రదాయ నిర్మాణ విధానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాయి. మన శిల్పుల్లో ఆ కళ పదిలం ఎలాంటి ఆధునిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా టన్నుల బరువున్న రాళ్లను పేర్చి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసి శిల్పులు అద్భుతాలు çసృష్టించారు. అయితే ప్రస్తుతం ఆలయాల్లోని మూలవిరాట్టు మినహా మిగతా భాగాలకు రాతితో పని అవసరం లేని సమయంలో నేటి శిల్పుల చేతుల్లో నాటి పనితనం ఉండదన్న అనుమానాలుండేవి. కానీ ఈ రెండు మందిరాలను నిర్మించి వారు నాటి శిల్పుల వారసులేనని నిరూపించారు. యాదాద్రి, రామాను జుల సహస్రాబ్ది మందిరాల్లో దాదాపు 5 వేల మంది శిల్పులు అద్భుత పనితనాన్ని చూపారు. రామానుజుల ప్రాంగణంలో రాతి నిర్మాణాలు యాదాద్రి మందిరానికి 86 వేల టన్నుల నల్లరాయి యాదాద్రి మందిరాన్ని పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించారు. ఇందుకు మేలురకమైన బ్లాక్ గ్రానైట్ కోసం వివిధ ప్రాంతాలను గాలించి ప్రకాశం జిల్లా గుర్జేపల్లి ప్రాంతంలోని క్వారీని ఎంపిక చేశారు. దాదాపు 86 వేల టన్నుల నల్లరాతిని సేకరించారు. ఇందుకు రూ. 48 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ రాతిని చెక్కి ఇటు శిల్పాలు, అటు నగిషీలు, ప్రాకార రాళ్లు.. ఇలా రకరకాలుగా వినియోగించారు. మొత్తంగా యాదాద్రి ఆలయానికి 10 లక్షల క్యూబిక్ ఫీట్ మేర దీన్ని వినియోగించారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణంలో మందిరాలకు రకరకాల రాళ్లు రామానుజుల 216 అడుగుల ఎత్తున్న విగ్రహం దిగువన ఉన్న 54 అడుగుల ఎత్తున్న భద్రపీఠానికి రాజస్తాన్‌లోని బన్సీపహాడ్‌పూర్ ప్రాంతం లోని లేత గులాబీ రంగు ఇసుక రాయిని వాడారు. మౌంట్అబూ ప్రాంతంలోని శిల్పుల చేత దాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ వినియోగించారు. సమతామూర్తి చుట్టూ విస్తరించి ఉన్న 108 దివ్యదేశ మందిరాల్లోని గర్భాలయ అంతరాలయాలకు ఏపీలోని కోటప్పకొండ, మార్టూరు పరిసరాల్లోని బ్లాక్ పెరల్ గ్రానైట్‌ను వాడారు. దివ్య మండపంలో హోయసల, కాకతీయ శైలిలో ఏర్పాటు చేసిన 468 స్తంభాలకు రాజస్తాన్‌లోని బేస్లానా బ్లాక్ మార్బుల్ (నల్ల చలువరాయి) వినియోగించారు. కాంచీపురం సమీపంలోని వాలాజా ప్రాంతంలోని కృష్ణ పురుష శిలను ఆలయాల్లోని ప్రధాన మూర్తులకు వాడారు. మరో 12 రోజుల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహణ జరగబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా 216 అడుగుల భారీ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణం 17వ శతాబ్దం తర్వాత తగ్గిన రాతి నిర్మాణాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరికెళ్లినా రాతితో నిర్మించిన చారిత్రక మందిరాలు దర్శనమిస్తాయి. శాతవాహనులు మొదలు కాకతీయులు, విజయనగర రాజుల వరకు నిర్మాణాలన్నీ రాతితోనే జరిపించారు. డంగు సున్నం మిశ్రమాన్ని నిర్మాణాలకు వినియోగించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా రాతికి రాతికి మధ్య బైండింగ్ వరకే దాన్ని వాడారు తప్ప ఆలయాల నిర్మాణానికి అంతగా వినియోగించలేదు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని దక్కన్ సుల్తాన్‌ను ఓడించిన తర్వాత భారీ రాతి నిర్మాణాలు పెద్దగా జరగలేదు. తర్వాత సంస్థానాలు కొలువుదీరాక 17వ శతాబ్దంలో కొన్ని పెద్ద రాతి దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. జటప్రోలు సంస్థానాధీశులు స్థానికంగా మదనగోపాల స్వామి దేవాలయం, కృష్ణా తీరంలోని మంచాలకట్ట మాధవస్వామి దేవాలయాలు నిర్మించారు. మళ్లీ 3 శతాబ్దాల తర్వాత 1910లో వనపర్తి సంస్థానాధీశులు పెబ్బేరు సమీపంలోని శ్రీరంగాపురంలో రంగనా«థ స్వామి ఆలయాన్ని రాతితో నిర్మించారు. కానీ అది చిన్నగా ఉండే ఒకే దేవాలయం. జటప్రోలు దేవాలయాల తర్వాత ఇంత కాలానికి అత్యంత భారీగా, పూర్తి రాతితో నిర్మించిన దేవాలయం యాదాద్రి. రామానుజుల సహస్రాబ్ధి మందిరాలు కూడా కొంతభాగం సిమెంటు నిర్మాణాలు పోను ప్రధాన మందిరాలను రాతితోనే నిర్మించారు. నగరం నడిబొడ్డున నౌబత్ పహాడ్‌పై పాలరాతితో నిర్మించిన బిర్లామందిరం కూడా రాతి కట్టడమే అయినా తెలుగు ప్రాంతాల సంప్రదాయ శైలికి భిన్నమైంది. -
అమరావతికి ఎంత ఖర్చుచేశారు?
సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చుచేశారు.. నిర్మాణాలన్నింటినీ ఆపేయడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టం ఎంత.. తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టంచేసింది. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతోపాటు పలు ఇతర అభ్యర్థనలతో గతంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన త్రిసభ్య ధర్మాసనం, వాటిపై గురువారం మరోసారి విచారణ జరిపింది. నిర్మాణాలపై చేసిన వ్యయం ప్రజల డబ్బు అని.. అది దుర్వినియోగమైతే చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది. ఖజానాకు వాటిల్లిన నష్టానికి బాధ్యులెవరు.. దానిని ఎలా రాబట్టాలన్న విషయాలను తదుపరి విచారణల్లో తేలుస్తామని తేల్చిచెప్పి తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలను కూడా 14న విచారణకు రానున్న వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గతంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలూ విచారణకు రాగా, బిల్లులు చట్టాలుగా మారాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు నిరర్థకమని అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి తెలిపారు. అయితే, ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని 14న రానున్న వ్యాజ్యాలకు జతచేసింది. ఇలా మిగిలిన అన్ని వ్యాజ్యాలను కూడా 14వ తేదీ వ్యాజ్యాలకు జతచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే, నవరత్నాల ఇళ్ల పట్టాల వ్యాజ్యాలను మాత్రం వాటితో జతచేయలేదు. -
ఏడాదిన్నరలో గృహప్రవేశం
సాక్షి, హైదరాబాద్: కనీసం మూడేళ్లయినా వేచి ఉండనిదే గృహ ప్రవేశం చేయని ఈ రోజుల్లో.. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసి, కొనుగోలుదారులకు అప్పగిస్తే? ప్రాజెక్ట్ విస్తీర్ణం చిన్నగా ఉన్నా.. వసతుల విషయంలో ఏమాత్రం తగ్గకపోతే? .. వీటన్నింటికీ ఒకటే సమాధానం చిన్న ప్రాజెక్ట్‌లు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజñ క్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. వసతులకు కొదవేంలేదు.. గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాకింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్‌లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్‌లో ఉండే కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
రూ.375 కోట్లతో పోలీస్ ఆఫీసులు
►9 జిల్లాల్లో టెండర్లు పూర్తి ►ఏడాదిన్నరలో నిర్మాణాలు పూర్తి: హౌజింగ్ ఎండీ మల్లారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు పోలీస్ హెడ్క్వార్టర్ల నిర్మాణంపై పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ కార్యాచరణ వేగవంతం చేసింది. కొత్తగా 13 జిల్లాల్లో హెడ్క్వార్టర్లు, 2 కమిషనరేట్ల నిర్మాణంపై టెండర్ల ప్రక్రియను తుదిదశకు చేర్చింది. 9 జిల్లాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్ (డీపీఓ) నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. 2 కమిషనరేట్లతోపాటు మరో 4 హెడ్క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తికానుంది. ఒక్కో పోలీస్ హెడ్క్వార్టర్ల నిర్మాణానికి మొత్తం రూ.25 కోట్లు ప్రభుత్వం కేటాయించగా, ఇందులో అడ్మినిస్ట్రేటివ్ భవనానికి రూ.12 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్, ఎస్పీ కార్యాలయం, నివాస భవనం, అదనపు ఎస్పీ కార్యాలయం, నివాస భవనం, ఏఆర్ హెడ్‌క్వార్టర్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ తదితర నిర్మాణాలకు మిగతా నిధులను వినియోగించనున్నారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ రామగుండం, సిద్దిపేటలో కమిషనరేట్లను నిర్మించనున్నారు. ఈ రెండింటికి కూడా రూ.25కోట్లతో భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం రూ.375 కోట్లతో పోలీస్ నూతన కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, వీటి నిర్మాణం మొత్తం పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణలోనే జరుగుతోందని హౌజింగ్ ఎండీ మల్లారెడ్డి తెలిపారు. టెండర్లు పూర్తయిన వాటికి దసరా తర్వాత భూమిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ మొత్తం నిర్మాణాలను పనులు ప్రారంభించిన ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
• అధికారులు సమన్వయంతో పనిచేయాలి • నత్తనడకన మిషన్ భగీరథ, ఇళ్ల నిర్మాణం • షెడ్యూల్ ప్రకారం జరిగేలా కలెక్టర్లు చూడాలి • డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి • ఐదు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు విజయవంతం కావాలంటే జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. యువ కలెక్టర్లు ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి తమకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. అయితే కలెక్టర్లకు పనులపై అవగాహన కలగడం లేదా, పట్టించుకోవడం లేదా అనేది అర్థం కావడం లేదన్నారు. మంగళవారం హన్మకొండ నక్కలగుట్టలోని నందనా గార్డెన్స్‌లో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లతో మిషన్ భగీరథ పనులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇతర జిల్లాలతో పోలిస్తే మిషన్ భగీరథ, గృహ నిర్మాణ పనుల్లో వెనుకబడి ఉండటం విచారకరమన్నారు. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, తమ స్థాయిలో ఉన్న సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించి పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయించవలసిన వాటిని ప్రభుత్వానికి పంపాలని కోరారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులు గడువు నిర్ధే శించిన సమయంలో పూర్తి చేయకుండా గడువు మీద గడువులు విధిస్తున్నారంటూ అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ కాంటాక్ట్ ఏజెన్సీలే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో పర్యావరణ అనుమతులు రాక ఆలస్యమవుతుందని మిషన్‌భగీరథ సీఈ సురేష్ ప్రస్తావించగా.. తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కడియం ప్రశ్నించారు. గృహ నిర్మాణంపై... సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం 400 రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేసిందని, త్వరలో వాటిని వెయ్యికి పెంచే అవకాశం ఉందని అన్నారు. 31 జిల్లాల్లో పనులు ప్రారంభమయ్యాయని, కలెక్టర్లు బాధ్యత తీసుకొని ఇంజనీర్లతో పనులు పూర్తయ్యేట్లు చూడాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా చెల్లింపులు చేపట్టాలని, వీటి కొరకు రూ.567 కోట్ల ఉన్నాయని ఇంకా రూ.500 కోట్లు అవసరం అవుతాయన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు మొదలు పెట్టాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంట్రక్టర్లు చాలా మంది ఉన్నారని, ఇళ్ళ నిర్మాణం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టి వేగవంతం చేయాలన్నారు. గిరిజన సంక్షేమ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు రెండూ పేద ప్రజల జీవితంలో మార్పుతోపాటు వారు ఆరోగ్యకరమైన జీవనం గడపడానికి దోహద పడతాయని, వీటిని లక్ష్యాలకనుగుణంగా పూర్తిచేయడంతో అందరం సమిష్టిగా పనిచేద్దామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ మాట్లాడుతూ.. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. న్యాయపరమైన వివాదాలు లేని ప్రదేశాల్లో, ఇంతకు ముందు శంకుస్థాపన చేసిన చోటే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కలెక్టర్లు వీటి నిర్మాణంపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వీలైతే కంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేయించాలన్నారు. వచ్చే మార్చి నాటికి ‘మిషన్’ పూర్తికావాలి మిషన్ భగీరథ పనులు 2018 మార్చి నాటికి పూర్తి కాలవాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లు టైం షెడ్యూల్ పాటించాలని, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ మిషన్ భగీరథకి సంబంధించి జిల్లాలో ఎటువంటి సమస్యలూ లేవని, గట్టుదుద్దేనపల్లి నుంచి హుజూరాబాద్‌కు వచ్చే రహదారి జాతీయ రహదారిగా మారడం వలన ఆ సంస్థ నుంచి అనుమతి వచ్చాక పనులు ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. అంబేద్కర్‌నగర్, ఎస్ఆర్ నగర్లలో రెండు పడకల గదుల నిర్మాణం మొదలయ్యాయని, శిఖం భూముల్లో ఇళ్ల నిర్మాణానికి వ్యయం పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాకు 2689 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా 2289 ఇళ్లకు పరిపాలనాపరమైన అనుమతి వచ్చిందని, 1804 ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, 1384 ఇళ్ల నిర్మాణం మొదలైందని తెలిపారు. జనగామ కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ మిషన్ భగీరథకు సంబంధించి ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని, ప్రజాప్రతినిధుల సహకారంతో పనులు వేగవంతం కావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి మాట్లాడుతూ మైలారంలో యాబై శాతం పనులు పూర్తయ్యాయని, జూన్ చివరి నాటికి వంద శాతం పనులు పూర్తవుతాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల సహకారంతో మిషన్ భగీరథ పనులు సవ్యంగా జరుగుతున్నాయన్నారు. జిల్లాకు 1780 ఇళ్లు మంజూరు కాగా 1360 ఇళ్లకు పరిపాలన పరమైన అనుమతి వచ్చిందని, 900 ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీన మాట్లాడుతూ పనుల ప్రగతిని వివరించారు. పరకాల పట్టణానికి తాగునీరు అందడం లేదని, దీనికి కారకులైన వారిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమావేశంలో కోరారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో తాగునీటి సరఫరా పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌లు కోరారు. జనగామ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించి ముందుకు సాగుతున్నామని, కాంట్రాక్టర్లు కూడా మరింత వేగంతో పనులు నిర్వహించాలని ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. అనంతరం సీనియర్ ఐఎఎస్ అధికారిని స్మిత సబర్వాల్ మాట్లాడుతూ మిషన్ భగీరథ కింద చేసే ప్రతి పనిని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అక్కడే ఉండి పర్యవేక్షించడం జరుగుతుందని, మెగా, ఎన్సీసీ కంపెనీలు గతంలో పనులు వేగంగా చేశారని, ప్రస్తుతం నెమ్మదిగా నిర్వహిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్లు రొనాల్డ్, వెంకట్రాంలను ఉదహరిస్తూ అవసరమైనప్పుడు వారి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. చివరగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు పరిపాలనపై పట్టు పెంచుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పనిసరిగా భాగస్వాములై ఇతరులకు ఆదర్శం కావాలన్నారు. కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన పనులను సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక బద్దంగా తయారు చేసుకొని అందుకు అనుగుణంగా కాల వ్యవధిని నిర్దేశించుకోవాలన్నారు. ఆ కాల వ్యవధి ప్రకారం పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, పార్లమెంట్ సభ్యులు సీతారాంనాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, నగర మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, మిషన్ భగీరథ ఎస్ఈ యేసురత్నం, గృహ నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించిన ఐదు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
‘డబుల్’ వేగం పెంచాలి
నిర్మాణాల్లో మేస్త్రీల సహాయం తీసుకోండి ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ సూచన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మెట్పల్లిలో సమీక్ష మెట్పల్లి(కోరుట్ల) : పేదలకు ప్రభుత్వం మంజూరుచేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో మేస్త్రీల సహాయం తీసుకోవాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. మెట్‌పల్లిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 1600 ఇళ్ల నిర్మాణాలకు పలుమార్లు టెండర్లు ఆహ్వానించినా.. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే సిమెంట్ కంపెనీలతో మాట్లాడి సిమెంట్ బస్తాను రూ.230కి ఇచ్చేలా యజమానులను ఒప్పించారు. ఇసుకను సైతం తక్కువ ధరకు అందించేలా తాము చూస్తామని వెల్లడించారు. ఇళ్లు మంజూరైన పట్టణాలు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు మేస్త్రీలు ముందుకు వచ్చేలా చొరవ తీసుకోవాలని, వారికి అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. మేస్త్రీల సహకారంతో ఇటీవలే మరుగుదొడ్లను పూర్తిచేశామని, అదేస్ఫూర్తితో ఇళ్లనూ నిర్మించాలని సూచించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గానికి 560 ఇళ్లు కేటాయించారని, వాటిని పూర్తిచేస్తే సీఎంతో మాట్లాడి అదనంగా మరో వెయ్యి ఇళ్లను మంజూరు చేయిస్తామని వివరించారు. అనంతరం మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 26లోపు వందశాతం నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీవోపై ఆగ్రహం ఇబ్రహీంపట్నం ఎంపీడీవో శశికుమార్ పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తిచేయడం సాధ్యం కాకపోవచ్చని ఎంపీడీవో పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇతర మండలాల ఎంపీడీవోలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే నువ్వెందుకు వెనుకడుగు వేస్తున్నావ్.. సాధ్యం కాదని ఎలా అంటవ్..’ అంటూ హెచ్చరించారు. సరిగ్గా పనిచేయకుంటే చర్యలు తప్పవని మందలించారు. కార్యక్రమంలో సబ్Œ కలెక్టర్ ముషారఫ్‌అలీ, పంచాయతీరాజ్ ఈఈ మనోహర్‌రెడ్డి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కబ్జాదారుల చెరవీడిన పార్కు
– అక్రమ కట్టడాల్ని కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది – ఆక్రమణలపై స్థానికుల ఆగ్రహం – సాక్షి కథనానికి స్పందన విజయవాడ (గాంధీనగర్) : కోట్లాది రూపాయల విలువచేసే కార్పొరేషన్ స్థలం కబ్జాకోరుల చెరవీడింది. సాక్షి కథనంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. ‘పార్కులపై కబ్జాకాండ’ శీర్షికతో శుక్రవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు నగర శివారు కండ్రికలోని పార్కు స్థలంలో టీడీపీ ప్రజాప్రతినిధులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు. నాలుగు ఇళ్ళు, ఒక రేకుల షెడ్డును పొక్లెయినర్ సహాయంతో నేలమట్టం చేశారు. కబ్జాలపై భగ్గుమన్న ప్రజాగ్రహం కబ్జా బాగోతాలపై అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ స్థలాలు, శ్మశానవాటికలు కబ్జాకు గురవుతున్నాయంటూ కండ్రిక వాసులు ఆరోపించారు. పేదలు కాల్వగట్లపై ఇళ్లు నిర్మించుకుంటే తొలగించే అధికారులు కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను కాజేస్తుంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్కు స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారా? అంటూ అక్కడికి వచ్చిన టౌన్‌ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేసే సమయంలోనే అక్కడ ఆందోళన చేపట్టారు. సీపీఐ నాయకులు సైతం అధికారులు తీరును ఎండగట్టారు. -
నిధులు.. మిగులు
♦ మూలుగుతున్న సీడీపీ నిధులు ♦ ఒక్కో నియోజకవర్గానికి ఏడాదికి రూ.75 లక్షలు ♦ రెండో ఏడాదిలో ఖర్చు కాని రూ.2.91 కోట్లు ♦ గత ఏడాదిలో రూ.5.31 లక్షలకు మోక్షం లేదు ♦ మంజూరైన పనుల్లోనూ నత్తనడకన నిర్మాణాలు ♦ శంకుస్థాపన చేసి నెలలు గడిచినా ఎక్కడివక్కడే.. ‘ఇది ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్‌లోని రోడ్డు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఇక్కడ సీసీ రోడ్డు వేయడానికి సీడీపీ నిధులు రూ.5 లక్షలతో పనులకు శంకుస్థాపన చేశారు. రెండు నెలలు గడిచినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో రోడ్డంతా బురదమయం అవుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’ సీడీపీ నిధులుండి పనులు మొదలు కాకపోవడం, పనుల ప్రతిపాదనలు పంపించినా ఇంకా మంజూరు కాకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద మంజూరవుతున్న నిధులు మూలుగుతున్నారుు. - సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం : ప్రతి ఏటా ఒక్కో నియోజకవర్గానికి రూ.75 లక్షలు మంజూరవుతాయి. రెండో ఏడాది పూర్తయినా పలు నియోజకవర్గాల్లో సీడీపీ నిధులు రూ.2.91 కోట్లు మూలుగుతున్నాయి. ప్రతి ఏటా మంజూరయ్యే నిధులకు ఎమ్మెల్యేలు అదే ఏడాది పనులను ప్రతిపాదిస్తే సీడీపీ నిధులను ఖర్చు చేస్తారు. ఎమ్మెల్యేలు ఏడాదికి మంజూరయ్యే పనులనే ప్రతిపాదించాలి. గత ఏడాది పనులను ప్రతిపాదించకపోవడంతో రూ.5.31 లక్షలు మిగిలాయి. రెండో ఏడాది పూర్తయినా రూ.2.91 కోట్లు అలానే ఉన్నాయి. ఇప్పటికే మంజూరైన పనులు మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపంతో నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా డ్రెయినేజీలు, కల్వర్టులు, కమ్యూనిటీ హాళ్ల పనుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు అధికారులను పనుల పురోగతిపై ప్రశ్నించినా వేగిరం మాత్రం కావడం లేదు. మంచినీటి సరఫరా, నీటి కుంటలు, డ్రెయినేజీలు, కల్వర్టులు, చిన్న బ్రిడ్జిలు, గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు, లింకు రోడ్లు, అప్రోచ్ రోడ్లు, ఫుట్ పాత్‌లు, ప్రభుత్వ పాఠశాలలకు మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీలు, కమ్యూనిటీ హాళ్లు, ఉర్దూఘర్ ఇలా సీడీపీ కింద 18 రకాల పనులను ఎమ్మెల్యేలు పెట్టుకోవచ్చు. ప్రతిపాదించినా మంజూరులో తాత్సారం ఖమ్మం, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు పలు పనులను ప్రతిపాదించినా.. మంజూరులో మాత్రం తాత్సారం జరుగుతోంది. ఓ వైపు శంకుస్థాపన చేసిన పనులు ముందుకు సాగకపోవడం, పంపిన పలు పనుల ప్రతిపాదనలకు మంజూరు చేయడంలో ఇటు ప్రభుత్వం, అటు అధికారులు అలసత్వం వహిస్తున్నారని గ్రామ, మండలస్థాయి ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా మంజూరయ్యే సీడీపీ నిధుల పనుల ప్రతిపాదనలు వెంటనే మంజూరై, పనులు వెంటనే చేస్తే గ్రామాలకు మహర్దశ పడుతుంది. కానీ మంజూరు, శంకుస్థాపనలు చేసినా పనులు ప్రారంభం కాకపోవడంతో సీడీపీ నిధులు ఏళ్లయినా ఖర్చు కావడం లేదు. -
111 జీఓకు తూట్లు..!
♦ అడ్డగోలుగా లేఅవుట్లు.. ♦ వెలిసిన నిర్మాణాలు 12,442 ♦ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో లెక్కతేల్చిన ♦ జిల్లా యంత్రాంగం ఆక్రమణల జాబితాలో సర్కారీ భవనాలు జీవసంరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్)లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలిశాయని ప్రభుత్వం లెక్క తేల్చింది. నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ జారీచేసిన 111 జీఓ అమలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలోని 83 గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన జిల్లా యంత్రాంగం.. ఆక్రమణల జాబితాను రూపొందించింది. 111జీఓ బేఖాతరు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని శంషాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచా రించిన ట్రిబ్యునల్ 111జీఓ అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలో పక్షం రోజులుగా పంచాయతీ కార్యదర్శులు జీఓ పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జీఓ 111లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో విస్మయ పరిచే వాస్తవాలు వెలుగుచూశాయి. గతంలో రెవెన్యూ యంత్రాంగం చేసినప్పటి కంటే ఎక్కువగా ఆక్రమణలు పుట్టుకొచ్చాయని తేలింది. అనధికార లేఅవుట్లు, అనుమతిలేకుండా నిర్మాణాలు రావడం.. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు, రైస్‌మిల్లులు, శీతల గిడ్డంగులు, ఇటుకబట్టీలు, మార్బుల్, ఫర్నీచర్ యూనిట్లు, విద్యాసంస్థల బహుళ అంతస్తు భవనాలు, సంపన్నవర్గాల రిసార్టులు వెలిశాయని స్పష్టమైంది. జంట జలాశయాలు కలుషితం కాకుండా.. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా పరీవాహక ప్రాంతంలో పరిశ్రమలు, నిర్మాణాలు రాకుండా అడ్డుకునేందుకు జీవసంరక్షణ మండలి(111జీఓ)ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాణాలు, పరిశ్రమల స్థాపనపై ఆంక్ష లు విధించింది. అయితే, జీఓ అమలులో అధికారయంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఈ క్రమంలోనే 111 జీఓను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం.. సమగ్ర నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని ట్రిబ్యునల్ స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం గ్రామాల వారీగా సర్వేచేసి అక్రమార్కుల చిట్టా రూపొందించింది. పుట్టుకొచ్చిన 426 లేఅవుట్లు శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో 426 లేఅవుట్లు వెలిశాయని లెక్క తీసింది. ఇందులో ప్రధానంగా శంషాబాద్ గ్రామ పరిధిలో ఏకంగా 60 లేఅవుట్లు పుట్టుకొచ్చాయని గుర్తించింది. మిగతా గ్రామాల విషయానికి వస్తే సురంగల్‌లో 30, చిలుకూరులో 22, నర్కుడలో 28, పెద్దషాపూర్ 20, తొండుపల్లిలో 19, కేతిరెడ్డిపల్లి, పెద్దమంగళారం గ్రామాల్లో 15 లేఅవుట్లను వేసినట్లు సర్వేలో వెలుగు చూసింది. మొత్తం 426 లేఅవుట్లలో 12,442 ప్లాట్లు చేతులు మారిననట్లు స్పష్టమైంది. ఇందులో వాణిజ్య, గృహాలకు సంబంధించిన నిర్మాణాలే గాకుండా.. 99 పరిశ్రమలు, 86 సర్కారీ భవనాలు కూడా కొలువు దీరాయని ప్రభుత్వం అంగీకరించింది. వీటిలో విద్యుత్ సబ్స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు, పోలీస్స్టేషన్లు, పొదుపు సంఘాల భవనాలు ఉన్నట్లు ఒప్పుకుంది. అదే క్రమంలో జీఓ పరిధిలోని 8 గ్రామాల్లో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని స్పష్టం చేసింది. 40 గ్రామాల్లో 50లోపు, 26 గ్రామాల్లో 51-200లోపు, 8 గ్రామాల్లో 201-300, ఒక ఊరులో 301-400, మరో 8 గ్రామాల్లో 400 పైచిలుకు నిర్మాణాలు వెలిశాయని పంచాయతీ కార్యదర్శుల సర్వేలో తేలింది. విచిత్రమేమిటంటే.. అక్రమ కట్టడాలు వెలిసిన దాంట్లో 2,891 నిర్మాణాలు శంషాబాద్‌లో, 691 పాల్మాకులలో ఉన్నాయి. -
అద్దెల మోత..!
రాజధానిలో సామాన్యుడికి భారంగా మారిన అద్దె ఇల్లు ఇళ్లు తక్కువగా ఉండడంతో పెరిగిన డిమాండ్ అద్దెలు పెరగడంతో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు వ్యాపార సముదాయాలకు మరింత డిమాండ్ ఆ గ్రామానికి కచ్చితమైన బస్సు సౌకర్యం లేదు.. రైలు మార్గం అంతకన్నా లేదు... వినోదానికి సినిమా థియేటర్లు లేవు... ఆహ్లాదానికి విశేషమైన పార్కులు, రిసార్టులు లేవు... అది పర్యాటక ప్రాంతమూ కాదు... ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కానే కాదు... ఇక విశాలమైన రహదారులు లేవు.. సమస్యల్లేని డ్రైనేజీ వ్యవస్థ లేదు. కానీ అక్కడి అద్దెలు మాత్రం వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇదీ గుంటూరు జిల్లా తుళ్లూరులో పరిస్థితి. - సాక్షి, గుంటూరు నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరు పేరు ప్రకటించగానే అక్కడి స్థలాలకు భారీగా విలువ పెరిగిపోయింది. పంట పొలాలు ఎకరా కోట్లల్లో పలికింది. నివాస స్థలాలైతే కాస్మొపాలిటన్ సిటీలకు తీసిపోని ధరలు పలుకుతున్నాయి. మొదట్లో ఎకరం పొలం రూ. కోటి నుంచి కోటిన్నర వరకు పలికింది. అద్భుతమైన భవనాలు లేకున్నా రెండు సెంట్లు స్థలంలో నిర్మించిన ఇంటి అద్దె నెలకు రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు పలుకుతోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అయితే నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు చెబుతున్నారు. ఆరునెలలు అద్దె ముందుగానే చెల్లించాలని డిమాండ్చేస్తున్నారు. ఇదే అదనుగా ఇప్పటికే ఖాళీస్థలాలున్న కొంతమంది ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీస్థలాలను లీజుకు సైతం ఇస్తున్నారు. చివరకు పశువుల పాకలను సైతం కార్యాలయాలుగా మార్చి అద్దెలకు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల చిన్నపాటి వేతన జీవుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రానురాను అద్దెకు ఇల్లు దొరకడమే కష్టమవుతుందని భావించిన అనేక మంది ఒక్క గది ఉన్న ఇంటిని సైతం రూ. 5వేల నుంచి 8 వేల వరకూ చెల్లిస్తూ ఉంటున్నారు. కొంతమంది ఈ అద్దెలు భరించలేక అక్కడకి దగ్గరలో ఉన్న పల్లెల్లో అద్దెకు ఉంటూ రోజూ తుళ్లూరు వెళ్ళి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. తుళ్లూరు, సమీప ప్రాంతాల్లో భవన నిర్మాణాలు అధికంగా జరుగుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికులు అధిక ధరలు చెల్లించి ఇల్లు అద్దెకు తీసుకుని ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవీ కారణాలు ►రాజధాని ప్రాంతంలో ఇప్పటినుంచే వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందకు వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించడం. ► బ్యాంకులు, వివిధ నగదు లావాదేవీల కార్యాలయాలు విస్తృతంగా ఏర్పాటు చేస్తుండటం. ► రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, వివిధ వ్యాపార షోరూమ్లకోసం ఇప్పటినుంచే భవనాలను వెదుకుతుండటం. ► ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం... అందులో పనిచేసే సిబ్బంది ఇక్కడే మకాం పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడడం. వివిధ ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు ఇలా.. గుంటూరు నగరంలో సింగిల్ బెడ్రూమ్, లేదా మూడుగదులు ఉన్న ఇంటి అద్దె రూ. 5 వేల నుంచి 6 వేలవరకూ... డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ శ్యామలానగర్‌లో రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకూ... అరండల్‌పేట, బ్రాడీపేట, లక్ష్మీపురంలో రూ. 9 వేల నుంచి రూ. 14 వేల వరకూ... విద్యానగర్, ఎస్వీఎన్ కాలనీ, సిద్ధార్ధనగర్‌లో రూ. 7 వేల నుంచి రూ. 12 వేల వరకూ ఉన్నాయి. గుంటూరు వన్‌టౌన్‌లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకూ ఉంది. మంగళగిరిలో సైతం అద్దెలు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే రెట్టింపు అయింది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏరియాను బట్టి రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకూ ఉన్నాయి. మామూలు మూడు గదుల ఇల్లులే రూ. 5 వేలు అద్దె చెబుతున్నారు. విజయవాడలోని పటమటలో డబుల్బెడ్రూమ్ రూ. 12వేలు, ట్రిపుల్బెడ్రూమ్ 19వేలు, లబ్బీపేట, మొగల్రాజపురంలో రూ. పదివేలు, రూ. 16వేలు, మాచవరంలో రూ. 8,500, రూ. 14,000 ఉంది. ఇక వన్‌టౌన్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ. 9,500, ట్రిపుల్బెడ్రూమ్ రూ. 12,000 ఉన్నాయి. -
బిల్డర్లకూ ఫైన్
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర బెంగళూరు : అక్రమ-సక్రమ పథకం కింద బిల్డర్లకూ అపరాధ రుసుం విధించే విషయం ఆలోచిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. విధానసౌధాలో మీడియాతో గురువారం ఆయన మాట్లాడారు. ‘అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారి నుంచి కొంత అపరాధ రుసుం వసూలు చేసి ఆ కట్టడాలను సక్రమం చేసే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు అనుమతులు లేకుండా కట్టడాలను నిర్మించి వినియోగదారులకు విక్రయించారు. ఈ విషయం సదరు వినియోగదారులకు తెలియదు. ఇలాంటి విషయాల్లో బిల్డర్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలనే ఆలోచన ఉంది. ఈ విషయమై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నాం.’ అని వివరించారు. ఇక మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విషయమై రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై అధికారులతో చర్చించి పరిష్కృత ధరను సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తామని మంత్రి టీ.బీ జయచంద్ర పేర్కొన్నారు. మేకదాటు వద్ద జలాశయన్ని నిర్మించే విషయమై నిర్వహించిన గ్లోబల్ టెండర్ ప్రక్రియలో ఆరు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయన్నారు. ఏ కంపెనీని ఇందుకోసం ఎంపిక చేయాలన్న విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. -
గోదాముల గోడు వినరూ!
పెద్దపల్లి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గోదాముల్లో సగానికిపైగా ఖాళీగా ఉంటే.. మంత్రి హరీష్‌రావు కొత్తగా 17 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మిస్తామని ప్రకటించడంపై పలువురు యజమానులు నివ్వెరపోతున్నారు. గోదాముల నిర్మాణంలో వచ్చే సబ్సిడీ పక్కదారి పట్టించేందుకే నిర్మాణాలు చేపడుతున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్న గోదాములే నిండక రుణాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కేవలం బ్యాంకు రుణం చెల్లిస్తే చాలు తమ గోదాములే అప్పగిస్తామని పలువురు యజమానులు పేర్కొంటున్నారు. ఈ మేరకు తమ గోదాములు పరిశీలించాలని మంత్రికి లేఖ సైతం రాశారు. జిల్లాలో జమ్మికుంట, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లిలో ఒక్కొక్కటి చొప్పున ఎఫ్‌సీఐ గోదాములున్నాయి. గత ప్రభుత్వం గోదాముల నిర్మాణాలపై పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వడంతో రాజకీయ నాయకులతోపాటు కాంట్రాక్టర్లు, వ్యాపారులు ముందుకొచ్చారు. తెలంగాణలో ఎక్కడా లేనంతగా కరీంనగర్ జిల్లాలో 22 చోట్ల గోదాములు నిర్మించారు. వీటిపై ప్రభుత్వం రూ.500 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఒక్క పెద్దపల్లి డివిజన్‌లోనే 8లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించారు. వీటిని ఎస్‌డబ్ల్యూసీ, సివిల్ సప్లయ్, సీసీఐ, ఎఫ్‌సీఐ వంటి సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. ఆయా శాఖల అధికారులకు ముడుపులు అందితేనే తమ గోదాములకు బియ్యం నిల్వలు వచ్చి చేరుతాయని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా బియ్యం సేకరణ మందగించడంతో గోదాముల్లో సగానికిపైగా ఖాళీగా ఉన్నాయని, దీంతో బ్యాంకు కిస్తీలు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. ఈ ఖాళీ గోదాముల సమస్య ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉందని, కొత్త గోదాముల నిర్మాణం కంటే తమ గోదాముల నిర్వహణ చూస్తే మేలని పేర్కొంటున్నారు. ఇదో పెద్ద కుంభకోణం గోదాములు నిర్మించడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉంది. సబ్సిడీలు మింగడం, అధికారులకు పర్సెంటేజీలు అందించడం తప్ప ఒరిగేదేమీ లేదు. లక్షలాది టన్నుల సామర్థ్యం గల గోదాములు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఓ గోదాములో నేనూ భాగస్వామినే. కొత్తగా గోదాములు నిర్మిస్తే డబ్బు వృథా తప్ప ప్రయోజనం లేదు. - మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మా గోదాములు ఇస్తాం పెద్దపల్లి సమీపంలో 1.80 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాం. ప్రభుత్వం నుంచి వస్తున్న కిరాయి బ్యాంకు కిస్తీలకు సరిపోవడం లేదు. కోట్లల్లో నష్టం వస్తోంది. మా గోదాములను ప్రభుత్వానికి గోదాములను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం. వాటిపై బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు చెల్లిస్తే సరిపోతుంది. మాకు ఎలాంటి అదనపు లాభాలు అవసరం లేదు. - గీట్ల రాజేందర్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ డెరైక్టర్ -
అప్పుల్లో గూడు!
ఆరు నెలలుగా పైసా చెల్లించని టీడీపీ ప్రభుత్వం ఇంటికి లక్షన్నర దేవుడెరుగు.. కట్టుకొన్న ఇళ్లకు బిల్లులెప్పుడో వడ్డీలకు తెచ్చి ఇళ్లు నిర్మించుకొంటున్న లబ్ధిదారులు మార్చినాటికి బకాయిరూ.16.53 కోట్లు బి.కొత్తకోట: పేదల గూడు అప్పుల్లో కూరుకుపోతోంది. కొత్త ప్రభుత్వంపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇంటికి లక్షన్నర ఇస్తామని హామీఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల నడ్డి విరుస్తున్నారు. వారిని మరింత అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ఆరు నెలలైనా ఒక్కపైసా చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 23తో ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.16.53 కోట్ల చెల్లింపులు ఆగాయి. నమోదు కాని నిర్మాణాలు మార్చి నెలాఖరుతోనే జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల నమోదు ఆగిపోయింది. మండల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులు నిర్మాణాలను వదిలేశారు. జిల్లాలోని పేదలకు 4,43,009 గృహాలను మంజూరు చేశారు. వీటిలో 2,95,134 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. 31,900 పునాదుల స్థాయి, 2,130 గోడల స్థాయి, 13,170 రూఫ్లెవల్లో ఉన్నాయి. 1,00671 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టనేలేదని తేల్చారు. మే 24 వరకు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు రూ.1,236.2కోట్లను ఖర్చు చేశారు. అప్పటి నుంచి రికార్డు పరంగా ఈ లెక్కలో మార్పులేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాలను నమోదు చేయడం మానేశారు. బకాయిలు రూ.60 కోట్లు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సుమారు రూ.60కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తుందని అంచనా. వివిధ దశల్లోని నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. లబ్ధిదారులు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకొస్తున్నారు. మార్చి నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం ప్రారంభిస్తే రూ.60 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఇదిగాక మార్చిలోపున్న బకాయిలు కలుపుకుంటే రూ.75 కోట్లకుపైనే చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. లక్షన్నర ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికి రూ.లక్షన్నర ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో కనీసం కట్టుకుంటున్న ఇళ్లకైనా బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఎస్సీలకు రూ.లక్ష, బీసీ, ఓసీలకు రూ.70వేలు ఇస్తున్నారు. వడ్డీలకు తెచ్చి కడుతున్నాం నా భార్య నాగరత్నమ్మకు ఇందిరమ్మ గృహం మం జూరైంది. పునాది దశలో రూ.14 వేలు, గోడల దశలో 34 వేల బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా పైకప్పుకు మోల్డింగ్ వేస్తేనే బిల్లులు వస్తాయి లేకుంటే రావని అధికారులు చెప్పడంతో రూ.20 వేలు అప్పుతెచ్చి పైకప్పు నిర్మాణం పూర్తి చేశాం. ఇంతవరకు బిల్లులు చేతికందలేదు. -డీ.వెంకట్రమణ, పెద్దతిప్పసముద్రం అప్పులెలా తీర్చాలి ఇందిరమ్మ పథకంలో ఇల్లిచ్చారు. బిల్లులివ్వకుంటే చేసిన ఎలా కట్టుకోవాలి. గతంలో రెండు దఫాలుగా రూ.39 వేలు ఇచ్చారు. సుమారు లక్ష మేరకు అప్పుచేశాం. మిగిలిన బిల్లు కోసం అధికారులను అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వరు. ఇంటి పనులు ఆపేశాం, అప్పులు మిగిలిపోయాయి. -బి.వల్లెమ్మ, పెద్దకొండామర్రి మోల్డింగ్ పనులతో ఆపేశాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఆనందమేసింది. పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయండి బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పారు. పూర్తిచేసినా ఇప్పటివరకూ రూ.16 వేలు ఇచ్చారు. మిగిలిన బిల్లు ఇస్తే పనులు పూర్తి చేస్తామని అధికారులకు తెలిపినా పట్టించుకునేవారు లేరు. -టీ.అలివేలమ్మ, పెద్దకొండమర్రి పట్టించుకునేదెవరు ఇందిరమ్మ ఇంటికి పునాది, గోడల దశ వరకు మాత్రమే బిల్లులిచ్చారు. మూడు నెలల క్రితం ఇంటి పైకప్పు కోసం రూ.30 వేలు అప్పుచేసి నిర్మాణం పూర్తి చేయించాం. ఇంతవరకు బిల్లు మంజూరు చేయలేదు. నిర్మాణం పూర్తిచేస్తే బిల్లులు తొందరగా మంజూరు చేస్తామని చెప్పిన అధికారులు పత్తాలేరు. అప్పులకు వడ్డీలు కడుతున్నాం. -కే. రెడ్డెమ్మ, పెద్దతిప్పసముద్రం -
అవిలాల చెరువుకు మహర్దశ
నేషనల్ పార్కుగా అభివృద్ధి చేయనున్న తుడా రూ.300 కోట్లతో ప్రతిపాదనలు తిరుపతి తుడా: అవిలాల చెరువు రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో ఇక్కడ నేషనల్ పార్కును ఏర్పాటు చేసేందుకు తుడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు రూ.300 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో 180 ఎకరాల విస్తీర్ణంలో అవిలాల చెరువు ఉంది. గతంలో ఇక్కడ కొందరు అక్రమ కట్టడాలు ప్రారంభించారు. దీనికి తోడు లే-అవుట్లు వేసి ప్లాట్లు విక్రయించాలని తుడా నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది మేధావులు చెరువు పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెరువులో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆక్రమణలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం ఈ చెరువు నిరుపయోగంగా ఉండటంతో తుడా వీసీ వెంటకేశ్వరరెడ్డి దృష్టి సారించారు. ఈ చెరువును రక్షించడం, ప్రజలకు సౌకర్యంగా మార్చడంపై సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వివరాలను తుడా చైర్మన్ ఎం. వెంకటరమణకు వివరించి ఆయన ద్వారా పురపాలిక శాఖ మంత్రి నారాయణకు ప్రతిపాదనలను అందజేశారు. దీనిపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. అవసరమైతే వ్యయం ఎక్కువైనా పక్కాప్రణాళికతో అభివృద్ధి పరిచేందుకు కసరత్తుచేయాలని ఆయన సూచించారు. దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చెరువును కాపాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చాలని ఆయన నిర్ణయించుకున్నారు. నిష్ణాతులతో అవిలాల చెరువుపై అధునాతన సౌకర్యాలతో నేషనల్ పార్క్, ట్యాంక్ బండ్ స్కెచ్ గీయించారు. అందులో యోగ, స్మిమ్మింగ్‌పూల్, పార్క్, వాటర్ స్టోరేజ్, హట్స్, పిల్లల క్రీడా సముదాయం వంటి సౌకర్యాలతో ప్రణాలికను సిద్ధం చేశారు. ఇందుకు రూ.300 కోట్ల ఖర్చు అవుతందని ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తిరుపతికి తలమానికంగా నిలుస్తుంది అవిలాల చెరువులో అత్యాధునిక సౌకర్యాలతో పార్క్ ఏర్పాటయి తే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి ఇది తలమానికంగా మారుతుంది. రూ.1000 కోట్ల ఆస్తిని కాపాడటమే కాకుండా ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుంది. తుడా చైర్మన్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే చరిత్రలో మిగిలిపోతుంది. ఇందుకు మేధావులూ సానుకూలంగా ఉన్నారు. -ఐ.వెంకటేశ్వరరెడ్డి, వీసీ, తుడా -
బిల్లు రాకపాయె..ఇల్లు ఆగిపాయె!
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల్లో ఆందోళన ఆర్నెళ్లుగా విడుదల కాని బిల్లులు నిర్మాణ రంగంపై ప్రభావం కూలీలకు ఉపాధి కూడా కరువే కొత్త పథకంపైనే ఆశలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలి చిపోయాయి. ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ముందు కు రావడం లేదు. సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక ధరలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సారి ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో కూలీలకు చేతినిండా పని లేకపోగా, ఇంటి నిర్మాణాలు సైతం నిలిచిపోవడంతో పనులు దొరక్క కూలీలు వలస వెళ్లాల్సిన పరిస్థిలు నెలకొన్నాయి. ఇందిరమ్మ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు బిల్లులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే బిల్లుల చెల్లింపులు మాత్రం అందని ద్రాక్షగా మారాయి. జిల్లాలో సుమారు 1.57 లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. జిల్లాలో మూడు విడతల్లో 2,41,992 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,57,824 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, అవి ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే 84,168 ఇండ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మరో 6,956 ఇండ్లు ప్రాథమిక దశలో ఉండగా, 15,390 ఇండ్లు బేస్మిట్ లెవల్లో, 1,689 ఇండల్లు లెంట ల్ లెవల్లో , రూఫ్ లెవల్లో 5,398 ఇండ్లు ఉన్నాయి. మరో 29,433 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొన్నాయి. జి ల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 1,28,391 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన జిల్లాలో 53 శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది మా ర్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు రూ. 55,340 లక్షలు విడుదల చేసింది. అయితే గృహ నిర్మాణ అధికారులు ఇంటి నిర్మాణాన్ని బట్టి లబ్ధి దారులకు బిల్లులు చెల్లిస్తారు. బిల్లుల చెల్లింపు ఇలా.. ఇందిరమ్మ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి మొత్తం 75 సిమెంట్ బస్తాలు ఇస్తారు. ఇవి గాక బేస్మిట్ లెవల్‌కు రూ.12,380, చార్జీల రూపంలో రూ. 2,100, రూఫ్ లెవల్‌కు రూ. 25,220, చార్జీల రూపంలో రూ. 1100, ప్లాస్టింగ్ లెవల్‌కు రూ.14,400, అదనపు చార్జీల రూపంలో రూ. వెయ్యి కలిపి మొత్తం రూ. 70 వేలు మంజూరు చేసేవారు. పట్టణ ప్రాంతాల్లో 75 సిమెంట్ బస్తాలు, బేసిక్ లెవల్‌కు రూ. 12,380, అదనపు చార్జీలు రూ. 5,100, రూఫ్ లెవల్‌కు రూ. 32,120, అదనపు చార్జీల కింద రూ. 1200, ప్లాస్టరింగ్‌కు రూ. 11,200 ఇరత్రా కలిపి మొత్తం రూ. 80 వేలు చెల్లించేవారు. అదే ఎస్సీ, ఎస్టీల ఇండ్ల నిర్మాణాలకు 75 సిమెంట్ బస్తాలతో పాటు బేసిక్ లెవల్‌కు రూ. 17,380, అదనపు చార్జీలకు రూ. 200, రూఫ్ లెవల్‌కు రూ.34,670 అదనపు చార్జీల రూపంలో రూ.1650, ప్లాస్టరింగ్‌కు రూ. 33,900 అదనపు చార్జీల కింద రు. 1500 మొత్తం కలిపి రూ. 1.05 లక్షలు చెల్లించారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.05 లక్షలు, ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 70 వేలు, పట్టణ ప్రాంతల్లో రూ. 80 వేలు చెల్లించేవారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 85 వేలు, ఇతరులకు రూ. 55వేలు మాత్రమే చెల్లించారు. గృ హ నిర్మాణ సామాగ్రి పెరగడంతో ఇళ్ళ నిర్మాణానికి లబ్దిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారు. కలగానే సొంతిల్లు సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనుకున్న లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేసినా బిల్లులు మాత్రం చేతికి అందలేదు. జిల్లాలో మార్చి చివరి వారం నుంచి ఇప్పటి వరకు అధికారులు లబ్దిదారులకు బిల్లులు చెల్లించలేదు. నిర్మాణాలు పూర్తి చేసిన ఇండ్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన లబ్ధిదారులు తమ ఇండ్లను మధ్యలోనే నిలిపివేశారు. నిర్మాణాలు పూర్తయితే బిల్లులు వస్తాయి కదా అని అప్పు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు బిల్లులు చేతికి అందక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పైగా అధికారులు జిల్లా గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి నివేదిక తయారు చేసిసే పనిలో నిమగ్నమయ్యారు. రూ. 3.5 లక్షలపై ఆశలు ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ. 3.5 లక్షల చొప్పున బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు గంపె డాశతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? లేదా గత మార్చి నెలలో దరఖాస్తు చేసుకొన్న వారికి సైతం వర్తింపజేస్తారా ? అంటూ చర్చించుకొంటున్నారు. ఇప్పటి వరకు ఈ పథకంలోని విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. -
మెకానికల్ ఇంజనీరింగ్‌తో మిన్నంటే అవకాశాలు!
ప్రతి ఇంజనీరింగ్ విభాగంలోనూ సమ్మిళితమై ఉండేదే మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ నిర్మాణాలు, ఉత్పత్తులు లేని ఏ ఇతర ఇంజనీరింగ్ విభాగాన్నీ ఊహించలేం. ఇది అంతటి విస్తృత, వైవిధ్యమైన బ్రాంచ్. ఆటోమోటివ్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమల్లో మెకానికల్ ఉత్పత్తుల అవసరం తప్పనిసరి. అందుకే మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను అభ్యసించిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో.. హీట్ ఎక్ఛేంజర్స్, రిఫ్రిజిరేటర్లు, వెంటిలేషన్ సిస్టమ్స్, గ్యాస్ టర్బైన్స్, విండ్ టర్బైన్స్, బయోమెడికల్ పరికరాలు, ఆటోమొబైల్స్, వాహనాలు, రోబోటిక్స్, మెకట్రానిక్స్ తదితర యంత్ర పరికరాల డిజైన్, తయారీ విధానాలను విద్యార్థులు అధ్యయనం చేస్తారు. కొత్త ప్రొడక్ట్స్ డిజైనింగ్, రూపకల్పనతోపాటు ఎప్పటికప్పుడు కొత్త మెథడ్స్, మెటీరియల్స్‌ను అభివృద్ధి చేయడంలోనూ పాలుపంచుకుంటారు. పరిశ్రమల్లో ఉపయోగించే టూల్స్, మెషిన్స్, ఇతర మెకానికల్ ఉపకరణాల తయారీలో మెకానికల్ ఇంజనీర్లు కీలక భూమికను పోషిస్తారు. పరిశ్రమల్లో అన్నిరకాల యంత్రాల పనితీరు, వాటి మెకానిజం, డిజైన్, డెవలప్మెంట్, తయారీ, అమరిక, నిర్వహణ మెకానికల్ ఇంజనీర్ల కనుసన్నల్లోనే నడుస్తుంది. నైపుణ్యాలు మెకానికల్ ఇంజనీర్లకు విశ్లేషణాత్మక, డిజైనింగ్ నైపుణ్యాలు ఎంతో ప్రధానం. బృందంలో పనిచేసే నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు కూడా అవసరం. సృజనాత్మకత, కష్టపడి పనిచేసేతత్వం ఉన్న వారు ఈ విభాగంలో రాణిస్తారు. ఉన్నత విద్యావకాశాలు బీటెక్/బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విస్తృత ఉన్నత విద్యావకాశాలున్నాయి. టర్బో మెషినరీ, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, రొబోటిక్స్, టూల్ డిజైన్, క్యాడ్/క్యామ్, మెరైన్ ఇంజనీరింగ్ లేదా మెకట్రానిక్స్ తదితర విభాగాల్లో ఉన్నత విద్యనభ్యసించొచ్చు. గేట్ రాసి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. పీజీఈసెట్ పరీక్ష ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో చేరొచ్చు. ఐటీ లేదా మేనేజ్మెంట్ విభాగాల్లోనూ ఉన్నత విద్యనభ్యసించొచ్చు. జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్టీఎస్ తదితర పరీక్షలు రాసి విదేశాల్లోనూ ఉన్నత విద్యనభ్యసించొచ్చు. మెకానికల్ విద్యార్థుల కెరీర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విస్తృత అవకాశాలున్నాయి. మెకట్రానిక్స్, ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ, సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్, కంప్యుటేషనల్ సిమ్యులేషన్, మైక్రోఎలక్రోమెకానికల్ సిస్టమ్స్, నానో అండ్ మైక్రో మెకానిక్స్, ప్రొపల్షన్, సెన్సింగ్ అండ్ కంట్రోల్ డిజైన్, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో అవకాశాలను అందుకోవచ్చు. మరో పదేళ్లలో గణనీయమైన వృద్ధి మెకానికల్ ఇంజనీరింగ్‌లో అప్లైడ్ సైంటిఫిక్, మ్యాథమెటికల్ అంశాలపై ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్, బోధన దిశగా మంచి అవకాశాలను పొందొచ్చు. అంతేకాకుండా కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ)లోనూ ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధిత కంపెనీలైన హానీవెల్, జీఈ, సైయంట్(గతంలో ఇన్ఫోటెక్) తదితర కంపెనీల్లో సీఎఫ్‌డీ నిపుణుల అవసరం ఉన్నప్పటికీ ప్రమాణాలకు తగిన సిబ్బంది లభించడం లేదు. మరో పదేళ్లలో ఆటోమొబైల్, పవర్, ఏరోస్పేస్ పరిశ్రమల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకోనుంది. అన్ని విభాగాల్లో అవకాశాలు ఇంజనీరింగ్ అన్ని విభాగాల్లో మెకానికల్ ఇంజనీర్లకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఏరోస్పేస్ పరిశ్రమలో పరిశోధనలు, డిజైన్స్, నిర్మాణం, ఆపరేట్స్, మెయింటనెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్; ఆటోమోటివ్ పరిశ్రమ: డిజైన్స్, మాన్యుఫాక్చర్స్, మోటార్ వెహికిల్స్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. అలాగే కెమికల్, కన్స్ట్రక్షన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, మెరైన్ తదితర పరిశ్రమల్లోనూ వివిధ విభాగాల్లో అవకాశాలు అందుకోవచ్చు. టాప్ రిక్రూటర్లు ‘‘టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో టెక్నాలజీస్, అసెంచర్ తదితర ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు మెకానికల్ ఇంజనీర్ల కూడా ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. ఫ్రెషర్ల ఎంపికలో సీఎస్ఈ/ఐటీ విద్యార్థులతో సమానంగా మెకానికల్ విద్యార్థులూ పోటీ పడుతున్నారు. కోర్ కంపెనీలైన మారుతి సుజుకీ, ఎంఅండ్ఎం, ఫియట్, హ్యూందాయ్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఎల్అండ్టీ, ఐటీసీ, ఇంటర్‌గ్రాఫ్ మొదలైన సంస్థ మెకానికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. మిధానీ, బెల్, బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయి. యూపీఎస్సీ, రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఆర్ఆర్బీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కొలువులనూ సొంతం చేసుకోవచ్చు’’ - వి. ఉమామహేశ్వర్, అసోసియేట్ ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. -
మహా ‘కష్టం’ హెచ్ఎండీఏ
మబద్ధీకరణపై ఎటూ తేల్చని సర్కార్ హెచ్ఎండీఏ ఆదాయానికి కోట్లలో గండి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులకు బూజు సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు ఆర్థిక సంక్షోభం... మరో వైపు నిర్మాణాలు, లే అవుట్లు క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వ నాన్చివేత ధోరణి మహా నగరాభివృద్ధి సంస్థకు శాపంగా మారింది. నెలల తరబడి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తుండటంతో పెండింగ్ ఫైళ్లు బూజుపడుతున్నాయి. ఫలితంగా సంస్థ ఆదాయానికి కోట్లలో గండిపడుతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చన్న అధికారుల ఆశలు అడియాశలవుతున్నాయి. నగర శివార్లలో ఇంకా 80 వేలకు పైగా అక్రమ లే అవుట్లు, నిర్మాణాలున్నట్లు మహానగరాభివృద్ధి సంస్థ అధికారుల పరిశీలనలో తేలింది. వీటన్నిటినీ క్రమబద్ధీకరిస్తే మరో రూ. 200 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే మొత్తం ఫీజు చెల్లించిన వారు వెయ్యి మంది, సగం ఫీజు చెల్లిం చిన వారు 17 వేలకు పైగా దరఖాస్తుదారులున్నారు. సగం ఫీజు చెల్లించిన వారు మిగతా సొమ్మును సైతం చెల్లించేందుకు ముందుకొచ్చినా హెచ్ఎండీఏ స్వీకరించట్లేదు. ఎల్ఆర్ఎస్,బీపీఎస్‌లపై ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు ఏమీ చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పెండిగ్‌లోని దరఖాస్తులను క్లియర్ చేసినా రూ. 100 కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ 2 నెలల కిందట కొత్త ప్రభుత్వానికి హెచ్ఎండీఏ లేఖ రాసినా అటు నుంచి కనీస స్పందన లేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో ఐటీ బకాయిల కింద రూ. 485 కోట్లు తక్షణం చెల్లిచాల్సి ఉంది. ఇందుకోసం సర్కార్ నిధులు సమకూర్చక పోయినా... కనీసం ఎల్ఆర్ఎస్,బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులనైనా క్లియర్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని సచివాలయం స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫైల్ సీఎం వద్దే ఉందని వారు దాటవేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను కూడా సీఎం పర్యవేక్షిస్తున్నందున.. హెచ్ఎండీఏ ైచైర్మన్ హోదాలో చర్యలు తీసుకుని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు. ఫైళ్లు మూషికార్పణం హెచ్ఎండీఏలో ఎల్ఆర్ఎస్,బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులు క్లియర్కాక బూజుపడుతున్నాయి. తార్నాక లోని ప్రధాన కార్యాలయంలో ఓ గదిలో గుట్టలుగా పడేసిన దరఖాస్తులను ఎలుకలు నాశనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎల్ఆర్ఎస్,బీపీఎస్‌ల కింద ఇప్పటికే సగం ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులు సైతం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. అక్రమ లే అవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు (ఎల్ఆర్ఎస్,బీపీఎస్) మరో అవకాశమిచ్చే విషయాన్ని సైతం కొత్త ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం హెచ్ఎండీఏలో అయోమయం నెలకొంది. అడ్డగోలుగా లే అవుట్లు నగర శివార్లలో అడ్డగోలుగా లే అవుట్లు వెలిశాయి. వీటిలో 5 శాతం కూ డా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న పాపానపోలేదు. నిజాం పేట, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి ఎల్ఆర్ఎస్ కింద 4500 దరఖాస్తులు రాగా వీరిలో 10 శాతం కూడా ఇప్పటివరకు ఫీజు చెల్లించలేదు. శామీర్‌పేట, తూముకుంట, కొంపల్లి, కొహెడ, నాగారం, దమ్మాయిగూడెం తదితర ప్రాంతాల్లో క్రమబద్ధీకరించాల్సిన లే అవుట్లు అధికంగా ఉన్నాయి. మణికొండ, బండ్లగూడ, పీరాన్‌చె రువు, అమీన్పూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాల్లో 30-40 శాతం మేర మాత్రమే ఫీజులు వసూలయ్యాయి. వీరంతా క్రమబద్ధీకరించుకుంటే రూ. 250 నుంచి రూ. 300 కోట్లు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది. -
దిష్టిబొమ్మల్లా శిలా ఫలకాలు
- నిర్మాణాలకు నోచుకోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు - నిధులు మంజూరైనా.. నిర్లక్ష్య ధోరణిలో అధికారులు కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏదీ? జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతనంగా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించాలని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.35 కోట్ల అంచనా వ్యయం కాగల ఈ పనులకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ కాంప్లెక్స్‌లోనే ప్రభుత్వానికి చెందిన 54 ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావించడంతో, అంచనా మొత్తం రూ.100 కోట్లకు చేరింది. పూణెకు చెదిన జీకేకే కన్స్ట్రక్షన్స్ సంస్థ 8 ఎకరాల విస్తీర్ణంలో యూ ఆకారంలో ఈ కాంప్లెక్స్ నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేసింది.ప్రస్తుతం కలెక్టరేట్ 6.75 ఎకరాల స్థలంతోపాటు, పక్కనే ఉన్న జేఎన్టీయూకి చెందిన మరో 2 ఎకరాలను స్థలాన్ని సేకరించాలని అధికారులు భావించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల బాధ్యత ఆర్అండ్బీ శాఖకు అప్పగించినా ఇప్పటికీ కనీసం పునాదికి కూడా నోచుకోలేదు. ఆర్డీఓ కార్యాలయాలదీ అదే దుస్థితి జిల్లాలో నూతనంగా ఏర్పడిన కళ్యాణదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవనాలు కూడా నిర్మాణానికి నోచుకోలేదు. కల్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని 17 సెంట్లు, కదిరిలోని హిందూపురం రోడ్డులో 10 సెంట్ల స్థలం ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడంతోపాటు, ఒక్కో భవన నిర్మాణానికి రూ.2 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే, ఇప్పటికీ ఈ రెండు కార్యాలయ భవనాల పనులు ప్రారంభం కాలేదు. ఏఈ కార్యాలయాల నిర్మాణాలు అంతంత మాత్రమే.. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఒకటి చొప్పును గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 63 మండలాలుండగా ఇప్పటి దాకా 33 కార్యాలయాల భవనాల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. కాగా, అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నా భవనాల నిర్మాణంలో జాప్యానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.