
భారతదేశంలో బంగారం అనేది కేవలం లోహం మాత్రమే కాదు.. అది వారసత్వం, సంప్రదాయం, విశ్వాసానికి చిహ్నం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతీయులకు బంగారంతో ప్రత్యేక అనుబంధం ఉంది. పెళ్లి అయినా, పండుగ అయినా బంగారం లేకుండా పూర్తవదు. ఈ కారణంగానే భారతీయ కుటుంబాలు తరతరాలుగా బంగారాన్ని కూడబెట్టుకుంటున్నాయి.
అయితే ఆదాయపు పన్ను శాఖ కూడా మీ బంగారం కొనుగోళ్లపై ఓ కన్నేసి ఉంచుతుందన్న విషయం మీకు తెలుసా? నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బంగారం ఉంటే, దాని చట్టబద్ధతను మీరు నిరూపించలేకపోతే ఆదాయపు పన్ను నోటీసు లేదా దాడులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో మీరు చట్టబద్ధంగా ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నిబంధనలేంటి?
భారతదేశంలో బంగారం కొనుగోలు, నిల్వకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ నిబంధనల ప్రకారం వివాహిత మహిళలు ఇంట్లో 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం ఇంట్లో నిర్ణీత మొత్తంలో బంగారాన్ని ఉంచుకోవచ్చు. అయితే మీ వద్ద ఎంత బంగారం ఉన్నా, అది మీకు ఎలా వచ్చిందో రుజువు ఉండాలి.
వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చని ఆదాయపు పన్ను చట్టాలు చెబుతున్నాయి. పెళ్లికాని మహిళలైతే 250 గ్రాముల పసిడిని తమ వద్ద ఉంచుకోవచ్చు. ఇక కుటుంబంలోని పురుషులు 100 గ్రాముల వరకు మాత్రమే బంగారాన్ని ఉంచువడానికి అనుమతి ఉంది.
పన్నులేమైనా ఉంటాయా?
మీరు ప్రకటించిన ఆదాయం లేదా పన్ను మినహాయింపు ఆదాయం (వ్యవసాయం వంటివి) నుంచి బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే లేదా చట్టబద్ధంగా వారసత్వంగా పొందినట్లయితే దానిపై ఎటువంటి పన్ను ఉండదు. దాడులు నిర్వహిస్తే నిర్ణీత పరిమితిలో దొరికిన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకోలేరు. బంగారాన్ని ఇంట్లో పెట్టుకుంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ, బంగారాన్ని విక్రయిస్తే మాత్రం దానిపై పన్ను చెల్లించాలి.
2024 జూలైలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాలకు అర్హత పొందడానికి భౌతిక బంగారంతో సహా కొన్ని ఆస్తుల హోల్డింగ్ పీరియడ్ ప్రమాణాలను మార్చింది. ఫిజికల్ గోల్డ్ కోసం, స్వల్పకాలిక మూలధన లాభాల హోల్డింగ్ వ్యవధిని 3 ఏళ్ల నుండి 2 సంవత్సరాలకు తగ్గించింది. దీర్ఘకాలిక మూలధన లాభాలకు అర్హత సాధించడానికి, హోల్డింగ్ వ్యవధి 2 ఏళ్లు కంటే ఎక్కువ ఉండాలి. అంటే మీరు బంగారాన్ని 2 సంవత్సరాలు నిల్వ చేసిన తర్వాత అమ్మితే వచ్చిన లాభం ఎటువంటి ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 12.5% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment