Metpalli
-
నమ్మించి పిలిచి.. చంపారు! హత్యపై పలు అనుమానాలు!
జగిత్యాల: ఆదివారం రాత్రి సుమారు 11.30గంటల సమయం.. మెట్పల్లి పట్టణ శివారులోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ అది.. దాని చెంతనే నిర్మానుష్య ప్రదేశం.. ఇద్దరు స్నేహితులు కన్నం సతీశ్, నిఖిల్ అక్కడ కూర్చొని ఏదోవిషయంపై మాట్లాడుకుంటున్నారు.. సరిగ్గా అనెంనడు ఇద్దరు అక్కడకు చేరుకున్నారు.. సతీశ్‌ను తమ వద్దకు రావాలని పిలిచారు. వారి వద్దకు వెళ్లిన సతీశ్ భుజంపై చెయ్యి వేసి కొద్దిదూరం నడుచుకుంటూ తీసుకెళ్లారు.. ఆ వెంటనే ఒక్కసారిగా దాడికి దిగారు.. అప్రమత్తమైన సతీశ్.. వారిబారి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు.. నిఖిల్ అడ్డుకునేందుకు యత్నిచంగా.. దుండగులు చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. గాయాలతో పారిపోతున్న సతీశ్‌ను వెంబడించి మరీ పట్టుకొని కట్టెలు, ఇటుకలతో విచక్షణ రహితంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న సతీశ్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. నాలుగు రోజుల క్రితమే కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడు రజాక్ కూడా హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సమయంలోనే సతీశ్ హత్యకు గురికావడం అలజడి సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న పట్టణంలో వరుస హత్యలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహంతో కాలనీవాసుల ఆందోళన.. సతీశ్ మరణవార్త తెలుసుకున్న కాలనీవాసులు పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన ఇన్చార్జి డీఎస్పీ వెంకటస్వామి.. కోరుట్ల, మెట్పల్లి సీఐలతోపాటు పలువురు ఎస్ఐలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యాక అంబులెన్స్‌లో మృతుడి ఇంటికి తరలిస్తున్నారు. అయితే, మార్గమధ్యంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై కాలనీవాసులు ఆందోళనకు దిగారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సంఘటనే కారణమా? ► పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన సతీశ్(27)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరి వయసు ఏడాదిన్నర కాగా, మరొకరి వయసు రెండు నెలలు. ► జక్కం రాజేశ్, నవీన్ కలిసి సతీశ్‌పై దాడిచేసి చంపారని ఇన్చార్జి డీఎస్పీ వెంకటస్వామి సోమవారం విలేకరులకు తెలిపారు. ► అయితే.. పాత పగతోనే రాజేశ్ తన మిత్రుడు నవీన్‌తో కలిసి సతీశ్‌ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ► ఐదేళ్ల క్రితం స్థానిక మినీస్టేడియంలో రాజేశ్, సతీశ్ వర్గాల మధ్య ఓ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ► చాలారోజుల తర్వాత రాజేశ్ కోలుకున్నాడు. అప్పటి నుంచి సతీశ్‌పై కక్ష పెంచుకున్నాడు. అదను చూసి హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ► కేవలం ఈ గొడవేనా.. ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. హంతకులను పట్టుకోవడానికి రెండు బృందాలు ► మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు. ► దోషులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ► సతీశ్‌ను కొట్టి చంపిన బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ► వాటిలో ఈ దృశ్యాలు నిక్షిప్తమై ఉంటాయని భావించిన పోలీసులు.. సీసీ ఫుటేజీలు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. -
జగిత్యాలలో దెయ్యం చేప.. ఇది వేరే చేపల్నిబతకనివ్వదు!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని చెరువులు దాదాపు నిండుకుండను తలపించాయి. చెరువుల్లో చేపలు పట్టేందుకు మత్య్సకారులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చిక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపెళ్లి రాజనర్సకు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా.. దీనిని డెవిల్(దెయ్యం) చేప అంటారని, ఇది ఎక్కువుగా సముద్ర జల్లాల్లో మాత్రమే కనిపిస్తుంటుందని అధికారులు తెలిపారు. మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని పేర్కొన్నారు. కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చలు, ముళ్లు ఉంటాయి. ఈ చేప సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. తాను ఎన్నో ఏళ్ల నుంచి చేపలు పడుతున్నా ఇలాంటి చేప ఎప్పుడూ చూడలేదని జాలరు రాజనర్సు తెలిపాడు. ఒంటినిండా జీబ్రా రకం గీతలతో కనిపించే ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మం కప్పబడినట్లు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేప నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు. -
స్వచ్ఛ గ్రామంగా మెట్లచిట్టాపూర్
సాక్షి, జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగమైన ఓడీఎఫ్ ప్లస్ స్టేటస్‌కు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామం అర్హత సాధించింది. గ్రామపంచాయతీ కొత్త పాలకవర్గం ఏర్పడ్డ రెండేళ్లలోనే ఈ ఘనత సాధించిన మెట్లచిట్టాపూర్ గ్రామాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ట్విట్టర్లో అభినందించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ గ్రామం నూరుశాతం అమలు చేయడంతో ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్లస్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో మేటి మెట్లచిట్టాపూర్ గ్రామంలో 1,975 మంది జనాభా, 719 నివాసాలు ఉండగా, ఇక్కడ నూరుశాతం స్వచ్ఛ కార్యక్రమాలను అవలంబిస్తున్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్ట్ తయారీ ద్వారా రైతులు మొక్కలకు సేంద్రియ ఎరువును అందిస్తున్నారు. జంతువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాలతో వాతావరణం, నీరు కలుషితం కాకుండా గ్రామంలో జంతువుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం విశేషం. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా మురుగునీరు నిలిచిపోకుండా మ్యాజికల్ ఇంకుడు గుంతలను నిర్మించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు గ్రామానికి వచ్చే సందర్శకుల కోసం కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఈ గ్రామం స్వచ్ఛ సుందర్ సముదాయక సౌచాలయ కింద ఓడీఎఫ్ గ్రామంగా ఎంపికైంది. గ్రామస్తుల సమష్టి సహకారంతోనే.. గ్రామ పాలకవర్గం చేసిన తీర్మానాలకు గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందరి సహకారంతోనే సామూహిక మరుగుదొడ్లు, కంపోస్ట్ యూనిట్లను నిర్మించాం. బహిరంగంగా చెత్త వేయకుండా, ప్లాస్టిక్ వినియోగించకుండా గ్రామస్తులు సహకరిస్తున్నారు. – బద్దం శేఖర్‌రెడ్డి, సర్పంచ్, మెట్లచిట్టాపూర్ -
మెట్పల్లిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
‘పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఈ భవనాలకు మున్సిపల్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ అదనంగా మరో అంతస్తును నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.’ మెట్పల్లి (కరీంనగర్) : మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మా ణాలు జోరుగా సాగుతున్నా యి. టౌన్‌ప్లానింగ్ వి భాగం అధికారుల అం డతో నిబంధనలకు విరుద్ధంగా సా గుతున్న నిర్మాణాలతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మున్సిపల్ నుంచి అనుమతులు పొందకపోయిన అనుమతి తీసుకొని అంతకుమించి అంతస్తులు నిర్మిస్తున్నారు. అయినా అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణంలోని వెల్లుల్లరోడ్లో ఓ వ్యక్తికి మొదట జీ+1 భవనానికి అనుమతి ఇచ్చిన అధికారులు.. తర్వాత భవనం నిర్మాణంలో ఉండగా పాత అనుమతిని పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా జీ+2 నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఈ అనుమతి వ్యవహారా>న్ని ‘సాక్షి’ ఇటీవల బయటపెట్టింది. ఆ తర్వాత పలు కాలనీల్లో ఇలాంటి అక్రమాలను స్థానికులు ‘సాక్షి’ దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిపై పరిశీలన జరుపగా, అధికారులు మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారనే విషయం తేటతెల్లమైంది. కాసులిస్తేనే అనుమతులు ! టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ముడుపులిస్తేనే అనుమతులు జారీ చేస్తారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నిర్మాణాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ లంచం ఇస్తేనే అనుమతులు జారీ చేస్తున్నారని.. లేనిపక్షంలో దానిని షార్ట్‌ఫాల్ కింద పెండింగ్‌లో పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో తప్పనిసరిగా అనుమతులు జారీచేయాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. లేనిపక్షంలో అధికారులే జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు నిర్ధేశిత సమయంలోపు తమ చేతికి ముడుపులు అందింతే అనుమతులు జారీ చేస్తున్నారు. లేకుంటే ఏదో ఒకటి కారణాన్ని సాకుగా చూపుతూ సంబంధిత ఫైళ్లను పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని దరఖాస్తుల విషయంలో మున్సిపల్‌కు ఫీజు రాకుండా అడ్డుపడుతున్నారనే ప్రచారం ఉంది. రూ.లక్షల్లో ఫీజు అవుతుందని దరఖాస్తుదారులకు చెబుతూ అనుమతులకు బదులు తమ జేబులు నింపుకుంటూ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే... టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్న విషయం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బయటపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో 90 శాతం మేర నిబంధనలకు విరుద్ధంగానే సాగుతున్నాయి. ఇందులో కొన్ని భవనాల్లో తీసుకున్న అనుమతుల కంటే అదనంగా అంతస్తులు నిర్మించడం, మరికొన్ని అనుమతులు తీసుకోకుండానే నిర్మిస్తున్నవి ఉండడం గమనార్హం. ఇష్టారాజ్యానికి నిదర్శనమిదిగో.. పట్టణంలోని వెల్లుల్ల రోడ్లో జీ+1 అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించిన ఇంటికి అధికారులు కొత్తగా జీ+2 అనుమతులిచ్చారు. పాత అనుమతిని పక్కనపెట్టి కొత్తగా అనుమతులివ్వడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇదిలా ఉంటే.. శివాజీనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో అధికారులు జాప్యం చేయడంతో అతడు పనులు మొదలుపెట్టాడు. అనంతరం అనుమతిపత్రాల కోసం వెళితే పనులు మొదలుపెట్టిన ఇంటికివ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్నారు. కానీ వెల్లుల్ల రోడ్లో భవనానికి పాత అనుమతిని పక్కన బెట్టి కొత్తగా అనుమతులివ్వరాదు. అధికారులు అనుమతుల జారీ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. టీపీబీఓ తిరుపతమ్మకు మెమో పట్టణంలోని వెల్లుల్లరోడ్లో నిబంధనలకు విరుద్ధంగా ఓ భవనానికి అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై ‘సాక్షి’లో ఈ నెల 18న ‘సక్రమం పేరుతో అక్రమం’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దీంతోపాటు స్థానికంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై టీపీబీవో తిరుపతమ్మను సంజాయిషీ అడుగుతూ మెమో ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారని, వచ్చిన వెంటనే మెమో జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. అక్రమమైతే కూల్చివేస్తాం నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. త్వరలోనే నూతన మున్సిపల్ చట్టం అమలులోకి రాబోతుంది. దీని ప్రకారం అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాం. దరఖాస్తుదారులు మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకొని దాని ప్రకారమే భవనాలు నిర్మించుకోవాలి. అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాం. ఎక్కడైన అలాంటివి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జగదీశ్వర్‌గౌడ్, కమిషనర్ -
ముంబయి రైలుకు హాల్టింగ్
సాక్షి, కోరుట్ల(కరీంనగర్) : కోరుట్ల, మెట్పల్లి పట్టణ వాసుల కల నెరవేరింది. తొమ్మిది నెలలుగా చేస్తున్న ఉద్యమాలు ఫలించాయి. కళ్ల ముందు నుంచి వెళ్తున్న రైలులో ఎక్కాలంటే 35 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణించాల్సిన దుస్థితి తప్పింది. కరీంనగర్– ముంబయి రైలు కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో ఆగాలన్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఉంటున్న ముంబయి వాసుల ఇబ్బందులు తొలగనున్నాయి. కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో కరీంనగర్–ముంబయి రైలు ఆగాలని మంగళవారం రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది నెలలుగా... గతేడాది అక్టోబర్‌లో కరీంనగర్–ముంబయి రైలు ప్రారంభమైంది. వారానికి రెండు సార్లు నడుస్తున్న ముంబయి–కరీంనగర్ రైలు కేవలం జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న లింగంపల్లి రైల్వే స్టేషన్లో మాత్రమే ఆగడంతో కోరుట్ల, మెట్పల్లి పట్టణాల ప్రజలు ముంబయి వెళ్లడానికి అవస్థలు పడ్డారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల లేదా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వెళ్లి ముంబయి రైలులో ఎక్కాల్సిన దుస్థితి. తమ ఊళ్లలో ఉన్న రైల్వేస్టేషన్ల నుంచి ముంబయి రైలు వెళ్తున్నా తాము ఇతర ప్రాంతాలకు వెళ్లి ముంబయి రైలు ఎక్కాల్సిన దుస్థితి. కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో రైలు ఆగాలని కోరుతూ రెండు పట్టణాలకు చెందిన స్థానికులు నిరసన దీక్షలు చేపట్టారు. ముంబయికి చెందిన కోరుట్ల, మెట్పల్లి వాసులు సైతం ముంబయి రైలు ఆగాలని కోరుతూ రైల్‌రోకో ఉద్యమానికి సిద్ధమై ముంబయి రైలులోనే ప్రయాణించి రైలును కోరుట్లలోనే ఆపేందుకు యత్నించారు. ఆ సమయంలో భారీ పోలీసు బందోబస్తు కారణంగా రైలు ఆపడం వీలు కాలేదు. దీంతోపాటు రైల్వే జీఎంకు స్థానికులు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత కోరుట్ల, మెట్పల్లిలో రైలు ఆపాలని కోరుతూ రైల్వే శాఖ ఉన్నతాధికారులకు లేఖలు ఇచ్చారు. ఎట్టకేలకు ఆగనుంది స్థానికుల ఉద్యమాలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తోడుగా ఇటీవల పార్లమెంట్ సెషన్స్ కొనసాగుతున్న సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ముంబయి రైలు ఆపాలని కోరుతూ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విన్నవించారు. అనంతరం పట్టుదలతో ప్రయత్నించిన క్రమంలో ముంబయి రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా కోరుట్ల, మెట్పల్లి స్టేషన్లలో ఒక్కో నిమిషం ఆగేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులతో ఇప్పటి నుంచి ముంబయి రైలు కోరుట్ల, మెట్‌పల్లిల్లో ఆగనుంది. ఈ రెండు పట్టణాల నుంచి 60 ఏళ్ల క్రితం ముంబయికి వలస వెళ్లిన వేలాది కుటుంబాలకు స్థానికంగా రైలు ఆగడం ప్రయోజనకరంగా మారనుంది. ప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి.. ముంబయి నుంచి నిజామాబాద్ వరకు నడిచే లోకమాన్య తిలక్ రైలును గతేడాది సెప్టెంబర్ 26న కరీంనగర్‌కు వరకు పొడగించారు. ఆ సమయంలో జిల్లాలో జగిత్యాలకు సమీపంలో ఉన్న ఒక లింగంపల్లి స్టేషన్లో మాత్రమే స్టాప్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల మెట్పల్లి, కోరుట్ల ప్రాంత వాసులు నిరాశ చెందారు. ఆ తర్వాత ఈ రెండు పట్టణాల్లోని స్టేషన్లలో కూడా స్టాప్‌లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. చొరవ తీసుకున్న ఎంపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మొదట ఈ సమస్యపైనే దృష్టి సారించారు. కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల నుంచి నిత్యం ముంబయికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి. ఎందరు ఇక్కడి నుంచి అక్కడికి తరలి వెళ్తున్నారనే వివరాలతో కూడిన నివేదికను రైల్వేశాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. ఆ శాఖ మంత్రిని కలిసి రైలును రెండు పట్టణాల్లో ఆపాల్సిన ఆవశ్యకతను వివరించారు. మంత్రి అంగీకరించడంతో అధికారులు రెండు స్టేషన్లల్లో స్టాప్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారానికి ఒక రోజు సెప్టెంబర్ 1 నుంచి రెండు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రస్తుతం వారానికి ఒక రోజు మాత్రమే ఈ మార్గంలో నడుపుతున్నారు. ప్రతీ ఆదివారం రాత్రి 7:45 గంటలకు కరీంనగర్ నుంచి ఈ రైలు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. ప్రతీ శనివారం 4:40 గంటలకు అదే స్టేషన్ నుంచి ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రెండు పట్టణాల్లో స్టాప్‌లను ఏర్పాటు చేయా లని నిర్ణయం తీసుకోవడంతో ముంబాయికి రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి. -
ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలపాలి
మెట్పల్లి: వచ్చే ఎన్నికల్లో అన్ని కుల సంఘాలు టీఆర్ఎస్కు మద్దతు తెలపాలని తాజా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరారు. పట్టణంలో ఆదివారం పలు కుల సంఘాలను ఆయన కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి ఇటీవల రూ.40కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయలేదన్నారు. ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే కుల సంఘాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. అలాగే స్థానిక అంగడిబజార్‌లో విద్యాసాగర్‌రావు భార్య ప్రచారం నిర్వహించారు. వ్యాపారులను కలిసి టీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంతో పాటు, మండలంలోని వర్షకొండలో శుభకార్యాలకు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆదివారం పాల్గొన్నారు. మండల కేంద్రంలో గూడ నిహారిక శారీ ఫంక్షన్‌కు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. వర్షకొండలో వైష్ణవి,నవీన్ వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎలాల ధశరథ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోరిగం రాజు, మాజీ జెడ్పీటీసీ కోక్కు పురుషోత్తం, నాయకులు సత్యనారాయణ ,ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. కోరుట్లటౌన్: కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును గెలిపించాలని పట్టణంలోని 5వ వార్డులో టీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు గండ్ర శిల్ప, పుప్పాల ఉమాదేవి, రెంజర్ల కళ్యాణి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, అన్ని రంగాల్లో ఆసరా కల్పిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలన్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు జీవనభృతి పథకం ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందన్నారు. కోరుట్లరూరల్: టీఆర్ఎస్ పాలనలో తెలంగాణాలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని వైస్ ఎంపీపీ కాశిరెడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని యూసుఫ్‌నగర్‌లో ఆదివారం ఇంటింటా ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ టిఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ సురేష్‌గౌడ్, నాయకులు భూమయ్య, రాజ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, మెట్పల్లి: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని చౌలమద్దిలో జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం ప్రతాపరెడ్డి(30) తన వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
సాక్షి, జగిత్యాల: అకారణంగా తన తండ్రిని పోలీసులు వేధిస్తున్నారని మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం ఆరపేటలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రాజారెడ్డిని మెట్పల్లి ఎస్సై అశోక్ ఓ కేసు విచారణ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో.. ఆయన కుమారుడు దశరథ్ రెడ్డి(25) మనస్తాపానికి గురై ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ భూ వివాదం నేపథ్యంలో ఎస్సై అశోక్ వేధింపులకు గురి చేస్తుండటంతో.. ఆ కుటుంబంలో గత కొన్ని రోజులు మనశ్శాంతి కురువైంది. ఈ క్రమంలో శనివారం రాత్రి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దశరథ్ రెడ్డి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దశరథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఆగ్రహించిన అతని బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో మెట్పల్లి-కోరుట్ల మధ్య గల 63వ నెంబర్ జాతీయ రహదరిపై రాస్తారోకో నిర్వహించారు. దీనికి కారణమైన ఎస్సైని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. -
‘డబుల్’ వేగం పెంచాలి
నిర్మాణాల్లో మేస్త్రీల సహాయం తీసుకోండి ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ సూచన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మెట్పల్లిలో సమీక్ష మెట్పల్లి(కోరుట్ల) : పేదలకు ప్రభుత్వం మంజూరుచేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో మేస్త్రీల సహాయం తీసుకోవాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. మెట్‌పల్లిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 1600 ఇళ్ల నిర్మాణాలకు పలుమార్లు టెండర్లు ఆహ్వానించినా.. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే సిమెంట్ కంపెనీలతో మాట్లాడి సిమెంట్ బస్తాను రూ.230కి ఇచ్చేలా యజమానులను ఒప్పించారు. ఇసుకను సైతం తక్కువ ధరకు అందించేలా తాము చూస్తామని వెల్లడించారు. ఇళ్లు మంజూరైన పట్టణాలు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు మేస్త్రీలు ముందుకు వచ్చేలా చొరవ తీసుకోవాలని, వారికి అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. మేస్త్రీల సహకారంతో ఇటీవలే మరుగుదొడ్లను పూర్తిచేశామని, అదేస్ఫూర్తితో ఇళ్లనూ నిర్మించాలని సూచించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గానికి 560 ఇళ్లు కేటాయించారని, వాటిని పూర్తిచేస్తే సీఎంతో మాట్లాడి అదనంగా మరో వెయ్యి ఇళ్లను మంజూరు చేయిస్తామని వివరించారు. అనంతరం మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 26లోపు వందశాతం నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీవోపై ఆగ్రహం ఇబ్రహీంపట్నం ఎంపీడీవో శశికుమార్ పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తిచేయడం సాధ్యం కాకపోవచ్చని ఎంపీడీవో పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇతర మండలాల ఎంపీడీవోలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే నువ్వెందుకు వెనుకడుగు వేస్తున్నావ్.. సాధ్యం కాదని ఎలా అంటవ్..’ అంటూ హెచ్చరించారు. సరిగ్గా పనిచేయకుంటే చర్యలు తప్పవని మందలించారు. కార్యక్రమంలో సబ్Œ కలెక్టర్ ముషారఫ్‌అలీ, పంచాయతీరాజ్ ఈఈ మనోహర్‌రెడ్డి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థులు దాడి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మెట్పల్లి 7వ వార్డులో మున్సిపల్ అభ్యర్థిగా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థులు దాడులు చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అభ్యర్థి గెలుపుని జీర్ణించుకోలేకే ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
మెట్పల్లి యువతికి బంగారు పతకం
మెట్పల్లి, న్యూస్‌లైన్ : పట్టణంలోని బుక్కవాడకు చెందిన వేముల శరణ్య సెంట్రల్ యూనివర్సిటీ గోల్డ్‌మెడల్ దక్కించుకుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ఆడిటోరియంలో జరి గిన యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవంలో శరణ్య గవర్నర్ నర్సింహన్ చేతులమీదుగా ఈ మెడల్‌ను అందుకుంది. ఒకటి నుంచి పదవతరగతి వరకు పట్టణంలోనే చదివిన శరణ్య ఇంటర్, డిగ్రీలు ధర్మపురిలోని సంస్కృతి కళాశాలలో చదివింది. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ(ఎంఏ తెలుగు విభాగం) ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి సీటు పొందింది. అనంతరం జరిగిన పరీక్షల్లో ప్రతిభ కనబర్చి యూనివ ర్సిటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి గాను ఆమెను గోల్డ్‌మెడల్‌కు ఎంపిక చేశారు. హైదరాబాద్‌కు చెందిన రావూరి కాంతమ్మభరద్వాజ్ అనే స్వచ్చంద సంస్థ కూడా శరణ్యకు గోల్డ్‌మెడల్ ప్రకటించింది. ఈ సంస్థ ఏటా రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థినికి అందిస్తోంది. ఈసారి శరణ్యను ఎంపిక చేసింది. ఈ మెడల్‌ను కూడా గవర్నర్ ఆమెకు అందజేశారు. -
సోయా.. గయా..!
మెట్‌పల్లిమెట్‌పల్లి, న్యూస్‌లైన్:మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఈ ఖరీఫ్‌లో అధికారుల అంచనాకు మించి అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేశారు. పంటపై పెట్టిన పెట్టుబడి రాకపోగా అప్పులు మీదపడే దుస్థితి దాపురించింది. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల మేర నష్టం జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. సోయాకు మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే గత ఏడాది వ్యాపారులు ఎక్కువ ధరను చెల్లించారు. మద్దతు ధర నలుపు రంగు సోయా క్వింటాల్‌కు రూ.2200, పసుపు రంగు సోయాకు రూ.2240 అందించింది. వ్యాపారులు రూ.3వేల నుంచి రూ.3500 వరకు చెల్లించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఖరీఫ్‌లో రైతులు అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేశారు. సాధారణంగా మొక్కజొన్న సాగు చేసే రైతులంతా ఎక్కువగా ఈ పంటవైపు మొగ్గుచూపారు. మొక్కజొన్న కన్నా ఈ పంటకు తక్కువ వ్యయం కావడంతోపాటు స్వల్పకాలంలో పంట చేతికి వస్తుందనే ఆశించారు. జిల్లాలో సోయా సాధారణ విస్తీర్ణం 2779 హెక్టార్లు కాగా, రైతులు 20,797 హెక్టార్లలో పంటను పండించారు. ఇందులో కరీంనగర్ డివిజన్లో 270హెక్టార్లు, జగిత్యాల డివిజన్లో 7545, మల్యాల డివిజన్లో 882, సిరిసిల్లలో 175, పెద్దపల్లిలో 71, మెట్పల్లి డివిజన్లో అత్యధికంగా 11,698 హెక్టార్లలో సోయా పంట వేశారు. రైతుల నుంచి వచ్చిన డిమాండ్‌తో ప్రభుత్వం వారికి సబ్సిడీపై విత్తనాలను అందజేసింది. 30కిలోలు ఉండే ఒక బ్యాగు ధర రూ.1440 ఉండగా, సబ్సిడీపై రూ.965కు అందించింది. వీటిని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా రైతులకు సరఫరా చేసింది. కాని ఈ విత్తనాలు అంతగా నాణ్యతగా లేవని రైతులు ఆరోపిస్తున్నారు. వీటివల్ల పంట పెరగక, గింజరాక ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభం మాటేమో గాని దిగుబడి తగ్గి తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. దిగుబడిపై తీవ్ర ప్రభావం.. నాణ్యతలేని విత్తనాల వల్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. సాధారణంగా ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముండగా, ప్రస్తుతం రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 51,992 ఎకరాల్లో పంటను వేశారు. దిగుబడి ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల చొప్పున చూస్తే మొత్తం 4.15 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి రావాలి. కాని విత్తనాల్లో నాణ్యత లోపించడంతో దిగుబడిలో సగానికిపైగా తగ్గుతుందని రైతు సంఘ నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఈ ఏడాది నలుపు రంగు సోయాకు రూ.2500, పసుపు రంగు సోయాకు రూ.2560 ప్రకటించింది. మార్కెట్లో మాత్రం రూ.3వేలు పలుకుతుంది. ఈ లెక్కన తగ్గిన దిగుబడి భారీగా తగ్గనుండడంతో జిల్లాలో రైతాంగం రూ.30కోట్లు నష్టపోనున్నారు.