భారత దేశంలో బంగారాన్ని (Gold) సంపదకు, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. మన సంప్రదాయాలలో పసిడి లోతుగా పాతుకుపోయింది. బంగారం కొనడాన్ని భారతీయులు అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా పండుగ సందర్భాలలో పుత్తడి కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. నాణేలు, ఆభరణాలు.. ఇలా వివిధ రూపాల్లో బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటారు.
అంతటి ప్రాధాన్యత ఉన్న బంగారాన్ని కొనడానికి ముందు దానికి సంబంధించిన నిబంధనలను తెలుసుకోవడం, అనుసరించడం కూడా అంతే ముఖ్యం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్గదర్శకాల ప్రకారం, డిక్లేర్డ్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం, సహేతుకమైన గృహ పొదుపులు లేదా చట్టబద్ధంగా సంక్రమించిన ఆస్తులతో కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి పన్నులు ఉండవు. ఇలా కాకుండా వేరే మార్గాల ద్వారా సమకూర్చుకున్న బంగారం పరిమితులకు మించి ఉంటే అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
ఎంత బంగారం ఉండొచ్చు?
వివాహిత మహిళలు: 500 గ్రాముల వరకు
అవివాహిత స్త్రీలు: 250 గ్రాముల వరకు
పురుషులు (వివాహితులు, అవివాహితులు ఎవరైనా): 100 గ్రాముల వరకు
బంగారం.. పెట్టుబడి మార్గం
స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు బాండ్లతో పాటు బంగారం కూడా చాలా కాలంగా విశ్వసనీయ పెట్టుబడి ఎంపికగా ఉంది. సంపదను పెంచుకోవడానికి ఇది నమ్మదగిన మార్గంగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) వంటి బంగారు పెట్టుబడుల కొత్త రూపాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ భౌతిక బంగారాన్ని ఇష్టపడుతున్నారు. వివిధ రకాల గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు వాటి నిబంధనలను పరిశీలిస్తే..
ఫిజికల్ గోల్డ్: పురుషులు 100 గ్రాముల వరకు కలిగి ఉండవచ్చు. వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత స్త్రీలు 250 గ్రాములు గరిష్టంగా కలిగి ఉండవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత భౌతిక బంగారాన్ని విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతంతోపాటు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వల్పకాలిక అమ్మకాలపై ఆదాయ స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను ఉంటుంది. అలాగే కొనుగోళ్లపైనా 3% జీఎస్టీ (GST) ఉంటుంది.
డిజిటల్ గోల్డ్: ఇది మరింత అనుకూలమైన ఎంపిక. డిజిటల్ గోల్డ్‌లో నిల్వ అవాంతరాలు ఉండవు. ఉపసంహరణపై మాత్రమే పన్నులు వర్తిస్తాయి. దీనిపై పెట్టే రోజువారీ ఖర్చు రూ. 2 లక్షలకు పరిమితం.
సావరిన్ గోల్డ్ బాండ్: ఈ బాండ్‌లు సంవత్సరానికి 4 కిలోల వరకు పెట్టుబడిని అనుమతిస్తాయి. దీనిపై 2.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. అయితే ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత వీటి నుండి వచ్చే లాభాలు పన్ను రహితంగా ఉంటాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు: వీటి నుండి వచ్చే లాభాలపై భౌతిక బంగారంతో సమానంగా పన్ను ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలపై మూడేళ్ల తర్వాత 20 శాతం పన్ను విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment