
రష్యా ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ
రష్యాకు కీలక ఆర్థిక వనరుగా మారిన చైనా
చైనావ్యాప్తంగా వెలసిన వేలాది దుకాణాలు
బీజింగ్/హాంకాంగ్: మన దేశంలోని అనేక వస్తువులపై మేడిన్ చైనా అని ఉంటుంది. అంత పెద్ద ఉత్పత్తిదారు అయిన ఆ దేశంలో మాత్రం ఇప్పుడెక్కడ చూసినా ‘మేడిన్ రష్యా’ అనే కనబడుతోంది. దుకాణాల మీద చైనా, రష్యాల జెండాలు.. లోపల రష్యా వస్తువులు. చాక్లెట్లు, కుకీల నుంచి తేనె, వోడ్కాల దాకా అన్ని రష్యన్ ఉత్పత్తులకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఉన్నట్టుండీ ఈ క్రేజ్ పెరగడంపై కొందరు చైనీయులే విస్తుపోతున్నారంటే ఇటీవలి మార్పును అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మార్పు వెనుక పెద్ద కథే ఉంది...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించారు. ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాకు చైనా కీలకమైన ఆర్థిక వనరుగా మారింది. ద్వైపాక్షిక వాణిజ్యం ఏటేటా రికార్డుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ చైనా, రష్యాలు మునుపెన్నడూ లేనంతగా దగ్గరయ్యాయి, అమెరికా పట్ల వారి శత్రుత్వం, ప్రపంచంపై ఆ దేశ ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే ధోరణి దీనితో వేగవంతం అయ్యింది.
ఆహారోత్పత్తులకు డిమాండ్
చౌకైన రష్యన్ చమురు, గ్యాస్, బొగ్గు.. చైనా దిగుమతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ ఐస్ క్రీం, తీపి బిస్కెట్లు, పాల పొడి వంటి రష్యా ఆహార ఉత్పత్తులకు ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు చైనా వ్యాపారులు పోటీ పడుతున్నారు. చైనా వ్యాపార రికార్డుల ప్రకారం, 2022 నుంచి రష్యన్ వస్తువుల వాణిజ్యంలో 2,500 కంటే ఎక్కువ కొత్త కంపెనీలు చేరాయి. అందులో దాదాపు సగం కంపెనీలు గత సంవత్సరంలోనే నమోదయ్యాయి.
వీటిలో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. రష్యా నుంచి అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటున్నా.. చైనాలో బెస్ట్ సెల్లర్ మాత్రం రష్యా తేనె, చాక్లెట్లు. సహజ పదార్థాలతో చేసిన ఈ ఉత్పత్తులు అధికనాణ్యతను కలిగి ఉన్నాయని, ఆరోగ్యకరమైనవని చెబుతున్నారు. ఇవి కేవలం రష్యన్ ఉత్పత్తుల దుకాణాలుగా మాత్రమే కాదు, ఆ దేశ సంస్కృతి, ప్రత్యేకతలను ప్రదర్శించే విండోలుగా మారాయి.
పుతిన్‌కూ విస్తృత ఆదరణ...
రష్యా వస్తువులకు మాత్రమే కాదు, అధ్యక్షుడు పుతిన్‌కు కూడా చైనా ప్రజల్లో విస్తృత ఆదరణ ఉంది. బీజింగ్‌లోని తిన్‌హువా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ గత ఏడాది విడుదల చేసిన సర్వేలో 66 శాతం మంది రష్యా పట్ల పూర్తి సానుకూలతను, మిగిలినవారు కొంత అనుకూల వైఖరిని ప్రకటించారు. దీనికి భిన్నంగా 76% మంది అమెరికా పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
మేడిన్ రష్యా ఫెస్టివల్
ఏప్రిల్ 2023 నాటికి టావోబావో, జేడీతో సహా మాస్కోకు చెందిన 300కి పైగా కంపెనీలు చైనా ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో చేరాయి. 2024లో ‘మేడ్ ఇన్ రష్యా ఫెస్టివల్ అండ్ ఫెయిర్’ అతిపెద్ద నగరాలైన షెన్యాంగ్, డాలియన్‌లలో జరిగింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 150కి పైగా రష్యన్ కంపెనీలు పాల్గొన్నాయి. 23లక్షల డాలర్ల విలువైన రష్యన్ వస్తువులను చైనా వినియోగదారులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించాయి. ఇదే అదనుగా ‘నకిలీ రష్యన్ వస్తువులు’ కూడా తయారవుతున్నాయి. ఈ వివాదం ఎలా ఉన్నా.. రష్యా పట్ల చైనా ప్రజలకు ఉన్న అనుబంధాన్ని, బీజింగ్, మాస్కో మధ్య వాణిజ్య సంబంధాలకు అద్దం పడుతూ చైనా వ్యాప్తంగా దుకాణాలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment