111 జీఓకు తూట్లు..!
♦ అడ్డగోలుగా లేఅవుట్లు..
♦ వెలిసిన నిర్మాణాలు 12,442
♦ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో లెక్కతేల్చిన
♦ జిల్లా యంత్రాంగం ఆక్రమణల జాబితాలో సర్కారీ భవనాలు
జీవసంరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్)లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలిశాయని ప్రభుత్వం లెక్క తేల్చింది. నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ జారీచేసిన 111 జీఓ అమలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలోని 83 గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన జిల్లా యంత్రాంగం.. ఆక్రమణల జాబితాను రూపొందించింది. 111జీఓ బేఖాతరు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని శంషాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచా రించిన ట్రిబ్యునల్ 111జీఓ అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలో పక్షం రోజులుగా పంచాయతీ కార్యదర్శులు జీఓ పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జీఓ 111లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో విస్మయ పరిచే వాస్తవాలు వెలుగుచూశాయి. గతంలో రెవెన్యూ యంత్రాంగం చేసినప్పటి కంటే ఎక్కువగా ఆక్రమణలు పుట్టుకొచ్చాయని తేలింది. అనధికార లేఅవుట్లు, అనుమతిలేకుండా నిర్మాణాలు రావడం.. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు, రైస్‌మిల్లులు, శీతల గిడ్డంగులు, ఇటుకబట్టీలు, మార్బుల్, ఫర్నీచర్ యూనిట్లు, విద్యాసంస్థల బహుళ అంతస్తు భవనాలు, సంపన్నవర్గాల రిసార్టులు వెలిశాయని స్పష్టమైంది. జంట జలాశయాలు కలుషితం కాకుండా..
వీటి ఉనికి ప్రశ్నార్థకంగా పరీవాహక ప్రాంతంలో పరిశ్రమలు, నిర్మాణాలు రాకుండా అడ్డుకునేందుకు జీవసంరక్షణ మండలి(111జీఓ)ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాణాలు, పరిశ్రమల స్థాపనపై ఆంక్ష లు విధించింది. అయితే, జీఓ అమలులో అధికారయంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఈ క్రమంలోనే 111 జీఓను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం.. సమగ్ర నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని ట్రిబ్యునల్ స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం గ్రామాల వారీగా సర్వేచేసి అక్రమార్కుల చిట్టా రూపొందించింది.
పుట్టుకొచ్చిన 426 లేఅవుట్లు
శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లో 426 లేఅవుట్లు వెలిశాయని లెక్క తీసింది. ఇందులో ప్రధానంగా శంషాబాద్ గ్రామ పరిధిలో ఏకంగా 60 లేఅవుట్లు పుట్టుకొచ్చాయని గుర్తించింది. మిగతా గ్రామాల విషయానికి వస్తే సురంగల్‌లో 30, చిలుకూరులో 22, నర్కుడలో 28, పెద్దషాపూర్ 20, తొండుపల్లిలో 19, కేతిరెడ్డిపల్లి, పెద్దమంగళారం గ్రామాల్లో 15 లేఅవుట్లను వేసినట్లు సర్వేలో వెలుగు చూసింది. మొత్తం 426 లేఅవుట్లలో 12,442 ప్లాట్లు చేతులు మారిననట్లు స్పష్టమైంది. ఇందులో వాణిజ్య, గృహాలకు సంబంధించిన నిర్మాణాలే గాకుండా.. 99 పరిశ్రమలు, 86 సర్కారీ భవనాలు కూడా కొలువు దీరాయని ప్రభుత్వం అంగీకరించింది. వీటిలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు, పోలీస్‌స్టేషన్లు, పొదుపు సంఘాల భవనాలు ఉన్నట్లు ఒప్పుకుంది.
అదే క్రమంలో జీఓ పరిధిలోని 8 గ్రామాల్లో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని స్పష్టం చేసింది. 40 గ్రామాల్లో 50లోపు, 26 గ్రామాల్లో 51-200లోపు, 8 గ్రామాల్లో 201-300, ఒక ఊరులో 301-400, మరో 8 గ్రామాల్లో 400 పైచిలుకు నిర్మాణాలు వెలిశాయని పంచాయతీ కార్యదర్శుల సర్వేలో తేలింది. విచిత్రమేమిటంటే.. అక్రమ కట్టడాలు వెలిసిన దాంట్లో 2,891 నిర్మాణాలు శంషాబాద్‌లో, 691 పాల్మాకులలో ఉన్నాయి.