
మెకానికల్ ఇంజనీరింగ్‌తో మిన్నంటే అవకాశాలు!
ప్రతి ఇంజనీరింగ్ విభాగంలోనూ సమ్మిళితమై ఉండేదే మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ నిర్మాణాలు, ఉత్పత్తులు లేని ఏ ఇతర ఇంజనీరింగ్ విభాగాన్నీ ఊహించలేం. ఇది అంతటి విస్తృత, వైవిధ్యమైన బ్రాంచ్. ఆటోమోటివ్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమల్లో మెకానికల్ ఉత్పత్తుల అవసరం తప్పనిసరి. అందుకే మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను అభ్యసించిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
మెకానికల్ ఇంజనీరింగ్‌లో.. హీట్ ఎక్ఛేంజర్స్, రిఫ్రిజిరేటర్లు, వెంటిలేషన్ సిస్టమ్స్, గ్యాస్ టర్బైన్స్, విండ్ టర్బైన్స్, బయోమెడికల్ పరికరాలు, ఆటోమొబైల్స్, వాహనాలు, రోబోటిక్స్, మెకట్రానిక్స్ తదితర యంత్ర పరికరాల డిజైన్, తయారీ విధానాలను విద్యార్థులు అధ్యయనం చేస్తారు. కొత్త ప్రొడక్ట్స్ డిజైనింగ్, రూపకల్పనతోపాటు ఎప్పటికప్పుడు కొత్త మెథడ్స్, మెటీరియల్స్‌ను అభివృద్ధి చేయడంలోనూ పాలుపంచుకుంటారు. పరిశ్రమల్లో ఉపయోగించే టూల్స్, మెషిన్స్, ఇతర మెకానికల్ ఉపకరణాల తయారీలో మెకానికల్ ఇంజనీర్లు కీలక భూమికను పోషిస్తారు. పరిశ్రమల్లో అన్నిరకాల యంత్రాల పనితీరు, వాటి మెకానిజం, డిజైన్, డెవలప్‌మెంట్, తయారీ, అమరిక, నిర్వహణ మెకానికల్ ఇంజనీర్ల కనుసన్నల్లోనే నడుస్తుంది.
నైపుణ్యాలు
మెకానికల్ ఇంజనీర్లకు విశ్లేషణాత్మక, డిజైనింగ్ నైపుణ్యాలు ఎంతో ప్రధానం. బృందంలో పనిచేసే నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు కూడా అవసరం. సృజనాత్మకత, కష్టపడి పనిచేసేతత్వం ఉన్న వారు ఈ విభాగంలో రాణిస్తారు.
ఉన్నత విద్యావకాశాలు
బీటెక్/బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విస్తృత ఉన్నత విద్యావకాశాలున్నాయి. టర్బో మెషినరీ, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, రొబోటిక్స్, టూల్ డిజైన్, క్యాడ్/క్యామ్, మెరైన్ ఇంజనీరింగ్ లేదా మెకట్రానిక్స్ తదితర విభాగాల్లో ఉన్నత విద్యనభ్యసించొచ్చు. గేట్ రాసి ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. పీజీఈసెట్ పరీక్ష ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో చేరొచ్చు. ఐటీ లేదా మేనేజ్‌మెంట్ విభాగాల్లోనూ ఉన్నత విద్యనభ్యసించొచ్చు. జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ తదితర పరీక్షలు రాసి విదేశాల్లోనూ ఉన్నత విద్యనభ్యసించొచ్చు.
మెకానికల్ విద్యార్థుల కెరీర్
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విస్తృత అవకాశాలున్నాయి. మెకట్రానిక్స్, ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ, సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్, కంప్యుటేషనల్ సిమ్యులేషన్, మైక్రోఎలక్రోమెకానికల్ సిస్టమ్స్, నానో అండ్ మైక్రో మెకానిక్స్, ప్రొపల్షన్, సెన్సింగ్ అండ్ కంట్రోల్ డిజైన్, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో అవకాశాలను అందుకోవచ్చు.
మరో పదేళ్లలో గణనీయమైన వృద్ధి
మెకానికల్ ఇంజనీరింగ్‌లో అప్లైడ్ సైంటిఫిక్, మ్యాథమెటికల్ అంశాలపై ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్, బోధన దిశగా మంచి అవకాశాలను పొందొచ్చు. అంతేకాకుండా కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ)లోనూ ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధిత కంపెనీలైన హానీవెల్, జీఈ, సైయంట్(గతంలో ఇన్ఫోటెక్) తదితర కంపెనీల్లో సీఎఫ్‌డీ నిపుణుల అవసరం ఉన్నప్పటికీ ప్రమాణాలకు తగిన సిబ్బంది లభించడం లేదు. మరో పదేళ్లలో ఆటోమొబైల్, పవర్, ఏరోస్పేస్ పరిశ్రమల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకోనుంది.
అన్ని విభాగాల్లో అవకాశాలు
ఇంజనీరింగ్ అన్ని విభాగాల్లో మెకానికల్ ఇంజనీర్లకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఏరోస్పేస్ పరిశ్రమలో పరిశోధనలు, డిజైన్స్, నిర్మాణం, ఆపరేట్స్, మెయింటనెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్; ఆటోమోటివ్ పరిశ్రమ: డిజైన్స్, మాన్యుఫాక్చర్స్, మోటార్ వెహికిల్స్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. అలాగే కెమికల్, కన్‌స్ట్రక్షన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, మెరైన్ తదితర పరిశ్రమల్లోనూ వివిధ విభాగాల్లో అవకాశాలు అందుకోవచ్చు.
టాప్ రిక్రూటర్లు
‘‘టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో టెక్నాలజీస్, అసెంచర్ తదితర ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు మెకానికల్ ఇంజనీర్ల కూడా ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. ఫ్రెషర్‌ల ఎంపికలో సీఎస్‌ఈ/ఐటీ విద్యార్థులతో సమానంగా మెకానికల్ విద్యార్థులూ పోటీ పడుతున్నారు. కోర్ కంపెనీలైన మారుతి సుజుకీ, ఎంఅండ్‌ఎం, ఫియట్, హ్యూందాయ్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, ఇంటర్‌గ్రాఫ్ మొదలైన సంస్థ మెకానికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. మిధానీ, బెల్, బీహెచ్‌ఈఎల్, బీఈఎంఎల్, ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయి. యూపీఎస్సీ, రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కొలువులనూ సొంతం చేసుకోవచ్చు’’
- వి. ఉమామహేశ్వర్,
అసోసియేట్ ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్
ప్లేస్‌మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ.