కబ్జాదారుల చెరవీడిన పార్కు
కబ్జాదారుల చెరవీడిన పార్కు
Published Fri, Sep 30 2016 11:40 PM | Last Updated on Mon, Aug 20 2018 9:21 PM
– అక్రమ కట్టడాల్ని కూల్చివేసిన
మున్సిపల్ సిబ్బంది
– ఆక్రమణలపై స్థానికుల ఆగ్రహం
– సాక్షి కథనానికి స్పందన
విజయవాడ (గాంధీనగర్) :
కోట్లాది రూపాయల విలువచేసే కార్పొరేషన్ స్థలం కబ్జాకోరుల చెరవీడింది. సాక్షి కథనంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. ‘పార్కులపై కబ్జాకాండ’ శీర్షికతో శుక్రవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు నగర శివారు కండ్రికలోని పార్కు స్థలంలో టీడీపీ ప్రజాప్రతినిధులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు. నాలుగు ఇళ్ళు, ఒక రేకుల షెడ్డును పొక్లెయినర్ సహాయంతో నేలమట్టం చేశారు.
కబ్జాలపై భగ్గుమన్న ప్రజాగ్రహం
కబ్జా బాగోతాలపై అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ స్థలాలు, శ్మశానవాటికలు కబ్జాకు గురవుతున్నాయంటూ కండ్రిక వాసులు ఆరోపించారు. పేదలు కాల్వగట్లపై ఇళ్లు నిర్మించుకుంటే తొలగించే అధికారులు కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను కాజేస్తుంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్కు స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారా? అంటూ అక్కడికి వచ్చిన టౌన్‌ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేసే సమయంలోనే అక్కడ ఆందోళన చేపట్టారు. సీపీఐ నాయకులు సైతం అధికారులు తీరును ఎండగట్టారు.
Advertisement