ముంబయి రైలుకు హాల్టింగ్‌ | Karimnagar To Mumbai train Will Stop On Korutla Metpally Also | Sakshi
Sakshi News home page

ముంబయి రైలుకు హాల్టింగ్‌

Published Thu, Aug 22 2019 10:28 AM | Last Updated on Thu, Aug 22 2019 10:28 AM

Karimnagar To Mumbai train Will Stop On Korutla Metpally Also - Sakshi

ముంబయి రైలు 

సాక్షి, కోరుట్ల(కరీంనగర్‌) : కోరుట్ల, మెట్‌పల్లి పట్టణ వాసుల కల నెరవేరింది. తొమ్మిది నెలలుగా చేస్తున్న ఉద్యమాలు ఫలించాయి. కళ్ల ముందు నుంచి వెళ్తున్న రైలులో ఎక్కాలంటే 35 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణించాల్సిన దుస్థితి తప్పింది. కరీంనగర్‌– ముంబయి రైలు కోరుట్ల, మెట్‌పల్లి రైల్వేస్టేషన్లలో ఆగాలన్న డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఉంటున్న ముంబయి వాసుల ఇబ్బందులు తొలగనున్నాయి. కోరుట్ల, మెట్‌పల్లి రైల్వేస్టేషన్లలో కరీంనగర్‌–ముంబయి రైలు ఆగాలని మంగళవారం రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

తొమ్మిది నెలలుగా... 
గతేడాది అక్టోబర్‌లో కరీంనగర్‌–ముంబయి రైలు ప్రారంభమైంది. వారానికి రెండు సార్లు నడుస్తున్న ముంబయి–కరీంనగర్‌ రైలు కేవలం జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఆగడంతో కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల ప్రజలు ముంబయి వెళ్లడానికి అవస్థలు పడ్డారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల లేదా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ వెళ్లి ముంబయి రైలులో ఎక్కాల్సిన దుస్థితి. తమ ఊళ్లలో ఉన్న రైల్వేస్టేషన్ల నుంచి ముంబయి రైలు వెళ్తున్నా తాము ఇతర ప్రాంతాలకు వెళ్లి ముంబయి రైలు ఎక్కాల్సిన దుస్థితి. కోరుట్ల, మెట్‌పల్లి రైల్వేస్టేషన్లలో రైలు ఆగాలని కోరుతూ రెండు పట్టణాలకు చెందిన స్థానికులు నిరసన దీక్షలు చేపట్టారు.

ముంబయికి చెందిన కోరుట్ల, మెట్‌పల్లి వాసులు సైతం ముంబయి రైలు ఆగాలని కోరుతూ రైల్‌రోకో ఉద్యమానికి సిద్ధమై ముంబయి రైలులోనే ప్రయాణించి రైలును కోరుట్లలోనే ఆపేందుకు యత్నించారు. ఆ సమయంలో భారీ పోలీసు బందోబస్తు కారణంగా రైలు ఆపడం వీలు కాలేదు. దీంతోపాటు రైల్వే జీఎంకు స్థానికులు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత కోరుట్ల, మెట్‌పల్లిలో రైలు ఆపాలని కోరుతూ రైల్వే శాఖ ఉన్నతాధికారులకు లేఖలు ఇచ్చారు.  

ఎట్టకేలకు ఆగనుంది 
స్థానికుల ఉద్యమాలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తోడుగా ఇటీవల పార్లమెంట్‌ సెషన్స్‌ కొనసాగుతున్న సమయంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ముంబయి రైలు ఆపాలని కోరుతూ రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు విన్నవించారు. అనంతరం పట్టుదలతో ప్రయత్నించిన క్రమంలో  ముంబయి రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా కోరుట్ల, మెట్‌పల్లి స్టేషన్లలో ఒక్కో నిమిషం ఆగేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులతో ఇప్పటి నుంచి ముంబయి రైలు కోరుట్ల, మెట్‌పల్లిల్లో ఆగనుంది. ఈ రెండు పట్టణాల నుంచి 60 ఏళ్ల క్రితం ముంబయికి వలస వెళ్లిన వేలాది కుటుంబాలకు స్థానికంగా రైలు ఆగడం ప్రయోజనకరంగా మారనుంది.  

ప్టెంబర్‌ 1 నుంచి అందుబాటులోకి.. 
ముంబయి నుంచి నిజామాబాద్‌ వరకు నడిచే లోకమాన్య తిలక్‌ రైలును గతేడాది సెప్టెంబర్‌ 26న కరీంనగర్‌కు వరకు పొడగించారు. ఆ సమయంలో జిల్లాలో జగిత్యాలకు సమీపంలో ఉన్న ఒక లింగంపల్లి స్టేషన్‌లో మాత్రమే స్టాప్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంత వాసులు నిరాశ చెందారు. ఆ తర్వాత ఈ రెండు పట్టణాల్లోని స్టేషన్లలో కూడా స్టాప్‌లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.  

చొరవ తీసుకున్న ఎంపీ 
నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మొదట ఈ సమస్యపైనే దృష్టి సారించారు. కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల నుంచి నిత్యం ముంబయికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి. ఎందరు ఇక్కడి నుంచి అక్కడికి తరలి వెళ్తున్నారనే వివరాలతో కూడిన నివేదికను రైల్వేశాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. ఆ శాఖ మంత్రిని కలిసి రైలును రెండు పట్టణాల్లో ఆపాల్సిన ఆవశ్యకతను వివరించారు. మంత్రి అంగీకరించడంతో అధికారులు రెండు స్టేషన్లల్లో స్టాప్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

వారానికి ఒక రోజు
సెప్టెంబర్‌ 1 నుంచి రెండు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రస్తుతం వారానికి ఒక రోజు మాత్రమే  ఈ మార్గంలో నడుపుతున్నారు. ప్రతీ ఆదివారం రాత్రి 7:45 గంటలకు కరీంనగర్‌ నుంచి ఈ రైలు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. ప్రతీ శనివారం 4:40 గంటలకు అదే స్టేషన్‌ నుంచి ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు కరీంనగర్‌ చేరుకుంటుంది. రెండు పట్టణాల్లో స్టాప్‌లను ఏర్పాటు చేయా లని నిర్ణయం తీసుకోవడంతో ముంబాయికి రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement