జగిత్యాల: ఆదివారం రాత్రి సుమారు 11.30గంటల సమయం.. మెట్‌పల్లి పట్టణ శివారులోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ అది.. దాని చెంతనే నిర్మానుష్య ప్రదేశం.. ఇద్దరు స్నేహితులు కన్నం సతీశ్, నిఖిల్ అక్కడ కూర్చొని ఏదోవిషయంపై మాట్లాడుకుంటున్నారు.. సరిగ్గా అనెంనడు ఇద్దరు అక్కడకు చేరుకున్నారు.. సతీశ్‌ను తమ వద్దకు రావాలని పిలిచారు.
వారి వద్దకు వెళ్లిన సతీశ్ భుజంపై చెయ్యి వేసి కొద్దిదూరం నడుచుకుంటూ తీసుకెళ్లారు.. ఆ వెంటనే ఒక్కసారిగా దాడికి దిగారు.. అప్రమత్తమైన సతీశ్.. వారిబారి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు.. నిఖిల్ అడ్డుకునేందుకు యత్నిచంగా.. దుండగులు చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. గాయాలతో పారిపోతున్న సతీశ్‌ను వెంబడించి మరీ పట్టుకొని కట్టెలు, ఇటుకలతో విచక్షణ రహితంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న సతీశ్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. నాలుగు రోజుల క్రితమే కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడు రజాక్ కూడా హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సమయంలోనే సతీశ్ హత్యకు గురికావడం అలజడి సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న పట్టణంలో వరుస హత్యలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
మృతదేహంతో కాలనీవాసుల ఆందోళన..
సతీశ్ మరణవార్త తెలుసుకున్న కాలనీవాసులు పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటస్వామి.. కోరుట్ల, మెట్‌పల్లి సీఐలతోపాటు పలువురు ఎస్‌ఐలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యాక అంబులెన్స్‌లో మృతుడి ఇంటికి తరలిస్తున్నారు. అయితే, మార్గమధ్యంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై కాలనీవాసులు ఆందోళనకు దిగారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ సంఘటనే కారణమా?
► పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన సతీశ్(27)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరి వయసు ఏడాదిన్నర కాగా, మరొకరి వయసు రెండు నెలలు.
► జక్కం రాజేశ్, నవీన్ కలిసి సతీశ్‌పై దాడిచేసి చంపారని ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటస్వామి సోమవారం విలేకరులకు తెలిపారు.
► అయితే.. పాత పగతోనే రాజేశ్ తన మిత్రుడు నవీన్‌తో కలిసి సతీశ్‌ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
► ఐదేళ్ల క్రితం స్థానిక మినీస్టేడియంలో రాజేశ్, సతీశ్ వర్గాల మధ్య ఓ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
► చాలారోజుల తర్వాత రాజేశ్ కోలుకున్నాడు. అప్పటి నుంచి సతీశ్‌పై కక్ష పెంచుకున్నాడు. అదను చూసి హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
► కేవలం ఈ గొడవేనా.. ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హంతకులను పట్టుకోవడానికి రెండు బృందాలు
► మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు.
► దోషులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
► సతీశ్‌ను కొట్టి చంపిన బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి.
► వాటిలో ఈ దృశ్యాలు నిక్షిప్తమై ఉంటాయని భావించిన పోలీసులు.. సీసీ ఫుటేజీలు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment