గోదాముల గోడు వినరూ!
పెద్దపల్లి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గోదాముల్లో సగానికిపైగా ఖాళీగా ఉంటే.. మంత్రి హరీష్‌రావు కొత్తగా 17 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మిస్తామని ప్రకటించడంపై పలువురు యజమానులు నివ్వెరపోతున్నారు. గోదాముల నిర్మాణంలో వచ్చే సబ్సిడీ పక్కదారి పట్టించేందుకే నిర్మాణాలు చేపడుతున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉన్న గోదాములే నిండక రుణాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కేవలం బ్యాంకు రుణం చెల్లిస్తే చాలు తమ గోదాములే అప్పగిస్తామని పలువురు యజమానులు పేర్కొంటున్నారు. ఈ మేరకు తమ గోదాములు పరిశీలించాలని మంత్రికి లేఖ సైతం రాశారు.
జిల్లాలో జమ్మికుంట, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లిలో ఒక్కొక్కటి చొప్పున ఎఫ్‌సీఐ గోదాములున్నాయి. గత ప్రభుత్వం గోదాముల నిర్మాణాలపై పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వడంతో రాజకీయ నాయకులతోపాటు కాంట్రాక్టర్లు, వ్యాపారులు ముందుకొచ్చారు.
తెలంగాణలో ఎక్కడా లేనంతగా కరీంనగర్ జిల్లాలో 22 చోట్ల గోదాములు నిర్మించారు. వీటిపై ప్రభుత్వం రూ.500 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఒక్క పెద్దపల్లి డివిజన్‌లోనే 8లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించారు. వీటిని ఎస్‌డబ్ల్యూసీ, సివిల్ సప్లయ్, సీసీఐ, ఎఫ్‌సీఐ వంటి సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు.
ఆయా శాఖల అధికారులకు ముడుపులు అందితేనే తమ గోదాములకు బియ్యం నిల్వలు వచ్చి చేరుతాయని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా బియ్యం సేకరణ మందగించడంతో గోదాముల్లో సగానికిపైగా ఖాళీగా ఉన్నాయని, దీంతో బ్యాంకు కిస్తీలు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. ఈ ఖాళీ గోదాముల సమస్య ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉందని, కొత్త గోదాముల నిర్మాణం కంటే తమ గోదాముల నిర్వహణ చూస్తే మేలని పేర్కొంటున్నారు.
ఇదో పెద్ద కుంభకోణం
గోదాములు నిర్మించడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉంది. సబ్సిడీలు మింగడం, అధికారులకు పర్సెంటేజీలు అందించడం తప్ప ఒరిగేదేమీ లేదు. లక్షలాది టన్నుల సామర్థ్యం గల గోదాములు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఓ గోదాములో నేనూ భాగస్వామినే. కొత్తగా గోదాములు నిర్మిస్తే డబ్బు వృథా తప్ప ప్రయోజనం లేదు.
- మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి
మా గోదాములు ఇస్తాం
పెద్దపల్లి సమీపంలో 1.80 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాం. ప్రభుత్వం నుంచి వస్తున్న కిరాయి బ్యాంకు కిస్తీలకు సరిపోవడం లేదు. కోట్లల్లో నష్టం వస్తోంది. మా గోదాములను ప్రభుత్వానికి గోదాములను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం. వాటిపై బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు చెల్లిస్తే సరిపోతుంది. మాకు ఎలాంటి అదనపు లాభాలు అవసరం లేదు.
- గీట్ల రాజేందర్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ డెరైక్టర్