
పోలీసులతో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్
కోరుట్ల: ‘మునావర్ షో ప్రోగ్రామ్‌కు ఐదు వందల మంది పోలీసుల బందోబస్తు పెడ్తరు.. నాకేమో ఇస్తలేరు. ఎర్దండి దగ్గర నాకు కావాలనే బందోబస్తు తక్కువ పెట్టారు. దీంతో కొంత మంది నా కారుపై రాళ్లు వేశారు. నా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. నేను కోరుట్ల వెళ్లాలంటే శాంతి భద్రతల సమస్య అంటున్నరు. నాకు ప్రొటెక్షన్ ఇవ్వ లేరా? మీరు ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తున్నరు.
ఆయన చెబితే వచ్చారా..?’ అంటూ ఎంపీ అర్వింద్ పోలీసులపై మండిపడ్డారు. విశ్వబ్రహ్మణుల సమస్యలపై కోరుట్లలో సమావేశానికి హాజరవ్వడానికి ఎంపీ అర్వింద్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరారు. సరిగ్గా జగిత్యాల జిల్లా సరిహద్దు కమ్మర్‌పల్లి గండి వద్దకు చేరుకోగానే ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌ను మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు రాజశేఖర్‌రాజు, శ్రీను, ఎస్సైలు అడ్డుకుని తిరిగివెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.
శాంతి భద్రతల సమస్య కారణంగా తమకు సహకరించాలని కోరారు. అయితే, కావాలనే తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని పోలీసులపై ఎంపీ అర్వింద్ విమర్శలు చేశారు. ప్రతీసారి తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు సిగ్గుచేటని, తీరు మార్చుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment