సోయా.. గయా..!
Published Tue, Sep 24 2013 3:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
మెట్‌పల్లిమెట్‌పల్లి, న్యూస్‌లైన్:మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఈ ఖరీఫ్‌లో అధికారుల అంచనాకు మించి అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేశారు. పంటపై పెట్టిన పెట్టుబడి రాకపోగా అప్పులు మీదపడే దుస్థితి దాపురించింది. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల మేర నష్టం జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. సోయాకు మార్కెట్‌లో ప్రభుత్వ మద్దతు ధర కంటే గత ఏడాది వ్యాపారులు ఎక్కువ ధరను చెల్లించారు. మద్దతు ధర నలుపు రంగు సోయా క్వింటాల్‌కు రూ.2200, పసుపు రంగు సోయాకు రూ.2240 అందించింది. వ్యాపారులు రూ.3వేల నుంచి రూ.3500 వరకు చెల్లించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఖరీఫ్‌లో రైతులు అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేశారు. సాధారణంగా మొక్కజొన్న సాగు చేసే రైతులంతా ఎక్కువగా ఈ పంటవైపు మొగ్గుచూపారు. మొక్కజొన్న కన్నా ఈ పంటకు తక్కువ వ్యయం కావడంతోపాటు స్వల్పకాలంలో పంట చేతికి వస్తుందనే ఆశించారు. జిల్లాలో సోయా సాధారణ విస్తీర్ణం 2779 హెక్టార్లు కాగా, రైతులు 20,797 హెక్టార్లలో పంటను
పండించారు.
ఇందులో కరీంనగర్ డివిజన్‌లో 270హెక్టార్లు, జగిత్యాల డివిజన్‌లో 7545, మల్యాల డివిజన్‌లో 882, సిరిసిల్లలో 175, పెద్దపల్లిలో 71, మెట్‌పల్లి డివిజన్‌లో అత్యధికంగా 11,698 హెక్టార్లలో సోయా పంట వేశారు. రైతుల నుంచి వచ్చిన డిమాండ్‌తో ప్రభుత్వం వారికి సబ్సిడీపై విత్తనాలను అందజేసింది. 30కిలోలు ఉండే ఒక బ్యాగు ధర రూ.1440 ఉండగా, సబ్సిడీపై రూ.965కు అందించింది. వీటిని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా రైతులకు సరఫరా చేసింది. కాని ఈ విత్తనాలు అంతగా నాణ్యతగా లేవని రైతులు ఆరోపిస్తున్నారు. వీటివల్ల పంట పెరగక, గింజరాక ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభం మాటేమో గాని దిగుబడి తగ్గి తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.
దిగుబడిపై తీవ్ర ప్రభావం..
నాణ్యతలేని విత్తనాల వల్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. సాధారణంగా ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముండగా, ప్రస్తుతం రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 51,992 ఎకరాల్లో పంటను వేశారు. దిగుబడి ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల చొప్పున చూస్తే మొత్తం 4.15 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి రావాలి. కాని విత్తనాల్లో నాణ్యత లోపించడంతో దిగుబడిలో సగానికిపైగా తగ్గుతుందని రైతు సంఘ నాయకులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం మద్దతు ధర ఈ ఏడాది నలుపు రంగు సోయాకు రూ.2500, పసుపు రంగు సోయాకు రూ.2560 ప్రకటించింది. మార్కెట్‌లో మాత్రం రూ.3వేలు పలుకుతుంది. ఈ లెక్కన తగ్గిన దిగుబడి భారీగా తగ్గనుండడంతో జిల్లాలో రైతాంగం రూ.30కోట్లు నష్టపోనున్నారు.
Advertisement
Advertisement