కేంద్రం నిర్ణయంపై గోల్డ్‌మ్యాన్ అసంతృప్తి
బంగారం, బంగారు అభరణాలపై వదంతులు వస్తుండటంతో గతవారం కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక పరిమితి వరకు బంగారు అభరణాలపై లెక్క చూపాల్సిన అవసరం లేదని, వారసత్వంగా వచ్చిన బంగారంపై కూడా పన్ను ఉండదని క్లారిటీ ఇచ్చింది. అయితే, అరకిలో (500 గ్రాముల) కన్నా ఎక్కువ బంగారం ఉంటే మాత్రం లెక్కలు చూపాలని పేర్కొంది.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణ, బంగారం వస్తున్న వదంతులపై ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ‘గోల్డ్ మ్యాన్’ మనోజ్ సెంగార్ భగ్గుమంటున్నారు. బంగారం విషయంలో కేంద్రం తీరు ఆయనకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ఒంటినిండా నగలు, చేతికి ఉంగరాలు, మణికట్టుకు బరువైన బ్రెస్లెట్ ఇలా దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని ధరించి అట్టహాసంగా తిరిగే మనోజ్‌ను స్థానికంగా ‘గోల్డ్‌మ్యాన్’గా ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఎప్పుడూ తెల్లటిదుస్తులు ధరించే ఆయన వెండితో చేయించిన షూస్ వేసుకుంటారు. బంగారంపై కేంద్రం పరిమితి విధించడాన్ని తప్పుబడుతూ.. ‘ప్రభుత్వమంటే ప్రతి ఒక్కరికీ గౌరవముంది. కానీ ఇలా చూస్తూ పోతే.. ఆఖరికీ గురక మీద, దగ్గు మీద కూడా పరిమితి విధించేలా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.
తన వద్ద ఎంత బంగారం ఉందో చెప్పడానికి నిరాకరించిన ఆయన.. ఈ బంగారం ఎక్కడిదంటే.. ‘తాతలు, తండ్రులు ఇచ్చింది. దానిని అమ్మకుండా ఇలా భద్రపరుచుకున్నా’ అని చెప్పారు. ‘ ఈ బంగారం గురించి బిల్లులు అడిగితే.. నేను స్వర్గానికి వెళ్లి మా తాతలు, ముత్తాతలను అడుగాల్సి ఉంటుంది’ అంటూ సెంగార్ నవ్వులొలికారు. పెళ్లయిన మహిళల వద్ద 500 గ్రాములు, పెళ్లికాని మహిళల వద్ద 250గ్రాములు, పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం ఉంటే లెక్కలు అడగబోమని, అంతకుమించి లెక్కలు చూపాల్సిందేనన్న కేంద్రం ప్రకటనపై సెంగార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.