- నేషనల్ పార్కుగా అభివృద్ధి చేయనున్న తుడా
- రూ.300 కోట్లతో ప్రతిపాదనలు
తిరుపతి తుడా: అవిలాల చెరువు రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో ఇక్కడ నేషనల్ పార్కును ఏర్పాటు చేసేందుకు తుడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు రూ.300 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు.
తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో 180 ఎకరాల విస్తీర్ణంలో అవిలాల చెరువు ఉంది. గతంలో ఇక్కడ కొందరు అక్రమ కట్టడాలు ప్రారంభించారు. దీనికి తోడు లే-అవుట్‌లు వేసి ప్లాట్లు విక్రయించాలని తుడా నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది మేధావులు చెరువు పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెరువులో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆక్రమణలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం ఈ చెరువు నిరుపయోగంగా ఉండటంతో తుడా వీసీ వెంటకేశ్వరరెడ్డి దృష్టి సారించారు.
ఈ చెరువును రక్షించడం, ప్రజలకు సౌకర్యంగా మార్చడంపై సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వివరాలను తుడా చైర్మన్ ఎం. వెంకటరమణకు వివరించి ఆయన ద్వారా పురపాలిక శాఖ మంత్రి నారాయణకు ప్రతిపాదనలను అందజేశారు. దీనిపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. అవసరమైతే వ్యయం ఎక్కువైనా పక్కాప్రణాళికతో అభివృద్ధి పరిచేందుకు కసరత్తుచేయాలని ఆయన సూచించారు.
దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చెరువును కాపాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చాలని ఆయన నిర్ణయించుకున్నారు. నిష్ణాతులతో అవిలాల చెరువుపై అధునాతన సౌకర్యాలతో నేషనల్ పార్క్, ట్యాంక్ బండ్ స్కెచ్ గీయించారు. అందులో యోగ, స్మిమ్మింగ్‌పూల్, పార్క్, వాటర్ స్టోరేజ్, హట్స్, పిల్లల క్రీడా సముదాయం వంటి సౌకర్యాలతో ప్రణాలికను సిద్ధం చేశారు. ఇందుకు రూ.300 కోట్ల ఖర్చు అవుతందని ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు.
తిరుపతికి తలమానికంగా నిలుస్తుంది
అవిలాల చెరువులో అత్యాధునిక సౌకర్యాలతో పార్క్ ఏర్పాటయి తే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి ఇది తలమానికంగా మారుతుంది. రూ.1000 కోట్ల ఆస్తిని కాపాడటమే కాకుండా ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుంది. తుడా చైర్మన్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే చరిత్రలో మిగిలిపోతుంది. ఇందుకు మేధావులూ సానుకూలంగా ఉన్నారు.
-ఐ.వెంకటేశ్వరరెడ్డి, వీసీ, తుడా