అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
• అధికారులు సమన్వయంతో పనిచేయాలి
• నత్తనడకన మిషన్ భగీరథ, ఇళ్ల నిర్మాణం
• షెడ్యూల్ ప్రకారం జరిగేలా కలెక్టర్లు చూడాలి
• డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
• ఐదు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు విజయవంతం కావాలంటే జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. యువ కలెక్టర్లు ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి తమకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. అయితే కలెక్టర్లకు పనులపై అవగాహన కలగడం లేదా, పట్టించుకోవడం లేదా అనేది అర్థం కావడం లేదన్నారు. మంగళవారం హన్మకొండ నక్కలగుట్టలోని నందనా గార్డెన్స్‌లో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లతో మిషన్ భగీరథ పనులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇతర జిల్లాలతో పోలిస్తే మిషన్ భగీరథ, గృహ నిర్మాణ పనుల్లో వెనుకబడి ఉండటం విచారకరమన్నారు. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, తమ స్థాయిలో ఉన్న సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించి పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయించవలసిన వాటిని ప్రభుత్వానికి పంపాలని కోరారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులు గడువు నిర్ధే శించిన సమయంలో పూర్తి చేయకుండా గడువు మీద గడువులు విధిస్తున్నారంటూ అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ కాంటాక్ట్ ఏజెన్సీలే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో పర్యావరణ అనుమతులు రాక ఆలస్యమవుతుందని మిషన్‌భగీరథ సీఈ సురేష్ ప్రస్తావించగా.. తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కడియం ప్రశ్నించారు.
గృహ నిర్మాణంపై...
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం 400 రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేసిందని, త్వరలో వాటిని వెయ్యికి పెంచే అవకాశం ఉందని అన్నారు. 31 జిల్లాల్లో పనులు ప్రారంభమయ్యాయని, కలెక్టర్లు బాధ్యత తీసుకొని ఇంజనీర్లతో పనులు పూర్తయ్యేట్లు చూడాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా చెల్లింపులు చేపట్టాలని, వీటి కొరకు రూ.567 కోట్ల ఉన్నాయని ఇంకా రూ.500 కోట్లు అవసరం అవుతాయన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు మొదలు పెట్టాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంట్రక్టర్లు చాలా మంది ఉన్నారని, ఇళ్ళ నిర్మాణం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టి వేగవంతం చేయాలన్నారు.
గిరిజన సంక్షేమ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు రెండూ పేద ప్రజల జీవితంలో మార్పుతోపాటు వారు ఆరోగ్యకరమైన జీవనం గడపడానికి దోహద పడతాయని, వీటిని లక్ష్యాలకనుగుణంగా పూర్తిచేయడంతో అందరం సమిష్టిగా పనిచేద్దామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ మాట్లాడుతూ.. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. న్యాయపరమైన వివాదాలు లేని ప్రదేశాల్లో, ఇంతకు ముందు శంకుస్థాపన చేసిన చోటే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కలెక్టర్లు వీటి నిర్మాణంపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వీలైతే కంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేయించాలన్నారు.
వచ్చే మార్చి నాటికి ‘మిషన్’ పూర్తికావాలి
మిషన్ భగీరథ పనులు 2018 మార్చి నాటికి పూర్తి కాలవాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లు టైం షెడ్యూల్ పాటించాలని, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ మిషన్ భగీరథకి సంబంధించి జిల్లాలో ఎటువంటి సమస్యలూ లేవని, గట్టుదుద్దేనపల్లి నుంచి హుజూరాబాద్‌కు వచ్చే రహదారి జాతీయ రహదారిగా మారడం వలన ఆ సంస్థ నుంచి అనుమతి వచ్చాక పనులు ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. అంబేద్కర్‌నగర్, ఎస్‌ఆర్ నగర్‌లలో రెండు పడకల గదుల నిర్మాణం మొదలయ్యాయని, శిఖం భూముల్లో ఇళ్ల నిర్మాణానికి వ్యయం పెరిగే అవకాశం ఉందన్నారు.
జిల్లాకు 2689 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా 2289 ఇళ్లకు పరిపాలనాపరమైన అనుమతి వచ్చిందని, 1804 ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, 1384 ఇళ్ల నిర్మాణం మొదలైందని తెలిపారు. జనగామ కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ మిషన్ భగీరథకు సంబంధించి ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని, ప్రజాప్రతినిధుల సహకారంతో పనులు వేగవంతం కావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి మాట్లాడుతూ మైలారంలో యాబై శాతం పనులు పూర్తయ్యాయని, జూన్ చివరి నాటికి వంద శాతం పనులు పూర్తవుతాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల సహకారంతో మిషన్ భగీరథ పనులు సవ్యంగా జరుగుతున్నాయన్నారు. జిల్లాకు 1780 ఇళ్లు మంజూరు కాగా 1360 ఇళ్లకు పరిపాలన పరమైన అనుమతి వచ్చిందని, 900 ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీన మాట్లాడుతూ పనుల ప్రగతిని వివరించారు. పరకాల పట్టణానికి తాగునీరు అందడం లేదని, దీనికి కారకులైన వారిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమావేశంలో కోరారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో తాగునీటి సరఫరా పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌లు కోరారు. జనగామ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించి ముందుకు సాగుతున్నామని, కాంట్రాక్టర్లు కూడా మరింత వేగంతో పనులు నిర్వహించాలని ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. అనంతరం సీనియర్ ఐఎఎస్ అధికారిని స్మిత సబర్వాల్ మాట్లాడుతూ మిషన్ భగీరథ కింద చేసే ప్రతి పనిని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అక్కడే ఉండి పర్యవేక్షించడం జరుగుతుందని, మెగా, ఎన్‌సీసీ కంపెనీలు గతంలో పనులు వేగంగా చేశారని, ప్రస్తుతం నెమ్మదిగా నిర్వహిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని సూచించారు.
కలెక్టర్లు రొనాల్డ్, వెంకట్రాంలను ఉదహరిస్తూ అవసరమైనప్పుడు వారి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. చివరగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు పరిపాలనపై పట్టు పెంచుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పనిసరిగా భాగస్వాములై ఇతరులకు ఆదర్శం కావాలన్నారు. కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన పనులను సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక బద్దంగా తయారు చేసుకొని అందుకు అనుగుణంగా కాల వ్యవధిని నిర్దేశించుకోవాలన్నారు. ఆ కాల వ్యవధి ప్రకారం పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, పార్లమెంట్ సభ్యులు సీతారాంనాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, నగర మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, మిషన్ భగీరథ ఎస్‌ఈ యేసురత్నం, గృహ నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించిన ఐదు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.