మహా ‘కష్టం’ హెచ్‌ఎండీఏ
-
మబద్ధీకరణపై ఎటూ తేల్చని సర్కార్
-
హెచ్‌ఎండీఏ ఆదాయానికి కోట్లలో గండి
- ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ దరఖాస్తులకు బూజు
సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు ఆర్థిక సంక్షోభం... మరో వైపు నిర్మాణాలు, లే అవుట్లు క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వ నాన్చివేత ధోరణి మహా నగరాభివృద్ధి సంస్థకు శాపంగా మారింది. నెలల తరబడి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తుండటంతో పెండింగ్ ఫైళ్లు బూజుపడుతున్నాయి. ఫలితంగా సంస్థ ఆదాయానికి కోట్లలో గండిపడుతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చన్న అధికారుల ఆశలు అడియాశలవుతున్నాయి.
నగర శివార్లలో ఇంకా 80 వేలకు పైగా అక్రమ లే అవుట్లు, నిర్మాణాలున్నట్లు మహానగరాభివృద్ధి సంస్థ అధికారుల పరిశీలనలో తేలింది. వీటన్నిటినీ క్రమబద్ధీకరిస్తే మరో రూ. 200 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే మొత్తం ఫీజు చెల్లించిన వారు వెయ్యి మంది, సగం ఫీజు చెల్లిం చిన వారు 17 వేలకు పైగా దరఖాస్తుదారులున్నారు. సగం ఫీజు చెల్లించిన వారు మిగతా సొమ్మును సైతం చెల్లించేందుకు ముందుకొచ్చినా హెచ్‌ఎండీఏ స్వీకరించట్లేదు.
ఎల్‌ఆర్‌ఎస్,బీపీఎస్‌లపై ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు ఏమీ చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పెండిగ్‌లోని దరఖాస్తులను క్లియర్ చేసినా రూ. 100 కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ 2 నెలల కిందట కొత్త ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ లేఖ రాసినా అటు నుంచి కనీస స్పందన లేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో ఐటీ బకాయిల కింద రూ. 485 కోట్లు తక్షణం చెల్లిచాల్సి ఉంది.
ఇందుకోసం సర్కార్ నిధులు సమకూర్చక పోయినా... కనీసం ఎల్‌ఆర్‌ఎస్,బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులనైనా క్లియర్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని సచివాలయం స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫైల్ సీఎం వద్దే ఉందని వారు దాటవేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను కూడా సీఎం పర్యవేక్షిస్తున్నందున.. హెచ్‌ఎండీఏ ైచైర్మన్ హోదాలో చర్యలు తీసుకుని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు.
ఫైళ్లు మూషికార్పణం
హెచ్‌ఎండీఏలో ఎల్‌ఆర్‌ఎస్,బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులు క్లియర్‌కాక బూజుపడుతున్నాయి. తార్నాక లోని ప్రధాన కార్యాలయంలో ఓ గదిలో గుట్టలుగా పడేసిన దరఖాస్తులను ఎలుకలు నాశనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎల్‌ఆర్‌ఎస్,బీపీఎస్‌ల కింద ఇప్పటికే సగం ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులు సైతం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. అక్రమ లే అవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు (ఎల్‌ఆర్‌ఎస్,బీపీఎస్) మరో అవకాశమిచ్చే విషయాన్ని సైతం కొత్త ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం హెచ్‌ఎండీఏలో అయోమయం నెలకొంది.
అడ్డగోలుగా లే అవుట్లు
నగర శివార్లలో అడ్డగోలుగా లే అవుట్లు వెలిశాయి. వీటిలో 5 శాతం కూ డా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న పాపానపోలేదు. నిజాం పేట, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి ఎల్‌ఆర్‌ఎస్ కింద 4500 దరఖాస్తులు రాగా వీరిలో 10 శాతం కూడా ఇప్పటివరకు ఫీజు చెల్లించలేదు. శామీర్‌పేట, తూముకుంట, కొంపల్లి, కొహెడ, నాగారం, దమ్మాయిగూడెం తదితర ప్రాంతాల్లో క్రమబద్ధీకరించాల్సిన లే అవుట్లు అధికంగా ఉన్నాయి. మణికొండ, బండ్లగూడ, పీరాన్‌చె రువు, అమీన్‌పూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాల్లో 30-40 శాతం మేర మాత్రమే ఫీజులు వసూలయ్యాయి. వీరంతా క్రమబద్ధీకరించుకుంటే రూ. 250 నుంచి రూ. 300 కోట్లు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది.