‘డబుల్’ వేగం పెంచాలి
నిర్మాణాల్లో మేస్త్రీల సహాయం తీసుకోండి
ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ సూచన
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మెట్‌పల్లిలో సమీక్ష
మెట్‌పల్లి(కోరుట్ల) : పేదలకు ప్రభుత్వం మంజూరుచేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో మేస్త్రీల సహాయం తీసుకోవాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. మెట్‌పల్లిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 1600 ఇళ్ల నిర్మాణాలకు పలుమార్లు టెండర్లు ఆహ్వానించినా.. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే సిమెంట్ కంపెనీలతో మాట్లాడి సిమెంట్ బస్తాను రూ.230కి ఇచ్చేలా యజమానులను ఒప్పించారు.
ఇసుకను సైతం తక్కువ ధరకు అందించేలా తాము చూస్తామని వెల్లడించారు. ఇళ్లు మంజూరైన పట్టణాలు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు మేస్త్రీలు ముందుకు వచ్చేలా చొరవ తీసుకోవాలని, వారికి అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. మేస్త్రీల సహకారంతో ఇటీవలే మరుగుదొడ్లను పూర్తిచేశామని, అదేస్ఫూర్తితో ఇళ్లనూ నిర్మించాలని సూచించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గానికి 560 ఇళ్లు కేటాయించారని, వాటిని పూర్తిచేస్తే సీఎంతో మాట్లాడి అదనంగా మరో వెయ్యి ఇళ్లను మంజూరు చేయిస్తామని వివరించారు. అనంతరం మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 26లోపు వందశాతం నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇబ్రహీంపట్నం ఎంపీడీవోపై ఆగ్రహం
ఇబ్రహీంపట్నం ఎంపీడీవో శశికుమార్ పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తిచేయడం సాధ్యం కాకపోవచ్చని ఎంపీడీవో పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇతర మండలాల ఎంపీడీవోలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే నువ్వెందుకు వెనుకడుగు వేస్తున్నావ్.. సాధ్యం కాదని ఎలా అంటవ్..’ అంటూ హెచ్చరించారు. సరిగ్గా పనిచేయకుంటే చర్యలు తప్పవని మందలించారు. కార్యక్రమంలో సబ్Œ కలెక్టర్ ముషారఫ్‌అలీ, పంచాయతీరాజ్ ఈఈ మనోహర్‌రెడ్డి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.