♦ మూలుగుతున్న సీడీపీ నిధులు
♦ ఒక్కో నియోజకవర్గానికి ఏడాదికి రూ.75 లక్షలు
♦ రెండో ఏడాదిలో ఖర్చు కాని రూ.2.91 కోట్లు
♦ గత ఏడాదిలో రూ.5.31 లక్షలకు మోక్షం లేదు
♦ మంజూరైన పనుల్లోనూ నత్తనడకన నిర్మాణాలు
♦ శంకుస్థాపన చేసి నెలలు గడిచినా ఎక్కడివక్కడే..
‘ఇది ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్‌లోని రోడ్డు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఇక్కడ సీసీ రోడ్డు వేయడానికి సీడీపీ నిధులు రూ.5 లక్షలతో పనులకు శంకుస్థాపన చేశారు. రెండు నెలలు గడిచినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో రోడ్డంతా బురదమయం అవుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’
సీడీపీ నిధులుండి పనులు మొదలు కాకపోవడం, పనుల ప్రతిపాదనలు పంపించినా ఇంకా మంజూరు కాకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద మంజూరవుతున్న నిధులు మూలుగుతున్నారుు. - సాక్షిప్రతినిధి, ఖమ్మం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ప్రతి ఏటా ఒక్కో నియోజకవర్గానికి రూ.75 లక్షలు మంజూరవుతాయి. రెండో ఏడాది పూర్తయినా పలు నియోజకవర్గాల్లో సీడీపీ నిధులు రూ.2.91 కోట్లు మూలుగుతున్నాయి. ప్రతి ఏటా మంజూరయ్యే నిధులకు ఎమ్మెల్యేలు అదే ఏడాది పనులను ప్రతిపాదిస్తే సీడీపీ నిధులను ఖర్చు చేస్తారు. ఎమ్మెల్యేలు ఏడాదికి మంజూరయ్యే పనులనే ప్రతిపాదించాలి. గత ఏడాది పనులను ప్రతిపాదించకపోవడంతో రూ.5.31 లక్షలు మిగిలాయి.
రెండో ఏడాది పూర్తయినా రూ.2.91 కోట్లు అలానే ఉన్నాయి. ఇప్పటికే మంజూరైన పనులు మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపంతో నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా డ్రెయినేజీలు, కల్వర్టులు, కమ్యూనిటీ హాళ్ల పనుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు అధికారులను పనుల పురోగతిపై ప్రశ్నించినా వేగిరం మాత్రం కావడం లేదు. మంచినీటి సరఫరా, నీటి కుంటలు, డ్రెయినేజీలు, కల్వర్టులు, చిన్న బ్రిడ్జిలు, గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు, లింకు రోడ్లు, అప్రోచ్ రోడ్లు, ఫుట్ పాత్‌లు, ప్రభుత్వ పాఠశాలలకు మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీలు, కమ్యూనిటీ హాళ్లు, ఉర్దూఘర్ ఇలా సీడీపీ కింద 18 రకాల పనులను ఎమ్మెల్యేలు పెట్టుకోవచ్చు.
ప్రతిపాదించినా మంజూరులో తాత్సారం
ఖమ్మం, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు పలు పనులను ప్రతిపాదించినా.. మంజూరులో మాత్రం తాత్సారం జరుగుతోంది. ఓ వైపు శంకుస్థాపన చేసిన పనులు ముందుకు సాగకపోవడం, పంపిన పలు పనుల ప్రతిపాదనలకు మంజూరు చేయడంలో ఇటు ప్రభుత్వం, అటు అధికారులు అలసత్వం వహిస్తున్నారని గ్రామ, మండలస్థాయి ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా మంజూరయ్యే సీడీపీ నిధుల పనుల ప్రతిపాదనలు వెంటనే మంజూరై, పనులు వెంటనే చేస్తే గ్రామాలకు మహర్దశ పడుతుంది. కానీ మంజూరు, శంకుస్థాపనలు చేసినా పనులు ప్రారంభం కాకపోవడంతో సీడీపీ నిధులు ఏళ్లయినా ఖర్చు కావడం లేదు.